ప్రతీకాత్మక చిత్రం
పరాచినార్, పాకిస్తాన్ : పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై అమెరికా పంజా విసిరింది. బుధవారం డ్రోన్ సాయంతో పాకిస్తాన్-అప్ఘనిస్తాన్ సరిహద్దులో అమెరికా చేసిన దాడిలో హక్కానీ నెట్‌వర్క్‌కు చెందిన ఒక కమాండర్, ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు తెలిసింది. అప్ఘనిస్తాన్‌లో వేళ్లూనుకున్న తాలిబన్‌కు హక్కానీ నెట్‌వర్క్‌తో సంబంధాలు ఉన్నాయి.
ఫెడరల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబల్ ఏరియా(ఎఫ్‌ఏటీఏ)లోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు నక్కి ఉన్నట్లు సమాచారం అందడంతో అమెరికా డ్రోన్‌తో దాడి చేయాలని నిర్ణయించింది. అనుమానిత స్థలంపై డ్రోన్‌తో రెండు మిస్సైళ్లను వదిలినట్లు పేరు చెప్పడానికి ఇష్టపడిని పాకిస్తాన్ అధికారి ఒకరు చెప్పారు.
అప్ఘనిస్తాన్‌లో తరచూ ఉగ్ర దాడులకు పాల్పడుతున్న హక్కానీ నెట్‌వర్క్‌ను తుద ముట్టించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంకణం కట్టుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా హక్కానీ కమాండర్లకు తలదాచుకోవడానికి అవకాశం కల్పిస్తున్న పాకిస్తాన్‌కు ఆర్థిక సాయాన్ని కూడా ఆయన నిలిపివేశారు. కాగా, అమెరికా డ్రోన్ దాడిని పాకిస్తాన్ ఖండించింది. ఉగ్రవాదులకు పాకిస్తాన్ సాయం చేస్తోందని ట్రంప్ చేసిన ఆరోపణలను ఆ దేశం కొట్టిపారేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment