
ఐరాస: ఐసిస్ ఉగ్రవాద సంస్థపై ఐరాస సెక్రటరీ జనరల్ విడుదల చేసిన నివేదికపై భారత్ అసహనం వ్యక్తం చేసింది. పాక్ స్థావరంగా కార్యకలాపాలు నిర్వహించే లష్కరేతోయిబా, జేషే మహ్మద్ సంస్థలకు ఐసిస్‌కు మధ్య ఉన్న సంబంధాల గురించి పలు మార్లు హెచ్చరించినా నివేదికలో పేర్కొనలేదని భారత్ అసంతృప్తి తెలిపింది. అఫ్గాన్‌లో ఐసిస్ అకృత్యాలపై ఐరాస్ 14వ సెక్రటరీ జనరల్ రిపోర్టును ఇటీవల విడుదల చేసింది.
పాక్ మద్దతుతో హక్కానీ నెట్‌వర్క్ విస్తరించడాన్ని, పలు ఉగ్రసంస్థలకు ఆల్‌ఖైదా, ఐసిస్‌తో ఉన్న సంబంధాలను విస్మరించకూడదని ఐరాసలో భారత ప్రతినిధి తిరుమూర్తి వ్యాఖ్యానించారు. ఈ ఉగ్రబంధాలపై భారత్ పలుమార్లు వివరాలందించిందని, ఆందోళన వ్యక్తం చేసిందని, కానీ కార్యదర్శి నివేదిక ఈ బంధాలను ప్రస్తావించలేదని చెప్పారు. భవిష్యత్‌లోనైనా సభ్యదేశాల ఆందోళనను పట్టించుకొని నివేదికలు రూపొందించాలని కోరారు. పాక్ నుంచి తాము ఎదుర్కొంటున్న ఉగ్రముప్పుపై భారత్ పలుమార్లు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉందన్నారు. ఆసియాలో ఐసిస్ విస్తరణకు యత్నించడాన్ని నివేదికలో పొందుపరిచారు. దీనిపై తిరుమూర్తి స్పందిస్తూ, ప్రపంచ దేశాలు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment