International Terrorism
-
తాలిబన్ విజయంతో ఉగ్రమూకలకు ధైర్యం!
న్యూయార్క్: అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు విజయం సాధించడం ప్రపంచంలో ఇతర ప్రాంతాల్లోని ఉగ్రవాదులకు ధైర్యాన్నిచ్చే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఒకపక్క అంతర్జాతీయ ఉగ్రవాదంపై ఆందోళన వ్యక్తం చేస్తూనే, మరోపక్క తాలిబన్లతో ఐరాస చర్చలు జరపాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. అంతర్జాతీయ సంబంధాల్లో అఫ్గాన్ కీలక పాత్ర పోషించాలని ఐరాస ఆశిస్తోందన్నారు. ‘‘ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అఫ్గాన్‌లో తాలిబన్లు విజయం సాధించడం ఇతర ప్రాంతాల్లోని ఉగ్రవాదులకు మనోధైర్యాన్నిస్తున్నది నిజం. అయితే ఇతర ఉగ్రగ్రూపులు తాలిబన్లతో పోలిస్తే భిన్నమైనవి, వీరి మధ్య పోలిక కనిపించదు.’’ అని ఆంటోనియో అభిప్రాయపడ్డారు. పలు టెర్రరిస్టు గ్రూపులు తాలిబన్లకు అభినందనలు పంపడమే కాకుండా, తమ సామర్ధ్యంపై బలమైన నమ్మకాన్ని పెంచుకుంటున్నాయన్నారు. ఆఫ్రికాలోని సహేల్ ప్రాంతంలో తీవ్రవాదుల దుశ్చర్యలను ఆయన ప్రస్తావించారు. చాలా ప్రాంతాల్లో ఉగ్రవాదాన్ని సమర్థంగా తిప్పికొట్టే పరిస్థితులు లేవన్నారు. దీనివల్ల టెర్రరిస్టులు క్రమంగా పట్టు సాధిస్తున్నారు, వీరికి తాజా పరిణామాలు ధైర్యాన్నిస్తున్నాయని చెప్పారు. ఐకమత్యమే అవసరం ఒక టెర్రరిస్టు గ్రూపు.. అది ఎంత చిన్నదైనా సరే, ఆత్మాహుతికి సిద్ధపడి ఒక దేశంపై దాడికి దిగితే, సదరు దేశ సైన్యాలు సైతం ఆ గ్రూపును ఎదుర్కోలేకపోతాయని ఆంటోనియో ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు ఉదాహరణగా అఫ్గాన్ ఆర్మీ 7రోజుల్లో మాయమవడాన్ని ప్రస్తావించారు. టెర్రరిజంపై యావత్ ప్రపంచం ఏకతాటిపై నిలబడితే సమర్ధవంతంగా ఎదుర్కోగలమన్నారు. అఫ్గాన్‌ను ఉగ్రవాదులకు నిలయంగా మారకుండా చూడాల్సిన బాధ్యత ఉందని అభిప్రాయపడ్డారు. అఫ్గాన్ తాలిబన్లతో ఐరాస నిరంతరం చర్చిస్తోందని, ఈ స్థితిలో చర్చలే ఉత్తమమార్గమని ఆయన చెప్పారు. తాలిబన్ల ప్రభుత్వం సమ్మిళితంగా ఉంటుందని ఆశించామని చెప్పారు. తాలిబన్లు అన్ని వర్గాలను పాలనలో మిళితం చేయాలని, మానవ హక్కులను కాపాడాలని, మహిళలు, బాలికల హక్కులపై నెలకొన్న ఆందోళనలను పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ సంబంధాల్లో అఫ్గానిస్థాన్ నిర్మాణాత్మక పాత్ర పోషించాలని కోరారు. -
కలపకుంటే తిరుగుబాటే
