
కొలంబో : ఈస్టర్ పర్వదినాన శ్రీలంకలో ఆత్మాహుతి దాడికి పాల్పడే ముందు ఉగ్రవాదులు భారత్‌కు వచ్చారని ఆ దేశ ఆర్మీ చీఫ్ తెలిపారు. ఇందులో భాగంగా అక్కడే ఉగ్రదాడులపై శిక్షణ పొందారని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 21న శ్రీలంకలో జరిగిన ఎనిమిది వరుస పేలుళ్లలో 250కి పైగా మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో గాయపడిన 500 మందికి పైగా క్షతగాత్రుల్లో కొంతమంది ఇప్పటికీ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో పేలుళ్ల గురించి శ్రీలంక ఆర్మీ చీఫ్ మహేష్ సేననాయకే మాట్లాడుతూ...‘ వాళ్లు(ఉగ్రవాదులు) భారత్‌లోని కశ్మీర్, బెంగళూరు, కేరళకు వెళ్లినట్లు మా వద్ద సమాచారం ఉంది. బహుషా ఆత్మాహుతి దాడుల్లో శిక్షణ పొందేందుకే వాళ్లు అక్కడికి వెళ్లి ఉండవచ్చు. పేలుళ్లకు దేశం బయటే వ్యూహ రచన జరిగినట్లు తెలుస్తోంది’ అని వ్యాఖ్యానించారు.
కాగా శ్రీలంకను వణికించిన వరుస పేలుళ్లకు తామే పాల్పడ్డామని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ప్రకటించింది. అయితే ఘటన జరిగిన వెంటనే స్పందించే ఐఎస్ ఘటనకు తామే పాల్పడ్డామని ప్రకటించడంలో జాప్యం చేయడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు న్యూజిలాండ్‌లో మసీదుపై జరిగిన దాడికి ప్రతీకారంగానే వరుస పేలుళ్లు జరిగాయని ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైందని శ్రీలంక రక్షణ శాఖ సహాయ మంత్రి రువన్ విజేవర్ధనే వెల్లడించిన సంగతి తెలిసిందే. పేలుళ్లపై ఇంటలెజిన్స్ హెచ్చరికలు పట్టించుకోని పోలీస్ ఛీఫ్‌పై వేటు వేయడంతో పాటుగా.. ముసుగులు ధరించడంపై శ్రీలంక ప్రభుత్వం నిషేధం విధించింది.
Comments
Please login to add a commentAdd a comment