మీనంబాక్కంలో అలర్ట్
సాక్షి, చెన్నై: మీనంబాక్కం విమానాశ్రయం ఆవరణలో ఆదివారం ఉదయం కాసేపు హైడ్రామా సాగింది. విమానాశ్రయం భద్రతా సిబ్బంది, తమిళ పోలీసులు ఓ వైపు, ఆంధ్రా పోలీసులు మరో వైపు తిష్ట వేయడంతో ఏమి జరుగుతోందో తెలియక ఉత్కంఠ నెలకొంది. చివరకు కట్టుదిట్టమైన భద్రత నడుమ కోల్‌కతా నుంచి చెన్నై మీదుగా నెల్లూరుకు మావోయిస్టు వెంకటేశ్వరరావును తరలించిన సమాచారంతో ఉత్కంఠకు తెర పడింది. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మీద జరిగిన బాంబు దాడి కేసు విచారణను ప్రత్యేక సిట్‌కు అప్పగించారు. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్‌లో దీపక్ అలియాస్ వెంకటేశ్వరరావు అనే మావోయిస్టును అక్కడి పోలీసులు పట్టుకున్నారు. అతడిని తమ కస్టడీలోకి తీసుకునేందుకు ఆంధ్రా పోలీసులు కోల్‌కతాకు వెళ్లారు. వెంకటేశ్వరరావును తమ అదుపులోకి తీసుకుని తిరుగు పయనమయ్యూరు.
అలర్ట్ : చెన్నై మీదుగా నెల్లూరుకు వెంకటేశ్వరరావును తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో మీనంబాక్కం విమానాశ్రయం వద్ద ఉదయం కాసేపు పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరించి హడావుడి సృష్టించారు. విమానాశ్రయంలోని కేంద్ర భద్రతా బలగాలు, తమిళ పోలీసులు ఓ వైపు, ఆంధ్రా నుంచి ఆయుధాలతో వచ్చిన పోలీసుల బృందాలు మరో వైపు అక్కడ తిష్ట వేయడంతో ఉత్కంఠ నెలకొంది. ఎవరైనా వీఐపీ వస్తున్నారా..? అన్న అనుమానాలు మెుదలయ్యూయి. అక్కడి మీడియా వర్గాలు సైతం కాసేపు అయోమయంలో పడ్డాయి. చివరకు తమిళ పోలీసుల ద్వారా వివరాలను రాబట్టడంతో కోల్‌కతా నుంచి మావోరుుస్టును పట్టుకొస్తున్నారన్న ప్రచారం అక్కడ వ్యాపించింది. అదే సమయంలో అక్కడి భద్రతా సిబ్బంది కాసేపు హడావుడి సృష్టించడంతో అటు ప్రయాణికులు, ఇటు మీడియా వర్గాలకు ఇబ్బందులు తప్పలేదు. చివరకు కోల్‌కతా నుంచి వచ్చిన ఓ విమానం నుంచి గట్టి భద్రత నడుమ వెంకటేశ్వరరావును బయటకు తీసుకొచ్చారు.
నెల్లూరుకు : ఆంధ్రా పోలీసుల వాహనంలో వెంకటేశ్వరరావును ఎక్కించారు. ముందు వెనుక పోలీసుల భద్రతా వాహనాలు అనుసరించగా మావోరుుస్టు కూర్చున్న వాహనం నెల్లూరు వైపుగా బయల్దేరింది. ఈ వాహనాలకు సిగ్నల్స్ వద్ద తమిళ పోలీసులు దారి ఇచ్చారు. రాష్ట్ర సరిహద్దులు దాటే వరకు తమిళ పోలీసులు సహకారం అందించి, చివరకు హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు. అసలే, రాష్ట్రంలో సంఘ విద్రోహ శక్తుల కదలికలు చాప కింద నీరులా విస్తరిస్తుండడం, రెండు రోజుల క్రితం ఐఎస్‌ఐ ఏజెంట్ పట్టుపడడం పోలీసుల్లో కొంత ఆందోళన కలిగించింది. కోల్‌కతా నుంచి మావోరుుస్టును చెన్నై మీదుగా తరలించడంతో తాము భద్రత కల్పించాల్సి వచ్చిందని తమిళ పోలీసులు పేర్కొనడం గమనార్హం.