ఎవరి మాటా వినని తాలిబన్లు | Sakshi Guest Column On Afghanistan Taliban's Terrorists - Sakshi
Sakshi News home page

ఎవరి మాటా వినని తాలిబన్లు

Published Wed, Sep 6 2023 12:33 AM | Last Updated on Wed, Sep 6 2023 9:49 AM

Sakshi Guest Column On Afghanistan Talibans Terrorists

అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు తిరిగి ఆక్రమించి మొన్న ఆగస్టు 15 నాటికి రెండేళ్లు పూర్తయ్యాయి. 2020లో అమెరికాతో దోహాలో చేసుకున్న ఒప్పందానికి తాలిబన్లు కట్టుబడలేదు. ఉగ్రవాదుల అడ్డాగా మార్చకపోవడం, లింగ వివక్ష అంశాలతో పాటు, అఫ్గాన్‌ రిపబ్లిక్‌తో అధికారం పంచుకోవడంపైనా తాలిబన్లు చర్చలు జరిపారు. ఈ క్రమంలో అక్కడ కొత్త రాజ్యాంగం పురుడు పోసుకుంటుందన్న అంచనా తీరా తారుమారైంది.

పాశ్చాత్య దేశాలు తమను కూలదోయలేవని తాలిబన్లకు తెలుసు. మొక్కుబడిగా కొన్ని డిమాండ్లు చేయడం, లేదంటే ఆంక్షలు విధిస్తామని హెచ్చరిస్తే అంతే చాలన్నట్టుగా అంతర్జాతీయ సమాజం ఉంది. తాలిబన్లతో సంబంధాల విషయంలో భారత్‌ కూడా ఆచితూచి వ్యవహరిస్తోంది.

అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు దాదాపు రెండు దశాబ్దాల తర్వాత తిరిగి ఆక్రమించి మొన్న ఆగస్టు 15 నాటికి రెండేళ్లు పూర్తయ్యాయి. అదే రోజు అప్పటి అధ్య క్షుడు అశరఫ్‌ గనీ దేశం వదిలి పారిపోయారు. తాలిబన్లు తమ ఆయుధ బలం మొత్తాన్ని ఉపయోగించి, అఫ్గానిస్తాన్‌ ఆద్యంతం అఫ్గాన్‌ ఎమిరేట్‌ను పునఃస్థాపించారు. అమెరికాపై ఉగ్రదాడికి ప్రతిగా ఆ దేశ మిలిటరీ దళాలు అఫ్గానిస్తాన్‌ మీద 2001 నవంబరులో యుద్ధం ప్రకటించడంతోనే ఈ అఫ్గాన్‌ ఎమిరేట్‌ పతనమైన సంగతి తెలిసిందే.

తాలిబన్లు మళ్లీ దేశాన్ని వశం చేసుకోవడానికి ముందు, అమెరికాతో దోహాలో 2020లో చేసుకున్న ఒప్పందానికి కట్టుబడలేదు. మిలిటరీ బలగాలను వెనక్కు తీసుకున్నందుకు ప్రతిగా తాలిబన్లు అఫ్గాన్‌ ప్రాంతాన్ని ఉగ్రవాదులకు అడ్డాగా మార్చరాదని దోహా ఒప్పందం షరతు విధించింది. దీనితో పాటు, అఫ్గాన్‌ రిపబ్లిక్‌తో అధికారం పంచుకోవడంపై చర్చలు జరిపేందుకూ తాలిబన్లు అంగీకరించారు. ఈ క్రమంలో అక్కడ కొత్త రాజ్యాంగం పురుడు పోసుకుంటుందని వేసుకున్న అంచనా తారుమారైంది.

తాలిబన్లు అఫ్గాన్‌ నేషనల్‌ ఆర్మీపై వేగంగా పైచేయి సాధించడంతో అధికారం పంచుకోవడం అన్న మాట పక్కకెళ్లిపోయింది. ఒకవైపు ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ఖురాసాన్‌ తో తాలి బన్లు పోరాడుతూనే ఉన్నారు. మరోవైపు ఉగ్రవాద సంస్థ ఆల్‌– ఖైదాతో వారి అనుబంధం పెరుగుతూనే ఉంది. అల్‌–ఖైదా నేత అయ మాన్‌ అల్‌–జవాహిరిని 2022 జూలైలో అమెరికా ఒక డ్రోన్‌  దాడిలో హతం చేసినప్పుడు, ఈ సంబంధం కొనసాగుతున్నట్టు అర్థమైంది.

అఫ్గానిస్తాన్‌లో అమెరికా, నాటోకు గట్టి దెబ్బ తగిలింది. తమ మిలిటరీ దళాలను వెనక్కు తీసుకునే ప్రక్రియను కూడా అవి సాఫీగా నిర్వహించలేకపోయాయి. గడచిన రెండేళ్లుగా, అమెరికా, దాని భాగ స్వాములు, అంతర్జాతీయ సమాజ సభ్యదేశాలు తాలిబన్‌ ప్రభుత్వం మానవ హక్కులు, మరీ ముఖ్యంగా లింగ వివక్షకు సంబంధించిన అంశాల్లో అందరినీ కలుపుకొని పోవాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

తాలిబన్‌ ప్రభుత్వం తాను అన్ని తెగలకు ప్రాతినిధ్యం కల్పించామని చెబుతోంది. అయితే లింగ వివక్షకు సంబంధించిన విషయాల్లో మాత్రం వాళ్లు ఇప్పటికీ షరియా చట్టాల అమలుకే మొగ్గు చూపు తున్నట్లుగా కనిపిస్తుంది. కాకపోతే 1990ల నాటి క్రూరత్వం కొంత తగ్గిందని చెప్పాలి. అంతర్జాతీయ సమాజపు డిమాండ్ల విషయంలో తాలిబన్లు వెనక్కి తగ్గలేదన్నది సుస్పష్టం. ప్రస్తుత అమీర్‌ (పాలకుడు) అయిన హిబతుల్లాహ్‌ అఖుంద్‌జాదా చేతుల్లో అధికారం ఉన్నంత వరకూ ఇది అసాధ్యమని కూడా చెప్పు కోవాలి. 

తాలిబన్లు ప్రధానంగా పష్తూన్లు. అదే సమయంలో ఇస్లామ్‌ను అనుసరిస్తారు. యాభై ఏళ్ల సంక్షోభం, యుద్ధాల ఫలితంగా అక్కడ సామాజిక మార్పులు చోటు చేసుకుని పష్తూన్ల సంప్రదాయ బలం తగ్గింది. ఈ నేపథ్యంలో తాలిబన్‌  అగ్రనేతకు అమిర్‌ అల్‌–ముమినీన్‌ హోదా కల్పించడంతో ఆయన మాట మీరడం ఎవరికైనా దుర్లభం.

దేశ ఆగ్నేయ ప్రాంతంలో మంచి పట్టున్న అంతర్గత వ్యవహారాల తాత్కాలిక మంత్రి సిరాజుద్దీన్‌  హక్కానీ, తాలిబన్ల వ్యవస్థాపకుడైన ముల్లా ఒమర్‌ కుమారుడిగా అదనపు అనుకూలత ఉన్న రక్షణ శాఖ మధ్యంతర మంత్రి ముల్లా యాకూబ్‌ లాంటి యువ నేతలు మార్పు నకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. అయితే, లింగ అంశాల మీద ప్రపంచాన్ని ధిక్కరిస్తున్న హిబతుల్లాహ్, ఆయన వర్గమైన సంప్ర దాయ ముల్లాలకు వ్యతిరేకంగా వారు నిలబడ లేకపోతున్నారు.

గత ఏడాది ఫిబ్రవరిలో రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధం మొద లైన తరువాత అంతర్జాతీయ సమాజం, అగ్రరాజ్యాల ధ్యాస మొత్తం అటువైపు మళ్లింది. యూరోపియన్‌  దేశాలపై, అమెరికా–చైనా మధ్య కొనసాగుతున్న పోటీ విషయంలోనూ యుద్ధం ప్రభావం చాలా ఎక్కువే. పైగా ఈ యుద్ధం వల్ల భూ దక్షిణార్ధ గోళంలో చేపట్టిన సంక్షేమ కార్యకలాపాలపై కూడా ప్రతికూల ప్రభావం పడింది. వీటన్నింటి కారణంగా అఫ్గానిస్తాన్‌ అంశం ఏడాదిన్నర కాలంగా కను మరుగైంది.

అప్పుడప్పుడూ మొక్కుబడిగా కొన్ని డిమాండ్లు చేయడం, ఆంక్షలు విధిస్తామని హెచ్చరిస్తే అంతే చాలన్నట్టుగా అంతర్జాతీయ సమాజం ఉంది. ఇదిలా ఉండగానే, అఫ్గానిస్తాన్‌ ఆర్థిక పరిస్థితి మరీ దిగజారి, శరణార్థులు ఇతర దేశాలకు వెల్లువెత్త కుండా మానవతా సాయం కొంతవరకూ కాపాడుతోంది. అయితే విదేశాలకు వెళ్లగలిగిన స్థోమత ఉన్నవారు ఇప్పటికీ వెళుతూనే ఉండటం గమనార్హం. 

అఫ్గానిస్తాన్‌ విషయంలో జోక్యం చేసుకునేందుకు ఇప్పుడు అంత ర్జాతీయ సమాజం అనాసక్తంగా ఉంది. ఆఖరికి అక్కడినుంచి పెరిగి పోతున్న మాదకద్రవ్యాల సరఫరా విషయాన్నీ పట్టించుకోవడం లేదు. మరోవైపు, ఏ అగ్రరాజ్యమైనా అక్కడ ఏం చేయగలదు? క్షేత్రస్థాయిలో అక్కడ ఎవరూ లేరు. ఉగ్రవాదుల గుంపు కార్యకలాపాలపై టెక్నాలజీ లేదా మానవ నిఘా ద్వారా ఎంత వరకూ పరిశీలించవచ్చు? అయితే అప్పుడప్పుడూ ఇవి కూడా ప్రభావవంతంగా ఉంటాయనడానికి అల్‌–జవాహిరిని మట్టుబెట్టడం నిదర్శనం.

పాశ్చాత్య దేశాలు తలుచుకుంటే వాయుమార్గం ద్వారా తమను ఎప్పుడైనా దెబ్బతీయగలవనీ, అయినప్పటికీ తమ ప్రభుత్వాన్ని మాత్రం అవి కూల్చలేవనీ తాలిబన్లకు తెలుసు. ఇలా జరగాలంటే దేశంలో అసంతృప్తి పెరగాలి. కానీ అలాంటి పరిస్థితి ఏదీ కనిపించడం లేదు. ప్రజాగ్రహం లేదా విదేశాల్లో స్థిరపడ్డ ప్రతిపక్ష పార్టీల చర్యలు మచ్చుకైనా లేవు. అంతేకాకుండా అమెరికా, యూరప్, రష్యా, చైనా ప్రయోజనాలేవీ దెబ్బతినకుండా తాలిబన్లు జాగ్రత్త పడుతున్నారు. 

అమెరికన్లు, యూరోపియన్ల విషయంలో తాలిబన్లు కొంత సానుకూలంగా వ్యవహరిస్తున్నా పాకిస్తాన్‌తో మాత్రం అంతంత మాత్రంగానే ఉంటున్నారు. తెహరీక్‌–ఎ–తాలిబన్‌ పాకిస్తాన్‌ (టీటీపీ), అఫ్గాన్‌ తాలిబన్ల సంబంధాలు మతపరమైనవి, వ్యక్తిగత మైనవి, తెగలకు కూడా సంబంధించినవి. టీటీపీ కూడా ‘అమీర్‌’కు విధేయులుగా ఉంటామని ఇప్పటికే ప్రకటించింది. అది ఇరు పక్షా లకూ పవిత్ర సంబంధం లాంటిది.

టీటీపీ నియంత్రణలో తాలిబన్ల సహకారం ఏమాత్రం అందక పోవడంతో పాకిస్తాన్‌ సైన్యం, నిఘా వర్గాలు చాలా నిస్పృహలో ఉన్నాయి. ఇది కాస్తా ఘర్షణకు దారితీస్తోంది. ఇరువైపులా బాహాటంగా వ్యతిరేకత వెల్లడవుతోంది. ఆగస్టు 14వ తేదీన కాకుల్‌లో పాకిస్తాన్‌ మిలిటరీ అకాడమీ ప్రారంభోత్సవం సందర్భంగా, పాకి స్తాన్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ అసీమ్‌ మునీర్‌ మాట్లాడుతూ, ‘‘అఫ్గాన్‌ సోదరులను గౌరవిస్తూనే ఈ మాట.

వారిని బాగా ఆదరిస్తున్న దేశం పాక్‌. వారు కూడా ఈ గౌరవ మన్ననలకు తగ్గట్టుగా వ్యవహరించా ల్సిన అవసరముంది. కనీసం మాకు వ్యతిరేకంగా పనిచేసే వారికి ఆశ్రయమైనా కల్పించకుండా ఉండాల్సింది’’ అని వ్యాఖ్యానించారు. 

ఈ ఆరోపణలను తాలిబన్‌ అధికార ప్రతినిధి తిరస్కరించడం గమనార్హం. అయినా ఎట్టి పరిస్థితుల్లోనూ తాలిబన్లు టీటీపీని వదులు కోరు. అంతర్జాతీయ సంబంధాల్లో ఉదారత అనేది ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం కాదని గ్రహించిన తొలి దేశం పాకిస్తాన్‌ ఏమీ కాదు.

తాలిబన్లతో సంబంధాల విషయంలో భారత్‌ కొంచెం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఏడాది కాలంగా అఫ్గానిస్తాన్‌లో మన ‘టెక్నికల్‌ టీమ్‌’ ఒకటి పనిచేస్తోంది. భారత్‌ నుంచి మానవతా సాయం కూడా ఈ పొరుగు దేశానికి అందుతోంది.

అయితే అఫ్గాన్ల పరిస్థితిని వాస్తవిక దృక్పథంతో అర్థం చేసుకుని ఆచరణ సాధ్యమైన ఆలోచనలను అమల్లో పెట్టడం మేలు. భద్రతా ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటూనే వీసాల జారీని కొంత సులువు చేయడం అవసరం. ఈ చర్య ఇరు దేశాల మధ్య దశాబ్దాలుగా ఉన్న సంబంధాలను మరి కొంచెం దృఢతరం చేయగలదు.
వివేక్‌ కాట్జూ 
వ్యాసకర్త విదేశీ వ్యవహారాల శాఖ మాజీ కార్యదర్శి
(‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement