Haqqani network
-
ఐరాస నివేదికపై భారత్ అసంతృప్తి
ఐరాస: ఐసిస్ ఉగ్రవాద సంస్థపై ఐరాస సెక్రటరీ జనరల్ విడుదల చేసిన నివేదికపై భారత్ అసహనం వ్యక్తం చేసింది. పాక్ స్థావరంగా కార్యకలాపాలు నిర్వహించే లష్కరేతోయిబా, జేషే మహ్మద్ సంస్థలకు ఐసిస్‌కు మధ్య ఉన్న సంబంధాల గురించి పలు మార్లు హెచ్చరించినా నివేదికలో పేర్కొనలేదని భారత్ అసంతృప్తి తెలిపింది. అఫ్గాన్‌లో ఐసిస్ అకృత్యాలపై ఐరాస్ 14వ సెక్రటరీ జనరల్ రిపోర్టును ఇటీవల విడుదల చేసింది. పాక్ మద్దతుతో హక్కానీ నెట్వర్క్ విస్తరించడాన్ని, పలు ఉగ్రసంస్థలకు ఆల్‌ఖైదా, ఐసిస్‌తో ఉన్న సంబంధాలను విస్మరించకూడదని ఐరాసలో భారత ప్రతినిధి తిరుమూర్తి వ్యాఖ్యానించారు. ఈ ఉగ్రబంధాలపై భారత్ పలుమార్లు వివరాలందించిందని, ఆందోళన వ్యక్తం చేసిందని, కానీ కార్యదర్శి నివేదిక ఈ బంధాలను ప్రస్తావించలేదని చెప్పారు. భవిష్యత్‌లోనైనా సభ్యదేశాల ఆందోళనను పట్టించుకొని నివేదికలు రూపొందించాలని కోరారు. పాక్ నుంచి తాము ఎదుర్కొంటున్న ఉగ్రముప్పుపై భారత్ పలుమార్లు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉందన్నారు. ఆసియాలో ఐసిస్ విస్తరణకు యత్నించడాన్ని నివేదికలో పొందుపరిచారు. దీనిపై తిరుమూర్తి స్పందిస్తూ, ప్రపంచ దేశాలు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలన్నారు. -
ప్రభుత్వ ఏర్పాటు: మాజీ అధ్యక్షుడితో తాలిబన్ల భేటీ
కాబూల్: అఫ్గనిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో తాలిబన్ కమాండర్, హక్కాని నెట్వర్క్ గ్రూపు సీనియర్ నేత అనాస్ హక్కాని, అఫ్గన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయిని కలిశారు. బుధవారం జరిగిన ఈ భేటీలో కర్జాయితో సహా గత ప్రభుత్వంలో శాంతిదూతగా వ్యవహరించిన అబ్దుల్లా అబ్దుల్లా కూడా పాల్గొన్నట్లు తాలిబన్ వర్గాలు తెలిపాయి. అయితే, ఈ సమావేశం జరిగిన చర్చకు సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఈ మేరకు స్థానిక టోలోన్యూస్ కథనం ప్రచురించింది. కాగా తాలిబన్ వ్యవస్థలో హక్కాని నెట్వర్క్ ఒక ముఖ్యశాఖ. అఫ్గన్‌ను తాలిబన్లు గుప్పిట్లోకి తెచ్చుకునే ప్రయత్నంలో ఈ నెట్వర్క్ కీలక పాత్ర పోషించింది. కాబూల్‌ను స్వాధీనం చేసుకుని సైన్యంపై పైచేయి సాధించింది. ఇక పాకిస్తాన్ సరిహద్దుల్లో స్థావరాలు ఏర్పరచుకున్న హక్కాని నెట్వర్క్... అఫ్గనిస్తాన్‌లో అనేకమార్లు ఉగ్రదాడులకు పాల్పడిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇక అఫ్గనిస్తాన్‌ను ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లు.. దేశ ప్రజలందరికీ క్షమాభిక్ష పెట్టామని, ఎవరిపై ప్రతీకార చర్యలు ఉండవని ప్రకటించినప్పటికీ ఆందోళనలు చల్లారడం లేదు. చదవండి: Afghanistan: తొలి మహిళా గవర్నర్‌ను బంధించిన తాలిబన్లు! Afghanistan: తాలిబన్ల రాజ్యం.. బ్రిటన్ ప్రధాని కీలక వ్యాఖ్యలు -
పాక్ ఉగ్రస్థావరాలపై అమెరికా పంజా..!
పరాచినార్, పాకిస్తాన్ : పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై అమెరికా పంజా విసిరింది. బుధవారం డ్రోన్ సాయంతో పాకిస్తాన్-అప్ఘనిస్తాన్ సరిహద్దులో అమెరికా చేసిన దాడిలో హక్కానీ నెట్‌వర్క్‌కు చెందిన ఒక కమాండర్, ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు తెలిసింది. అప్ఘనిస్తాన్‌లో వేళ్లూనుకున్న తాలిబన్‌కు హక్కానీ నెట్‌వర్క్‌తో సంబంధాలు ఉన్నాయి. ఫెడరల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబల్ ఏరియా(ఎఫ్ఏటీఏ)లోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు నక్కి ఉన్నట్లు సమాచారం అందడంతో అమెరికా డ్రోన్‌తో దాడి చేయాలని నిర్ణయించింది. అనుమానిత స్థలంపై డ్రోన్‌తో రెండు మిస్సైళ్లను వదిలినట్లు పేరు చెప్పడానికి ఇష్టపడిని పాకిస్తాన్ అధికారి ఒకరు చెప్పారు. అప్ఘనిస్తాన్‌లో తరచూ ఉగ్ర దాడులకు పాల్పడుతున్న హక్కానీ నెట్‌వర్క్‌ను తుద ముట్టించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంకణం కట్టుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా హక్కానీ కమాండర్లకు తలదాచుకోవడానికి అవకాశం కల్పిస్తున్న పాకిస్తాన్‌కు ఆర్థిక సాయాన్ని కూడా ఆయన నిలిపివేశారు. కాగా, అమెరికా డ్రోన్ దాడిని పాకిస్తాన్ ఖండించింది. ఉగ్రవాదులకు పాకిస్తాన్ సాయం చేస్తోందని ట్రంప్ చేసిన ఆరోపణలను ఆ దేశం కొట్టిపారేసిన విషయం తెలిసిందే. -
‘కహానీలు కాదు..హకానీ అంతు చూడండి’
సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్తాన్ తన భూభాగం నుంచీ హకానీ నెట్వర్క్, ఇతర ఉగ్రవాద గ్రూపులను ఏరివేయాలని అమెరికా తేల్చిచెప్పింది. ఉగ్ర కార్యకలాపాలకు సహకరిస్తున్న క్రమంలో పాకిస్తాన్‌కు సైనిక సాయాన్ని నిలిపివేసిన అమెరికా తాజాగా పాక్ భూభాగంలో ఉగ్రవాదుల ఏరివేతపై అల్టిమేటం ఇచ్చింది. హకానీ నెట్వర్క్ సహా ఉగ్ర గ్రూపులను నిర్మూలించాలని అమెరికా రాయబారి ఏలిస్ విల్స్ స్పష్టం చేశారు. పాకిస్తాన్‌ను సందర్శించిన ఏలిస్ విల్స్ ఇస్లామాబాద్‌లో పాక్ విదేశాంగ శాఖ సీనియర్ అధికారులతో సంప్రదింపులు జరిపారు. హకానీ నెట్వర్క్ ఆప్ఘన్లో భారతీయులు లక్ష్యంగా భీకర దాడులు చేపట్టింది. 2008లో కాబూల్‌లోని ఇండియన్ మిషన్‌పై హకానీ దాడుల్లో 58 మంది మరణించారు. ఇక ఆప్ఘన్లో అమెరికన్లను టార్గెట్‌గా హకానీ నెట్వర్క్ పలు దాడులతో చెలరేగింది. పలు మార్లు అమెరికన్లే లక్ష్యంగా హక్కానీ నెట్వర్క్ కిడ్నాప్‌లు, దాడులకు పాల్పడింది. -
పాకిస్తాన్‌పై అమెరికా అసహనం
వాషింగ్టన్ : ఉగ్రవాదంపై పోరులో పాకిస్తాన్ పూర్తిగా సహకారం అందించడం లేదంటూ అమెరికా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. అఫ్ఘనిస్తాన్‌లో ఉగ్రవాదాన్ని పెంచుతున్న హక్కానీ నెట్‌వర్క్‌పై పాకిస్తాన్ ఎటువంటి సైనిక చర్య చేపట్టడం లేదని ట్రంప్ ఆడ్మినిస్ట్రేషన్ అసహనం వ్యక్తం చేసింది. పాకిస్తాన్ తాజాగా తీసుకుంటున్న చర్యలు ఉగ్రవాదానికి కొమ్ముకాస్తున్నట్లు ఉందని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. అందులో భాగంగానే ముంబై ఉగ్రదాడి సూత్రధారి హఫీజ్ సయీద్‌ను పాకిస్తాన్ గృహనిర్భంధం నుంచి విడుదల చేసిందని అమెరికా పేర్కొంది. పాకిస్తాన్ కేంద్రంగా హక్కానీ నెట్వర్క్ ఉగ్రకార్యక్రమాలు నిర్వహిస్తోందని.. అయినా పాకిస్తాన్ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. ట్రంప్ న్యూ సౌత్ ఏషియా స్ట్రాటజీలో పాకిస్తాన్ భాగమైనా అందుకు అనుగుణంగా ఆ దేశం చర్యలు తీసుకునే అవకాశలు లేవని అమెరికా నిఘా సంస్థలు చెబుతున్నాయి. -
పాకిస్తాన్ ఇక ఏకాకే!?
ఇస్లామాబాద్/వాషింగ్టన్ : అంతర్జాతీయంగా పాకిస్తాన్‌పై భారత్ మరోమారు అత్యంత కీలక దౌత్య విజయాన్ని సాధించింది. భారత్‌పై ఉగ్రదాడులకు తెగబడుతున్న లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి సంస్థలకు హక్కానీ నెట్‌వర్క్‌తో సంబంధాలున్నాయని అమెరికా తేల్చింది. ఈ నేపథ్యంలో లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి సంస్థలపై చర్యలు తీసుకునేందుకు అమెరికా సన్నద్ధమవుతోంది. హక్కానీ నెట్‌వర్క్‌తో సంబంధాలున్న లష్కరే తోయిబాపై ఉగ్రవాదంపై పోరులో భాగంగా పాకిస్తాన్ కఠిన చర్యలు తీసుకోవాలని అమెరికా స్పష్టం చేసింది. అందులో భాగంగా అమెరికన్ కాంగ్రెస్ కొత్తగా రూపొందించిన నేషనల్ ఢిఫెన్స్ ఆథరైజేషన్ చట్టం 2018లో లష్కరే తోయిబా, హక్కానీ నెట్‌వర్క్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతిపాదించింది. లష్కరే తోయిబాను అమెరికా ఉగ్రవాద సంస్థగా గుర్తించినట్లు అందులో స్పష్టంగా పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో ఉగ్రవాదాన్ని పూర్తిగా రూపుమాపేలా అమెరికా కొత్తగా చట్టాన్ని రూపొందించింది. లష్కరే తోయిబాను అమెరికా ఉగ్రవాద సంస్థగా గుర్తించడంతో.. ఉగ్రవాదంపై పోరు చేస్తున్న పాకిస్తాన్ కూడా ఈ సంస్థను ఉగ్రసంస్థగానే పరిగణించాల్సి ఉంటుంది. ఉగ్రవాదంపై పోరుగలో భాగంగా పాకిస్తాన్‌కు అమెరికా భారీగా ఆర్థిక సహకారం అందిస్తోంది. గతంలో 350 మిలియన్ డాలర్లు ఉన్న ఆర్థిక సహకారం.. ఈ ఏడాది 700 మిలియన్ డాలర్లకు అమెరికా పెంచింది. హక్కానీ నెట్వర్క్, లష్కరే తోయిబాలను నిర్వీర్యం చేసే క్రమంలో పాకిస్తాన్ వెనకడుగు వేస్తే.. భవిష్యత్‌లో అమెరికా నుంచి ఎటువంటి నిధులు అందవని రక్షణ శాఖ వర్గాలు స్పష్టం చేశాయి. ఇది భారత్ విజయం ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన బ్రిక్స్, ఇతర అంతర్జాతీయ వేదికలపై లష్కరే తోయిబా, దాని అధిపతి హహీజ్ సయీద్‌పై భారత్ పోరుబాట పట్టింది. ముఖ్యంగా లష్కరే తోయిబా, జైషే మహమ్మద్‌ను అంతర్జాతీయ ఉగ్రసంస్థలుగా ప్రకటించాలని భారత్ అంతర్జాతీయ వేదికలపై గట్టిగా డిమాండ్ చేసింది. అంతేకాక జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ ఐక్యరాజ్య సమితిలో భారత్ పెద్ద పోరాటమే చేసింది. చైనా అడ్డుపడకపోయి ఉంటే.. మసూద్ అజర్‌ని ఈ పాటికే అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రపంచం గుర్తించేది. -
తాలిబాన్ల మారణహోమం
ఖోస్ట్/పెషావర్: ఆగ్నేయ అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్ ఉగ్రవాదులు మంగళవారం పోలీసు శిక్షణా కేంద్రం, భద్రతా దళాలు లక్ష్యంగా ఆత్మాహుతి దాడులకు తెగబడి రెండు వేర్వేరు ఘటనల్లో మొత్తం 71 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఈ దాడుల్లో మరో 200 మంది గాయపడ్డారు. తొలుత ఐదుగురు ఉగ్రవాదులు బాంబులతో కూడిన దుస్తులు ధరించి, తుపాకులు, పేలుడు పదార్థాలతో పక్తియా ప్రావిన్సులోని గార్డెజ్ పట్టణంలో ఉన్న పోలీసు శిక్షణా కేంద్రం వద్దకు చేరుకున్నారు. అనంతరం ఇద్దరు ముష్కరులు శిక్షణా కేంద్రం ద్వారం వద్దకు వచ్చి పేలుడు పదార్థాలతో నిండిన కార్లతో ఆత్మాహుతికి పాల్పడ్డారు. తర్వాత మిగిలిన ఉగ్రవాదులు కూడా తుపాకులతో కాల్పులు ప్రారంభించారు. పోలీసులకు ఉగ్రవాదులకు మధ్య ఐదు గంటల భీకర పోరు తర్వాత ముష్కరులందరినీ పోలీసులు అంతమొందించారనీ, పోలీసులు, పౌరులు సహా 41 మంది చనిపోయారని అఫ్గానిస్తాన్ హోం శాఖ వెల్లడించింది. శిక్షణా కేంద్రం ప్రాంగణంలోనే సరిహద్దు పోలీసులు, అఫ్గాన్ ఆర్మీ, పక్తియా పోలీసు విభాగం ప్రధాన కార్యాలయాలు కూడా ఉంటాయి. బాధితుల్లో ఎక్కువ మంది వివిధ పనులపై అక్కడకు వచ్చిన పౌరులేనని అధికారులు తెలిపారు. మరో దాడి ఘటనలో 30 మంది దుర్మరణం చెందారు. పాక్‌లో అమెరికా డ్రోన్ దాడి పాకిస్తాన్‌లోని ఖుర్రం జిల్లాలో అమెరికా డ్రోన్లతో దాడి చేసి తాలిబాన్ అనుబంధ సంస్థ హక్కానీకి చెందిన 26 మంది ఉగ్రవాదులను హతమార్చింది. ఈ దాడి జరిగిన కొన్ని గంటల్లోనే ఉగ్రవాదులు అఫ్గాన్‌లో దాడులు చేయడం గమనార్హం. హక్కానీ ఉగ్రవాద సంస్థ అఫ్గానిస్తాన్‌లో ఎన్నో దాడులకు పాల్పడి వందలాది మందిని పొట్టనబెట్టుకుంది. విదేశీయులను అపహరించి, విడుదల చేయాలంటే డబ్బులు ఇవ్వాలని కూడా బెదిరిస్తుంటుంది. ఈ ఏడాదిలో పాకిస్తాన్లో ఉగ్రవాదులపై జరిగిన అతిపెద్ద దాడి ఇదే. -
పాక్‌కు షాకిచ్చిన అమెరికా
వాషింగ్టన్: దాయాది దేశం పాకిస్తాన్‌కు అమెరికా షాకిచ్చింది. హక్కానీ నెట్‌వర్క్‌పై సమర్థవంతంగా పోరాడలేదని ఆరోపిస్తూ సంకీర్ణ సాయం కింద పాక్‌కు అందిస్తున్న 90కోట్ల డాలర్లలో 35కోట్ల డాలర్లకు కోతపెట్టింది. హక్కానీ ఉగ్రవాదులను నిర్మూలించడానికి పాక్ తీసుకున్న చర్యలపై తాను సంతృప్తిగా లేనని అమెరికా రక్షణ కార్యదర్శి జేమ్స్ మాటిస్ కాంగ్రెస్ డిఫెన్స్ కమిటీకి తెలపడంతో పెంటగాన్ ఈ నిర్ణయం తీసుకుంది. అఫ్గానిస్తాన్, పాక్‌ల విషయంలో అమెరికా విదేశాంగ విధానాన్ని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ సమీక్షించనున్న తరుణంలో సాయాన్ని నిలిపివేయడం గమనార్హం -
హక్కానీ నెట్ వర్క్ కీలక కమాండర్ హతం
కాబూల్: ఉగ్రవాద సంస్థ హక్కానీ నెట్ వర్క్‌కు చెందిన కీలక కమాండర్ హతమయ్యాడు. అఫ్ఘనిస్తాన్‌లోని పక్తికా ప్రావిన్స్‌లో డ్రోన్ జరిపిన దాడుల్లో అతడు మృతి చెందినట్లు అధికారిక ప్రకటన వెలువడింది. సర్వాజా జిల్లాలోని ఓ కీలక స్థావరంపై జరిగిన బాంబు దాడుల్లో హక్కానీ కమాండర్ సిరాజుద్దీన్ ఖడేమి ప్రాణాలుకోల్పోయాడు. ఇతడు దాడులకు పాల్పడే వారికి కీలక వ్యూహకర్తగా ఉండటంతోపాటు వారికి ముఖ్యమైన పేలుడు పదార్థాలు అందిస్తుండేవాడు. ఈ దాడిలో భారీ మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు కూడా ధ్వంసం అయ్యాయి. తాలిబన్ సంస్థకు అనుబంధంగా హక్కానీ నెట్ వర్క్ పనిచేస్తున్న విషయం తెలిసిందే. అఫ్ఘనిస్తాన్లోనే ఉంటూ ఈ సంస్థ తన కార్యకలాపాలు నిర్వర్తిస్తుండగా అప్ఘన్ సైన్యం వారిని అణిచివేసేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. -
సుస్మిత హత్య కేసులో ఇద్దరు అరెస్ట్
భారతీయ రచయిత్రి సుస్మిత బెనర్జీ హత్య కేసులో ఆఫ్ఘాన్ పోలీసులు పురోగతి సాధించారు. ఆ కేసుకు సంబంధించి ఇద్దరు తీవ్రవాదులను గత అర్థరాత్రి అరెస్ట్ చేసినట్లు పక్నిక గవర్నర్ అధికార ప్రతినిధి మెక్లిస్ ఆఫ్ఘాన్ మంగళవారం ఇక్కడ వెల్లడించారు. ఆమె రచన ద్వారా తాలిబన్లను ఆగౌరవ పరిచిందని, ఈ నేపథ్యంలో సుష్మితను చంపమని తమకు పై నుంచి ఆదేశాలు అందాయని తీవ్రవాదులు ఇద్దరు తమ విచారణలో వెల్లడించారని ఆఫ్ఘాన్ పేర్కొన్నారు. అంతేకాకుండా ఇంటర్నేట్ ద్వారా ఆమె ఆఫ్ఘాన్ దేశ రహస్యాలను భారత్‌కు చేరవేస్తూ గూఢచర్యానికి పాల్పడుతోందని వారు ఆరోపించినట్లు తెలిపారు. నిందితులు తాలిబన్ అనుబంధ సంస్థ హక్కానికి చెందిన తీవ్రవాదులుగా భావిస్తున్నామన్నారు. పక్నిక ప్రావెన్స్ రాజధాని సహర్నలో వీరిని సోమవారం అర్థరాత్రి అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. భారత్‌కు చెందిన సుస్మిత ఆఫ్ఘానిస్థాన్‌లో వ్యాపారవేత్త జాన్బాజ్ ఖాన్‌ను వివాహాం చేసుకున్నారు. అనంతరం ఆమెపై మతం మార్చుకోవాలని తాలిబాన్లు ఆమెపై ఒత్తిడి తెచ్చారు. ఆ క్రమంలో ఆమెను అపహరించుకు పోయారు. ఆమె వారి చెర నుంచి తప్పించుకుని కొల్‌కత్తాలో కొంత కాలం నివసించారు. ఆ సమయంలో ఆమె కాబూలీవాలాస్ బెంగాలీ వైఫ్ పేరిట ఓ పుస్తకాన్ని రచించారు. ఆ పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని 2003లో బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఓ చిత్రాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. గత మంగళవారం ఆఫ్ఘానిస్థాన్‌లోని సుస్మిత నివాసంలో హత్యకు గురైయ్యారు.