UN Secretary General
-
మేజర్గారి ప్రసంగం మెగా హిట్
ప్రతిష్ఠాత్మక ‘మిలిటరీ జెండర్ అడ్వకేట్ అవార్డ్’ అందుకోవడంతో వార్తల్లోకి వచ్చిన మేజర్ రాధికాసేన్ తన ‘వైరల్ స్పీచ్’ ద్వారా మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ‘జెండర్–సెన్సిటివ్ పీస్‌కీపింగ్ ప్రాముఖ్యత గురించి తన ప్రసంగంలో నొక్కి చెప్పింది సేన్. ‘జెండర్–సెన్సిటివ్ పీస్‌కీపింగ్ అనేది కేవలం మహిళల బాధ్యత మాత్రమే కాదు. అది అందరి బాధ్యత. మహిళల ఆరోగ్యం, విద్య, శిశుసంరక్షణ. లింగసమానత్వం, లైంగిక హింసను ఎదుర్కోవడం లాంటి అంశాలపై కమ్యూనిటీలతో మమేకమయ్యే అవకాశం లభించింది’ అంటుంది సేన్. ప్రసంగం అనంతరం ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ రాధికసేన్ను నిజమైన నాయకురాలిగా, మోడల్‌గా అభివర్ణించారు. -
Israel-Hamas War: గాజాలో తక్షణమే కాల్పుల విరమణ
ఐక్యరాజ్యసమితి: ఇజ్రాయెల్–హమాస్ మధ్య వివాదం మొదలైన అయిదు నెలల తర్వాత సోమవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుత రంజాన్ మాసంలో గాజాలో తక్షణమే కాల్పుల విరమణ అమలు చేయాలని సంబంధిత వర్గాలను కోరుతూ ఐరాస భద్రతా మండలి తీర్మానాన్ని ఆమోదించింది. 15 సభ్యదేశాలతో కూడిన మండలిలోని 10 తాత్కాలిక సభ్యదేశాలు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. రష్యా, చైనా సహా 14 దేశాలు అనుకూలంగా ఓటేశాయి. ఎవరూ వ్యతిరేకించనప్పటికీ శాశ్వత సభ్యదేశం అమెరికా ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయింది. ‘గాజా విషయంలో ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న తీర్మానాన్ని భద్రతా మండలి ఆమోదించింది. తక్షణమే కాల్పుల విరమణ జరగాలని, బేషరతుగా బందీలందరినీ విడుదల చేయాలని కోరింది’అని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ‘ఎక్స్’లో తెలిపారు. అలాగే, గాజాలో చిక్కుకున్న పాలస్తీనియన్ల వైద్య, ఇతర మానవతా అవసరాలను పరిష్కరించాలని, నిర్బంధించిన వారందరికీ అంతర్జాతీయ చట్టాల ప్రకారం కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత సంబంధిత వర్గాలపై ఉందని తీర్మానం పేర్కొంది. ‘ఈ తీర్మానాన్ని కచి్చతంగా అమలు చేయాల్సిందే. వైఫల్యం క్షమించరానిది’ అంటూ అని గుటెరస్ వ్యాఖ్యానించారు. మండలి తీర్మానంపై ఇజ్రాయెల్ తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉందని ఐరాస హ్యూమన్ రైట్స్ వాచ్ డైరెక్టర్ ల్యూయిస్ పేర్కొన్నారు. పాలస్తీనా ప్రజల ఆకలిచావులను ఆపేందుకు మానవతా సాయం అందించేందుకు వీలు కల్పించాలని, చట్ట విరుద్ధ దాడులను ఆపాలని ఇజ్రాయెల్‌ను కోరారు. అమెరికా పర్యటనను రద్దు చేసుకున్న నెతన్యాహు ఐరాస తీర్మానానికి నిరసనగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఉన్నత స్థాయి బృందంతో తన అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారు. పాలస్తీనా శరణార్థుల ఏజెన్సీకి సహకారం నిలిపివేయాలని కూడా ఇజ్రాయెల్ నిర్ణయించింది. గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులు చేయడం, ప్రతిగా గాజాపై ఇజ్రాయెల్ తీవ్రస్థాయి యుద్ధంతో విరుచుకుపడుతుంటం తెలిసిందే. -
పర్యావరణానికి ‘లైఫ్’
కెవాడియా: వాతావరణ మార్పుల కారణంగా విధ్వంసకరమైన పరిణామాల నుంచి మన భూమండలాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా భారత్ ఆధ్వర్యంలో ఒక అంతర్జాతీయ కార్యాచరణ రూపు దిద్దుకుంది. ప్రధాని మోదీ, ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి గుటెరస్ సంయుక్తంగా మిషన్ లైఫ్(లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్)ను ప్రారంభించారు. ప్రజలు తమ జీవన విధానాన్ని మార్చుకోవడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని, దీనిని ప్రపంచ దేశాల ప్రజల్లోకి ఒక ఉద్యమంలా తీసుకువెళ్లాలని నిర్ణయించారు. గుజరాత్‌లోని ఐక్యతా విగ్రహం దగ్గర గురువారం లైఫ్ మిషన్‌ను ప్రారంభించారు. ప్రజలు లైఫ్ స్టైల్లో మార్చుకోవాల్సిన జాబితాతో పాటు లైఫ్ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ఈ మిషన్ పీ3 మోడల్ అని ప్రో ప్లేనెట్, పీపుల్‌గా వ్యాఖ్యానించారు. ‘రెడ్యూస్, రీయూజ్, రీ సైకిల్’ విధానాన్ని అందరూ అనుసరించాలని ప్రధాని పిలుపునిచ్చారు. ప్రజలు చేయాల్సిందిదే..! ప్రతీ రోజూ ఒక వ్యక్తి జిమ్‌కి వెళ్లడానికి పెట్రోల్‌తో నడిచే బైక్, కారు వంటి వాహనాన్ని వాడే బదులుగా సైకిల్‌పై వెళ్లడం మంచిదన్నారు. ఎల్ఈడీ బల్బులు వాడితే విద్యుత్ బిల్లులు తగ్గడమే కాకుండా పర్యావరణానికి మేలు జరుగుతుందని ప్రధాని హితవు పలికారు. ఇలాంటివన్నీ ప్రజలందరూ మూకుమ్మడిగా పాటిస్తే ప్రపంచ దేశ ప్రజలందరి మధ్య ఐక్యత పెరుగుతుందని మోదీ చెప్పారు. ప్రకృతి వనరుల్ని అతిగా వాడొద్దు : గుటెరస్ ప్రకృతి వనరుల్ని అతిగా వినియోగించడం వల్ల పర్యావరణానికి హాని జరుగుతోందని గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. జీ–20 దేశాలు 80 శాతం గ్రీన్ హౌస్ వాయువుల్ని విడుదల చేస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చెప్పిన మాటల్ని గుటెరస్ గుర్తు చేసుకున్నారు. ‘‘ప్రతీ ఒక్కరి అవసరాలు తీర్చే వనరులు ఈ భూమిపై ఉన్నాయి. కానీ అందరి అత్యాశలను నెరవేర్చే శక్తి భూమికి లేదు. దురదృష్టవశాత్తూ ఇవాళ రేపు ప్రతీ ఒక్కరూ అత్యాశకి పోతున్నారు. దానిని మనం మార్చాలి’’ అని కొన్ని దశాబ్దాల కిందటే గాంధీజీ చెప్పారని ఇప్పటికీ అది అనుసరణీయమని వ్యాఖ్యానించారు. భారత్ తీసుకువచ్చిన ఈ కార్యాచరణని ప్రపంచ దేశాలు ప్రశంసిస్తున్నాయి. -
ఐరాసలో శాశ్వత ప్రతినిధిగా రుచిరా కాంబోజ్
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితిలో భారత ప్రథమ మహిళా శాశ్వత ప్రతినిధిగా రుచిరా కాంబోజ్(58) బాధ్యతలు చేపట్టారు. సంబంధిత అధికార పత్రాలను మంగళవారం ఆమె ఐరాస సెక్రటరీ జనరల్ గుటెర్రస్‌కు అందజేశారు. 1987 ఐఎఫ్ఎస్ అధికారి అయిన రుచిరా కాంబోజ్, గతంలో భూటాన్‌లో భారత రాయబారిగా పనిచేశారు. 2002–2005 సంవత్సరాల్లో ఐరాసలోని భారత శాశ్వత మిషన్‌లో కౌన్సిలర్‌గా ఉన్నారు. భారత శాశ్వత రాయబారి టీఎస్ తిరుమూర్తి పదవీ కాలం ముగియడంతో ఆ స్థానంలో రుచితా జూన్‌లో నియమితులయ్యారు. -
Sakshi Cartoon: యుద్ధం ఆపాలని పుతిన్‌తో ఐక్యరాజ్యసమితి భేటీ
యుద్ధం ఆపాలని పుతిన్‌తో ఐక్యరాజ్యసమితి భేటీ -
Russia-Ukraine War: నా పదవీకాలంలో అత్యంత విషాద క్షణాలు!
న్యూయార్క్: ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయడం తన పదవీ కాలంలోనే అంత్యంత విషాదకరమైన క్షణమని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ అంశంపై చర్చించేందుకు ఐరసా భద్రతా మండలి గురువారం అత్యవసరంగా సమావేశమైంది. ‘‘ నా హృదయాంతరాళాల్లోంచి పుతిన్‌కు విజ్ఞప్తి చేస్తున్నా! ఉక్రెయిన్‌పై దాడికి పంపిన మీ బలగాలను ఆపండి. చాలామంది చనిపోయినందున దయచేసి శాంతికి అవకాశం ఇవ్వండి’’ అని భద్రతా మండలి సమావేశాన్ని ఆరంభించినట్లు గుటెరస్ మీడియాకు చెప్పారు. ఈ సమావేశం జరుగుతుండగానే పుతిన్ యుద్ధ ప్రకటన వెలువడింది. దీంతో ‘‘పుతిన్, మానవత్వం పేరు మీద అభ్యర్థిస్తున్నా మీ బలగాలను వెంటనే రష్యాకు మరలించండి. ఈ శతాబ్ది ప్రారంభం నుంచి ఐరోపా చూడని అత్యంత ఘోరమైన యుద్ధాన్ని ప్రారంభించడానికి అనుమతించకండి. ఈ పరిణామాలు ఉక్రెయిన్‌కు మాత్రమే కాక ప్రపంచానికే వినాశకారిగా మారతాయి. ఇవి మొత్తం రష్యా ఫెడరేషన్‌కే కాక ప్రపంచమంతటికీ విషాదభరిత పరిణామాలవుతాయి’’ అని గుటెరస్ మరో ప్రకటన చేశారు. కోవిడ్ నుంచి కోలుకుంటున్న అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై దాడి దుష్ప్రభావం చూపుతుందని, అభివృద్ధి చెందుతున్న దేశాలు కోలుకోవడం క్లిష్టంగా మారుతుందని చెప్పారు. చదవండి: (రష్యాకు స్ట్రాంగ్ వార్నింగ్.. ఆ దేశాల జోలికొస్తే ఖబడ్దార్) పుతిన్ ప్రకటనతో కల్లోలం ఉద్రిక్తతలు నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చకు ఐరాస భద్రతా మండలి సమావేశమైంది. సమావేశం జరుగుతుండగానే పుతిన్ యుద్ధ ప్రకటన వచ్చింది. దీంతో ఒక్కమారుగా ఆయా దేశాల సభ్యులు షాక్ అయ్యారు. శాంతిస్థాపన కోరుతూ మండలి సభ్యులు సమావేశమైన సమయంలోనే, భద్రతామండలి బాధ్యతను తృణీకరిస్తూ పుతిన్ ప్రకటన చేశారని ఐరాసలో అమెరికా ప్రతినిధి లిండా థామస్ గ్రీన్‌ఫీల్డ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో మండలి కలిసికట్టుగా వ్యవహరించాలని కోరారు. ఈ విషయంలో మండలిలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెడతామన్నారు. చదవండి: (Vladimir Putin: రష్యాకి ఎక్కడిదీ బరి తెగింపు!.. వాటిని చూసుకొనేనా..?) పుతిన్ చర్యల అనైతికమని, అన్యాయమని, ఉక్రెయిన్‌కు, ఐరసా సూత్రాలకు ఇది చీకటి రోజని యూకే ప్రతినిధి బార్బరా వుడ్వార్డ్ విచారం వెలిబుచ్చారు. రష్యా చర్యలకు ప్రతి చర్యలుంటాయని హెచ్చరించారు. యుద్ధాన్ని ఆపేందుకు మండలి కృషి చేయాలన్నారు. రష్యా యుద్ధాన్ని కోరుకుందని, దీన్ని తమ దేశం తీవ్రంగా ఖండిస్తోందని ఫ్రాన్స్ రాయబారి నికోలస్ డీరివెరె చెప్పారు. ఈ చర్యలకు రష్యా మండలి ముందు బాధ్యత వహించాలన్నారు. రష్యా చర్య అన్యాయమని ఐరాసలో ఉక్రెయిన్ రాయబారి సెర్గీ క్లైస్లిట్సియా ఆవేదన వెలిబుచ్చారు. ఫిబ్రవరి నెలకు మండలికి రష్యా తరఫున అధ్యక్షత వహిస్తున్న వాస్లీ నెబెంజియా వెంటనే తన బాధ్యతలను నెరవేర్చాలని సెర్గీ డిమాండ్ చేశారు. పుతిన్‌తో చెప్పి యుద్ధాన్ని ఆపాలని కోరారు. మండలిలో రష్యా ఆక్రమణను ఖండిస్తూ తీర్మానం చేయాలన్న నిర్ణయంపై ఆయన కృతజ్ఞతలు చెప్పారు. అయితే తాము కేవలం కీవ్‌లో పదవిలో ఉన్న జుంటాకు వ్యతిరేకమని, ఉక్రెయిన్ ప్రజలకు కాదని రష్యా రాయబారి వాస్లీ చెప్పారు. ఇది యుద్ధం కాదని, డోన్బాస్లో ఒక ప్రత్యేక మిలటరీ చర్యని చెప్పారు. -
ఐరాస నివేదికపై భారత్ అసంతృప్తి
ఐరాస: ఐసిస్ ఉగ్రవాద సంస్థపై ఐరాస సెక్రటరీ జనరల్ విడుదల చేసిన నివేదికపై భారత్ అసహనం వ్యక్తం చేసింది. పాక్ స్థావరంగా కార్యకలాపాలు నిర్వహించే లష్కరేతోయిబా, జేషే మహ్మద్ సంస్థలకు ఐసిస్‌కు మధ్య ఉన్న సంబంధాల గురించి పలు మార్లు హెచ్చరించినా నివేదికలో పేర్కొనలేదని భారత్ అసంతృప్తి తెలిపింది. అఫ్గాన్‌లో ఐసిస్ అకృత్యాలపై ఐరాస్ 14వ సెక్రటరీ జనరల్ రిపోర్టును ఇటీవల విడుదల చేసింది. పాక్ మద్దతుతో హక్కానీ నెట్వర్క్ విస్తరించడాన్ని, పలు ఉగ్రసంస్థలకు ఆల్‌ఖైదా, ఐసిస్‌తో ఉన్న సంబంధాలను విస్మరించకూడదని ఐరాసలో భారత ప్రతినిధి తిరుమూర్తి వ్యాఖ్యానించారు. ఈ ఉగ్రబంధాలపై భారత్ పలుమార్లు వివరాలందించిందని, ఆందోళన వ్యక్తం చేసిందని, కానీ కార్యదర్శి నివేదిక ఈ బంధాలను ప్రస్తావించలేదని చెప్పారు. భవిష్యత్‌లోనైనా సభ్యదేశాల ఆందోళనను పట్టించుకొని నివేదికలు రూపొందించాలని కోరారు. పాక్ నుంచి తాము ఎదుర్కొంటున్న ఉగ్రముప్పుపై భారత్ పలుమార్లు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉందన్నారు. ఆసియాలో ఐసిస్ విస్తరణకు యత్నించడాన్ని నివేదికలో పొందుపరిచారు. దీనిపై తిరుమూర్తి స్పందిస్తూ, ప్రపంచ దేశాలు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలన్నారు. -
అక్కడ ఉగ్రవాదులకు అపరిమిత స్వేచ్ఛ.. ఐరాస ఆందోళన
ఐరాస: కల్లోలిత అఫ్గానిస్తాన్‌లో ఉగ్రవాద మూకలు అంతులేని స్వేచ్ఛను అనుభవిస్తున్నాయని, వాటికి ఎదురే లేకుండా పోయిందని ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుట్టెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. అఫ్గానిస్తాన్‌లోని ఐసిస్ అనుబంధ సంస్థ ‘ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ లెవాంట్–ఖోరాసన్’కు సనావుల్లా గఫారీ అలియాస్ సాహ బ్ అల్-ముజాహిర్ నేతృత్వం వహిస్తున్నాడు. గత ఏడాది కాబూల్ ఎయిర్‌పోర్టుపై దాడికి సంబంధించి గఫారీపై అమెరికా సోమవారం 10 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించింది. -
లతా మంగేష్కర్‌కు ఐరాస కార్యదర్శి నివాళి
న్యూయార్క్: ప్రఖ్యాత బాలీవుడ్ గాయని లతా మంగేష్కర్ మృతిపట్ల ఐరాస ప్రధాన కార్యదర్శి అంటోనియో గుట్టెరస్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. భారత ఉపఖండ గొంతు లత అని అభివర్ణించారు. లతా మంగేష్కర్ మరణం భారత్‌కు తీర్చలేని నష్టమని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి తిరుమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మరణం సంగీత కుటుంబానికి కూడా పూడ్చలేని లోటన్నారు. ఆమె ప్రజల హృదయాల్లో ఎప్పటికీ ఉంటారన్నారు. ఐరా స ఉన్నతోద్యోగి అనితా భాటియా తదితరులు కూడా లత మృతికి తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. విదేశాల్లోని భారతీయ సంఘాలు లత మరణంపై విచారం వ్యక్తం చేశాయి. (చదవండి: బోరు కొడుతుందని సెక్యూరిటీ గార్డు చేసిన నిర్వాకం!... ఏకంగా రూ. 7 కోట్లు భారీ నష్టం) -
తీరుమారని తాలిబన్లు
న్యూయార్క్: అఫ్గాన్‌లో ప్రభుత్వ మాజీ సభ్యులు, మాజీ భద్రతా దళ సభ్యులు, అంతర్జాతీయ దళాలతో కలిసి పనిచేసిన వారు.. కలిపి దాదాపు 100 మందికి పైగా స్వదేశీయులను తాలిబన్లు చంపినట్లు నమ్మకమైన ఆరోపణలు వచ్చాయని ఐక్యరాజ్యసమితి కార్యదర్శి ఆంటోనియో గుట్టెరస్ చెప్పారు. హతుల్లో మూడింట రెండొందలమందిని సరైన విచారణ లేకుండానే తాలిబన్లు పొట్టనబెట్టుకున్నారన్నారు. తమ హయాంలో దేశీయులందరికీ క్షమాభిక్ష పెడుతున్నామని, కక్ష సాధింపులుండవని గతంలో తాలిబన్లు ప్రకటించారు. కానీ ఇందుకు విరుద్ధంగా తాలిబన్లు వ్యవహరించినట్లు ఆరోపణలు వచ్చాయి. అఫ్గాన్‌లో హక్కుల కార్యకర్తలు, మీడియాపై దాడులు, వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయని గుట్టెరస్ ఆవేదన వ్యక్తం చేశారు. అటు తాలిబన్లు, ఇటు ఐఎస్ ఉగ్రవాదులు కలిపి ఇప్పటికి 8 మంది పౌర హక్కుల కార్యకర్తలను చంపారని, 10 మందిని నిర్బంధించారని తెలిసిందన్నారు. గత ఆగస్టులో అఫ్గాన్ పగ్గాలు తాలిబన్ల వశమయ్యాయి. త్వరలో ఎన్నికలు జరుపుతామని తాలిబన్లు ప్రకటించారు. కానీ ఇంతవరకు అలాంటి ఊసు తీసుకురాలేదు, పైగా మహిళలపై తీవ్ర నిర్భంధం మొదలైంది. దేశంలో మానవహక్కుల పరిరక్షణ జరపకపోతే విదేశీ సాయం అందించమని పలు దేశాలు ప్రకటిస్తున్నా పరిస్థితిలో మార్పు రాలేదు. అఫ్గాన్‌లో ప్రస్తుతం అనేక సమస్యలు తాండవం చేస్తున్నాయని, దాదాపు 3 కోట్లమంది సంక్షోభ కోరల్లో చిక్కుకున్నారని ఆంటోనియో చెప్పారు. మరోవైపు తాలిబన్లపై ఎన్ఆర్ఎఫ్, ఐసిస్ దాడులు కూడా పెరిగాయన్నారు. తాలిబన్లలో జాతుల వైరుధ్య తగాదాలు ముదిరాయని చెప్పారు. -
తాలిబన్ విజయంతో ఉగ్రమూకలకు ధైర్యం!
