లాహోర్: పాకిస్తాన్‌లోని లాహోర్‌లో ఒక కూడలికి భారత స్వాతంత్ర్య పోరాట వీరుడు భగత్ సింగ్ పేరు పెట్టడంలో జరుగుతున్న జాప్యంపై లాహోర్ హైకోర్టు అక్కడి పంజాబ్ ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలించింది. దీనిపై నోటీసులు జారీ చేస్తూ, సమాధానం చెప్పేందుకు చివరి అవకాశం ఇచ్చింది.
లాహోర్‌లోని షాద్‌మాన్ చౌక్‌కు భగత్ సింగ్ పేరు పెట్టడంపై కోర్టు ఇచ్చిన ఆదేశాల అమలుకు పంజాబ్ ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. దీనికి సమాధానం ఇచ్చేందుకు మరికొంత సమయం కావాలని కోర్టును పంజాబ్ ప్రభుత్వం కోరింది. పాకిస్తాన్‌లోని భగత్ సింగ్ మెమోరియల్ ఫౌండేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై లాహోర్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ షమ్స్ మహమూద్ మీర్జా విచారణ చేపట్టారు. ఈ అంశంపై స్పందించడానికి పంజాబ్ ప్రభుత్వానికి చివరి అవకాశం ఇచ్చారు. పంజాబ్ ప్రభుత్వ న్యాయవాది సాద్ బిన్ ఘాజీ కోర్టుకు హాజరై, దీనిపై సమాధానం ఇచ్చేందుకు మరింత సమయం కోరారు.
పంజాబ్ తరపు న్యాయవాది అభ్యర్థన మేరకు, ఈ అంశంపై స్పందించేందుకు పంజాబ్ ప్రభుత్వానికి చివరి అవకాశం ఇస్తున్నట్లు న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే చాలా జాప్యం జరుగుతోందని పిటిషనర్ తరఫు న్యాయవాది ఖలీద్ జమాన్ ఖాన్ కాకర్ కోర్టుకు తెలిపారు. కేసు తదుపరి విచారణను కోర్టు నవంబర్ 8కి వాయిదా వేసింది.
షాద్‌మాన్ చౌక్‌కు భగత్ సింగ్ పేరు పెట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఫౌండేషన్ చైర్మన్ ఇంతియాజ్ రషీద్ ఖురేషీ కోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. 1931లో భగత్‌సింగ్‌ను ఉరితీసిన షాద్‌మాన్ చౌక్‌కు ఆయన పేరు పెట్టాలని లాహోర్ హైకోర్టు 2018లో ప్రభుత్వాన్ని ఆదేశించిందని ఖురేషీ తెలిపారు. అయితే కోర్టు ఆదేశాలను పంజాబ్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పాటించలేదని ఆయన పేర్కొన్నారు. భగత్ సింగ్ భారతదేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించారు. ఆయనను సిక్కులు, హిందువులే కాకుండా ముస్లింలు కూడా ఎంతగానో గౌరవిస్తారు.
ఇది కూడా చదవండి: ఎమర్జెన్సీకన్నా దారుణం
Comments
Please login to add a commentAdd a comment