న్యూఢిల్లీ: మెజారిటీ ప్రజలను అభివృద్ధి ప్రక్రియలో భాగస్వాములు చేయకుంటే ప్రపంచంలో ఎక్కడైనా తిరుగుబాటు చెలరేగే అవకాశముందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. భారత్‌లో ప్రధాని మోదీ ప్రభుత్వం ఆదివాసీలు, దళితులు, మైనారిటీలను ఇదే తరహాలో అభివృద్ధికి దూరంగా ఉంచుతోందన్నారు. జర్మనీలోని హాంబర్గ్‌లో ఉన్న బుసెరియస్ సమ్మర్ స్కూల్లో బుధవారం జరిగిన ఓ సదస్సులో రాహుల్ మాట్లాడారు. ‘2003లో అమెరికా–ఇరాక్ యుద్ధం తర్వాత ఇరాక్‌లో ఓ తెగ వారిని ప్రభుత్వ ఉద్యోగాలు, సైన్యంలో తీసుకోకుండా నిషేధిస్తూ చట్టం తెచ్చారు. దీంతో ఆ తెగవారు తిరుగుబాటుదారుల్లో చేరిపోయారు. ఇది ఇక్కడితో ఆగలేదు. ఈ తిరుగుబాటుదారులు సిరియాకూ విస్తరించారు. చివరికి అదే ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐసిస్) వంటి అంతర్జాతీయ ఉగ్రసంస్థగా రూపాంతరం చెందింది’ అని రాహుల్ అన్నారు. మహిళలకు ప్రపంచంలోనే భారత్ ప్రమాదకరమైన దేశమన్న ఆరోపణలను ఆయన ఖండించారు. కానీ దేశంలో మహిళల పట్ల దారుణాలు పెరిగిపోతున్నాయని అంగీకరించారు. ‘భారత్ మారాల్సిన అవసరం ఉంది. పురుషులు మహిళలను గౌరవంతో, తమతో సమానంగా చూడాలి. కానీ ఇది ప్రస్తుతం భారత్‌లో జరగడం లేదు’ అని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు నిరుద్యోగం కారణంగా మూకహత్యలు నిరుద్యోగం, పేదలకు సమాన అవకాశాలు రాకపోవడం కారణంగా ప్రజల్లో ఏర్పడిన ఆగ్రహంతోనే దేశంలో మూకహత్యలు జరుగుతున్నాయని రాహుల్ అన్నారు. కేంద్రం అనాలోచితంగా తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం, దుందుడుకుగా తీసుకొచ్చిన వస్తుసేవల పన్ను(జీఎస్టీ)కారణంగా చిన్న వ్యాపారాలు నాశనమైపోయాయని దుయ్యబట్టారు. మరోవైపు, జర్మనీలో జరిగిన సదస్సులో మహిళల భద్రత విషయంలో భారత్‌ను కించపరిచేలా మాట్లాడిన కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. దేశంలోని ముస్లింలకు ఉద్యోగాలు కల్పించకుంటే వారంతా ఇస్లామిక్ స్టేట్‌లో చేరతారన్నట్లు రాహుల్ వ్యాఖ్యలు ఉన్నాయని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా మండిపడ్డారు. -
అమెరికా ‘ఇంటిదొంగ’
అంతర్జాతీయ ఉగ్రవాదం మీద ప్రకటించిన యుద్ధంలో పాకిస్థాన్‌ను తన కుడిభుజంగా అమెరికా ‘భావిస్తోంది’. ఆ కుడిభుజం తాజా నిర్వాకమే ఇప్పుడు అమెరికాను కలవరపెడుతోంది. అమెరికా విదేశ వ్యవహారాల శాఖలో ఒక ఇంటిదొంగ తమ కోసం పని చేస్తున్నట్టు పాకిస్థాన్ అధికారి ఒకరు నోరు జారారు. ఈ అంశమే ఇప్పుడు అగ్రదేశాన్ని కలవరపెడుతోంది. ఆ ఇంటిదొంగ పేరు రాబిన్ ఎల్. రాఫెల్. 67 ఏళ్ల ఈ మహిళా దౌత్య నిపుణురాలి మీద గత నెల నుంచి అమెరికా నిఘా సంస్థ ఎఫ్‌బీఐ కన్ను వేసి ఉంచింది. కిందటి నెలలో ఇంటిని సోదా చేసి, కొంత సమాచారాన్ని కనుగొన్నారు. ఆమె కార్యాలయానికి సీలు కూడా వేశారు. కానీ రాఫెల్‌ను ఎఫ్‌బీఐ ప్రశ్నించలేదని ఆమె కార్యదర్శి ప్రకటించడం విశేషం. అలాగే, రాఫెల్ పాకిస్థాన్ మిత్రురాలు కాబట్టే ఎఫ్‌బీఐ ప్రశ్నిం చిందని అనుకోవడం సరికాదని పాకి స్థాన్ దౌత్యవేత్త తస్నీమ్ అస్లాం ప్రకటించడం ఈ వివా దంలో మరో కోణం. ఇది అమె రికా అంతర్గత వ్యవహారమని అంటూనే, రాఫెల్ పాక్ చిర కాల మిత్రురాలని తస్నీమ్ చెప్పక చెప్పారు. కానీ, గూఢ చర్యం వంటి కీలక ఆరోపణల గురించిన దర్యాప్తులో ఎఫ్‌బీఐ సాధారణంగా సమాచారాన్ని బయటకు పొక్కనీయదు. అందుకు భిన్నంగా ఇప్పుడు జరుగుతోంది. పాకిస్థాన్ నుంచి వచ్చిన ఫోన్ కాల్స్‌ను రహస్యంగా విన్నపుడు ఈ వివాదం బయటపడింది. అమెరికా దేశ రహస్యాలు అందించే ఒక అధికారి ఉన్నారని అందులో మాట్లాడిన పాక్ అధికారి చెప్పాడు. దీనితో కొన్ని నెలలు నిఘా వేసి, ఇంటిదొంగను పట్టుకున్నారు. రాఫెల్ తన కార్యాలయం నుంచి కొంత సమాచారం ఇంటికి తీసుకువెళ్లినట్టు తేలింది. అయితే పాకిస్థాన్ ఫోన్ కాల్ ఆధారంగానే ఇదంతా చేస్తున్నారా అన్నది తేలడం లేదు. ఆమెపై ఇప్పటికీ నేరారోపణ పత్రం ఏదీ దాఖలు కాలేదు. కానీ గత నెలలోనే రాఫెల్ అధికారాలను పూర్తిగా తొలగించారు. ఆమె పదవీ కాలం నవంబర్ రెండుతో ముగిసిందన్న వాదనలూ వినిపిస్తున్నాయి. అమెరికా దౌత్య వ్యవహారాలలో నాలుగు దశాబ్దాల అనుభవం కలిగిన రాఫెల్ ఆ దేశ మహిళా దౌత్యవేత్తలలో ప్రముఖురాలు. బిల్ క్లింటన్ హయాం లో కీలకంగా పనిచేశారు. ట్యునీషియాలో అమెరికా రాయబారిగా పనిచేయ డంతో పాటు, దక్షిణ ఆసియా వ్యవహారాల శాఖకు సహాయ కార్యదర్శిగా కూడా పనిచేశారు. ముఖ్యంగా పాకిస్థాన్ సంబంధాలలో లోతైన అధ్యయనం చేసినవారు. 2005లో పదవీ విరమణ చేసిన తరువాత మళ్లీ అదే శాఖలో చేరి, పాకిస్థానీ లాబీకి దగ్గరయ్యారు. ఈ నెల ఆరంభం వరకు రాఫెల్ పాక్ పౌర వ్యవహారాలలో అమెరికాకు సలహాదారుగానే ఉన్నారు. పాకిస్థాన్‌కు అమెరికా ఇచ్చిన 7.5 బిలియన్ డాలర్ల సైనికేతర నిధుల నిర్వహణలో ఆమెదే కీలక పాత్ర. పాకిస్థాన్‌ను కేంద్రంగా మార్చుకుని అఫ్ఘానిస్థాన్ భూమి మీద సోవి యెట్ యూనియన్‌కు వ్యతిరేకంగా అమెరికా జరిపిన పోరాటం సమయంలో ఒక దౌత్య నిపుణుల బృందం అమెరికాలో వృద్ధిలోకి వచ్చింది. అందులో ఒకరు రాఫెల్. 1975 నుంచి పాకిస్థాన్‌తో ఆమె అనుబంధం కొనసాగుతోంది. తనకు ఇండియా కంటె పాకిస్థాన్ బాగా అర్థమైందని ఆమె చెప్పేవారు. ఒకటి వాస్తవం. రాఫెల్ మీద ఆరోపణలను నమ్ముతున్నవారు, వ్యతి రేకిస్తున్నవారు కూడా ఉన్నారు. ఆమెను ‘పక్షి’ అని వ్యంగ్యంగా పిలిచే వ్యతిరేక వర్గం బలంగానే ఉంది. అఫ్ఘాన్ యుద్ధంలో వేయి మంది సైనికులు చని పోవడానికి కారణమైన పాకిస్థాన్‌ను సమర్థించే అధికారిగా ఆమెను ఈసడించే వారు తక్కువేమీ కాదు. తాలిబన్‌ను శాంతి చర్చలకు తీసుకురావాలని పాకి స్థాన్‌ను ఒప్పించవచ్చునని భావించి విఫలమైన వ్యక్తిగా కూడా ఆమెను సైనికాధికారులు పరిగణిస్తారు. ఈ యుద్ధంలో 2,350 మంది సైనికులను అమెరికా కోల్పోయింది. రాఫెల్ మాజీ భర్త ఆర్నాల్డ్ ఎల్ రాఫెల్ 1988లో పాకిస్థాన్‌లో రాయబారి. ఆ సమయంలో జరిగిన విమాన ప్రమాదంలోనే పాకిస్థాన్ అధ్యక్షుడు, సైనిక నియంత జనరల్ జియా ఉల్ హక్ మరణించాడు. విమానం కూల్చివేత పెద్ద కుట్ర అన్న వాదన ఉంది. ఇప్పటికీ చిక్కుముడిగా ఉన్న ఆ విమాన ప్రమాదంలోనే ఆర్నాల్డ్ కూడా మరణించారు. -
సోషల్ వెబ్సైట్లపై కన్నేసి ఉంచండి: నరసింహన్
* సున్నిత ప్రాంతాల్లో నిఘా ముమ్మరం చేయండి * యువతకు కౌన్సెలింగ్ ఇవ్వడానికి ప్రయత్నించండి * పోలీసు అధికారులకు స్పష్టం చేసిన గవర్నర్ నరసింహన్ సాక్షి, హైదరాబాద్: ఆసియాతో పాటు భారత్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్లు అల్‌కాయిదా నేత అల్ జవహరి ప్రకటనతో కూడిన వీడియో విడుదల కావడం, అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్)లో చేరేందుకు వెళ్తూ హైదరాబాద్‌కు చెందిన నలుగురు విద్యార్థులు కోల్‌కతాలో పట్టుపడటం నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ శుక్రవారం విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు. అత్యంత అప్రమత్తంగా ఉంటూ అన్ని ముందు జాగ్రత్త చర్యల్నీ తీసుకోవాల్సిందిగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో గవర్నర్ సలహాదారులు ఏకే మహంతి, శర్మలతో పాటు తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ, రెండు రాష్ట్రాల నిఘా విభాగం అధిపతులు, హైదరాబాద్-సైబరాబాద్ కమిషనర్లతో పాటు కేంద్ర నిఘా సంస్థ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) సంయుక్త డెరైక్టర్ పాల్గొన్నారు. తాజా పరిణామాలతో పాటు రాజధానిలో గణేష్ ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో సున్నిత ప్రాంతాల్లో నిఘా ముమ్మరం చేయాల్సిందిగా గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. సామాజిక మాధ్యమాలపై నిఘా వేసి ఉంచేందుకు నిఘా విభాగంలో ప్రత్యేక సాంకేతిక బృందాలను ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారు. అనుమానిత ప్రాంతాల్లో యువతతో పాటు వారి తల్లిదండ్రులకూ కౌన్సెలింగ్ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. ఈ కోణంలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ పోలీసులు, నిఘా విభాగాలు అప్రమత్తంగా వ్యవహరించాలని, ఏమాత్రం ఏమరుపాటుకు తావిచ్చినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్న విషయం గుర్తుంచుకోవాలని గవర్నర్ స్పష్టం చేశారు. అల్‌కాయిదా, ఐఎస్ఐఎస్ల కార్యకలాపాలను పరిగణనలోకి తీసుకునే ముందు జాగ్రత్త చర్యల్ని రెండు రాష్ట్రాల కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ అధికారులు నరసింహన్‌కు వివరించారు. -