న్యూయార్క్: అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు విజయం సాధించడం ప్రపంచంలో ఇతర ప్రాంతాల్లోని ఉగ్రవాదులకు ధైర్యాన్నిచ్చే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఒకపక్క అంతర్జాతీయ ఉగ్రవాదంపై ఆందోళన వ్యక్తం చేస్తూనే, మరోపక్క తాలిబన్లతో ఐరాస చర్చలు జరపాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. అంతర్జాతీయ సంబంధాల్లో అఫ్గాన్ కీలక పాత్ర పోషించాలని ఐరాస ఆశిస్తోందన్నారు. ‘‘ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అఫ్గాన్‌లో తాలిబన్లు విజయం సాధించడం ఇతర ప్రాంతాల్లోని ఉగ్రవాదులకు మనోధైర్యాన్నిస్తున్నది నిజం. అయితే ఇతర ఉగ్రగ్రూపులు తాలిబన్లతో పోలిస్తే భిన్నమైనవి, వీరి మధ్య పోలిక కనిపించదు.’’ అని ఆంటోనియో అభిప్రాయపడ్డారు. పలు టెర్రరిస్టు గ్రూపులు తాలిబన్లకు అభినందనలు పంపడమే కాకుండా, తమ సామర్ధ్యంపై బలమైన నమ్మకాన్ని పెంచుకుంటున్నాయన్నారు. ఆఫ్రికాలోని సహేల్ ప్రాంతంలో తీవ్రవాదుల దుశ్చర్యలను ఆయన ప్రస్తావించారు. చాలా ప్రాంతాల్లో ఉగ్రవాదాన్ని సమర్థంగా తిప్పికొట్టే పరిస్థితులు లేవన్నారు. దీనివల్ల టెర్రరిస్టులు క్రమంగా పట్టు సాధిస్తున్నారు, వీరికి తాజా పరిణామాలు ధైర్యాన్నిస్తున్నాయని చెప్పారు. ఐకమత్యమే అవసరం ఒక టెర్రరిస్టు గ్రూపు.. అది ఎంత చిన్నదైనా సరే, ఆత్మాహుతికి సిద్ధపడి ఒక దేశంపై దాడికి దిగితే, సదరు దేశ సైన్యాలు సైతం ఆ గ్రూపును ఎదుర్కోలేకపోతాయని ఆంటోనియో ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు ఉదాహరణగా అఫ్గాన్ ఆర్మీ 7రోజుల్లో మాయమవడాన్ని ప్రస్తావించారు. టెర్రరిజంపై యావత్ ప్రపంచం ఏకతాటిపై నిలబడితే సమర్ధవంతంగా ఎదుర్కోగలమన్నారు. అఫ్గాన్‌ను ఉగ్రవాదులకు నిలయంగా మారకుండా చూడాల్సిన బాధ్యత ఉందని అభిప్రాయపడ్డారు. అఫ్గాన్ తాలిబన్లతో ఐరాస నిరంతరం చర్చిస్తోందని, ఈ స్థితిలో చర్చలే ఉత్తమమార్గమని ఆయన చెప్పారు. తాలిబన్ల ప్రభుత్వం సమ్మిళితంగా ఉంటుందని ఆశించామని చెప్పారు. తాలిబన్లు అన్ని వర్గాలను పాలనలో మిళితం చేయాలని, మానవ హక్కులను కాపాడాలని, మహిళలు, బాలికల హక్కులపై నెలకొన్న ఆందోళనలను పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ సంబంధాల్లో అఫ్గానిస్థాన్ నిర్మాణాత్మక పాత్ర పోషించాలని కోరారు. -
ఐరాసకు అరోరా ఎందుకీ ఆకాంక్ష
ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరస్ ఐదేళ్ల పదవీ కాలం ఈ ఏడాది డిసెంబర్ 31తో ముగుస్తుంది. అంతకు రెండు నెలల ముందే అక్టోబర్‌లో ఆ పదవికి ఎన్నికలు జరుగుతాయి. అనుభవజ్ఞుడైన 71 ఏళ్ల గ్యుటెరస్ మళ్లీ పోటీ చేస్తే కనుక మళ్లీ గెలిచే అవకాశాలే ఎక్కువ. అయితే అంతటి అత్యున్నతస్థాయి పదవికి తాను పోటీ చేయబోతున్నట్లు ఏ మాత్రం అనుభవం లేని అరోరా ఆకాంక్ష అనే 34 ఏళ్ల మహిళ హటాత్తుగా ప్రకటించారు! ‘గెలుస్తానా.. లేదా తర్వాతి సంగతి. నేనైతే పోటీ చేస్తాను’ అంటున్నారు. అంతేకాదు, ఐక్యరాజ్య సమితి డబ్బంతా మీటింగ్‌లకు, పేపర్వర్క్లకు ఎలా వృథా అవుతోందో చెబుతూ ఒక వీడియోను కూడా విడుదల చేశారు! చూస్తుంటే సమితి ప్రధాన కార్యదర్శి అభ్యర్థిగా ఒక సాధారణ మహిళ అయిన ఆకాంక్ష ఎన్నికల ప్రచారం మొదలైనట్లే ఉంది! అరోరా ఆకాంక్షకు తన ఇంటిపేరుతో ‘అరోరా’ అని పిలిపించుకోవడమే ఇష్టం. గతంలో నాలుగేళ్లు ఆమె ఐక్యరాజ్య సమితిలోనే ఒక కంపెనీ తరఫున ఆడిటర్‌గా పని చేశారు. అది తప్ప దౌత్యవేత్తగా ఆమెకు ఏ అనుభవమూ లేదు. ఇప్పుడు సమితికే చీఫ్‌గా పోటీ పడటానికి సిద్ధం అయ్యారు! ‘‘ఒకప్పటి శరణార్థుల మనవరాలిని. కష్టం అంటే ఏమిటో నాకు తెలుసు. కనుక దేశాల కష్టాలను గట్టెక్కించే ఈ పదవికి నేను అర్హురాలిననే అనుకుంటున్నాను’’ అని ఆమె చెబుతున్నారు. ప్రచారం కోసం ఆమె ఎక్కువగా తన సొంత పొదుపు నుంచే ఖర్చుచేయబోతున్నారు. ఆ మొత్తం 30 వేల డాలర్లు. రూపాయల్లో సుమారు 22 లక్షలు. అరోరా కెనడా పౌరురాలు. పుట్టింది ఇండియాలో. 2022–26 పదవీ కాలానికి జరిగే సమితి ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేసేందుకు ఆమోదం కోసం ఈ నెల 17నే ఆమె తన దరఖాస్తు పత్రాన్ని సమితికి సమర్పించారు. ఆ వెంటనే ‘‘పేద దేశాల కోసం ఏదైతే చేయాలో దాన్ని చేయడం లో సమితి విఫలమయింది’’ అనే వ్యాఖ్యతో తన ప్రచారాన్ని కూడా ప్రారంభించారు! పోటీకి ఆమె పేరును ఏదో ఒక దేశం ప్రతిపాదించాలి. 193 దేశాలు సభ్యులుగా ఉన్న సమితి నుంచి ఇంతవరకూ అలాంటి సమర్థన ఏదీ రాలేదు. పోటీ చేయలేకపోయినా, పోటీ చేయాలన్న ఆమె ప్రయత్నం వైపు మాత్రం ప్రపంచ దేశాల తలలన్నీ తిర గనయితే తిరిగాయి. చిన్న దేశాలను సమితి చిన్న చూపు చూస్తోందని అరోరా ఆరోపణ. ఏటా సమితికి వచ్చే 56 బిలియన్ డాలర్ల రాబడిలో డాలరుకు 29 సెంట్లు మాత్రమే సకారణంగా ఖర్చువుతుండగా, మిగతా అంతా సమావేశాలకు, నివేదికల తయారీకి వృథా అవుతోందన్నది ఆమె చేస్తున్న మరో ఆరోపణ. అందుకే తను ఎంపికైతే ఇలాంటి దుర్వినియోగం జరగకుండా చూస్తానని ఆమె హామీ ఇస్తున్నారు. ‘అయినా సరే, తను గెలుస్తుంది అని ఎలా అనుకుంటోంది..’ అని పరిహసించేవాళ్ల ఉండొచ్చు. అయితే ఆమెను సమర్థించేవారూ లేకపోలేదు. ‘ఫియర్లెస్’ అని కొందరు. ‘ఎందుకు పోటీ చేయకూడదు?’ అని ఇంకొందరు. దీనికి భిన్నంగా.. ‘75 ఏళ్ల చరిత్ర గల ఐక్యరాజ్య సమితి ఏ పరిస్థితుల్లో ఏర్పడిందో ఈమెకు ఏం తెలుసు?’ అనేవారు ఎలాగూ ఉంటారు. సమితి లో శాశ్వత సభ్యత్వం గల దేశాలైన బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా, అమెరికాలు వీటో చేస్తే ఏ నిర్ణయమైనా వీగిపోక తప్పని స్థితిలో ఈమె వచ్చి ఏం మారుస్తుంది అని మరో మాట! అవేవీ పట్టించుకోవడం లేదు ఆరోరా. రానున్న ఒకటి రెండు నెలల్లో ఆమె సమితి రాయబారులను కలిసి తన లక్ష్యం ఏమిటో వివరించే ఆలోచనలో కూడా ఉన్నారు. ఒకప్పటి ఆమె సహోద్యోగుల నుంచి కూడా అరోరాకు మద్దతు లభిస్తోంది. ‘నాకేమీ గెలుపు వ్యూహాలు, రాజకీయ ధ్యేయాలు లేవు. సమితి పనితీరును మెరుగు పరిచేందుకు నిజాయితీగా పోటీలోకి దిగుతున్నాను’’ అని చెబుతున్నారు అరోరా. ∙∙ న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయానికి దగ్గర్లోనే నివాసం ఉంటున్నారు అరోరా ఆకాంక్ష. ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం. జీతాన్ని పొదుపుగా వాడుకుంటారు. తల్లిదండ్రులూ ఆమెతోనే ఉంటారు. సమితికి పోటీ చేసే విషయంలోనూ వారు ఆమె వైపే ఉన్నారు. అరోరాకు హ్యారీపొట్టర్ నవలలంటే ఇష్టం. ఒత్తిడుల నుంచి అవి ఆమెను సేద తీరుస్తాయట. ఆమె వార్డ్రోబ్ నిండా అన్నీ ముదురు వర్ణాల దుస్తులే. సమితి ఫీల్డ్ వర్క్ మీద 2017లో ఉగాండా వెళ్లినప్పుడు అక్కడి నుంచి తెచ్చుకున్న ఆరు సూట్లు కూడా వాటిల్లో ఉన్నాయి. ఉగాండా వెళ్లినప్పుడు అక్కడ ఆమె చూసిన ఘోరం గురించి ఇక్కడ చెప్పాలి. అరోరా హర్యానాలో జన్మించారు. తర్వాత కొంతకాలం సౌదీ అరేబియాలో పెరిగారు. తల్లిదండ్రులిద్దరూ వైద్యులే. తొమ్మిదో యేట నుంచి 18 ఏళ్ల వయసు వరకు అరోరా ఇండియాలోని బోర్డింగ్ స్కూల్లో చదివారు. తర్వాత కెనడా వెళ్లి అక్కడ డిగ్రీ పూర్తి చేశారు. అక్కడే ఒక ప్రేవేట్ కంపెనీలో ఆడిటర్‌గా చేరారు. ఆ కంపెనీ తరఫున 2016 లో ఐక్యరాజ్య సమితిలో ఉద్యోగం రాగానే ఎగిరి గంతేసి చేరిపోయారు. ఐక్యరాజ్య సమితి అంటే అంత గొప్ప ఆమెకు. అయితే ఆ గొప్ప లోపలికి వెళ్లాక కనిపించలేదు! తర్వాతి ఏడాది వేసవిలోనే అరోరాకు ఉగాండా వెళ్లే అవకాశం వచ్చింది. అక్కడో చిన్నారి.. ఆకలి బాధ తట్టుకోలేక బురద ముద్దల్ని తినడం ఆమె మనసును కలచి వేచింది. ఆ దృశ్యం ఆమె మనసులో అలా ఉండిపోయింది. డ్యూటీకి తిరిగొచ్చాక సమితిలోని తన సీనియర్ ఆఫీసర్‌తో ఆ సంగతి ని ఆమె ఎంతో ఆవేదనగా చెప్పినప్పుడు ఆ ఆఫీసర్ స్పందించిన తీరు ఆమెను మరింతగా బాధించింది. ‘బురద మంచిదేలే. ఐరన్ ఉంటుంది’ అని అన్నారట! అది తట్టుకోలేక పోయారు అరోరా. క్రమంగా సమితిలోని అలక్ష్యాలు, సమితి నిరాదరణలు ఒక్కోటీ ఆమె కంటబడటం మొదలైంది. ఆ అనుభవాలన్నీ ఇప్పుడు ఆమెను సమితి ప్రధాన కార్యదర్శిగా పోటీ చేసేందుకు బలంగా ప్రేరేపిస్తున్నాయి. అరోరా గెలుస్తారా లేదా అనేది పక్కన పెడితే పోటీ చేయాలన్న ఆలోచననే ఒక గెలుపుగా భావించాలని ఆమెను సమర్థించేవారు అంటున్నారు. -
కరోనా కోసం 2 బిలియన్ డాలర్ల నిధి
ఐక్యరాజ్యసమితి: ప్రపంచవ్యాప్తంగా కరోనాను ఎదుర్కొనేందుకు ఐక్యరాజ్యసమితి 2 బిలియన్ డాలర్ల అత్యవసర నిధిని ప్రకటించింది. ‘ఊహించని ముప్పును ప్రపంచం ఎదుర్కొంటోంది. కోట్లాది ప్రజల జీవితాలను ఛిద్రం చేస్తూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుప్పకూలుస్తోంది. ఇది ప్రపంచ మానవాళి అంతటికీ ఎదురైన సమస్య. కాబట్టి మానవాళి అంతా కలసి దీంతో పోరాడాలి. దీని కోసం మేము రెండు బిలియన్ డాలర్ల ప్రపంచ మానవత్వ నిధిని ఏర్పాటు చేస్తున్నాం. ప్రపంచంలోని పేద దేశాలకు ఇది ఉపయోగపడుతుంది. దీన్ని సరిగ్గా వినియోగించుకుంటే, ఎంతోమంది ప్రజల ప్రాణాలను కాపాడవచ్చు. ఇప్పుడు సరైన చర్యలు తీసుకోకపోతే పెనుముప్పుగా మారుతుంది. అన్ని దేశాలకు మేము చెప్పేది ఒక్కటే. ఈ హెచ్చరికను ఆలకించండి’ యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ వ్యాఖ్యానించారు. -
మహాత్ముడి స్ఫూర్తి ఇప్పుడే అవసరం
