అల్‌ఖైదాతో అలర్ట్
సాక్షి, చెన్నై : అల్‌ఖైదా హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రాన్ని అప్రమత్తం చేస్తూ కేంద్ర నిఘా వర్గాలు శనివారం సమాచారం పంపించాయి. భద్రత వ్యవహారంలో అప్రమత్తంగా ఉండాలని, ప్రధానంగా సముద్ర తీరాల్లో నిఘా కట్టుదిట్టం చేయాలని ఆదేశాలు వెలువడ్డాయి. తీవ్రవాదుల టార్గెట్‌లో ఉన్న మదురై మీనాక్షి అమ్మవారి ఆలయ పరిసరాల్లో ఎన్‌ఎస్‌జీ బృందం పరిశీలన జరిపింది. రాష్ర్ట రాజధాని నగరం తీవ్రవాదుల టార్గెట్లో ఉన్నట్టు కేంద్ర నిఘా వర్గాలు గతంలో సమాచారం పంపించాయి. దీంతో పోలీసులు అప్రమత్తంగానే వ్యవహరిస్తున్నారు. గతంలో వెలుగు చూసిన అంశాల మేరకు ఆయా ప్రాంతాల్లో నిఘాను కట్టుదిట్టం చేశారు. ఎల్లప్పుడు నగరం భద్రతా వలయంలో ఉండే విధంగా చర్యలు చేపట్టారు. ఈ పరిస్థితుల్లో ఇటీవల మదురై సైతం తీవ్రవాదుల గురిలో ఉన్నట్టు వెలుగు చూసింది.
ఇతర రాష్ట్రాల్లో చోటుచేసుకునే బాంబు పేలుళ్ల కేసులు తమిళనాడు చుట్టూ తిరుగుతుండటం, ఇక్కడి యువత అరెస్టు అవుతుండడం చోటుచేసుకుం టూ రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగానే ఉంది. ఈ పరిస్థితుల్లో రెండు రోజుల క్రితం అల్ ఖైదా చీఫ్ అల్ జవహరి ఉగ్రవాదాన్ని విస్తరించే రీతిలో ప్రకటన చేశారు. భారత్‌లోను ఖైదత్ అల్ జిహాద్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ కేంద్ర నిఘా వర్గాలు, హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అప్రమత్తం : అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్రం పంపిన ఆదేశాలు, హెచ్చరికల ఉత్తర్వులు శనివారం రాష్ట్ర పోలీసులకు అందాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసు యంత్రాంగంతో సమాలోచనలకు డీజీపీ రామానుజం కసరత్తులు చేస్తున్నారు. జిల్లాల వారీగా ఎస్పీలు, డీఐజీలు, ఐజీలతో వేర్వేరుగా చర్చించి,
అందరితో ఒకే సారి సమీక్షించి ఆయా జిల్లాల్లోని పరిస్థితి, చేపట్టాల్సిన భద్రతపై పలు ఆదేశాలు, సూచనలు ఇవ్వనున్నట్లు ఓ పోలీసు అధికారి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇటీవల వెలుగు చూస్తున్న పరిణామాలు పోలీసు బాసుల్ని కలవరంలో పడేస్తున్నట్టు సమాచారం. అజ్ఞాత తీవ్ర వాదులు పట్టుబడుతుండడం, ఇతర రాష్ట్రాల కేసులు తమిళనాడు చుట్టూ సాగుతుండడంతో, ఇక్కడ చాప కింద నీరులా ఏదేని ఉగ్రవాద కార్యకలాపాలు సాగుతున్నాయా..? అన్నదిశగా పరిశీలనను వేగవంతం చేశారు. ఉగ్రవాద కదలికల్ని పసిగట్టడం, ఎప్పటికప్పుడు సమాచారాలు ఇవ్వడం, పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసే రీతిలో ప్రత్యేకంగా ఓ నిఘా బృందాన్ని రంగంలోకి దించే విధంగా కార్యాచరణ సాగుతున్నట్టు సమాచారం.
ఎన్‌ఎస్‌జీ: తీవ్రవాదుల గురిలో ఉన్న మదురై నగరంలో మరింత భద్రత కట్టుదిట్టం లక్ష్యంగా కేంద్ర బలగాలు కసరత్తులు చేపట్టాయి. ఎన్‌ఎస్‌జీ కమాండర్ ప్రవీణ్‌కుమార్ నేతృత్వంలో ప్రత్యేక బృందం శనివారం మదురైలో పర్యటించింది. ఆలయ పరిసరాల్లో, అన్ని గోపురాలు, అక్కడి వీధులు, ఆలయంలోకి వచ్చే అన్ని మార్గాలు, ఆలయంలోపల ఉన్న భద్రత, వెలుపలి భద్రతను పరిశీలించాయి. నగర పరిసరాల్లో ఉన్న ఎత్తరుున భవనాలను ఆలయం వద్ద నుంచి చూసి, అన్ని వివరాలను నమోదు చేసుకున్నారు. ఆలయ భద్రత లక్ష్యంగా కట్టుదిట్టం చేయాల్సిన నిఘా ఏర్పాట్ల గురించి కేంద్రానికి నివేదిక సమర్పించేందుకు ఈ బృందం మదురైకు వచ్చినట్టుగా అక్కడి పోలీసులు పేర్కొంటున్నారు.