Al Khaida
-
Bihar: సీఎం కార్యాలయానికి బాంబు బెదిరింపు
బీహార్‌లోని పట్నాలో గల ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కార్యాలయానికి బాంబు బెదిరింపు రావడంతో కలకలం చెలరేగింది. ఈ నేపధ్యంలో సీఎం కార్యాలయ భద్రతా వ్యవస్థను మరింత అప్రమత్తం చేశారు. కార్యాలయ ప్రాంగణంలో అణువణువునా తనిఖీలు నిర్వహిస్తున్నారు.తీవ్రవాద సంస్థ అల్ ఖైదా పేరుతో సీఎం కార్యాలయానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీనిపై సెక్రటేరియట్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తరువాత ఏటీఎస్ కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించింది. కాగా గతంలో పట్నా విమానాశ్రయానికి బాంబు బెదిరింపు వచ్చింది. అయితే ముమ్మర తనిఖీల తర్వాత బాంబులాంటిదేమీ లేదని తేలడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.జూలైలో పట్నాలోని ఓ ఇంట్లో బాంబు తయారీ సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 35 లైవ్ కాట్రిడ్జ్‌లు, పొటాషియం నైట్రేట్ బాక్స్, ట్రీ ఫిల్ లిక్విడ్ బాక్స్ తదితరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో పవన్ మహతో అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
జేమ్స్ బాండ్ సినిమా తరహాలో ప్రతీకారం తీర్చుకున్న అమెరికా
అల్‌ఖైదా అగ్రనేత అల్ జవాహిరీని అమెరికా వేటాడి, వెంటాడి ప్రాణాలు తీసిన వార్త కొంచెం ఆలస్యంగా వెలుగు చూసింది. గురికి బారెడు దూరంలో ఉన్న ఆస్తులకు, మనుషులకు ఏమాత్రం హాని కలిగించకుండా కేవలం లక్ష్యాన్ని మాత్రమే చేధించగల ఆధునిక క్షిపణి సాయంతో, అఫ్గానిస్తాన్‌లో తలదాచుకున్న ఆ ఉగ్రవాదిని మట్టుబెట్టింది. ఇరవై ఏళ్ళ క్రితం 2001 సెప్టెంబర్ 11 తేదీన (9/11) అప్పటి అల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ కారణంగా జరిగిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన 2,997 మంది అమెరికన్ కుటుంబాల బాధకు, ఆవేదనకు జవాహిరీ మరణం ఓ ముగింపు అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. 9/11గా ప్రసిద్ధమైన ఆనాటి విధ్వంసానికి ప్రతీకారంగా, అమెరికా పదేళ్ల తర్వాత, 2011లో బిన్ లాడెన్‌ను వధించి పగ తీర్చుకుంది. అప్పట్లో లాడెన్‌కు కుడి భుజంగా వ్యవహరించిన జవాహిరీని కూడా వదిలిపెట్టలేదు. మరో పదేళ్ల తర్వాత ఇప్పుడు అల్ జవాహిరీని చంపి, తమది పాము పగ అని అమెరికా యావత్ ప్రపంచానికీ మరోమారు చాటి చెప్పింది. ఈ నేపథ్యంలో గతంలో ఏం జరిగిందో చూద్దాం. ‘మతం కోసం ఎలాంటి మారణహోమానికి అయినా సిద్ధం’ అనే సిద్ధాంతం అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్‌ది. ‘ప్రపంచం మీద పెత్తనం కోసం ఎంతటి దురాగతానికయినా సంసిద్ధం’ అనే తత్వం అమెరికాది. ‘పాముకు పాలుపోసి పెంచుతాను, కానీ ఆ పాము తనను తప్ప ఎవరిని కాటేసినా ఫరవాలేదు అనే థియరీ’ అమెరికాది. ‘కోరల్లో దాచుకున్న విషం కక్కేటప్పుడు స్వపర భేదాల ప్రసక్తి పనికి రాదనే భావజాలం’ ఒసామాది. ఒకానొక కాలంలో అమెరికా తన అవసరాల కోసం పెంచి పోషించిన ఒసామా బిన్ లాడెన్ అనే ఈ విషనాగు, ఇరవై ఏళ్ళ క్రితం అమెరికాపైనే ఎదురుతిరిగి, పాలు పోసి పెంచిన చేతినే కాటేసింది. సోవియట్ యూనియన్ అంతర్ధానం తరువాత ఏర్పడ్డ ఏకధృవ ప్రపంచానికి... లేని పెద్దరికాన్ని ఆపాదించుకుని అనేక అకృత్యాలకు పాల్పడుతున్న అమెరికా అహంభావాన్ని... బిన్ లాడెన్ తనదైన శైలిలో దెబ్బ తీశాడు. అప్పుడు కానీ ‘పాము – పాలు’ కథ లోని అంతరార్థం అమెరికాకు అవగతం కాలేదు. తన దాకా వస్తేగాని తత్వం బోధపడదన్నట్టుగా... అల్‌ఖైదా తీవ్ర వాదులు 2001, సెప్టెంబర్ 11న వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట టవర్లను విమానాలతో ఢీ కొట్టించి కనీ వినీ ఎరగని భయోత్పాతాన్ని సృష్టించిన ఘటన తర్వాత గానీ ఉగ్రవాదం వల్ల పొంచి వున్న ముప్పు ఎలా ఉంటుందన్నది అమెరికాకు అర్థం కాలేదు. ఆనాటి పరాభవం అమెరికాలో పట్టుదలను పెంచింది. ఆ దురాగతానికి రూపశిల్పి అయిన ఒసామా బిన్ లాడెన్ అంతం చూడడానికి దశాబ్ద కాలంగా అమెరికా చేయని ప్రయత్నం అంటూ లేదు. చిట్టచివరికి, పదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, పాకిస్తాన్ భూభాగంలో ఆ దేశ పాలకులకే తెలియకుండా తలదాచుకుంటున్న ఒసామా బిన్ లాడెన్‌ను, జల్లెడ పట్టి గాలించి పట్టుకుని మట్టు పెట్టేదాకా మాజీ అగ్ర రాజ్యాధినేత బరాక్ హుస్సేన్ ఒబామాకు కంటిమీద కునుకు లేకుండాపోయింది. ఒసామా మరణించిన విషయాన్ని స్వయంగా అమెరికన్ అధ్యక్షుడే ప్రకటించిన అంశాన్ని గమనిస్తే ఈ విషయానికి ఆ దేశం ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో విశదమవుతుంది. లాడెన్ మరణ వార్తను ధృవ పరచుకోవడానికి వీలుగా అమెరికా వ్యూహకర్తలు పకడ్బందీగా అమలు చేసిన హైటెక్ పద్ధతులు టీవీల్లో చూసినవారికి జేమ్స్ బాండ్ సినిమాలు జ్ఞప్తికి వచ్చాయి. వైట్ హౌస్‌లో కూర్చుని పథకం అమలవుతున్న తీరు తెన్నులను ఎప్పటి కప్పుడు ఉపగ్రహ సాయంతో గమనిస్తున్న ప్రెసిడెంట్ ఒబామా హావభావాలను బట్టి అన్ని దేశాలలోని టీవీ వీక్ష కులూ లాడెన్ మృతి పట్ల ఆ దేశానికి వున్న పట్టుదలను అర్థం చేసుకోగలిగారు. (క్లిక్: జవహరీ మృతిపై తాలిబన్ల సంచలన ప్రకటన) ఒసామా బిన్ లాడెన్ పూర్వీకులు ఎమెన్‌లో కడు నిరుపేదలు. అతడి తండ్రి