JuD
-
ముంబై పేలుళ్ల సూత్రధారికి 32 ఏళ్ల జైలు శిక్ష
లాహోర్: ముంబై పేలుళ్ల సూత్రధారి, నిషేధిత జమాత్ ఉద్ దవా(జేయూడీ) సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్(70)కు ఉగ్రవాద వ్యతిరేక కోర్టు 32 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఉగ్రముఠాలకు ఆర్థిక సాయం అందించిన కేసులో 2019లో ఇతడికి 36 ఏళ్ల జైలు శిక్ష పడగా ప్రస్తుతం లాహోర్‌లోని కోట్ లఖ్‌పత్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఉగ్ర సంస్థలకు ఆర్థిక సాయం అందించిన మరో రెండు కేసుల్లో కలిసి 32 ఏళ్లతోపాటు, 3.40 లక్షల పాకిస్తానీ రూపాయల జరిమానా విధిస్తూ తాజాగా గురువారం కోర్టు తీర్పు వెలువరించింది. ఈ శిక్షలన్నీ ఏకకాలంలో అమలవుతాయని తెలిపింది. 2008లో సంభవించిన ముంబై బాంబు పేలుళ్లకు జేయూడీకి చెందిన లష్కరే తోయిబా సూత్రధారిగా ఉంది. అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రపడిన హఫీజ్‌పై అమెరికా ప్రభుత్వం కోటి రూపాయల రివార్డు ప్రకటించింది. ఇండియాకు చెందిన ఎన్ఐఏ మోస్టు వాంటెడ్ జాబితాలో ఉన్న హఫీజ్ సయీద్ పాకిస్తాన్ పంజాబ్ ప్రాంతంలోని సర్గోధాలో 1950 జూన్ 5న జన్మించాడు. తొలుత మత గురువుగా పనిచేశాడు. తర్వాత ఉగ్రబాట పట్టాడు. ఐక్యరాజ్యసమితి కూడా అతడిని ఉగ్రవాదిగా అధికారికంగా గుర్తించింది. -
ట్రంప్-మోదీ దోస్తీపై సయీద్ ఫైర్!
ట్రంప్ సర్కార్ ఒత్తిడితో ఉగ్రవాద సూత్రధారి హఫీజ్ సయీద్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్ అధికారులు రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. ముంబై దాడుల సూత్రధారి, జమాత్ ఉద్ దావా (జేయూడీ) అధినేత అయిన సయీద్‌ను పాక్ పోలీసులు ఆదివారం రాత్రి గృహనిర్బంధంలో ఉంచారు. అయితే, లాహోర్‌లోని తన నివాసంలోనే గృహనిర్బంధంలో ఉన్న సయీద్ ఒక వీడియో ఫుటేజ్‌ను విడుదల చేశాడు. అమెరికా-భారత్ మధ్య అనుబంధం బలపడుతుండటమే తన హౌజ్ అరెస్టుకు కారణమని ఆయన ఈ వీడియోలో నిందించాడు. తనను అరెస్టు చేయాలని పాక్ ప్రభుత్వంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడి తెచ్చారని, తద్వారా భారత ప్రధాని మోదీతో ఆయన తన స్నేహాన్ని బలోపేతం చేసుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. అంతకుముందు జేయూడీ అధికారి అహ్మద్ నదీమ్ మాట్లాడుతూ కూడా ఇదేవిధంగా అమెరికా, భారత్‌పై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అమెరికా, భారత్‌లను సంతృప్తిపరిచేందుకు సయీద్‌ను పాక్ ప్రభుత్వం అరెస్టు చేసిందని, జేయూడీ కార్యాలయం వద్ద భారీగా బలగాలను మోహరించి తమను భయపెడుతున్నదని ఆయన విమర్శించారు. దీనికి సంబంధించిన మరిన్ని వార్తలకై చదవండి (అమెరికా దిక్కులు పిక్కటిల్లేలా..) (ఇది ముస్లింలపై నిషేధంకాదు: ట్రంప్) (ట్రంప్ ‘నిషేధం’: ఐసిస్ విజయోత్సవాలు) (ట్రంప్ చెప్పింది పచ్చి అబద్ధం!) (అమెరికాను సమర్థించిన సౌదీ, అబుదాబి) (ట్రంపోనమిక్స్ మనకు నష్టమా? లాభమా?) (ట్రంప్‌గారు మా దేశంపై నిషేధం విధించండి!) (ట్రంప్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సీఈవో!) (వీసా హోల్డర్స్పై ట్రంప్ కొరడా) -
పాక్ ఉగ్ర సూత్రధారికి ట్రంప్ ఝలక్!
