తాలిబన్‌ విజయంతో ఉగ్రమూకలకు ధైర్యం! | Talibans victory in Afghanistan may embolden other groups | Sakshi
Sakshi News home page

Taliban-Afghanistan Crisis: తాలిబన్‌ విజయంతో ఉగ్రమూకలకు ధైర్యం!

Published Sun, Sep 12 2021 6:30 AM | Last Updated on Sun, Sep 12 2021 10:22 AM

Talibans victory in Afghanistan may embolden other groups - Sakshi

న్యూయార్క్‌: అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు విజయం సాధించడం ప్రపంచంలో ఇతర ప్రాంతాల్లోని ఉగ్రవాదులకు ధైర్యాన్నిచ్చే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఒకపక్క అంతర్జాతీయ ఉగ్రవాదంపై ఆందోళన వ్యక్తం చేస్తూనే, మరోపక్క తాలిబన్లతో ఐరాస చర్చలు జరపాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. అంతర్జాతీయ సంబంధాల్లో అఫ్గాన్‌ కీలక పాత్ర పోషించాలని ఐరాస ఆశిస్తోందన్నారు. ‘‘ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

అఫ్గాన్‌లో తాలిబన్లు విజయం సాధించడం ఇతర ప్రాంతాల్లోని ఉగ్రవాదులకు మనోధైర్యాన్నిస్తున్నది నిజం. అయితే ఇతర ఉగ్రగ్రూపులు తాలిబన్లతో పోలిస్తే భిన్నమైనవి, వీరి మధ్య పోలిక కనిపించదు.’’ అని ఆంటోనియో అభిప్రాయపడ్డారు. పలు టెర్రరిస్టు గ్రూపులు తాలిబన్లకు అభినందనలు పంపడమే కాకుండా, తమ సామర్ధ్యంపై బలమైన నమ్మకాన్ని పెంచుకుంటున్నాయన్నారు.  ఆఫ్రికాలోని సహేల్‌ ప్రాంతంలో తీవ్రవాదుల దుశ్చర్యలను ఆయన ప్రస్తావించారు. చాలా ప్రాంతాల్లో ఉగ్రవాదాన్ని సమర్థంగా తిప్పికొట్టే పరిస్థితులు లేవన్నారు. దీనివల్ల టెర్రరిస్టులు క్రమంగా పట్టు సాధిస్తున్నారు, వీరికి తాజా పరిణామాలు ధైర్యాన్నిస్తున్నాయని చెప్పారు.  

ఐకమత్యమే అవసరం
ఒక టెర్రరిస్టు గ్రూపు.. అది ఎంత చిన్నదైనా సరే, ఆత్మాహుతికి సిద్ధపడి ఒక దేశంపై దాడికి దిగితే, సదరు దేశ సైన్యాలు సైతం ఆ గ్రూపును ఎదుర్కోలేకపోతాయని ఆంటోనియో ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు ఉదాహరణగా అఫ్గాన్‌ ఆర్మీ 7రోజుల్లో మాయమవడాన్ని ప్రస్తావించారు. టెర్రరిజంపై యావత్‌ ప్రపంచం ఏకతాటిపై నిలబడితే సమర్ధవంతంగా ఎదుర్కోగలమన్నారు.

అఫ్గాన్‌ను ఉగ్రవాదులకు నిలయంగా మారకుండా చూడాల్సిన బాధ్యత ఉందని అభిప్రాయపడ్డారు. అఫ్గాన్‌ తాలిబన్లతో ఐరాస నిరంతరం చర్చిస్తోందని, ఈ స్థితిలో చర్చలే ఉత్తమమార్గమని ఆయన చెప్పారు. తాలిబన్ల ప్రభుత్వం సమ్మిళితంగా ఉంటుందని ఆశించామని చెప్పారు. తాలిబన్లు అన్ని వర్గాలను పాలనలో మిళితం చేయాలని, మానవ హక్కులను కాపాడాలని, మహిళలు, బాలికల హక్కులపై నెలకొన్న ఆందోళనలను పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ సంబంధాల్లో అఫ్గానిస్థాన్‌ నిర్మాణాత్మక పాత్ర పోషించాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement