న్యూయార్క్: అఫ్గాన్‌లో ప్రభుత్వ మాజీ సభ్యులు, మాజీ భద్రతా దళ సభ్యులు, అంతర్జాతీయ దళాలతో కలిసి పనిచేసిన వారు.. కలిపి దాదాపు 100 మందికి పైగా స్వదేశీయులను తాలిబన్లు చంపినట్లు నమ్మకమైన ఆరోపణలు వచ్చాయని ఐక్యరాజ్యసమితి కార్యదర్శి ఆంటోనియో గుట్టెరస్ చెప్పారు. హతుల్లో మూడింట రెండొందలమందిని సరైన విచారణ లేకుండానే తాలిబన్లు పొట్టనబెట్టుకున్నారన్నారు.
తమ హయాంలో దేశీయులందరికీ క్షమాభిక్ష పెడుతున్నామని, కక్ష సాధింపులుండవని గతంలో తాలిబన్లు ప్రకటించారు. కానీ ఇందుకు విరుద్ధంగా తాలిబన్లు వ్యవహరించినట్లు ఆరోపణలు వచ్చాయి. అఫ్గాన్‌లో హక్కుల కార్యకర్తలు, మీడియాపై దాడులు, వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయని గుట్టెరస్ ఆవేదన వ్యక్తం చేశారు. అటు తాలిబన్లు, ఇటు ఐఎస్ ఉగ్రవాదులు కలిపి ఇప్పటికి 8 మంది పౌర హక్కుల కార్యకర్తలను చంపారని, 10 మందిని నిర్బంధించారని తెలిసిందన్నారు. గత ఆగస్టులో అఫ్గాన్ పగ్గాలు తాలిబన్ల వశమయ్యాయి.
త్వరలో ఎన్నికలు జరుపుతామని తాలిబన్లు ప్రకటించారు. కానీ ఇంతవరకు అలాంటి ఊసు తీసుకురాలేదు, పైగా మహిళలపై తీవ్ర నిర్భంధం మొదలైంది. దేశంలో మానవహక్కుల పరిరక్షణ జరపకపోతే విదేశీ సాయం అందించమని పలు దేశాలు ప్రకటిస్తున్నా పరిస్థితిలో మార్పు రాలేదు. అఫ్గాన్‌లో ప్రస్తుతం అనేక సమస్యలు తాండవం చేస్తున్నాయని, దాదాపు 3 కోట్లమంది సంక్షోభ కోరల్లో చిక్కుకున్నారని ఆంటోనియో చెప్పారు. మరోవైపు తాలిబన్లపై ఎన్‌ఆర్‌ఎఫ్, ఐసిస్ దాడులు కూడా పెరిగాయన్నారు. తాలిబన్లలో జాతుల వైరుధ్య తగాదాలు ముదిరాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment