సముద్ర తీరాల్లో అలర్ట్
సాక్షి, చెన్నై:రాష్ట్రంలో కొన్నేళ్లుగా ఏ యేడాదికాయేడాది ఎండలు మండుతూనే ఉన్నాయి. భానుడి దెబ్బకు జనం విలవిల్లాడాల్సిన పరిస్థితి. వరుణుడు కరుణించని దృష్ట్యా, ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ ఏడాది కూడా పరిస్థితి అలాగే ఉంది. అయితే, అగ్ని నక్షత్రం ముగియగానే కనమరుగు కావాల్సిన ఎండలు, ఇంకా తమ ప్రతాపాన్ని చూపిస్తుండడం వాతావరణ పరిశోధకులను విస్మయంలో పడేస్తున్నాయి. అగ్ని నక్షత్రం ముగిసి ఇరవై రోజులకు పైగా అవుతున్నా, నైరుతీ రుతు పవనాల సీజన్ ఆరంభమైనా భానుడి ప్రతాపం ఏ మాత్రం తగ్గడం లేదు. మూడు రోజులుగా అయితే, చెన్నై, కడలూరు, వేలూరు, తిరుచ్చి, మదురై, తూత్తుకుడి, పుదుచ్చేరి ప్రజానీకాన్ని భానుడు బెంబేలెత్తిస్తున్నాడు. ఈ సమయంలో కెరటాలు సైతం ఉవ్వెత్తున ఎగసి పడుతుండడం చూసి వాతావరణ పరిశోధకులే అయోమయూనికి లోనవుతున్నారు.
ఉత్కంఠ: భానుడి ప్రతాపం ఓ వైపు, సముద్రంలో అలజడి మరో వైపు వెరసి మున్ముందు రాష్ట్రంలో వాతావరణం ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది. చెన్నై నుంచి కడలూరు తీరం వరకు అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. మహాబలిపురం, కోవలం, చదరంగ పట్నం, కడపాక్కం, వన పాక్కం, ఉయ్యలికుప్పుం, పుదుపట్నం, కడలూరుల్లో పది అడుగుల మేరకు కెరటాలు ఎగసి పడుతున్నాయి. దీంతో జాలర్లు ఆందోళనకు గురవుతున్నారు. కొన్ని చోట్ల సముద్రపు నీరు గ్రామాల్లోకి చొరబడకుండా నిర్మించిన అడ్డు గోడల్ని దాటుతూ అలలు ఎగసి పడుతున్నాయి. కొన్ని చోట్ల సముద్రపు నీళ్లు తమ గ్రామాల్లోకి రాకుండా జాలర్లు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చిన్న సైజు పడవలను భద్ర పరుస్తున్నారు. బుధవారం కొన్ని గ్రామాల జాలర్లు కడలిలోకి చేపల వేటకు వెళ్లడానికి సాహసించ లేదు. బంగాళా ఖాతంలో గాలుల ప్రభావం అధికంగా ఉన్న దృష్ట్యా, కెరటాలు ఎగసి పడుతున్నాయని, ఈ ప్రభావం క్రమంగా పెరిగిన పక్షంలో గాలిలో తేమ పెరిగి వాతావరణం చల్లబడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. మరింతగా అలలు ఎగసి పడేందుకు అవకాశం ఉందని, సముద్ర తీరవాసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
జాలరి గల్లంతు : కెరటాలు ఎగసి పడుతుండడంతో కన్యాకుమారిలో పడవ బోల్తా పడింది. బుధవారం సాయంత్రం కన్యాకుమారి, తూత్తుకుడి, రామనాథపురం తీరాల్లోను అలలు ఉవ్వెత్తున ఎగసి పడ్డాయి. కన్యాకుమారి పల్లంతురైకు చెందిన సోదరులు జాన్ జోసెఫ్, జేసురాజ్‌లు తమ చిన్న పడవతో కడలిలోకి వేటకు వెళ్లారు. అలల తాకిడికి పడవ బోల్తా పడడంతో ఇద్దరు సముద్రంలో పడ్డారు. దీన్ని గుర్తించిన సమీపంలోని కొన్ని పడవల్లో ఉన్న జాలర్లు వారిని రక్షించే యత్నం చేశారు. అయితే, జేసురాజ్‌నుమాత్రం రక్షించ గలిగారు. జాన్ జోసెఫ్ జాడ కానరాలేదు.