అబుదాబి : భూమి మీద నూకలు ఉంటే చాలు చావు అంచుల దాకా వెళ్లినా సరే తిరిగి రావొచ్చు అన్న మాట అభినవ్ చారి అనే వ్యక్తికి సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే ముష్కరులు జరిపిన దాడుల్లో రెండుసార్లు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఏప్రిల్ 21న శ్రీలంకలో మొదలైన బాంబుల మోత ఇప్పటికీ మోగుతూనే ఉంది. భద్రతా వైఫల్యం కారణంగా ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడుల్లో వందలాది ప్రాణాలు కోల్పోగా..మరెంతో మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా ఈస్టర్ ఆదివారం రోజున జరిగిన శ్రీలంక పేలుళ్ల నుంచే కాకుండా.. భారత్‌లోని ముంబై ఉగ్రదాడుల(26/11) నుంచి కూడా బయటపడ్డానని చెబుతున్నాడు దుబాయ్‌లో నివసించే ఎన్నారై అభినవ్ చారి.
దుబాయ్‌లో నివసిస్తున్న అభినవ్ చారి భార్య నరూప్‌తో కలిసి బిజినెస్ ట్రిప్‌లో భాగంగా శ్రీలంకకు వెళ్లాడు. ఈ క్రమంలో కొలంబోలోని సినామన్ గ్రాండ్ హోటల్లో బస చేశాడు. ఈస్టర్ సండే సందర్భంగా ఓ చర్చికి వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి హోటల్‌కు చేరుకునే సరికి అక్కడి బాంబు దాడిలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం చూసి బెంబేలెత్తిపోయాడు. ఈ విషయం గురించి అభినవ్ చారి మాట్లాడుతూ.. ‘ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దాటి బయటి దేశాల్లో బస చేసింది కేవలం రెండే రెండుసార్లు. కానీ ఆ రెండు సందర్భాల్లోనూ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాను. మత విద్వేషం సృష్టించే అరాచకాన్ని చూశాను. మెడిసిన్ చదివేందుకు ముంబై వెళ్లాను. 2008లో అక్కడ ఉన్న సమయంలో ఉగ్రవాదులు దాడి చేశారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో ఐదారు రోజులు వణికిపోయా. ఇప్పుడేమో శ్రీలంకలో. చర్చికి వెళ్లి ప్రార్థనలు చేసిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్ చేద్దామనుకున్నాం. కానీ అప్పటికే రోడ్డుపై అంతా గందరగోళంగా ఉంది. దీంతో హోటల్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. అయితే అక్కడికే చేరుకునే కొద్ది నిమిషాల కంటే పేలుడు సంభవించిందని తెలుసుకుని ఆందోళన చెందాను. ఉగ్రదాడుల నుంచి నేను నా భార్య తృటిలో బయటపడ్డాం’ అని చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment