కాబూల్: అల్‌ఖైదా చీఫ్ అల్ జవహరి కోసం రెండు దశాబ్దాలుగా వేట కొనసాగిస్తున్నాయి అమెరికా బలగాలు. ఎట్టకేలకు అతడు కాబూల్‌లో ఓ ఇంట్లో నక్కి ఉన్నాడని పసిగట్టి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి మట్టుబెట్టాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఈ విషయాన్ని ఇప్పటికే ధ్రువీకరించారు.
అయితే ఈ ఆపరేషన్‌కు సంబంధించి పేరు చెప్పడానికి ఇష్టపడని అమెరికా నిఘా అధికారి ఒకరు కీలక విషయాలను వెల్లడించారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) డ్రోన్ దాడులు చేసి అల్ జవహరిని హతమార్చినట్లు తెలిపారు. అంతేకాదు ఈ ఆపరేషన్‌కు కొన్ని నెలల ముందు నుంచి ఏం జరుగిందో వివరించారు.
2001లో ట్విన్ టవర్లపై దాడి జరిగినప్పటి నుంచి అందుకు కారణమైన అల్‌ఖైదాను నామరూపాల్లేకుండా చేయాలని అమెరికా కంకణం కట్టుకుంది. దీని ముఖ్య సూత్రధారులు ఒసామా బిన్ లాడెన్, అల్ జవహరి కోసం వేట మొదలుపెట్టింది. ఇద్దరూ అమెరికా నిఘా వర్గాలు కూడా పసిగట్టలేని రహస్య ప్రదేశాల్లో తలదాచుకున్నారు. అయితే పదేళ్ల తర్వాత బిన్ లాడెన్ పాకిస్థాన్‌లో ఉన్నట్లు అగ్రరాజ్యానికి తెలిసింది. 2011 మే 2న సైన్యాన్ని రంగంలోకి దింపి రాత్రికిరాత్రే అతడ్ని మట్టుబెట్టింది. కానీ అల్ జవవరి ఆచూకీపై మాత్రం ఎలాంటి సమాచారం లేదు.
మకాం మార్చినట్లు తెలిసి
అయితే ఈ ఏడాది ఏప్రిల్‌లో అల్ జవహరి కుటుంబంతో సహా తన మకాం కాబూల్‌లోని ఓ ఇంట్లోకి మార్చినట్లు అమెరికా నిఘా వర్గాలకు కచ్చితమైన సమాచారం అందింది. వెంటనే నిఘా అధికారులు, జాతీయ భద్రతా సలహాదారులు జో బైడెన్‌తో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఈ విషయంపై చర్చించారు.
అనంతరం జులై1న బైడెన్‌తో అధికారులు మరోసారి సమావేశం నిర్వహించారు. జవహరిని ఎలా చంపబోతున్నామనే మాస్టర్ ప్లాన్‌కు బైడెన్‌కు వివరించారు. అల్‌ఖైదా చీఫ్ ప్రస్తుతం ఉన్న ఇంటి నమూనాను కూడా బైడెన్ చూపించి దాడి ఎలా చేసేది పూసగుచ్చినట్లు వివరించారు. ఈ ఆపరేషన్ గురించి బైడెన్, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌తో పాటు అతికొద్ది మంది అధికారులకు మాత్రమే తెలుసు.
ఆపరేషన్‌కు గ్రీన్ సిగ్నల్
ఆ తర్వాత జులై 25న తన కేబినెట్ సభ్యులు, ముఖ్య అధికారులో బైడెన్ సమావేశమయ్యారు. ఒకవేళ జవహరిని చంపితే తాలిబన్లతో అమెరికా సంబంధాలు ప్రభావితమవుతాయా? అనే విషయంపై చర్చించారు. అనంతరం జవహరిని హతమార్చేందుకు బైడెన్ అనుమతి ఇచ్చారు. పౌరుల ప్రాణాలకు ముప్పు లేకుండా వాయు దాడులు చేయాలని సూచించారు.
క్షిపణులతో భీకర దాడి
జులై 30న సీఐఏ పక్కా పథకంతో దాడికి సిద్ధమైంది. కాబూల్‌లో అల్ జవహరి ఉన్న ఇల్లును చుట్టుముట్టింది. అతను ఇంటి బాల్కనీపైకి రాగానే మానవరహిత డ్రోన్ల సాయంతో క్షిపణి దాడులు చేసింది. సరిగ్గా రాత్రి 9:38గంటల సమయంలో ఈ ఎటాక్ జరిగింది. జవహరి చనిపోయాడని నిర్ధరించుకున్నాకే సీఐఏ వెనుదిరిగింది. అయితే దాడి జరిగిన సమయంలో జవవరి కుటుంబసభ్యులు ఇంటి వేరే భాగం వైపు ఉన్నట్లు సీఐఏ అధికారి తెలిపారు.
అల్ జవహరి తలదాచుకున్న ఇల్లు సీనియర్ తాలిబన్‌దేనని సీఐఏ అధికారి పేర్కొన్నారు. ఆయన కాబూల్‌లోనే ఉన్నాడనే విషయం తాలిబన్లకు తెలుసన్నారు. అయితే తాము చేపట్టిన ఆపరేషన్ గురించి తాలిబన్లకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని చెప్పారు.
అల్ జవహరి హతమైనట్లు బైడెన్ సోమవారం అధికారిక ప్రకటన చేసినప్పుడు ఈ ఆపరేషన్‌ను ఎవరు నిర్వహించారనే విషయంపై మాత్రం ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అమెరికా నిఘా వర్గాల నైపుణ్యాలను బైడెన్ కొనియాడారు.
చదవండి: అల్‌ఖైదా అగ్రనేతను మట్టుబెట్టిన అమెరికా
Comments
Please login to add a commentAdd a comment