సోషల్ వెబ్‌సైట్లపై కన్నేసి ఉంచండి: నరసింహన్
* సున్నిత ప్రాంతాల్లో నిఘా ముమ్మరం చేయండి
* యువతకు కౌన్సెలింగ్ ఇవ్వడానికి ప్రయత్నించండి
* పోలీసు అధికారులకు స్పష్టం చేసిన గవర్నర్ నరసింహన్
సాక్షి, హైదరాబాద్: ఆసియాతో పాటు భారత్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్లు అల్‌కాయిదా నేత అల్ జవహరి ప్రకటనతో కూడిన వీడియో విడుదల కావడం, అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్‌ఐఎస్)లో చేరేందుకు వెళ్తూ హైదరాబాద్‌కు చెందిన నలుగురు విద్యార్థులు కోల్‌కతాలో పట్టుపడటం నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ శుక్రవారం విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు. అత్యంత అప్రమత్తంగా ఉంటూ అన్ని ముందు జాగ్రత్త చర్యల్నీ తీసుకోవాల్సిందిగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో గవర్నర్ సలహాదారులు ఏకే మహంతి, శర్మలతో పాటు తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ, రెండు రాష్ట్రాల నిఘా విభాగం అధిపతులు, హైదరాబాద్-సైబరాబాద్ కమిషనర్లతో పాటు కేంద్ర నిఘా సంస్థ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) సంయుక్త డెరైక్టర్ పాల్గొన్నారు.
తాజా పరిణామాలతో పాటు రాజధానిలో గణేష్ ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో సున్నిత ప్రాంతాల్లో నిఘా ముమ్మరం చేయాల్సిందిగా గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. సామాజిక మాధ్యమాలపై నిఘా వేసి ఉంచేందుకు నిఘా విభాగంలో ప్రత్యేక సాంకేతిక బృందాలను ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారు. అనుమానిత ప్రాంతాల్లో యువతతో పాటు వారి తల్లిదండ్రులకూ కౌన్సెలింగ్ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. ఈ కోణంలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ పోలీసులు, నిఘా విభాగాలు అప్రమత్తంగా వ్యవహరించాలని, ఏమాత్రం ఏమరుపాటుకు తావిచ్చినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్న విషయం గుర్తుంచుకోవాలని గవర్నర్ స్పష్టం చేశారు. అల్‌కాయిదా, ఐఎస్‌ఐఎస్‌ల కార్యకలాపాలను పరిగణనలోకి తీసుకునే ముందు జాగ్రత్త చర్యల్ని రెండు రాష్ట్రాల కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ అధికారులు నరసింహన్‌కు వివరించారు.