-
బ్రేకింగ్: పాక్ ఉగ్ర సూత్రధారికి ట్రంప్ ఝలక్!
హఫీజ్ సయీద్ హౌజ్ అరెస్టు.. ఆకస్మికంగా చర్యలు తీసుకున్న పాక్ ఇస్లామాబాద్: ముంబై దాడుల సూత్రధారి, జమాత్ ఉద్ దావా (జేయూడీ) అధినేత హఫీజ్ సయీద్‌కు పాకిస్థాన్ అధికారులు సడన్‌గా ఝలక్ ఇచ్చారు. ఆయనతోపాటు జేయూడీకి చెందిన మరో నలుగురిని గృహనిర్బంధం (హౌజ్ అరెస్టు)లో ఉంచారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కారు ఒత్తిడి మేరకే పాక్‌లో యథేచ్ఛగా తిరుగుతున్న సయీద్‌పై ఈ మేరకు చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. లాహోర్ చౌబుర్జీలోని జమియా మసీద్ ఆల్ ఖద్సియా వద్ద సయీద్‌కు గృహనిర్బంధాన్ని విధించారు. ఇక్కడ జేయూడీ ప్రధాన కార్యాలయం ఉంది. ఇక్కడే ఉన్న సయీద్ నివాసాన్ని సబ్ జైలుగా మార్చి.. ఆయనను గృహ నిర్బంధంలో కొనసాగించనున్నట్టు అధికారులు తెలిపారు. పాక్ కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఈ నెల 27న జారీచేసిన ఆదేశాల మేరకు పంజాబ్ ప్రావిన్స్ హోంత్రిత్వశాఖ సయీద్ హౌజ్ అరెస్టుకు ఆదేశాలిచ్చింది. భారీ ఎత్తున మోమరించిన పోలీసులు జేయూడీ ప్రధాన కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారని జేయూడీ సభ్యుడు నదీమ్ పేర్కొన్నారు. పాక్ ప్రభుత్వం బయటి ఒత్తిడికి తలొగ్గి ఈ నిర్ణయం తీసుకుందని, భారత్‌ను సంతృప్తిపరిచేందుకు సయీద్‌ను అదుపులోకి తీసుకున్నారని ఆయన ఆరోపించారు. ఐరాస భద్రతా మండలి సయీద్‌పై ఆంక్షలు విధించిన నేపథ్యంలో అతన్ని అదుపులోకి తీసుకోవాలని భావిస్తున్నట్టు అంతకుముందు పాక్ హోంమంత్రి చౌదరి నిస్సార్ అలీఖాన్ తెలిపారు. జేయూడీ అణచివేతకు చర్యలు తీసుకోకుంటే పాక్‌పై ఆంక్షలు తప్పవని అమెరికా సర్కార్ హెచ్చరించిందని, అందుకే సయీద్‌ను అదుపులోకి తీసుకున్నారని పాక్‌కు చెందిన న్యూస్డైలీ పేర్కొంది. సయాద్ స్థాపించిన కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా 26/11 ముంబై దాడులకు పాల్పడి.. మారణహోమం సృష్టించిన సంగతి తెలిసిందే. లష్కరేపై నిషేధం విధించడంతో దీనికి ముసుగు సంస్థగా జేయూడీని సయీద్ స్థాపించాడు. ఇది కూడా ఉగ్రవాద సంస్థనని ఇప్పటికే అమెరికా, ఐరాస ప్రకటించిన సంగతి తెలిసిందే. -
భారత్ వీసాకు పాక్ బృందం దరఖాస్తు!
లాహోర్ః కశ్మీర్ అల్లర్ల నేపథ్యంలో గాయపడిన వారికి మందులు, వైద్య చికిత్స అందించేందుకు పారామెడికల్ సిబ్బందితో కూడిన పాక్ వైద్య బృందం కశ్మీర్ చేరేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో హఫీజ్ సయీద్ నేతృత్వంలోని 30 మంది సభ్యులు భారత్ పర్యటనకు వీసాలకోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. ముస్లిం మత సంబంధిత మెడికల్ మిషన్.. జమాత్-ఉద్-దవా (జుద్) కు చెందిన 30 మంది వైద్య సిబ్బంది భారత్ వీసాలకు సన్నాహాలు చేస్తున్నారు. జమ్ము కశ్మీర్ ఘర్షణల్లో భారత సైన్యం చేతిలో గాయపడ్డవారికి చికిత్స అందించేందుకు వారు మంగళవారం కశ్మీర్ చేరే ప్రయత్నంలో ఉన్నారు. హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది బుర్హాన్ వనీ ఎన్ కౌంటర్ అనంతరం జమ్ము కశ్మీర్ లో అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ ఘర్షణల్లో ఎక్కువమందికి కళ్ళకు గాయాలవ్వడంతో వారికి చికిత్స అందించేందుకుగాను కశ్మీర్ బయల్దేరుతున్న బృందంలో కంటి నిపుణులను సైతం తీసుకువెడుతున్నట్లు 'జుద్' కు చెందిన అధికారి అహ్మద్ నదీమ్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో జుద్ వైద్య బృందాన్ని ఇస్లామాబాద్ లోని భారత రాయబార కార్యాలయం ఎలా అనుమతిస్తోంది? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. ముస్లిం మెడికల్ మిషన్ తన వంతు సహాయం అందించడంలో భాగంగా పాకిస్తాన్ ప్రభుత్వానికి తాము విజ్ఞప్తి చేశామని నదీమ్ తెలిపారు. అయితే గాయపడిన కాశ్మీరీలకు చికిత్స అందించేందుకు తమ బృదం రాకూడదంటూ భారత వైద్య బృదం..తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్లు మిషన్ ప్రెసిడెండ్ ప్రొఫెసర్ డాక్టర్ జాఫర్ ఇక్బాల్ చౌదరి తెలిపారు. గాయపడినవారికి భారత ప్రభుత్వం పూర్తిశాతం వైద్య చికిత్స అందించకపోవడంతోనే తమ బృదం భారత్ కు బయల్దేరాల్సి వస్తోందని తెలిపారు. గాయపడ్డవారికి పూర్తి శాతం చికిత్స అందించకుండానే భారత వైద్య బృందం శ్రీనగర్ నుంచీ తిరిగి వెళ్ళిపోయిందని ఆరోపించిన ఇక్బాల్ చౌదరి.. కశ్మీరీలకు చికిత్స అందించడం తమ విధిగా భావిస్తున్నామని తెలిపారు. -
‘భారత్‌లో మరిన్ని ఉగ్రదాడులు చేస్తాం’
ఇస్లామాబాద్: భారతదేశంలో మరిన్ని ఉగ్రవాద దాడులు చేస్తామని జమాత్ ఉద్ దావా(జేయూడీ) చీఫ్, ముంబై దాడుల సూత్రదారి హఫీజ్ సయీద్ హెచ్చరించాడు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో నిర్వహించిన ఒక ర్యాలీలో ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘మీరు పఠాన్ కోట్ దాడినే చూశారు. మేము అత్యంత సులువుగా మరిన్ని దాడులను చేయగలం’ అని అన్నాడు. భారత సైన్యం కశ్మీర్ ప్రజలపై మారణ హోమం చేస్తోందని ఆరోపించాడు. మరోవైపు, సయీద్‌ను అదుపులో పెట్టాల్సిన బాధ్యత పాక్‌పై ఉందని భారత్ స్పష్టం చేసింది. పాక్‌లో సయీద్ కార్యకలాపాలపై ఆందోళన వ్యక్తం చేసింది. నిజానికి సయీద్ చేస్తోంది ఉగ్రవాద కార్యకలాపాలని, ఉగ్రవాదానికి ఆర్థిక ఊతం అందించే చర్యలేనని స్పష్టం చేసింది. పాక్‌లో సయీద్ లాంటి ఉగ్రవాదులు స్వేచ్ఛగా తమ కార్యకలాపాలను నిర్వహించుకోవడం ఆందోళనకరమని పేర్కొంది. -
జమాత్‌పై పాక్ నిషేధం
ఇస్లామాబాద్: అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడికి పాకిస్తాన్ తలొగ్గింది. పాక్‌లో ని ఉగ్రవాద గ్రూపులపై ఎట్టకేలకు నిషేధం విధించింది. 2008లో ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ నేతృత్వంలోని జమాత్-ఉద్-దవా(జేయూడీ), హక్కానీ నెట్‌వర్క్‌లతో సహా పలు ఉగ్రవాద సంస్థలపై వేటు వేసింది. సయీద్ విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. పలు ఉగ్రవాద గ్రూపులకు వెన్నుదన్నుగా నిలుస్తూ, కొన్ని గ్రూపులపై మాత్రమే చర్యలు తీసుకుంటున్న పాక్ తీరుపై అంతర్జాతీయంగా విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. నిషేధాన్ని ధృవీకరిస్తూ పాక్ విదేశాంగ శాఖ ప్రకటన చేసింది. పలు ఉగ్రవాద సంస్థలపై నిషేధం విధించినట్లు వెల్లడిస్తూనే.. ఐరాస నిర్దేశం మేరకే ఈ చర్యలు తీసుకున్నామని, ఈ విషయంలో అమెరికా సహా ఎవరి ఒత్తిడి లేదని పేర్కొంది. ఉగ్రవాద సంస్థల బ్యాంకు లావాదేవీలను నిలిపివేస్తున్నట్లు కూడా రేడి యో పాకిస్తాన్ వెల్లడించింది. భారత గణతంత్ర దినోత్సవాల్లో ఒబామా పాల్గొంటున్న నేపథ్యంలో పాక్ చర్యలు చేపట్టడం గమనార్హం. నిషేధిత జాబితాలో పలు సంస్థలు నిషేధిత సంస్థల జాబితాలో జేయూడీతో పాటు ఫలా-ఇ-ఇన్సానియత్ ఫౌండేషన్(ఎఫ్ఐఎఫ్), హర్కతుల్ జిహాద్ ఇస్లామీ, హర్కతుల్ ముజాహిదీన్, ఉమ్మా తమీర్-ఇ-నౌ వంటి సంస్థలు ఉన్నాయి. హఫీజ్ సయీద్‌ను పట్టుకోడానికి అమెరికా ఇప్పటికే దాదాపు రూ. 60 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది. ప్రస్తుతం పాక్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్న సయీద్.. తరచూ బహిరంగ సభల్లో పాల్గొంటూ భారత్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఉగ్ర కార్యకలాపాలు ఆపం: జేయూడీ.. తమ సంస్థపై పాక్ నిషేధం విధించినా సరే తమ కార్యకలాపాలను ఆపేదిలేదని ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. గతంలోనే తమ సంస్థ మతబోధనలు, కార్యకలాపాలకు అనుకూలంగా సుప్రీం కోర్టు, లాహోర్ హైకోర్టులు తీర్పులు చెప్పాయని జేడీయూ అధికార ప్రతినిధి యాహా ముజాహిదీన్ గురువారం వ్యాఖ్యానించారు.