యు తిన్ సేన్‌తో మన్మోహన్ సమావేశం
నేప్యీదే : ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మయన్మార్‌లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన మయన్మార్ అధ్యక్షుడు యు తిన్ సేన్‌తో ఆ దేశ రాజధాని నేపిదాలో సమావేశమయ్యారు. పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న సాంస్కృతిక, వ్యాపార, వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే విధంగా చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. బింస్టెక్ దేశాల సదస్సులో పాల్గొనేందుకు మయన్మార్ వెళ్లిన ప్రధాని పర్యటనలో భాగంగా శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, థాయ్‌లాండ్ దేశాధినేతలతోనూ సమావేశమౌతారు. -
సమష్టిగా పోరాడదాం: మన్మోహన్ సింగ్
దక్షిణ, తూర్పు ఆసియా దేశాలకు ప్రధాని మన్మోహన్ పిలుపు నేప్యీదే: అంతర్జాతీయ ఉగ్రవాదం, సీమాంతర నేరాలు, మత్తు మందుల రవాణా కారణంగా తలెత్తుతున్న భద్రత సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవడానికి దక్షిణ, తూర్పు ఆసియా దేశాలు సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని మన్మోహన్ సింగ్ సోమవారమిక్కడ అన్నారు. ఆసియావ్యాప్తంగా అభివృద్ధి, సుస్థిరత, శాంతి వర్ధిల్లేలా చేయాలంటే ఉమ్మడి కృషి అవసరమన్నారు. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న ‘బిమ్స్టెక్’ (బహుళ రంగాల్లో సాంకేతిక, ఆర్థిక సహకారానికి బంగాళాఖాత తీర దేశాల కూటమి కృషి) దేశాల సదస్సు నిమిత్తం రెండు రోజుల పర్యటనకు మన్మోహన్ మయన్మార్ రాజధాని నేప్యీదే వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వ్యవసాయం, పర్యాటకం, వాతావరణం, ఇంధనం, పెట్టుబడి, వాణిజ్యం, ఇతర రంగాల్లో ఉప ప్రాంతీయ సహకారాన్ని, సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. ఢిల్లీ నుంచి బయల్దేరే ముందు ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నేర సంబంధిత అంశాల్లో పరస్పర న్యాయ సహకారం, మత్తు మందుల రవాణా, సీమాంతర నేరాలు, అంతర్జాతీయ ఉగ్రవాదాలను ఎదుర్కోవడానికి ప్రాంతీయ సహకారం అవసరమ న్నారు. యూపీఏ ప్రభుత్వ కాలపరిమితి త్వరలో ముగుస్తున్న నేపథ్యంలో ప్రధానిగా మన్మోహన్‌కు ఇదే చివరి విదేశీ పర్యటన కావచ్చు. ఈ దృష్ట్యా ఆయన శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్, థాయ్‌లాండ్, భూటాన్, నేపాల్ నాయకులతో సంబంధాలను పటిష్టం చేసుకునేందుకు ఈ పర్యటన ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బంగ్లాదేశ్, నేపాల్ దేశాల ఉగ్రవాదులు ఇక్కడ దాడులకు దిగే అవకాశముందని భావిస్తున్న నేపథ్యంలో ఈ అంశాన్ని ప్రధాని వారితో చర్చించనున్నారు.