బ్రేకింగ్: పాక్ ఉగ్ర సూత్రధారికి ట్రంప్ ఝలక్!
- హఫీజ్ సయీద్ హౌజ్ అరెస్టు..
- ఆకస్మికంగా చర్యలు తీసుకున్న పాక్
ఇస్లామాబాద్: ముంబై దాడుల సూత్రధారి, జమాత్ ఉద్ దావా (జేయూడీ) అధినేత హఫీజ్ సయీద్‌కు పాకిస్థాన్ అధికారులు సడన్‌గా ఝలక్ ఇచ్చారు. ఆయనతోపాటు జేయూడీకి చెందిన మరో నలుగురిని గృహనిర్బంధం (హౌజ్ అరెస్టు)లో ఉంచారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కారు ఒత్తిడి మేరకే పాక్‌లో యథేచ్ఛగా తిరుగుతున్న సయీద్‌పై ఈ మేరకు చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది.
లాహోర్ చౌబుర్జీలోని జమియా మసీద్ ఆల్ ఖద్సియా వద్ద సయీద్‌కు గృహనిర్బంధాన్ని విధించారు. ఇక్కడ జేయూడీ ప్రధాన కార్యాలయం ఉంది. ఇక్కడే ఉన్న సయీద్ నివాసాన్ని సబ్ జైలుగా మార్చి.. ఆయనను గృహ నిర్బంధంలో కొనసాగించనున్నట్టు అధికారులు తెలిపారు. పాక్ కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఈ నెల 27న జారీచేసిన ఆదేశాల మేరకు పంజాబ్ ప్రావిన్స్ హోంత్రిత్వశాఖ సయీద్ హౌజ్ అరెస్టుకు ఆదేశాలిచ్చింది. భారీ ఎత్తున మోమరించిన పోలీసులు జేయూడీ ప్రధాన కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారని జేయూడీ సభ్యుడు నదీమ్ పేర్కొన్నారు. పాక్ ప్రభుత్వం బయటి ఒత్తిడికి తలొగ్గి ఈ నిర్ణయం తీసుకుందని, భారత్‌ను సంతృప్తిపరిచేందుకు సయీద్‌ను అదుపులోకి తీసుకున్నారని ఆయన ఆరోపించారు.
ఐరాస భద్రతా మండలి సయీద్‌పై ఆంక్షలు విధించిన నేపథ్యంలో అతన్ని అదుపులోకి తీసుకోవాలని భావిస్తున్నట్టు అంతకుముందు పాక్ హోంమంత్రి చౌదరి నిస్సార్ అలీఖాన్ తెలిపారు. జేయూడీ అణచివేతకు చర్యలు తీసుకోకుంటే పాక్‌పై ఆంక్షలు తప్పవని అమెరికా సర్కార్ హెచ్చరించిందని, అందుకే సయీద్‌ను అదుపులోకి తీసుకున్నారని పాక్‌కు చెందిన న్యూస్‌డైలీ పేర్కొంది. సయాద్ స్థాపించిన కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా 26/11 ముంబై దాడులకు పాల్పడి.. మారణహోమం సృష్టించిన సంగతి తెలిసిందే. లష్కరేపై నిషేధం విధించడంతో దీనికి ముసుగు సంస్థగా జేయూడీని సయీద్ స్థాపించాడు. ఇది కూడా ఉగ్రవాద సంస్థనని ఇప్పటికే అమెరికా, ఐరాస ప్రకటించిన సంగతి తెలిసిందే.