మహమ్మద్ బిన్ లాడెన్, ఎమెన్ నుంచి ఉదర పోషణార్థం సౌదీ అరేబియాకు వలస వెళ్లి నిర్మాణ రంగంలో కాలుపెట్టి కోట్లకు పడగలెత్తాడు. గల్ఫ్ యుద్ధం సహాయక చర్యల్లో భాగంగా... అమెరికా మిలిటరీ స్థావరం ఏర్పాటుకు సౌదీ ప్రభుత్వం తన భూభాగంలో అనుమతించడాన్ని ఒసామా విమర్శించాడు. దీంతో కోపగించిన సౌదీ ప్రభుత్వం అతడి పౌరసత్వాన్నీ, పాస్‌పోర్ట్‌నూ రద్దు చేసింది. అప్పటికే లాడెన్ కుటుంబం కూడా ఒసామాను తమ నుంచి వెలి వేసింది. ఆ తర్వాత ప్రపంచంలోనే భయంకర ఉగ్రవాదిగా తయారయ్యి అమెరికా చేతిలో హతుడయ్యాడు. ఒసామా తర్వాత అల్‌ఖైదా పగ్గాలు చేపట్టిన అల్ జవాహిరీ కూడా లాడెన్ తరహాలోనే మరణించడం కాకతాళీయం. - భండారు శ్రీనివాసరావు సీనియర్ జర్నలిస్ట్ -
కాబూల్‌లో అల్‌ఖైదా చీఫ్ హతం.. స్పందించిన తాలిబన్లు
కాబూల్: అల్‌ఖైదా చీఫ్ అల్ జవహరిని అమెరికా డ్రోన్ దాడులు నిర్వహించి హతమార్చిన విషయం తెలిసిందే. అయితే ఆదివారం జరిగిన ఈ దాడిపై తాలిబన్లు స్పందించారు. అమెరికా చర్య అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమని, జవహరిపై దాడిని ఖండిస్తున్నామన్నారు. 2020లో జరిగిన అమెరికా బలగాల ఉపసంహరణ ఒప్పందాన్ని అతిక్రమించారని పేర్కొన్నారు. ఈమేరకు తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహీద్ ఒక ప్రకటన విడుదల చేశారు. కాబూల్‌లోని ఓ నివాసంలో తలదాచుకున్న అల్ జవహరిని మట్టుబెట్టినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం వెల్లడించారు. 9/11 దాడి బాధితులకు న్యాయం చేసినట్లయిందని పేర్కొన్నారు. ఆపరేషన్‌లో కీలకంగా వ్యవహరించిన అమెరికా నిఘా వర్గాలను కొనియాడారు. అల్ జవహరి కుటుంబంతో సహా కాబూల్‌లోని ఓ ఇంట్లో తలదాచుకున్నాడనే పక్కా సమాచారంతో అమెరికా సీఐఏ ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. అతను ఇంటి బాల్కనీపైకి వచ్చినప్పుడు అదను చూసి క్షిపణులతో విరచుకుపడింది. డ్రోన్ల సాయంతో ఈ దాడి చేసింది. ఈ ఘటనలో సాధారణ పౌరులెవరూ చనిపోలేదని అమెరికా నిఘా వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదంపై పోరాటంలో భాగంగా దాదాపు 20 ఏళ్లకు పైగా అఫ్గానిస్తాన్‌లో ఉన్న అమెరికా బలగాలు గతేడాది తాలిబన్లు అధికారం చేపట్టాక వెళ్లిపోయాయి. దాదాపు 11 నెలల తర్వాత అల్‌ఖైదా చీఫ్‌ను హతమార్చేందుకు మళ్లీ అక్కడకు వెళ్లాయి. అయితే దాడి విషయంపై తాలిబన్లకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. చదవండి: రెండు దశాబ్దాల వేట.. అల్ ఖైదా చీఫ్‌ను అమెరికా ఎలా మట్టుబెట్టిందంటే? -
రెండు దశాబ్దాల వేట.. అల్ ఖైదా చీఫ్‌ను అమెరికా ఎలా మట్టుబెట్టిందంటే?
కాబూల్: అల్‌ఖైదా చీఫ్ అల్ జవహరి కోసం రెండు దశాబ్దాలుగా వేట కొనసాగిస్తున్నాయి అమెరికా బలగాలు. ఎట్టకేలకు అతడు కాబూల్‌లో ఓ ఇంట్లో నక్కి ఉన్నాడని పసిగట్టి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి మట్టుబెట్టాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఈ విషయాన్ని ఇప్పటికే ధ్రువీకరించారు. అయితే ఈ ఆపరేషన్‌కు సంబంధించి పేరు చెప్పడానికి ఇష్టపడని అమెరికా నిఘా అధికారి ఒకరు కీలక విషయాలను వెల్లడించారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) డ్రోన్ దాడులు చేసి అల్ జవహరిని హతమార్చినట్లు తెలిపారు. అంతేకాదు ఈ ఆపరేషన్‌కు కొన్ని నెలల ముందు నుంచి ఏం జరుగిందో వివరించారు. 2001లో ట్విన్ టవర్లపై దాడి జరిగినప్పటి నుంచి అందుకు కారణమైన అల్‌ఖైదాను నామరూపాల్లేకుండా చేయాలని అమెరికా కంకణం కట్టుకుంది. దీని ముఖ్య సూత్రధారులు ఒసామా బిన్ లాడెన్, అల్ జవహరి కోసం వేట మొదలుపెట్టింది. ఇద్దరూ అమెరికా నిఘా వర్గాలు కూడా పసిగట్టలేని రహస్య ప్రదేశాల్లో తలదాచుకున్నారు. అయితే పదేళ్ల తర్వాత బిన్ లాడెన్ పాకిస్థాన్‌లో ఉన్నట్లు అగ్రరాజ్యానికి తెలిసింది. 2011 మే 2న సైన్యాన్ని రంగంలోకి దింపి రాత్రికిరాత్రే అతడ్ని మట్టుబెట్టింది. కానీ అల్ జవవరి ఆచూకీపై మాత్రం ఎలాంటి సమాచారం లేదు. మకాం మార్చినట్లు తెలిసి అయితే ఈ ఏడాది ఏప్రిల్‌లో అల్ జవహరి కుటుంబంతో సహా తన మకాం కాబూల్‌లోని ఓ ఇంట్లోకి మార్చినట్లు అమెరికా నిఘా వర్గాలకు కచ్చితమైన సమాచారం అందింది. వెంటనే నిఘా అధికారులు, జాతీయ భద్రతా సలహాదారులు జో బైడెన్‌తో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఈ విషయంపై చర్చించారు. అనంతరం జులై1న బైడెన్‌తో అధికారులు మరోసారి సమావేశం నిర్వహించారు. జవహరిని ఎలా చంపబోతున్నామనే మాస్టర్ ప్లాన్‌కు బైడెన్‌కు వివరించారు. అల్‌ఖైదా చీఫ్ ప్రస్తుతం ఉన్న ఇంటి నమూనాను కూడా బైడెన్ చూపించి దాడి ఎలా చేసేది పూసగుచ్చినట్లు వివరించారు. ఈ ఆపరేషన్ గురించి బైడెన్, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌తో పాటు అతికొద్ది మంది అధికారులకు మాత్రమే తెలుసు. ఆపరేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఆ తర్వాత జులై 25న తన కేబినెట్ సభ్యులు, ముఖ్య అధికారులో బైడెన్ సమావేశమయ్యారు. ఒకవేళ జవహరిని చంపితే తాలిబన్లతో అమెరికా సంబంధాలు ప్రభావితమవుతాయా? అనే విషయంపై చర్చించారు. అనంతరం జవహరిని హతమార్చేందుకు బైడెన్ అనుమతి ఇచ్చారు. పౌరుల ప్రాణాలకు ముప్పు లేకుండా వాయు దాడులు చేయాలని సూచించారు. క్షిపణులతో భీకర దాడి జులై 30న సీఐఏ పక్కా పథకంతో దాడికి సిద్ధమైంది. కాబూల్‌లో అల్ జవహరి ఉన్న ఇల్లును చుట్టుముట్టింది. అతను ఇంటి బాల్కనీపైకి రాగానే మానవరహిత డ్రోన్ల సాయంతో క్షిపణి దాడులు చేసింది. సరిగ్గా రాత్రి 9:38గంటల సమయంలో ఈ ఎటాక్ జరిగింది. జవహరి చనిపోయాడని నిర్ధరించుకున్నాకే సీఐఏ వెనుదిరిగింది. అయితే దాడి జరిగిన సమయంలో జవవరి కుటుంబసభ్యులు ఇంటి వేరే భాగం వైపు ఉన్నట్లు సీఐఏ అధికారి తెలిపారు. అల్ జవహరి తలదాచుకున్న ఇల్లు సీనియర్ తాలిబన్‌దేనని సీఐఏ అధికారి పేర్కొన్నారు. ఆయన కాబూల్‌లోనే ఉన్నాడనే విషయం తాలిబన్లకు తెలుసన్నారు. అయితే తాము చేపట్టిన ఆపరేషన్ గురించి తాలిబన్లకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని చెప్పారు. అల్ జవహరి హతమైనట్లు బైడెన్ సోమవారం అధికారిక ప్రకటన చేసినప్పుడు ఈ ఆపరేషన్‌ను ఎవరు నిర్వహించారనే విషయంపై మాత్రం ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అమెరికా నిఘా వర్గాల నైపుణ్యాలను బైడెన్ కొనియాడారు. చదవండి: అల్‌ఖైదా అగ్రనేతను మట్టుబెట్టిన అమెరికా -
అల్‌ఖైదా అగ్రనేతను మట్టుబెట్టిన అమెరికా
కాబూల్: అల్‌ఖైదా చీఫ్ అల్-జవహరిని అమెరికా మట్టుబెట్టింది. అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో డ్రోన్ దాడులు జరిపి అతడ్ని హతమార్చింది. అల్ జవహరి మృతిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం అధికారికంగా ప్రకటించారు. ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి అల్ జవహరిని మట్టుబెట్టినట్లు పేర్కొన్నారు. అల్ జవహరి కుటుంబంతో సహా కాబూల్‌లోని ఓ ఇంట్లో తలదాచుకున్నట్లు అమెరికా నిఘా వర్గాలు పసిగట్టాయి. దీంతో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించేందుకు జో బైడెన్ అమెరికా సైన్యానికి గతవారం అనుమతిచ్చారు. ఆదివారం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన వారు డ్రోన్ దాడులు చేసి అల్ జవహరిని హతమార్చారు. ఈ ఘటనలో సాధారణ పౌరులెవరూ ప్రాణాలు కోల్పోలేదని బైడెన్ పేర్కొన్నారు. అల్ జవహరి మృతితో 9/11 ఉగ్రదాడి బాధితులకు న్యాయం చేసినట్లయిందని అన్నారు. 2001లో అమెరికా ట్విన్ టవర్లపై ఉగ్రదాడి ఘటనలో ఒసామా బిన్ లాడెన్‌తో పాటు అల్ జవహరి కూడా ముఖ్య సూత్రధారి. పాకిస్తాన్లో తలదాచుకున్న బిన్ లాడెన్‌ను 2011 మే 2న ప్రత్యేక ఆపరేషన్ నిర్వహంచి మట్టు బెట్టింది అమెరికా సైన్యం. ఇప్పుడు కాబూల్‌లో నక్కి ఉన్న అల్ జవవరిని హతమార్చింది. అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా బలగాలు వెళ్లిపోయిన 11 నెలలకే అల్‌ఖైదా చీఫ్‌ను అంతం చేయడం ఉగ్రవాదంపై పోరులో అమెరికాకు కీలక విజయమనే చెప్పవచ్చు. అల్ జవహరి మృతితో ఇకపై అప్గానిస్థాన్ ఉగ్రవాదులకు సురక్షితమైన ప్రదేశంగా ఉండబోదని బైడెన్ పేర్కొన్నారు. చదవండి: షాకింగ్! బిన్ లాడెన్ కుటుంబం నుంచి భారీ విరాళం తీసుకున్న బ్రిటన్ ప్రిన్స్! -
