
ప్రతీకాత్మక చిత్రం
పారిస్: ఉగ్రసంస్థ ఆల్-ఖైదా ఇన్ ఇస్లామిక్ మాగ్‌రేబ్(ఏక్యూఐఎం) ఉత్తరాఫ్రికా నాయకుడు ఆబ్డేమలేక్ డ్రౌకడేల్‌ను హతమార్చినట్లు ఫ్రాన్స్ తెలిపింది. సాహెల్‌లో ఎన్నో ఏళ్లుగా జిహాదీలతో పోరాడుతున్న తమ బలగాలు సాధించిన గొప్ప విజయం ఇదేనని ప్రకటించింది. ఈ విషయాన్ని ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లే ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఉత్తర మాలీలో డ్రౌకడేల్ సహా అతని అనుచరులను బుధవారం ఫ్రాన్స్ బలగాలు, వారి భాగస్వాములు మట్టుబెట్టాయని పేర్కొన్నారు. పాశ్చాత్య దేశాల ప్రజలపై దాడులకు పాల్పడుతూ, అపహరిస్తున్న డ్రౌకడేల్ గ్యాంగ్‌ను అల్జీరియా సరిహద్దులో హతమార్చినట్లు తెలిపారు. (చదవండి: అంగుళం భూమి వదులుకోం.. క్షమించం: చైనా)
అదే విధంగా నేగర్ పశ్చిమ సరిహద్దుల్లో అకృత్యాలకు పాల్పడుతున్న ఇస్లామిక్ స్టేట్ ఇన్ ది గ్రేటర్ సహారా(ఈఐజీఎస్) నాయకుడిని కూడా శుక్రవారం అంతమొందించినట్లు వెల్లడించారు. కాగా 1990లో సంఘటితమైన అల్జేరియన్ రాడికల్ ఇస్లామిస్టులు ఏక్యూఐఎంను ఏర్పాటు చేశారు. సహారన్ సాహెల్ జోన్‌లో అకృత్యాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో జీ5 సాహెల్ గ్రూప్ సభ్యదేశాలు మౌరిటానియా, మాలి, బుర్కినా ఫాసో, నైగర్, చాద్ ఫ్రాన్స్ సహాయం కోరాయి. ఈ క్రమంలో ఆఫ్రికా దేశాల విజ్ఞప్తి మేరకు సాహెల్‌లో ఉన్న జిహాదీలను ఏరివేసేందుకు దాదాపు 5 వేలకు పైగా బలగాలను అక్కడ మోహరించింది. ఈ నేపథ్యంలో స్థానిక బలగాలతో కలిసి ఫ్రాన్స్ బలగాలు తాజాగా ఇద్దరు కీలక ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టడం గమనార్హం. అయితే ఉగ్రసంస్థలు మాత్రం ఇంతవరకు వారి మృతి గురించి ఎటువంటి ప్రకటనా విడుదల చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment