Russia-Ukraine War: నా పదవీకాలంలో అత్యంత విషాద క్షణాలు! | Saddest Moment in My Tenure: UN Chief on Russian Invasion of Ukraine | Sakshi
Sakshi News home page

Russia-Ukraine War: నా పదవీకాలంలో అత్యంత విషాద క్షణాలు!

Published Fri, Feb 25 2022 8:38 AM | Last Updated on Fri, Feb 25 2022 12:50 PM

Saddest Moment in My Tenure: UN Chief on Russian Invasion of Ukraine - Sakshi

న్యూయార్క్‌: ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయడం తన పదవీ కాలంలోనే అంత్యంత విషాదకరమైన క్షణమని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌ అంశంపై చర్చించేందుకు ఐరసా భద్రతా మండలి గురువారం అత్యవసరంగా సమావేశమైంది.  ‘‘ నా హృదయాంతరాళాల్లోంచి పుతిన్‌కు విజ్ఞప్తి చేస్తున్నా! ఉక్రెయిన్‌పై దాడికి పంపిన మీ బలగాలను ఆపండి. చాలామంది చనిపోయినందున దయచేసి శాంతికి అవకాశం ఇవ్వండి’’ అని భద్రతా మండలి సమావేశాన్ని ఆరంభించినట్లు గుటెరస్‌ మీడియాకు చెప్పారు.

ఈ సమావేశం జరుగుతుండగానే పుతిన్‌ యుద్ధ ప్రకటన వెలువడింది. దీంతో ‘‘పుతిన్, మానవత్వం పేరు మీద అభ్యర్థిస్తున్నా మీ బలగాలను వెంటనే రష్యాకు మరలించండి. ఈ శతాబ్ది ప్రారంభం నుంచి ఐరోపా చూడని అత్యంత ఘోరమైన యుద్ధాన్ని ప్రారంభించడానికి అనుమతించకండి. ఈ పరిణామాలు ఉక్రెయిన్‌కు మాత్రమే కాక ప్రపంచానికే వినాశకారిగా మారతాయి. ఇవి మొత్తం రష్యా ఫెడరేషన్‌కే కాక ప్రపంచమంతటికీ విషాదభరిత పరిణామాలవుతాయి’’ అని గుటెరస్‌ మరో ప్రకటన చేశారు. కోవిడ్‌ నుంచి కోలుకుంటున్న అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై దాడి దుష్ప్రభావం చూపుతుందని, అభివృద్ధి చెందుతున్న దేశాలు కోలుకోవడం క్లిష్టంగా మారుతుందని చెప్పారు.  

చదవండి: (రష్యాకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌.. ఆ దేశాల జోలికొస్తే ఖబడ్దార్‌)

పుతిన్‌ ప్రకటనతో కల్లోలం 
ఉద్రిక్తతలు నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చకు ఐరాస భద్రతా మండలి సమావేశమైంది. సమావేశం జరుగుతుండగానే పుతిన్‌ యుద్ధ ప్రకటన వచ్చింది. దీంతో ఒక్కమారుగా ఆయా దేశాల సభ్యులు షాక్‌ అయ్యారు. శాంతిస్థాపన కోరుతూ మండలి సభ్యులు సమావేశమైన సమయంలోనే, భద్రతామండలి బాధ్యతను తృణీకరిస్తూ పుతిన్‌ ప్రకటన చేశారని ఐరాసలో అమెరికా ప్రతినిధి లిండా థామస్‌ గ్రీన్‌ఫీల్డ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో మండలి కలిసికట్టుగా వ్యవహరించాలని కోరారు. ఈ విషయంలో మండలిలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెడతామన్నారు.

చదవండి: (Vladimir Putin: రష్యాకి ఎక్కడిదీ బరి తెగింపు!.. వాటిని చూసుకొనేనా..?)

పుతిన్‌ చర్యల అనైతికమని, అన్యాయమని, ఉక్రెయిన్‌కు, ఐరసా సూత్రాలకు ఇది చీకటి రోజని యూకే ప్రతినిధి బార్బరా వుడ్‌వార్డ్‌ విచారం వెలిబుచ్చారు. రష్యా చర్యలకు ప్రతి చర్యలుంటాయని హెచ్చరించారు. యుద్ధాన్ని ఆపేందుకు మండలి కృషి చేయాలన్నారు. రష్యా యుద్ధాన్ని కోరుకుందని, దీన్ని తమ దేశం తీవ్రంగా ఖండిస్తోందని ఫ్రాన్స్‌ రాయబారి నికోలస్‌ డీరివెరె చెప్పారు. ఈ చర్యలకు రష్యా మండలి ముందు బాధ్యత వహించాలన్నారు. రష్యా చర్య అన్యాయమని ఐరాసలో ఉక్రెయిన్‌ రాయబారి సెర్గీ క్లైస్లిట్సియా ఆవేదన వెలిబుచ్చారు. ఫిబ్రవరి నెలకు మండలికి రష్యా తరఫున అధ్యక్షత వహిస్తున్న వాస్లీ నెబెంజియా వెంటనే తన బాధ్యతలను నెరవేర్చాలని సెర్గీ డిమాండ్‌ చేశారు.

పుతిన్‌తో చెప్పి యుద్ధాన్ని ఆపాలని కోరారు. మండలిలో రష్యా ఆక్రమణను ఖండిస్తూ తీర్మానం చేయాలన్న నిర్ణయంపై ఆయన కృతజ్ఞతలు చెప్పారు. అయితే తాము కేవలం కీవ్‌లో పదవిలో ఉన్న జుంటాకు వ్యతిరేకమని, ఉక్రెయిన్‌ ప్రజలకు కాదని రష్యా రాయబారి వాస్లీ చెప్పారు. ఇది యుద్ధం కాదని, డోన్‌బాస్‌లో ఒక ప్రత్యేక మిలటరీ చర్యని చెప్పారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement