భారత్లోనూ అల్ఖైదా.. హోంశాఖ అలర్ట్!
భారతదేశంలో కూడా అల్ఖైదా శాఖను ఏర్పాటుచేస్తున్నట్లు ఆ సంస్థ అధినేత అల్ జవహరి ప్రకటించడంతో కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఒక్కసారిగా అలర్ట్ అయ్యింది. జవహరి విడుదల చేసిన వీడియో విషయమై చర్చించేందుకు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ నిఘా ఏజెన్సీలతో సమావేశం ఏర్పాటుచేశారు. అల్ఖైదా విడుదల చేసిందని చెబుతున్న వీడియోను ఎంతవరకు నమ్మొచ్చో చూడాలని హోం శాఖ ఐబీని కోరింది.
కొత్తగా వచ్చిన ఉగ్రవాద ముప్పు నేపథ్యంలో దేశంలోని అన్ని పోలీసు స్టేషన్లను ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరించింది. ''అల్ఖైదా వీడియో నేపథ్యంలో మనమంతా మరింత అప్రమత్తం కావాలి. కేంద్ర ప్రభుత్వ నిఘా వర్గాలతో కలిసి పనిచేసి, రాష్ట్రానికి ఎలాంటి ముప్పు రాకుండా చూసుకోవాలి'' అని గుజరాత్ హోం శాఖలోని అత్యంత సీనియర్ అధికారి ఎస్కే నందా తెలిపారు.
భారతదేశంలో కూడా అల్ఖైదా శాఖను ఏర్పాటు చేశామని, ఉపఖండంలో ఇస్లామిక్ పాలన నెలకొల్పి, జీహాద్ జెండా ఎగరేస్తామని అంటూ అల్ఖైదా అగ్రనేత ఆయమాన్ అల్ జవహరి ఓ వీడియోలో ప్రకటించారు. ఈ వీడియో 55 నిమిషాల పాటు సాగింది. బర్మా, బంగ్లాదేశ్, అసోం, గుజరాత్, అహ్మదాబాద్, కాశ్మీర్.. ఇలా అన్ని ప్రాంతాల్లో ఉన్న ముస్లింలకు భారత ఉపఖండంలో అల్ఖైదా రావడం శుభవార్త అవుతుందని ఆ వీడియోలో అల్ జవహరి చెప్పారు.