లాహోర్: ముంబై పేలుళ్ల సూత్రధారి, నిషేధిత జమాత్ ఉద్ దవా(జేయూడీ) సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్(70)కు ఉగ్రవాద వ్యతిరేక కోర్టు 32 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఉగ్రముఠాలకు ఆర్థిక సాయం అందించిన కేసులో 2019లో ఇతడికి 36 ఏళ్ల జైలు శిక్ష పడగా ప్రస్తుతం లాహోర్‌లోని కోట్ లఖ్‌పత్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఉగ్ర సంస్థలకు ఆర్థిక సాయం అందించిన మరో రెండు కేసుల్లో కలిసి 32 ఏళ్లతోపాటు, 3.40 లక్షల పాకిస్తానీ రూపాయల జరిమానా విధిస్తూ తాజాగా గురువారం కోర్టు తీర్పు వెలువరించింది.
ఈ శిక్షలన్నీ ఏకకాలంలో అమలవుతాయని తెలిపింది. 2008లో సంభవించిన ముంబై బాంబు పేలుళ్లకు జేయూడీకి చెందిన లష్కరే తోయిబా సూత్రధారిగా ఉంది. అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రపడిన హఫీజ్‌పై అమెరికా ప్రభుత్వం కోటి రూపాయల రివార్డు ప్రకటించింది. ఇండియాకు చెందిన ఎన్‌ఐఏ మోస్టు వాంటెడ్ జాబితాలో ఉన్న హఫీజ్ సయీద్ పాకిస్తాన్ పంజాబ్ ప్రాంతంలోని సర్గోధాలో 1950 జూన్ 5న జన్మించాడు. తొలుత మత గురువుగా పనిచేశాడు. తర్వాత ఉగ్రబాట పట్టాడు. ఐక్యరాజ్యసమితి కూడా అతడిని ఉగ్రవాదిగా అధికారికంగా గుర్తించింది.
Comments
Please login to add a commentAdd a comment