ఐక్యరాజ్యసమితి: ఢిల్లీలో చెలరేగిన అల్లర్లపై ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటొనియొ గ్యుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలో శాంతి సౌభ్రాతృత్వాలు నెలకొనాల్సిన పరిస్థతి ఏర్పడిన ప్రస్తుత తరుణంలోనే.. శాంతి, అహింస బోధించిన మహాత్మా గాంధీ స్ఫూర్తి అత్యంత ఆవశ్యకమని పేర్కొన్నారు. సమాజంలో అంతా కలిసిమెలసి జీవించేందుకు గతంలో కన్నా ఇప్పుడే మహాత్ముడి స్ఫూర్తి అవసరం ఎంతో ఉందన్నారు. హింసను విడనాడాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ‘భారత్‌లో నెలకొన్న పరిస్థితిని ప్రధాన కార్యదర్శి నిశితంగా పరిశీలిస్తున్నారు. అల్లర్ల సందర్భంగా ఢిల్లీలో చోటు చేసుకున్న మరణాలపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శాంతి, సంయమనం పాటించాలని కోరుతున్నారు’ అని గ్యుటెరస్ ప్రతినిధి తెలిపారు. -
ఐరాస మాజీ ప్రధాన కార్యదర్శి కోఫి అన్నన్ ఇకలేరు
-
కోఫి అన్నన్ కన్నుమూత
స్విట్జర్లాండ్ : ఐక్యరాజ్యసమితి మాజీ ప్రధాన కార్యదర్శి, నోబెల్ శాంతి బహుమతి గ్రహిత కోఫీ అన్నన్(80) శనివారం మృతి చెందారు. స్వల్ప అస్వస్థతో బాధపడుగున్న కోఫీ అన్నన్ స్విట్జర్లాండ్‌లోని బెర్న్‌లో ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ శనివారం ఉదయం కన్నుమూశారు. ఐరాస సెక్రటరీ పదవి చేపట్టిన తొలి నల్ల జాతీయుడిగా ఆయన రికార్డుకెక్కారు. 1997నుంచి 2006 వరకూ రెండు దఫాలుగా కోఫీ ఐరాస సెక్రటరీ బాధ్యతలు నిర్వహించారు. 1938లో అఫ్రికాలోని కుమాసి నగరంలో కోఫి అన్నన్ జన్మించారు.ఆయన పూర్తిపేరు కోఫి అటా అన్నన్. అమెరికాలోని మాకాలెస్టర్ కాలేజీలో చదువుకున్నారు.ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)లో బడ్జెట్ ఆపీసర్గా కెరీర్ మొదలు కోఫి అన్నన్..1997లో ఐరాస ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.ఇరాక్ యుద్ధం జరుగుతున్న సమయంలో, హెచ్ఐవీ/ఎయిడ్స్ విజృంభిస్తున్న రోజుల్లో అన్నన్ ఐరాస చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించారు. -
'గటరర్స్ని స్వాగతిస్తున్నాం'
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌గా పోర్చుగల్ మాజీ ప్రధాని ఆంటోనియో గటరర్స్ ఎంపికవడాన్ని భారత్ స్వాగతించింది. ఈ సందర్భంగా ఆయనకు భారత ఐక్యరాజ్యసమితి రాయభారి సయ్యద్ అక్బరుద్దీన్ అభినందనలు తెలియజేశారు. ట్వీట్ ద్వారా ఆయన ఈ శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా ఈ ఏడాది జూలై గటరస్ ఢిల్లీ పర్యటనకు వచ్చినప్పుడు భారత విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్‌తో చేతులు కలిపిన ఫోటోను కూడా పోస్ట్ చేశారు. గటరర్స్ గతంలో ఐక్యరాజ్యసమితి శరణార్థుల విభాగానికి 10 సంవత్సరాలపాటు హై కమిషనర్‌గా పనిచేశారు. కాగా, ఐరాస జనరల్ సెక్రటరీ పదవికి పోటీ పడిన స్లొవేకియా విదేశాంగ మంత్రి మిరోస్లావ్ 9 అనుకూల ఓట్లు, 5 వ్యతిరేక ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. సెర్బియన్ విదేశాంగ మంత్రి వుక్ జెరిమిక్, యునెస్కో డెరైక్టర్ జనరల్ ఇరినా బొకోవా మూడో స్థానంలో నిలిచారు. 70 సంవత్సరాలుగా యూఎన్ సెక్రటరీ జనరల్‌గా పురుషుడే ఎన్నికవుతూ వస్తున్నారు. దీంతో సెక్రటరీ జనరల్ పదవి కోసం ఒక మహిళను ఎన్నుకోవాలని సూచనలు వచ్చాయి. అయితే ఈ సారికూడా పాత పద్ధతే కొనసాగబోతోంది.