డ్రోన్ దాడిలో అల్ ఖైదా కీలక నేత హతం: అమెరికా
డమస్కస్: సిరియాలో అమెరికా జరిపిన దాడుల్లో అల్ ఖైదా అగ్రనేత హతమయ్యాడు. నార్త్ వెస్ట్రన్ సిరియాలోని స్థావరంపై అమెరికా డ్రోన్ల సాయంతో ఈ దాడులు చేపట్టింది. ఈ దాడిలో అల్-ఖైదా సీనియర్ నాయకుడు, అబ్దుల్ హమీద్ అల్ మాతర్ మరణించినట్లు సెంట్రల్ కమాండ్ ప్రతినిధి ఆర్మీ మేజర్ జాన్ రిగ్స్బీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ దాడిలో సాధారణ పౌరులు ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. ఎమ్క్యూ-9 విమానం ఉపయోగించి దీనిని నిర్వహించామని ఆయన చెప్పారు. తాజాగా జరిపిన దాడిలో అల్‌ఖైదాలోని కీలక నేతను హతమార్చడంతో ఉగ్రవాద సంస్థలు ప్రపంచంపై జరిపే దాడులను నివారిస్తుందని ఆయన అన్నారు. సెప్టంబర్ చివరిలో అల్ ఖైదా నేత అబు అహ్మద్ యూఎస్ సైన్యం మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. అబు అహ్మద్ నిధుల సమీకరణ, దాడులకు ప్రణాళికలు రచించడం, ఎక్కడికక్కడ అల్ ఖైదా దాడులకు అనుమతులు ఇవ్వడం తదితర బాధ్యతలను నిర్వర్తించేవాడు. దక్షిణ సిరియాలోని అమెరికా ఔట్‌పోస్ట్‌పై ఉగ్రవాదులు దాడిచేసిన రెండు రోజుల తర్వాత ఈ డ్రోన్ దాడి జరగడం విశేషం. అయితే ప్రతికారంగానే ఈ దాడి జరిగిందా అనే విషయాన్ని అమెరికా ధృవీకరించలేదు. చదవండి: Russia Orders: ఆ వారం రోజులు ఆఫీసులకు వెళ్లకండి.. అయినా జీతాలిస్తాం! -
ఆ ఉగ్రవాదిని అంతమొందించాం: ఫ్రాన్స్
పారిస్: ఉగ్రసంస్థ ఆల్-ఖైదా ఇన్ ఇస్లామిక్ మాగ్రేబ్(ఏక్యూఐఎం) ఉత్తరాఫ్రికా నాయకుడు ఆబ్డేమలేక్ డ్రౌకడేల్ను హతమార్చినట్లు ఫ్రాన్స్ తెలిపింది. సాహెల్‌లో ఎన్నో ఏళ్లుగా జిహాదీలతో పోరాడుతున్న తమ బలగాలు సాధించిన గొప్ప విజయం ఇదేనని ప్రకటించింది. ఈ విషయాన్ని ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లే ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఉత్తర మాలీలో డ్రౌకడేల్ సహా అతని అనుచరులను బుధవారం ఫ్రాన్స్ బలగాలు, వారి భాగస్వాములు మట్టుబెట్టాయని పేర్కొన్నారు. పాశ్చాత్య దేశాల ప్రజలపై దాడులకు పాల్పడుతూ, అపహరిస్తున్న డ్రౌకడేల్ గ్యాంగ్‌ను అల్జీరియా సరిహద్దులో హతమార్చినట్లు తెలిపారు. (చదవండి: అంగుళం భూమి వదులుకోం.. క్షమించం: చైనా) అదే విధంగా నేగర్ పశ్చిమ సరిహద్దుల్లో అకృత్యాలకు పాల్పడుతున్న ఇస్లామిక్ స్టేట్ ఇన్ ది గ్రేటర్ సహారా(ఈఐజీఎస్) నాయకుడిని కూడా శుక్రవారం అంతమొందించినట్లు వెల్లడించారు. కాగా 1990లో సంఘటితమైన అల్జేరియన్ రాడికల్ ఇస్లామిస్టులు ఏక్యూఐఎంను ఏర్పాటు చేశారు. సహారన్ సాహెల్ జోన్లో అకృత్యాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో జీ5 సాహెల్ గ్రూప్ సభ్యదేశాలు మౌరిటానియా, మాలి, బుర్కినా ఫాసో, నైగర్, చాద్ ఫ్రాన్స్ సహాయం కోరాయి. ఈ క్రమంలో ఆఫ్రికా దేశాల విజ్ఞప్తి మేరకు సాహెల్‌లో ఉన్న జిహాదీలను ఏరివేసేందుకు దాదాపు 5 వేలకు పైగా బలగాలను అక్కడ మోహరించింది. ఈ నేపథ్యంలో స్థానిక బలగాలతో కలిసి ఫ్రాన్స్ బలగాలు తాజాగా ఇద్దరు కీలక ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టడం గమనార్హం. అయితే ఉగ్రసంస్థలు మాత్రం ఇంతవరకు వారి మృతి గురించి ఎటువంటి ప్రకటనా విడుదల చేయలేదు. -
11 ఉగ్ర సంస్థలపై ఆంక్షలు
వాషింగ్టన్: ఉగ్రవాదంపై పోరును అమెరికా ముమ్మరం చేసింది. అల్‌కాయిదా దాడులు (9/11) జరిగి 18 ఏళ్లు అయిన సందర్భంగా ట్రంప్ ప్రభుత్వం బుధవారం సుమారు 11 ఉగ్రవాద సంస్థలపై ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ)కు చెందిన ముఫ్తీ నూర్ వలీ మెహ్సూద్పై ఆంక్షల కొరడా ఝుళిపించింది. ముల్లా ఫజల్ మరణం తరువాత గత ఏడాది జూన్ నుంచి నూర్ వలీ టీటీపీకి నేతృత్వం వహిస్తున్నారని, పలు ఉగ్రదాడులకు కారణమైన అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటిస్తున్నామని ట్రంప్ ప్రభుత్వం తెలిపింది. ఈ ఆంక్షల ఉత్తర్వుల కారణంగా ఈ ఉగ్రవాదులను వెతికిపట్టుకోవడం, ఆర్థిక మూలాలను దెబ్బతీయడం, ఉగ్రవాద శిక్షణలో పాల్గొన్న వారిని బంధించడం సులువు అవుతుందని ఆర్థిక శాఖ మంత్రి స్టీవెన్ మంచిన్ తెలిపారు. ఉగ్రవాద సంస్థలకు సాయం అందించే, వారితో ఆర్థిక వ్యవహారాలు జరిపే ఆర్థిక సంస్థ లపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు వీలుగా బుధవారం కొన్ని ఉత్తర్వులు జారీ చేసినట్లు మంచిన్ తెలిపారు. ఇరాన్‌లోని కుడ్స్ ఫోర్సెస్, హమాస్, ఐసిస్, అల్‌ఖైదా వాటి అనుబంధ సంస్థలపై ఈ ఉత్తర్వుల ప్రభావం ఉంటుందని తెలిపారు. -
అమెరికా దాడుల్లో అల్ ఖైదా బడావీ మృతి
వాషింగ్టన్: ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా ముఖ్యనాయకుడు జమాల్ అల్ బడావీ అమెరికా వాయుసేన దాడుల్లో మరణించినట్లు ఆ దేశం వెల్లడించింది. అల్‌ఖైదా తరఫున యెమెన్‌లో కార్యకలాపాలు నిర్వహించే బడావీ.. 2000 సంవత్సరంలో అమెరికాకు చెందిన నావికాదళ సిబ్బందిపై జరిగిన ఆత్మాహుతి దాడిలో కీలకపాత్ర పోషించాడు. ఈ దాడిలో 17 మంది మృత్యువాతపడగా.. 40 మంది గాయాలపాలయ్యారు. బడావీ ఆచూకీ తెలిపిన వారికి 5 మిలియన్ డాలర్లు ఇస్తామని అమెరికా ప్రకటించింది. ఈ ఘటనపై అమెరికా సెంట్రల్ కమాండ్ అధికార ప్రతినిధి బిల్ అర్బన్ మాట్లాడుతూ.. జనవరి 1వ తేదీన మారిబ్ గవర్నేట్‌లో అమెరికా వాయు దళాలు జరిపిన దాడుల్లో జమాల్ అల్ బడావీ మృతిచెందినట్లు తెలిపారు. బడావిని హత్యచేసిన అమెరికా మిలటరీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభినందించారు. ‘ఆత్మాహుతి దాడి సూత్రదారి జమాల్ అల్ బడావీని మేము ఇప్పుడే చంపాం. అల్‌ఖైదాకు వ్యతిరేకంగా మా పని కొనసాగిస్తాం. ఇస్లామిక్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కొనసాగిస్తున్న మా పోరాటాన్ని ఎప్పటికీ ఆపబోం’అని ట్రంప్ పేర్కొన్నారు. -
ఉగ్రవాదుల తలలతో కూర వండుతోంది
బాగ్దాద్: ఉగ్రవాదుల చేతిలో కుటుంబాన్ని పోగొట్టుకున్న ఓ మహిళ.. ఇప్పుడు అదే ఉగ్రవాదుల వెన్నులో వణుకుపుట్టిస్తోంది. తన చేతికి చిక్కిన ముష్కరులను తెగనరుకుతూ వారి తలలతో కూరలు వండుతోంది. ఐసిస్ చీఫ్ బాగ్దాదీ సైతం 'ఆమెకు దొరకకుండా జాగ్రత్త పడండి' అని జిహాదీలను హెచ్చరించాడంటే అతిశయంకాదు. ఆమె పేరు వహీదా మహమ్మద్ అలియాస్ ఉమ్ హనది. ప్రస్తుతం ఇరాకీ మిలటరీ కమాండర్ గా పనిచేస్తున్న ఆమె ఇంత క్రూరంగా మారడానికి కారణం ఐసిస్, అల్ కాయిదాలే! ఇరాక్ లోని ఓ ఊళ్లో సంతోషంగా కాలం గడుపుతోన్న వహీదా కుటుంబాన్ని అల్ కాయిదా, ఐసిస్ ఉగ్రమూకలు సర్వనాశనం చేశాయి. ఉగ్రవాదుల దాడుల్లో వహీదా ఇద్దరు భర్తలు, తండ్రి, ముగ్గరు సోదరులు చనిపోయారు. ఉగ్రవాదులపై పగతీర్చుకోవాలనుకున్న ఆమె 2004లో ఇరాకీ సైన్యంలో చేరారు. ప్రస్తుతం కమాండర్ స్థాయిలో ముష్కరమూకల పనిబడుతోంది. వహీదా తనకు చిక్కిన ఉగ్రవాదుల తలలు నరికి వాటిని వండుతోందని గతంలో కొన్ని రిపోర్టులు వెలువడ్డాయి. ఇప్పుడు స్వయంగా ఆమె.. నరికి తలలను చేతులతో పట్టుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఐసిస్ కు సింహస్వప్నం తమ జిహాదీలను కర్కశంగా చంపుతోన్న వహీదాను మట్టుపెట్టేందుకు ఐసిస్, అల్ కాయిదాలు చేయని ప్రయత్నమంటూ లేదు. 2006 నుంచి 2014 మధ్యకాలంలో కారులో బాంబులు పెట్టడం తదితర విధాలుగా వహీదాను అంతం చేసేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు. కానీ అన్నిసార్లూ విఫలమయ్యారు. అతి సమీపంగా జరిగిన ఒక దాడిలో వహీదా తలకు, చేతులకు గాయాలయ్యాయి. అయినాసరే ఐసిస్ కు సింహస్వప్నంగా నిలబడింది ఆమె. అంతేకాదు ఐసిస్ చరనుంచి తన స్వగ్రామాన్ని సైతం విడపించింది. 'ఇరాక్ ప్రధానమంత్రి కంటే తనను చంపడానికే ఐసిస్ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందం'టోన్న వహీదా.. చివరి రక్తపుబొట్టు వరకూ ఉగ్రవాదులతో పోరాడుతూనే ఉంటానని చెబుతోంది.