![Joe Biden: Will Address Nation Why US Troops Withdrawal Afghanistan Deadline - Sakshi](/styles/webp/s3/article_images/2021/08/31/Joe-Biden1.jpg.webp?itok=1Lnxc5pi)
అమెరికా సైన్యాల ఉపసంహరణ.. అధ్యక్షుడు జో బైడెన్ ప్రసంగం
వాషింగ్టన్: గత 17 రోజులుగా అఫ్గనిస్తాన్‌లో తమ బలగాలు చేపట్టిన పౌరుల తరలింపు ప్రక్రియ(ఎయిర్‌లిఫ్టు) అమెరికా చరిత్రలోనే అతి పెద్దదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు. సుమారు 1,20,000 వేల మంది అమెరికా పౌరులు, అమెరికా- అఫ్గన్ మిత్ర దేశాల ప్రజలను తరలించినట్లు పేర్కొన్నారు. అఫ్గన్‌లో అమెరికా బలగాల ఉపసంహరణ పూర్తైన నేపథ్యంలో జో బైడెన్ తాజాగా మీడియాతో మాట్లాడారు.
ఈ మేరకు... ‘‘20 ఏళ్లుగా అమెరికా సైన్యం అఫ్గనిస్తాన్‌లో అందిస్తున్న సేవలు నేటితో ముగిసాయి. ముందుగా నిర్దేశించిన ప్రకారం ఆగష్టు 31, వేకువజాము లోపే.. ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా.. అత్యంత సురక్షితంగా ఈ ప్రమాదకరమైన ఆపరేషన్ పూర్తి చేసిన మా కమాండర్లకు ధన్యవాదాలు చెబుతున్నా’’ అని పేర్కొన్నారు. అయితే ఇప్పటితో తరలింపు ప్రక్రియ పూర్తైనట్లు కాదని, అంతర్జాతీయ భాగస్వాములు, మిత్రదేశాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని తమ విదేశాంగ మంత్రికి చెప్పినట్లు బైడెన్ తెలిపారు.
తాలిబన్లు మాట నిలబెట్టుకోవాలి
‘‘అఫ్గనిస్తాన్‌ను వీడాలనుకుంటున్న అమెరికన్లు, అఫ్గన్, ఇతర విదేశీ పౌరులను సురక్షితంగా అక్కడి నుంచి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించాను. ఇందుకు సంబంధించి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో నేడు తీర్మానం జరుగనుంది’’ అని పేర్కొన్నారు. అఫ్గనిస్తాన్‌ను వీడాలనుకున్న పౌరులను సురక్షితంగా తరలిస్తామని తాలిబన్లు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా బైడెన్ గుర్తుచేశారు.
అంతర్జాతీయ పౌరుల ప్రయాణాలపై తాలిబన్లు ఎటువంటి ఆంక్షలు విధించరని అంతర్జాతీయ సమాజం భావిస్తోందన్నారు. ఇక ఆగష్టు 31లోపు అమెరికా సైన్యాలను వెనక్కి పిలిపించడం వెనుక గల కారణాలను తదుపరి మీడియా సమావేశంలో వెల్లడిస్తానని బైడెన్ పేర్కొన్నారు. కాగా ఆగష్టు 15న తాలిబన్లు అఫ్గనిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం నాటి(ఆగష్టు 31)తో సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని అమెరికాకు డెడ్‌లైన్ విధించారు.
Comments
Please login to add a commentAdd a comment