ఆపరేషన్ ‘ఆమ్లా’ ఆరంభం
సాక్షి, చెన్నై: ముంబైలో పేలుళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, ఈ పేలుళ్లకు పాల్పడిన తీవ్రవాదులు సముద్రమార్గం గుండానే దేశంలోకి చొరబడినట్లు నిర్ధారణ అయింది. అప్పటి నుంచి దేశ వ్యాప్తంగా సముద్ర తీరాల్లో భద్రతను పెంచారు. రాష్ట్రంలో పదమూడు జిల్లాలు సముద్ర తీరాల్లోనే ఉన్నాయి. దీంతో భారత కోస్టు గార్డ్, నావికాదళంతోపాటుగా మెరైన్ పోలీసులు, హార్బర్ పోలీసులు, కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. వీరి పని తీరుకు సవాల్ విసిరే రీతిలో, ఏ మేరకు అప్రమత్తంగా ఉన్నారో పసిగట్టేందుకు ఆపరేషన్ ఆమ్లా మాక్ డ్రిల్‌ను నిర్వహిస్తున్నారు.ఆపరేషన్ ఆరంభం : 36 గంటల పాటు సాగే ఈ ఆపరేషన్ ఆమ్లా మాక్ డ్రిల్ బుధవారం ఉదయం ఆరు గంటలకు ఆరంభం అయిం ది. మరుసటి రోజు రాత్రి వరకు సముద్ర తీరాల్లో గస్తీ కట్టుదిట్టంగా ఉంటుంది. ఆదిశగా రాష్ట్రంలోని చెన్నై, కాంచీపురం, కడలూరు, తూత్తుకుడి, నాగపట్నం, రామనాధపురం, కన్యాకుమారి తదితర 13 సముద్ర తీర జిల్లాల్లో నిఘాను పటిష్ట వంతం చేశారు.
ఓ వైపు భారత కోస్ట్ గార్డ్, మరో వైపు రాష్ట్ర ప్రభుత్వ నేతృత్వంలోని సముద్ర తీర భద్రతా విభాగం, కేంద్ర బలగాలు, మెరైన్ పోలీసులు డేగ క ళ్లతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రంలోకి సముద్ర తీరం గుండా తీవ్రవాదులు గుంపులు గుంపులుగా బయలు దేరినట్టు ఏక కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సముద్ర తీర జిల్లాల పోలీసు స్టేషన్లకు, ప్రత్యేక భద్రతా విభాగాలు, అధికారులకు పోలీసు హెడ్ క్వార్టర్స్ నుంచి సమాచారం చేర వేశారు. పరుగో పరుగు: తీవ్రవాదుల చొరబాటు సమాచారంతో సముద్ర తీర జిల్లాల్లో భద్ర తా సిబ్బంది అప్రమత్తం అయ్యారు. మఫ్టీలో చొరబడే పోలీసుల(తీవ్రవాదుల)ను పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులను ఏర్పాటు చేసి వాహనాల్ని తనిఖీలు చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేసినానంతరం అనుమతించారు. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లలో నూ భద్రతను కట్టుదిట్టం చేశారు. పడవల్లో సముద్రంలోకి దూసుకెళ్లారు.
చేపల వేట నుంచి వస్తున్న జాలర్లను తనిఖీల అనంత రం అనుమతించారు. కాశిమేడు హార్బర్‌లోకి ఆరున్నర గంటల సమయంలో వేర్వురుగా రెండు పడవల్లో చెన్నైలోకి చొరబడేందుకు యత్నించిన ఆరుగురిని అరెస్టు చేశారు. నీలాంకరైలో మరో ముగ్గురిని అరెస్టు చేశా రు. ఇంకా మరి కొంత మంది జట్టులు జట్టులుగా సముద్ర తీర జిల్లాల్లో చొరబడనుండడంతో వారి కోసం వేట కొనసాగుతోంది. ఆమ్లా ఆపరేషన్ గురువారం రాత్రి వరకు కొనసాగుతుండడంతో పోలీసులకు విశ్రాంతి లేనట్టే. మఫ్టీలో ఉన్న వాళ్లను వదలి పెట్టిన పక్షంలో ఎక్కడ ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందోనన్న ఆందోళనలతో సముద్ర తీరాల్లో కళ్లు కాయలు కాచేలా భద్ర తా విధుల్లో సిబ్బంది నిమగ్నమై ఉన్నారు. ఈ సారి ఆమ్లా ఆపరేషన్‌లో కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరినిసైతం కలుపుకున్నారు.
బంగారం పట్టి వేత: ఆపరేషన్ ఆమ్లాలో భాగంగా తనిఖీలను పోలీసులు ముమ్మరం చేశారు. ఈ సమయంలో ఓ యువకుడు కోయంబేడులోకి రావడం, అతడి వద్ద జరిపిన తనిఖీల్లో బంగారం బిస్కెట్లు పట్టుబడ్డాయి. నగదు సైతం లభించడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో భువనేశ్వర్‌కు చెందిన రాహుల్ అగర్వాల్‌గా తేలింది. కోయంబత్తూరులోని ఓ బంగారం దుకాణానికి వీటిని తీసుకెళ్తున్న ట్టు పేర్కొన్నా, అందుకు తగ్గ రశీదులు అతడి వద్ద లేవు. పట్టుబడిన 8 కిలోల బంగారం, రూ.8 లక్షల నగదును వాణిజ్య పన్నుల విభాగం అధికారులకు అప్పగించారు.