వెంకయ్యకు బ్రహ్మరథం
- అందరూ మిత్రులే
- ప్రాంతీయ భాషల్ని గౌరవిస్తాం
- జంప్ జిలానీలొద్దు...
- యువత రావాలని పిలుపు
సాక్షి, చెన్నై : కేంద్ర మంత్రిగా తొలిసారి చెన్నైలో అడుగుపెట్టిన ఎం.వెంకయ్యనాయుడుకు కమలనాథులు బ్రహ్మరథం పట్టారు. మీనంబాక్కం విమానాశ్రయంలో, పార్టీ కార్యాలయం కమలాలయంలో ఆయనకు ఘన స్వాగతం పలికి సత్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వెంకయ్య నాయుడు అన్ని రాష్ట్రాలతో స్నేహ పూర్వకంగా మెలిగేందుకు తమ ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. ప్రాంతీయ భాషలకు గౌరవం ఇస్తున్నామని, ఆ భాషల మీద మరో భాషను రుద్దే ప్రయత్నం చేయలేదని స్పష్టం చేశారు.
తొలిసారిగా కేంద్ర మంత్రి హోదాలో వెంకయ్యనాయుడు చెన్నైకు శుక్రవారం వచ్చారు. ఆయన రాకను పురస్కరించుకుని కమలనాథులు భారీ స్వాగతానికి ఏర్పాట్లు చేశారు. కమలాలయం వద్ద పార్టీ వర్గాలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు.
హుందాగా వ్యవహరించాలి
తమ పార్టీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ ఆందోళన చేయడం విడ్డూరంగా ఉందని గుర్తుచేస్తూ, ప్రజలు ఇచ్చిన తీర్పును ఓ మారు వారు పరిశీలన చేసుకోవాలని హితవు పలికా రు. గతంలో ఎన్‌డీఏ నియమించిన గవర్నర్‌లోని అధికారంలోకి రాగానే, యూపీఏ తప్పించిందని గుర్తుచేశారు. అయితే తాము రాజీనామ చేయాలని అడగక ముందే కాంగ్రెస్ రాజకీయం చేస్తుండడం శోచనీయమన్నారు.
రాజకీయంగా పదవులు పొందిన వాళ్లు ప్రభుత్వం మారగానే, వాళ్లంతకు వాళ్లు రాజీనామాలు చేసి వెళ్లడం సంప్రదాయం అని, అలా చేసి తమ హుందాతనాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ నియమించిన గవర్నర్లకు సూచించారు. తమిళనాడులో బీజేపి బలం పెరిగిందన్నారు. తమిళనాడులో పార్టీ బలోపేతం మీద దృష్టి పెట్టనున్నామన్నారు.
ప్రాంతీయ భాషలకు గౌరవం
హిందీని రుద్దేయత్నం చేస్తున్నామని కొన్ని పార్టీలు గగ్గోలు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో యూపీఏ ఇచ్చిన ఉత్తర్వుల్ని తాము ఇచ్చినట్టుగా చెబుతున్నారంటూ మండి పడ్డారు. అయితే ఆ ఉత్తర్వుల్లో ఎలాంటి తప్పులు లేవని వివరించారు. హిందీ మాట్లాడే రాష్ట్రాలకు హిందీ ప్రాధాన్యత ఇవ్వాలని ఉందేగానీ, ఇతర భాషల మీద రుద్దాలని లేదని పేర్కొన్నారు. హిందీని ఇతర భాషల మీద రుద్దాలన్న సిద్ధాంత బీజేపీలో లేదని పేర్కొంటూ, తాము ప్రాంతీయ భాషలకు గౌరవాన్ని ఇస్తున్నామన్నారు. ఇలగణేషన్, చక్రవర్తి, వానతీ శ్రీనివాసన్ పాల్గొన్నారు.