భారతీయ రచయిత్రి సుస్మిత బెనర్జీ హత్య కేసులో ఆఫ్ఘాన్ పోలీసులు పురోగతి సాధించారు. ఆ కేసుకు సంబంధించి ఇద్దరు తీవ్రవాదులను గత అర్థరాత్రి అరెస్ట్ చేసినట్లు పక్నిక గవర్నర్ అధికార ప్రతినిధి మెక్లిస్ ఆఫ్ఘాన్ మంగళవారం ఇక్కడ వెల్లడించారు. ఆమె రచన ద్వారా తాలిబన్లను ఆగౌరవ పరిచిందని, ఈ నేపథ్యంలో సుష్మితను చంపమని తమకు పై నుంచి ఆదేశాలు అందాయని తీవ్రవాదులు ఇద్దరు తమ విచారణలో వెల్లడించారని ఆఫ్ఘాన్ పేర్కొన్నారు. అంతేకాకుండా ఇంటర్నేట్ ద్వారా ఆమె ఆఫ్ఘాన్ దేశ రహస్యాలను భారత్కు చేరవేస్తూ గూఢచర్యానికి పాల్పడుతోందని వారు ఆరోపించినట్లు తెలిపారు.
నిందితులు తాలిబన్ అనుబంధ సంస్థ హక్కానికి చెందిన తీవ్రవాదులుగా భావిస్తున్నామన్నారు. పక్నిక ప్రావెన్స్ రాజధాని సహర్నలో వీరిని సోమవారం అర్థరాత్రి అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. భారత్కు చెందిన సుస్మిత ఆఫ్ఘానిస్థాన్లో వ్యాపారవేత్త జాన్బాజ్ ఖాన్ను వివాహాం చేసుకున్నారు. అనంతరం ఆమెపై మతం మార్చుకోవాలని తాలిబాన్లు ఆమెపై ఒత్తిడి తెచ్చారు. ఆ క్రమంలో ఆమెను అపహరించుకు పోయారు.
ఆమె వారి చెర నుంచి తప్పించుకుని కొల్కత్తాలో కొంత కాలం నివసించారు. ఆ సమయంలో ఆమె కాబూలీవాలాస్ బెంగాలీ వైఫ్ పేరిట ఓ పుస్తకాన్ని రచించారు. ఆ పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని 2003లో బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఓ చిత్రాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. గత మంగళవారం ఆఫ్ఘానిస్థాన్లోని సుస్మిత నివాసంలో హత్యకు గురైయ్యారు.