al jawahiri
-
జేమ్స్ బాండ్ సినిమా తరహాలో ప్రతీకారం తీర్చుకున్న అమెరికా
అల్‌ఖైదా అగ్రనేత అల్ జవాహిరీని అమెరికా వేటాడి, వెంటాడి ప్రాణాలు తీసిన వార్త కొంచెం ఆలస్యంగా వెలుగు చూసింది. గురికి బారెడు దూరంలో ఉన్న ఆస్తులకు, మనుషులకు ఏమాత్రం హాని కలిగించకుండా కేవలం లక్ష్యాన్ని మాత్రమే చేధించగల ఆధునిక క్షిపణి సాయంతో, అఫ్గానిస్తాన్‌లో తలదాచుకున్న ఆ ఉగ్రవాదిని మట్టుబెట్టింది. ఇరవై ఏళ్ళ క్రితం 2001 సెప్టెంబర్ 11 తేదీన (9/11) అప్పటి అల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ కారణంగా జరిగిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన 2,997 మంది అమెరికన్ కుటుంబాల బాధకు, ఆవేదనకు జవాహిరీ మరణం ఓ ముగింపు అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. 9/11గా ప్రసిద్ధమైన ఆనాటి విధ్వంసానికి ప్రతీకారంగా, అమెరికా పదేళ్ల తర్వాత, 2011లో బిన్ లాడెన్‌ను వధించి పగ తీర్చుకుంది. అప్పట్లో లాడెన్‌కు కుడి భుజంగా వ్యవహరించిన జవాహిరీని కూడా వదిలిపెట్టలేదు. మరో పదేళ్ల తర్వాత ఇప్పుడు అల్ జవాహిరీని చంపి, తమది పాము పగ అని అమెరికా యావత్ ప్రపంచానికీ మరోమారు చాటి చెప్పింది. ఈ నేపథ్యంలో గతంలో ఏం జరిగిందో చూద్దాం. ‘మతం కోసం ఎలాంటి మారణహోమానికి అయినా సిద్ధం’ అనే సిద్ధాంతం అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్‌ది. ‘ప్రపంచం మీద పెత్తనం కోసం ఎంతటి దురాగతానికయినా సంసిద్ధం’ అనే తత్వం అమెరికాది. ‘పాముకు పాలుపోసి పెంచుతాను, కానీ ఆ పాము తనను తప్ప ఎవరిని కాటేసినా ఫరవాలేదు అనే థియరీ’ అమెరికాది. ‘కోరల్లో దాచుకున్న విషం కక్కేటప్పుడు స్వపర భేదాల ప్రసక్తి పనికి రాదనే భావజాలం’ ఒసామాది. ఒకానొక కాలంలో అమెరికా తన అవసరాల కోసం పెంచి పోషించిన ఒసామా బిన్ లాడెన్ అనే ఈ విషనాగు, ఇరవై ఏళ్ళ క్రితం అమెరికాపైనే ఎదురుతిరిగి, పాలు పోసి పెంచిన చేతినే కాటేసింది. సోవియట్ యూనియన్ అంతర్ధానం తరువాత ఏర్పడ్డ ఏకధృవ ప్రపంచానికి... లేని పెద్దరికాన్ని ఆపాదించుకుని అనేక అకృత్యాలకు పాల్పడుతున్న అమెరికా అహంభావాన్ని... బిన్ లాడెన్ తనదైన శైలిలో దెబ్బ తీశాడు. అప్పుడు కానీ ‘పాము – పాలు’ కథ లోని అంతరార్థం అమెరికాకు అవగతం కాలేదు. తన దాకా వస్తేగాని తత్వం బోధపడదన్నట్టుగా... అల్‌ఖైదా తీవ్ర వాదులు 2001, సెప్టెంబర్ 11న వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట టవర్లను విమానాలతో ఢీ కొట్టించి కనీ వినీ ఎరగని భయోత్పాతాన్ని సృష్టించిన ఘటన తర్వాత గానీ ఉగ్రవాదం వల్ల పొంచి వున్న ముప్పు ఎలా ఉంటుందన్నది అమెరికాకు అర్థం కాలేదు. ఆనాటి పరాభవం అమెరికాలో పట్టుదలను పెంచింది. ఆ దురాగతానికి రూపశిల్పి అయిన ఒసామా బిన్ లాడెన్ అంతం చూడడానికి దశాబ్ద కాలంగా అమెరికా చేయని ప్రయత్నం అంటూ లేదు. చిట్టచివరికి, పదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, పాకిస్తాన్ భూభాగంలో ఆ దేశ పాలకులకే తెలియకుండా తలదాచుకుంటున్న ఒసామా బిన్ లాడెన్‌ను, జల్లెడ పట్టి గాలించి పట్టుకుని మట్టు పెట్టేదాకా మాజీ అగ్ర రాజ్యాధినేత బరాక్ హుస్సేన్ ఒబామాకు కంటిమీద కునుకు లేకుండాపోయింది. ఒసామా మరణించిన విషయాన్ని స్వయంగా అమెరికన్ అధ్యక్షుడే ప్రకటించిన అంశాన్ని గమనిస్తే ఈ విషయానికి ఆ దేశం ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో విశదమవుతుంది. లాడెన్ మరణ వార్తను ధృవ పరచుకోవడానికి వీలుగా అమెరికా వ్యూహకర్తలు పకడ్బందీగా అమలు చేసిన హైటెక్ పద్ధతులు టీవీల్లో చూసినవారికి జేమ్స్ బాండ్ సినిమాలు జ్ఞప్తికి వచ్చాయి. వైట్ హౌస్‌లో కూర్చుని పథకం అమలవుతున్న తీరు తెన్నులను ఎప్పటి కప్పుడు ఉపగ్రహ సాయంతో గమనిస్తున్న ప్రెసిడెంట్ ఒబామా హావభావాలను బట్టి అన్ని దేశాలలోని టీవీ వీక్ష కులూ లాడెన్ మృతి పట్ల ఆ దేశానికి వున్న పట్టుదలను అర్థం చేసుకోగలిగారు. (క్లిక్: జవహరీ మృతిపై తాలిబన్ల సంచలన ప్రకటన) ఒసామా బిన్ లాడెన్ పూర్వీకులు ఎమెన్‌లో కడు నిరుపేదలు. అతడి తండ్రి మహమ్మద్ బిన్ లాడెన్, ఎమెన్ నుంచి ఉదర పోషణార్థం సౌదీ అరేబియాకు వలస వెళ్లి నిర్మాణ రంగంలో కాలుపెట్టి కోట్లకు పడగలెత్తాడు. గల్ఫ్ యుద్ధం సహాయక చర్యల్లో భాగంగా... అమెరికా మిలిటరీ స్థావరం ఏర్పాటుకు సౌదీ ప్రభుత్వం తన భూభాగంలో అనుమతించడాన్ని ఒసామా విమర్శించాడు. దీంతో కోపగించిన సౌదీ ప్రభుత్వం అతడి పౌరసత్వాన్నీ, పాస్‌పోర్ట్‌నూ రద్దు చేసింది. అప్పటికే లాడెన్ కుటుంబం కూడా ఒసామాను తమ నుంచి వెలి వేసింది. ఆ తర్వాత ప్రపంచంలోనే భయంకర ఉగ్రవాదిగా తయారయ్యి అమెరికా చేతిలో హతుడయ్యాడు. ఒసామా తర్వాత అల్‌ఖైదా పగ్గాలు చేపట్టిన అల్ జవాహిరీ కూడా లాడెన్ తరహాలోనే మరణించడం కాకతాళీయం. - భండారు శ్రీనివాసరావు సీనియర్ జర్నలిస్ట్ -
జవహరీ హతం.. అమెరికన్లూ జాగ్రత్త! బైడెన్ సర్కారు అధికారిక ప్రకటన
వాషింగ్టన్: అల్‌ఖైదా చీఫ్ అల్ జవహరీ హత్య తర్వాత అమెరికన్లపై ప్రతీకార దాడులు జరిగే ప్రమాదం ఉందని ఆ దేశ విదేశాంగ శాఖ హెచ్చరించింది. అల్‌ఖైదా అనుబంధ ఉగ్రసంస్థలు, సానుభూతిపరులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా పౌరులు, కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడే అవకాశముందని చెప్పింది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న అమెరికన్లు, మున్ముందు విదేశీ పర్యటనలకు వెళ్లాలనుకునే పౌరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉగ్రసంస్థలు వివిధ దేశాల్లో దాడులకు పాల్పడే అవకాశముందని ప్రస్తుతం తమకు అందుబాటులో ఉన్న సమాచారం సూచిస్తోందని విదేశాంగ శాఖ చెప్పింది. ఆత్మాహుతి దాడులు, హత్యలు, కిడ్నాప్‌లు, బాంబుపేలుళ్లు ఇలా ఏ రూపంలోనైనా ఉగ్రవాదులు విధ్వంసం సృష్టించవచ్చని చెప్పింది. పరిస్థితిని అర్థం చేసుకుని అమెరికన్లంతా అత్యంత జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. అల్ జవహరీని అమెరికా డ్రోన్ దాడులు నిర్వహించి హతమార్చింది. కాబూల్ ఓ ఇంట్లో తలదాచుకున్న అతడిపై డ్రోన్లతో క్షిపణి దాడులు చేసి అంతం చేసింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ విషయాన్ని సోమవారం అధికారికంగా ప్రకటించారు. జవహరీ మృతితో 9/11 ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు న్యాయం చేసినట్లయిందని పేర్కొన్నారు. మరోవైపు ఈ దాడిని తాలిబన్లు ఖండించారు. అమెరికా అంతర్జాతీయ నిబంధనలను అతిక్రమించిందని, 2000 సంవత్సరంలో కుదిరిన ఒప్పందాలను విస్మరించిందని ఆరోపించారు. చదవండి: రెండు దశాబ్దాల వేట.. అల్ ఖైదా చీఫ్‌ను అమెరికా ఎలా మట్టుబెట్టిందంటే? -
Al Zawahiri: అల్‌ఖైదా చీఫ్ హతంపై బరాక్ ఒబామా కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్: డ్రోన్ దాడితో అల్‌ఖైదా చీఫ్ అల్ జవహరిని అమెరికా ముట్టుబెట్టిన విషయం తెలిసిందే. దీనిపై అగ్రరాజ్యం మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం చేయకుండానే ఉగ్రవాదాన్ని కూకటివెేళ్లతో పెకలించివేయవచ్చు అనేందుకు జవహరి ఘటనే నిదర్శనమన్నారు. అతని మృతితో 9/11 దాడుల బాధిత కుటుంబాలకు శాంతి లభిస్తుందని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు. అలాగే ఒక్క పౌరుని ప్రాణాలకు కూడా హాని లేకుండా జవహరిని అంతం చేసినందుకు అధ్యక్షుడు జో బైడెన్ పాలనాయంత్రాంగంపై ప్రశంసల వర్షం కురిపించారు ఒబామా. ఈ క్షణం కోసం రెండు దశాబ్దాలుగా నిర్విరామంగా కృషి చేసిన అమెరికా నిఘా వర్గాలను కొనియాడారు. More than 20 years after 9/11, one of the masterminds of that terrorist attack and Osama bin Laden’s successor as the leader of al-Qaeda – Ayman al-Zawahiri – has finally been brought to justice. — Barack Obama (@BarackObama) August 2, 2022 కాబూల్‌లో తన కుటుంబసభ్యులతో కలిసి ఓ ఇంట్లో ఉన్న అల్ జవహరి బాల్కనీలోకి వచ్చినప్పుడు డ్రోన్లతో క్షిపణిదాడులు చేసింది అమెరికా. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. జో బైడెన్ ఈ విషయాన్ని సోమవారం వెల్లడించారు. అతని మృతితో 9/11 ఘటన బాధితుల కుటుంబాలకు న్యాయం చేసినట్లయిందని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌లో కీలకంగా వ్యవహరించిన నిఘా వర్గాలను కొనియాడారు. 9/11 ఘటన అనంతరం ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు ఆఫ్గానిస్థాన్‌లో రెండు దశాబ్దాల పాటు యుద్ధం చేశాయి అమెరికా బలగాలు. అఫ్గాన్ సైన్యానికి కూడా శిక్షణ ఇచ్చాయి. అయితే గతేడాదే అమెరికా బలగాలను ఉపసంహరించారు జో బైడెన్. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు యుద్ధం చేయాల్సిన అవసరం లేదని ఒబామా అన్నారు. చదవండి: రెండు దశాబ్దాల వేట.. అల్ ఖైదా చీఫ్‌ను అమెరికా ఎలా మట్టుబెట్టిందంటే? -
కాబూల్‌లో అల్‌ఖైదా చీఫ్ హతం.. స్పందించిన తాలిబన్లు
కాబూల్: అల్‌ఖైదా చీఫ్ అల్ జవహరిని అమెరికా డ్రోన్ దాడులు నిర్వహించి హతమార్చిన విషయం తెలిసిందే. అయితే ఆదివారం జరిగిన ఈ దాడిపై తాలిబన్లు స్పందించారు. అమెరికా చర్య అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమని, జవహరిపై దాడిని ఖండిస్తున్నామన్నారు. 2020లో జరిగిన అమెరికా బలగాల ఉపసంహరణ ఒప్పందాన్ని అతిక్రమించారని పేర్కొన్నారు. ఈమేరకు తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహీద్ ఒక ప్రకటన విడుదల చేశారు. కాబూల్‌లోని ఓ నివాసంలో తలదాచుకున్న అల్ జవహరిని మట్టుబెట్టినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం వెల్లడించారు. 9/11 దాడి బాధితులకు న్యాయం చేసినట్లయిందని పేర్కొన్నారు. ఆపరేషన్‌లో కీలకంగా వ్యవహరించిన అమెరికా నిఘా వర్గాలను కొనియాడారు. అల్ జవహరి కుటుంబంతో సహా కాబూల్‌లోని ఓ ఇంట్లో తలదాచుకున్నాడనే పక్కా సమాచారంతో అమెరికా సీఐఏ ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. అతను ఇంటి బాల్కనీపైకి వచ్చినప్పుడు అదను చూసి క్షిపణులతో విరచుకుపడింది. డ్రోన్ల సాయంతో ఈ దాడి చేసింది. ఈ ఘటనలో సాధారణ పౌరులెవరూ చనిపోలేదని అమెరికా నిఘా వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదంపై పోరాటంలో భాగంగా దాదాపు 20 ఏళ్లకు పైగా అఫ్గానిస్తాన్‌లో ఉన్న అమెరికా బలగాలు గతేడాది తాలిబన్లు అధికారం చేపట్టాక వెళ్లిపోయాయి. దాదాపు 11 నెలల తర్వాత అల్‌ఖైదా చీఫ్‌ను హతమార్చేందుకు మళ్లీ అక్కడకు వెళ్లాయి. అయితే దాడి విషయంపై తాలిబన్లకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. చదవండి: రెండు దశాబ్దాల వేట.. అల్ ఖైదా చీఫ్‌ను అమెరికా ఎలా మట్టుబెట్టిందంటే? -
రెండు దశాబ్దాల వేట.. అల్ ఖైదా చీఫ్‌ను అమెరికా ఎలా మట్టుబెట్టిందంటే?
కాబూల్: అల్‌ఖైదా చీఫ్ అల్ జవహరి కోసం రెండు దశాబ్దాలుగా వేట కొనసాగిస్తున్నాయి అమెరికా బలగాలు. ఎట్టకేలకు అతడు కాబూల్‌లో ఓ ఇంట్లో నక్కి ఉన్నాడని పసిగట్టి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి మట్టుబెట్టాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఈ విషయాన్ని ఇప్పటికే ధ్రువీకరించారు. అయితే ఈ ఆపరేషన్‌కు సంబంధించి పేరు చెప్పడానికి ఇష్టపడని అమెరికా నిఘా అధికారి ఒకరు కీలక విషయాలను వెల్లడించారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) డ్రోన్ దాడులు చేసి అల్ జవహరిని హతమార్చినట్లు తెలిపారు. అంతేకాదు ఈ ఆపరేషన్‌కు కొన్ని నెలల ముందు నుంచి ఏం జరుగిందో వివరించారు. 2001లో ట్విన్ టవర్లపై దాడి జరిగినప్పటి నుంచి అందుకు కారణమైన అల్‌ఖైదాను నామరూపాల్లేకుండా చేయాలని అమెరికా కంకణం కట్టుకుంది. దీని ముఖ్య సూత్రధారులు ఒసామా బిన్ లాడెన్, అల్ జవహరి కోసం వేట మొదలుపెట్టింది. ఇద్దరూ అమెరికా నిఘా వర్గాలు కూడా పసిగట్టలేని రహస్య ప్రదేశాల్లో తలదాచుకున్నారు. అయితే పదేళ్ల తర్వాత బిన్ లాడెన్ పాకిస్థాన్‌లో ఉన్నట్లు అగ్రరాజ్యానికి తెలిసింది. 2011 మే 2న సైన్యాన్ని రంగంలోకి దింపి రాత్రికిరాత్రే అతడ్ని మట్టుబెట్టింది. కానీ అల్ జవవరి ఆచూకీపై మాత్రం ఎలాంటి సమాచారం లేదు. మకాం మార్చినట్లు తెలిసి అయితే ఈ ఏడాది ఏప్రిల్‌లో అల్ జవహరి కుటుంబంతో సహా తన మకాం కాబూల్‌లోని ఓ ఇంట్లోకి మార్చినట్లు అమెరికా నిఘా వర్గాలకు కచ్చితమైన సమాచారం అందింది. వెంటనే నిఘా అధికారులు, జాతీయ భద్రతా సలహాదారులు జో బైడెన్‌తో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఈ విషయంపై చర్చించారు. అనంతరం జులై1న బైడెన్‌తో అధికారులు మరోసారి సమావేశం నిర్వహించారు. జవహరిని ఎలా చంపబోతున్నామనే మాస్టర్ ప్లాన్‌కు బైడెన్‌కు వివరించారు. అల్‌ఖైదా చీఫ్ ప్రస్తుతం ఉన్న ఇంటి నమూనాను కూడా బైడెన్ చూపించి దాడి ఎలా చేసేది పూసగుచ్చినట్లు వివరించారు. ఈ ఆపరేషన్ గురించి బైడెన్, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌తో పాటు అతికొద్ది మంది అధికారులకు మాత్రమే తెలుసు. ఆపరేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఆ తర్వాత జులై 25న తన కేబినెట్ సభ్యులు, ముఖ్య అధికారులో బైడెన్ సమావేశమయ్యారు. ఒకవేళ జవహరిని చంపితే తాలిబన్లతో అమెరికా సంబంధాలు ప్రభావితమవుతాయా? అనే విషయంపై చర్చించారు. అనంతరం జవహరిని హతమార్చేందుకు బైడెన్ అనుమతి ఇచ్చారు. పౌరుల ప్రాణాలకు ముప్పు లేకుండా వాయు దాడులు చేయాలని సూచించారు. క్షిపణులతో భీకర దాడి జులై 30న సీఐఏ పక్కా పథకంతో దాడికి సిద్ధమైంది. కాబూల్‌లో అల్ జవహరి ఉన్న ఇల్లును చుట్టుముట్టింది. అతను ఇంటి బాల్కనీపైకి రాగానే మానవరహిత డ్రోన్ల సాయంతో క్షిపణి దాడులు చేసింది. సరిగ్గా రాత్రి 9:38గంటల సమయంలో ఈ ఎటాక్ జరిగింది. జవహరి చనిపోయాడని నిర్ధరించుకున్నాకే సీఐఏ వెనుదిరిగింది. అయితే దాడి జరిగిన సమయంలో జవవరి కుటుంబసభ్యులు ఇంటి వేరే భాగం వైపు ఉన్నట్లు సీఐఏ అధికారి తెలిపారు. అల్ జవహరి తలదాచుకున్న ఇల్లు సీనియర్ తాలిబన్‌దేనని సీఐఏ అధికారి పేర్కొన్నారు. ఆయన కాబూల్‌లోనే ఉన్నాడనే విషయం తాలిబన్లకు తెలుసన్నారు. అయితే తాము చేపట్టిన ఆపరేషన్ గురించి తాలిబన్లకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని చెప్పారు. అల్ జవహరి హతమైనట్లు బైడెన్ సోమవారం అధికారిక ప్రకటన చేసినప్పుడు ఈ ఆపరేషన్‌ను ఎవరు నిర్వహించారనే విషయంపై మాత్రం ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అమెరికా నిఘా వర్గాల నైపుణ్యాలను బైడెన్ కొనియాడారు. చదవండి: అల్‌ఖైదా అగ్రనేతను మట్టుబెట్టిన అమెరికా -
అల్‌ఖైదా అగ్రనేతను మట్టుబెట్టిన అమెరికా
కాబూల్: అల్‌ఖైదా చీఫ్ అల్-జవహరిని అమెరికా మట్టుబెట్టింది. అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో డ్రోన్ దాడులు జరిపి అతడ్ని హతమార్చింది. అల్ జవహరి మృతిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం అధికారికంగా ప్రకటించారు. ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి అల్ జవహరిని మట్టుబెట్టినట్లు పేర్కొన్నారు. అల్ జవహరి కుటుంబంతో సహా కాబూల్‌లోని ఓ ఇంట్లో తలదాచుకున్నట్లు అమెరికా నిఘా వర్గాలు పసిగట్టాయి. దీంతో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించేందుకు జో బైడెన్ అమెరికా సైన్యానికి గతవారం అనుమతిచ్చారు. ఆదివారం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన వారు డ్రోన్ దాడులు చేసి అల్ జవహరిని హతమార్చారు. ఈ ఘటనలో సాధారణ పౌరులెవరూ ప్రాణాలు కోల్పోలేదని బైడెన్ పేర్కొన్నారు. అల్ జవహరి మృతితో 9/11 ఉగ్రదాడి బాధితులకు న్యాయం చేసినట్లయిందని అన్నారు. 2001లో అమెరికా ట్విన్ టవర్లపై ఉగ్రదాడి ఘటనలో ఒసామా బిన్ లాడెన్‌తో పాటు అల్ జవహరి కూడా ముఖ్య సూత్రధారి. పాకిస్తాన్లో తలదాచుకున్న బిన్ లాడెన్‌ను 2011 మే 2న ప్రత్యేక ఆపరేషన్ నిర్వహంచి మట్టు బెట్టింది అమెరికా సైన్యం. ఇప్పుడు కాబూల్‌లో నక్కి ఉన్న అల్ జవవరిని హతమార్చింది. అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా బలగాలు వెళ్లిపోయిన 11 నెలలకే అల్‌ఖైదా చీఫ్‌ను అంతం చేయడం ఉగ్రవాదంపై పోరులో అమెరికాకు కీలక విజయమనే చెప్పవచ్చు. అల్ జవహరి మృతితో ఇకపై అప్గానిస్థాన్ ఉగ్రవాదులకు సురక్షితమైన ప్రదేశంగా ఉండబోదని బైడెన్ పేర్కొన్నారు. చదవండి: షాకింగ్! బిన్ లాడెన్ కుటుంబం నుంచి భారీ విరాళం తీసుకున్న బ్రిటన్ ప్రిన్స్! -
సోషల్ వెబ్సైట్లపై కన్నేసి ఉంచండి: నరసింహన్
* సున్నిత ప్రాంతాల్లో నిఘా ముమ్మరం చేయండి * యువతకు కౌన్సెలింగ్ ఇవ్వడానికి ప్రయత్నించండి * పోలీసు అధికారులకు స్పష్టం చేసిన గవర్నర్ నరసింహన్ సాక్షి, హైదరాబాద్: ఆసియాతో పాటు భారత్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్లు అల్‌కాయిదా నేత అల్ జవహరి ప్రకటనతో కూడిన వీడియో విడుదల కావడం, అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్)లో చేరేందుకు వెళ్తూ హైదరాబాద్‌కు చెందిన నలుగురు విద్యార్థులు కోల్‌కతాలో పట్టుపడటం నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ శుక్రవారం విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు. అత్యంత అప్రమత్తంగా ఉంటూ అన్ని ముందు జాగ్రత్త చర్యల్నీ తీసుకోవాల్సిందిగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో గవర్నర్ సలహాదారులు ఏకే మహంతి, శర్మలతో పాటు తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ, రెండు రాష్ట్రాల నిఘా విభాగం అధిపతులు, హైదరాబాద్-సైబరాబాద్ కమిషనర్లతో పాటు కేంద్ర నిఘా సంస్థ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) సంయుక్త డెరైక్టర్ పాల్గొన్నారు. తాజా పరిణామాలతో పాటు రాజధానిలో గణేష్ ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో సున్నిత ప్రాంతాల్లో నిఘా ముమ్మరం చేయాల్సిందిగా గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. సామాజిక మాధ్యమాలపై నిఘా వేసి ఉంచేందుకు నిఘా విభాగంలో ప్రత్యేక సాంకేతిక బృందాలను ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారు. అనుమానిత ప్రాంతాల్లో యువతతో పాటు వారి తల్లిదండ్రులకూ కౌన్సెలింగ్ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. ఈ కోణంలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ పోలీసులు, నిఘా విభాగాలు అప్రమత్తంగా వ్యవహరించాలని, ఏమాత్రం ఏమరుపాటుకు తావిచ్చినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్న విషయం గుర్తుంచుకోవాలని గవర్నర్ స్పష్టం చేశారు. అల్‌కాయిదా, ఐఎస్ఐఎస్ల కార్యకలాపాలను పరిగణనలోకి తీసుకునే ముందు జాగ్రత్త చర్యల్ని రెండు రాష్ట్రాల కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ అధికారులు నరసింహన్‌కు వివరించారు. -
భారత్‌లోనూ అల్‌ఖైదా.. హోంశాఖ అలర్ట్!
భారతదేశంలో కూడా అల్‌ఖైదా శాఖను ఏర్పాటుచేస్తున్నట్లు ఆ సంస్థ అధినేత అల్ జవహరి ప్రకటించడంతో కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఒక్కసారిగా అలర్ట్ అయ్యింది. జవహరి విడుదల చేసిన వీడియో విషయమై చర్చించేందుకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నిఘా ఏజెన్సీలతో సమావేశం ఏర్పాటుచేశారు. అల్‌ఖైదా విడుదల చేసిందని చెబుతున్న వీడియోను ఎంతవరకు నమ్మొచ్చో చూడాలని హోం శాఖ ఐబీని కోరింది. కొత్తగా వచ్చిన ఉగ్రవాద ముప్పు నేపథ్యంలో దేశంలోని అన్ని పోలీసు స్టేషన్లను ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరించింది. ''అల్‌ఖైదా వీడియో నేపథ్యంలో మనమంతా మరింత అప్రమత్తం కావాలి. కేంద్ర ప్రభుత్వ నిఘా వర్గాలతో కలిసి పనిచేసి, రాష్ట్రానికి ఎలాంటి ముప్పు రాకుండా చూసుకోవాలి'' అని గుజరాత్ హోం శాఖలోని అత్యంత సీనియర్ అధికారి ఎస్కే నందా తెలిపారు. భారతదేశంలో కూడా అల్‌ఖైదా శాఖను ఏర్పాటు చేశామని, ఉపఖండంలో ఇస్లామిక్ పాలన నెలకొల్పి, జీహాద్ జెండా ఎగరేస్తామని అంటూ అల్‌ఖైదా అగ్రనేత ఆయమాన్ అల్ జవహరి ఓ వీడియోలో ప్రకటించారు. ఈ వీడియో 55 నిమిషాల పాటు సాగింది. బర్మా, బంగ్లాదేశ్, అసోం, గుజరాత్, అహ్మదాబాద్, కాశ్మీర్.. ఇలా అన్ని ప్రాంతాల్లో ఉన్న ముస్లింలకు భారత ఉపఖండంలో అల్‌ఖైదా రావడం శుభవార్త అవుతుందని ఆ వీడియోలో అల్ జవహరి చెప్పారు.