చిత్తశుద్ధి లేని చర్య | Pakistan Court Sent Hafiz Saeed Jail For 11 Years | Sakshi
Sakshi News home page

చిత్తశుద్ధి లేని చర్య

Published Fri, Feb 14 2020 4:16 AM | Last Updated on Fri, Feb 14 2020 4:16 AM

Pakistan Court Sent Hafiz Saeed Jail For 11 Years - Sakshi

ముంబై మహానగరంపై పన్నెండేళ్లక్రితం జరిగిన ఉగ్రవాద దాడి సూత్రధారి, జమాత్‌ ఉద్‌ దవా(జేయూడీ) చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌కు పాకిస్తాన్‌ కోర్టు బుధవారం 11 ఏళ్ల జైలుశిక్ష విధించింది. ఇది విని అమెరికా హర్షం వ్యక్తంచేసింది గానీ పాకిస్తాన్‌ న్యాయస్థానాల తీరుతెన్నులు, అక్కడి పాలకుల ఎత్తుగడలు తెలిసినవారికి ఈ పరిణామం పెద్దగా ఆశ్చర్యం కలిగించదు. ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబాకు ముసుగు సంస్థగా రంగంలోకొచ్చిన జేయూడీ మన దేశంలో 173 మందిని పొట్టనబెట్టుకున్న ముంబై ఉగ్రవాద దాడి కేసులో మాత్రమే కాదు... 12 మంది మరణించిన 2001 పార్లమెంటు దాడి, 209 మంది చనిపోయిన 2006 నాటి ముంబై రైలు పేలుళ్ల కేసు వగైరాల్లో ప్రధాన పాత్ర పోషించింది. ఈ కేసుల్లో హఫీజ్‌ను అప్పగించాలని మన దేశం డిమాండ్‌ చేస్తోంది. ముంబై ఉగ్ర దాడికి సంబంధించి నిర్దిష్టమైన సాక్ష్యాధారాలు కూడా సమర్పించింది. కానీ ఇచ్చిన సాక్ష్యాలు సరిపోవని, మరిన్ని వివరాలు కావాలని పదే పదే అడగటం తప్ప పాక్‌ చేసిందేమీ లేదు. ముంబై ఉగ్రదాడి జరిగిన ఏడాది తర్వాత అమెరికా పోలీసులకు చిక్కి ప్రస్తుతం అక్కడే జైలుశిక్ష అను భవిస్తున్న పాకిస్తానీ అమెరికన్‌ డేవిడ్‌ హెడ్లీ సైతం ఆ దాడిలో పాకిస్తాన్‌ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ ప్రమేయం, లష్కర్‌తో దానికున్న సంబంధాలు, హఫీజ్‌ సయీద్‌ పోషించిన పాత్ర వగైరాలపై పూస గుచ్చినట్టు చెప్పాడు. అలాంటి హఫీజ్‌కు ఇప్పుడు ఉగ్రవాదానికి ఆర్థిక సాయం అందించిన కేసులో శిక్ష పడింది. అతగాడి పాపాల చిట్టాతో పోలిస్తే ఈ ఆర్థిక సాయం ఆరోపణ చాలా చిన్నది.

 
 అంతర్జాతీయంగా ఒత్తిళ్లు వచ్చినప్పుడు హఫీజ్‌ను జైలుకు పంపడం, అవి చల్లారగానే అతన్ని విడుదల చేయడం రివాజుగా మారింది. మధ్యమధ్య గృహ నిర్బంధంలో ఉంచడం కూడా సర్వసాధారణం. గత పదేళ్లుగా ఈ తంతు నడుస్తూనేవుంది. 90వ దశకం చివర లష్కరే సంస్థను నిషేధించినప్పుడు అప్పటికి ఉనికిలో లేని జమాత్‌ ఉద్‌ దవావల్‌ ఇర్షాద్‌ అనే సంస్థ పంచన చేరిన హఫీజ్‌ 2002లో దాన్ని జేయూడీగా మార్చుకున్నాడు. అది ధార్మిక సంస్థ అని చెప్పుకున్నాడు. దానిద్వారా భారీయెత్తున నిధులు సేకరించడం, ఆ నిధుల్ని ఖర్చుపెట్టి ఉగ్రవాద మూకలను తయారు చేయడం వంటి చర్యలు కొనసాగిస్తున్నా పాకిస్తాన్‌ ప్రభుత్వాలు కళ్లు మూసుకున్నాయి. జేయూడీకి సైన్యం అండదండలుండటమే ఇందుకు కారణం. పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ నిరుడు అమెరికా పర్యటనలో వుండగా ఇలాంటి ఉగ్ర మూకల గురించి తీవ్రంగానే మాట్లాడారు. అఫ్ఘానిస్తాన్, కశ్మీర్‌లలో పోరాడిన సాయుధ మిలిటెంట్లు 30,000 నుంచి 40,000 వరకూ పాక్‌లో ఉన్నారని ప్రకటించారు.

పాక్‌ను గతంలో ఏలినవారంతా ఈ నిజాన్ని దాచి దేశానికి నష్టం కలగ జేశారని ఆరోపించారు. ఈ మాదిరి మిలిటెంట్లపై తాము చర్యలు తీసుకోవడం మొదలుపెట్టామని కూడా చెప్పారు. కానీ అందులో అర్థసత్యమే ఉందని ప్రపంచానికంతకూ తెలుస్తునే వుంది. అందుకు హఫీజ్‌ సయీద్‌ ఉదంతమే పెద్ద ఉదాహరణ. నిజంగా తన దేశంలో సాయుధ మిలిటెంట్ల బెడద వుండకూడదనుకుంటే హఫీజ్‌పైనా, అలాంటి మరికొందరిపైనా పకడ్బందీ సాక్ష్యాలు సేకరించి, వారందరికీ ఎప్పుడో శిక్ష పడేలా చర్యలు తీసుకునేవారు. కానీ ఆ విషయంలో చిత్తశుద్ధి కనబడటం లేదు. ఇప్పుడైనా శిక్ష పడిన సందర్భమేమిటో గమనిస్తే చివరకు ఈ కేసు ఏమవుతుందో సులభంగానే తెలుస్తుంది. జీ–7 దేశాల చొరవతో 1989లో ఏర్పడి, పారిస్‌ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ ఉగ్రవాద లావాదేవీల నిఘా సంస్థ ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌(ఎఫ్‌ఏటీఎఫ్‌) ఉగ్రవాదుల కదలికలను, వారి లావాదేవీలను గమనిస్తూ వుంటుంది.

ఏ దేశమైనా ఇలాంటి లావాదేవీలను నిరో ధించలేకపోయినా, వాటిని ప్రోత్సహిస్తున్నట్టు అనుమానం కలిగినా, ఉగ్ర సంస్థల నిధుల వ్యవ హారాన్ని దర్యాప్తు చేయడంలో సహకరించకపోయినా అనుమానిత దేశాల జాబితాలో లేదా కుమ్మక్కయిన దేశాల జాబితాలో చేరుస్తుంది. పర్యవసానంగా ప్రపంచ దేశాలనుంచి వాటికి ఆర్థిక సాయం నిలిచిపోతుంది. బ్లాక్‌ లిస్టులో చేరిన దేశాలపై ఇతరత్రా ఆంక్షలు కూడా విధిస్తారు. ఇరాన్, ఉత్తర కొరియాలపై ఈ వంకనే ఆంక్షలు అమలవుతున్నాయి. ఆ సంస్థ  నిరుడు జూన్‌లో సమావే శమైనప్పుడు పాకిస్తాన్‌ను తీవ్రంగా హెచ్చరించింది. 2020 ఫిబ్రవరి 20కల్లా చర్య తీసుకోకపోతే చర్యలు తప్పవని తెలిపింది. ఉగ్రవాద సంస్థలను నియంత్రించడంలో సమర్థవంతంగా వ్యవహ రించలేకపోతున్నారని చీవాట్లు పెట్టింది.

నిజానికి అప్పట్లోనే కఠిన చర్య తీసుకోవాల్సివున్నా చైనా, టర్కీ, మలేసియా, సౌదీ అరేబియా, గల్ఫ్‌ సహకార మండలి జోక్యం చేసుకుని ఆ దేశానికి మరికొంత సమయం ఇద్దామని నచ్చజెప్పాయి. మరో మూడురోజుల్లో పారిస్‌లో ఎఫ్‌ఏటీఎఫ్‌ సమావేశాలు జరగబోతున్నాయి. ఈసారి హఫీజ్‌పై చర్యకు వెనకాడితే ఎవరూ తనను సమర్థించరన్న భయం పాకిస్తాన్‌కు వుంది. అలాగే అఫ్ఘానిస్తాన్‌ ఊబిలో కూరుకుపోయిన అమెరికా సాధ్యమైనంత త్వరగా అక్కణ్ణించి బయటపడాలని చూస్తోంది. పాక్‌ అండ లేకుంటే అది సాధ్యం కాదు గనుక, ఎఫ్‌ఏటీఎఫ్‌ బెడద తప్పించుకోవడానికి వెనువెంటనే ఏదో ఒక చర్య తీసుకోమని అమెరికా సలహా ఇచ్చి వుండొచ్చు కూడా. మొత్తానికి ఇలా స్వీయ ప్రయోజనాలను ఆశించి ఉగ్రవాదంపై భిన్న వైఖరులు తీసుకునే దేశాల వల్లే పాకిస్తాన్‌ ఇష్టానుసారం వ్యవహరించగలుగుతోంది.

ఇది అంతిమంగా ఉగ్రవాదులకు ఊతం ఇస్తోంది. ఎఫ్‌ఏటీఎఫ్‌ సమావేశాలు ముగిశాక పాక్‌లో మరో న్యాయస్థానం హఫీజ్‌ నిర్దోషి అని తీర్పి చ్చినా ఆశ్చర్యం లేదు. సంస్థల నిషేధం, వ్యక్తుల అరెస్టులు మించి అదనంగా పాక్‌ ఏం చేస్తున్నదో నిశితంగా గమనించాల్సిన అవసరం... అది అంతర్జాతీయ నిబంధనలకు కట్టుబడేలా చూడాల్సిన బాధ్యత ప్రపంచ దేశాలకుంది. ముఖ్యంగా ఉగ్రవాదం రాజ్య విధానంగా లేదా దాని ఉపకరణంగా మారకూడదన్న స్పష్టత అందరికీ ఉండాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement