Vivek Katju
-
సైన్యం నీడలోనే... ‘ఆపద్ధర్మం’
పాకిస్తాన్లో ఏ ప్రభుత్వం ఉన్నా దానిపై సైన్యం ప్రభావం తప్పకుండా ఉంటుందనేది మరోసారి నిరూపితమయ్యింది. ఆపద్ధర్మ ప్రధాన మంత్రి అన్వర్ ఉల్ హఖ్ కాకర్ అచ్చంగా ఒక ఎన్నికైన ప్రధానమంత్రిలా సైన్యానికి అనుగుణంగా వ్యవహరించడం ఇందుకు తాజా ఉదాహరణ. ఇటీవల ‘మార్గల్లా డైలాగ్’లో పాల్గొని దీర్ఘకాలిక ప్రభుత్వాధినేత లాగా ‘ముసురుకుంటున్న భద్రతా సవాళ్లు’ అనే అంశంపై ప్రసంగించారు.చైనా ఎదుగుదలను అరికట్టే విషయంలో పశ్చిమ దేశాల విధానం విఫలమైందనీ, మరోవైపు, పాకిస్తాన్ ‘అంతిమ–ప్రత్యర్థి’ భారతదేశం ఈ సంఘర్షణను ప్రోత్సహించిందనీ ఆయన ఆరోపించారు. పాకిస్తాన్లో ఎవరూ ఆయన మాటలను విమర్శించడం లేదు. కారణం ఆయన సైన్యం ఏం కోరుకుంటున్నదో అదే చేస్తున్నారు కనుక! పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రధాన మంత్రి అన్వర్ ఉల్ హఖ్ కాకర్, ఆ దేశంలో ఈ తాత్కాలిక పదవిని నిర్వహిస్తున్న ఎనిమిదో నేత. తాత్కాలిక ప్రధానమంత్రులూ, వారు సారథ్యం వహించే ప్రభుత్వాల పని ఏమిటంటే... ప్రభుత్వ యంత్రాంగంతో పనిచేయిస్తూ, రాజ్యాంగబద్ధంగా నిర్దేశించిన వ్యవధిలో ఎన్నికలను నిర్వహించడంలో ఎన్నికల కమిషన్‌కు సహాయం చేయడం! తన పూర్వ ఆపద్ధర్మ ప్రధానుల మాదిరిగా కాకుండా, దేశ పాలనా వ్యవస్థకు చేరువగా ఉన్న కాకర్, ఎన్నుకోబడిన నాయకుడిగా తనను తాను ప్రదర్శించుకుంటున్నారు. అంతర్జాతీయ సమావేశాలకు హాజరవుతున్నారు. దీర్ఘకాలిక విధాన నిర్ణయాలు తీసుకుంటున్నారు. పైగా, చారిత్రక రాజకీయ ప్రక్రియలపై తన అవగాహనను వ్యక్తపరు స్తున్నారు. ఆ విధంగా ఆయన తన పరిమితులను దాటుతున్నారు. కానీ పాకిస్తాన్లో ఎవరూ దానిని ఎత్తి చూపడం లేదు. ఇందుకు కారణం ఆయన సైన్యం ఏం కోరుకుంటున్నదో అదే చేస్తున్నారు కనుక. మే 9 నాటి అవాంతరాల తర్వాత, పాకిస్తానీ రాజకీయ నాయ కులు లేదా వ్యాఖ్యాతలెవరూ, ఆగ్రహంతో ఉన్న ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ అసిమ్ మునీర్‌ను నిజంగానే అతిక్రమించడానికి సాహసించడం లేదు. ఇస్లామాబాద్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐపీఆర్‌ఐ) నవంబర్ 15న నిర్వహించిన ‘మార్గల్లా డైలాగ్’లో కాకర్ ప్రసంగించారు. ఈ సంభాషణ థీమ్ ఏమిటంటే, ‘ముసురుకుంటున్న భద్రతా సవాళ్లు’. ఐపీఆర్‌ఐ అనేది పాకిస్తాన్ ప్రధాన మంత్రి కార్యాలయానికి అనుబంధంగా ఉన్న జాతీయ భద్రతా విభాగం (ఎన్ఎస్డీ)కి చెందిన మేధావుల బృందం. భారతదేశంపై ముఖ్యంగా ఐపీఆర్‌ఐ నిర్వహించిన కార్యక్రమంలో కాకర్ చేసిన వ్యాఖ్యలు, భారతదేశంపై పాకిస్తాన్ అధికార వ్యవస్థ ప్రస్తుత ఆలోచనకు ప్రతిబింబం కావు. అందువల్ల, భారత రాజకీయ, భద్రతా వర్గాలను పరిగణనలోకి తీసుకోవడంలో పాకిస్తాన్ తన పూర్వపు ప్రాధాన్యాన్ని ప్రస్తుతం కొద్దిగా కోల్పోయిన ప్పటికీ, కాకర్ వ్యాఖ్యలను విస్మరించలేము. ముఖ్యంగా పాకిస్తానీ దౌత్య వేత్తలు, భద్రతా విశ్లేషకులు ఇప్పుడు ఈ అభిప్రాయాలకు సంబంధించి పాశ్చాత్య దేశాలతో సహా వారి సంభాషణకర్తలను ఒత్తిడి చేయవలసి ఉంటుంది. చైనా ఎదుగుదలను అరికట్టే విషయంలో పశ్చిమ దేశాల విధానం విఫలమైందని అంచనా వేస్తూ, చైనా–పాశ్చాత్య ఘర్షణ నుండి పాకి స్తాన్ ఇక ఎటువంటి ప్రయోజనాన్ని పొందలేదని కాకర్ నొక్కి చెప్పారు. మరోవైపు, పాకిస్తాన్ ‘అంతిమ–ప్రత్యర్థి’ భారతదేశం ఈ సంఘర్షణను ప్రోత్సహించిందని ఆయన అన్నారు. విస్తారమైన జనాభా కారణంగా చైనాను అదుపు చేయడంలో సహాయపడటానికి భారత్ తనను తాను ‘ముఖ్య పాత్రధారి’గా ప్రతిపాదించుకుంటోందని అన్నారు. సాంకేతికత బదిలీలు, పెట్టుబడులు, ఇతర ‘ప్రయో జనాలు’ పొందేందుకు ‘భారతదేశం పశ్చిమార్ధ గోళంతో సరసా లాడుతోంది’ అని ఆయన వ్యాఖ>్యనించారు. పాశ్చాత్య దేశాలు జనాభా కారణంగా చైనాతో పోటీలో భారతదేశాన్ని ఆకర్షణీయంగా భావిస్తే, దాదాపు 1.4 బిలియన్ల జనాభా ఉన్న ఆఫ్రికా ఖండాన్ని లేదా యాభై కోట్ల మంది జనాభా ఉన్న ‘ది ఎకనామిక్ కో–ఆపరేషన్ ఆర్గనైజేషన్’ (ఈసీఓ)ను ఎందుకు పరిగణించలేదని కాకర్ ఆశ్చర్య పోయారు. ఇక కశ్మీర్ విషయానికి వస్తే, కాకర్ 2019 ఆగస్టు నాటి రాజ్యాంగ మార్పుల విషయానికి వెళ్లలేదు. అయితే కశ్మీరీ ప్రజలకు చేసిన వాగ్దానాలను విస్మరించడంలో అంతర్జాతీయ సమాజానివి ‘ద్వంద్వ ప్రమాణాలు’ అని ఆయన ఆరోపించారు. కశ్మీర్ సమస్యకు పరి ష్కారం చూపడం భారత్ లేదా పాకిస్తాన్ పని కాదనీ, కశ్మీరీలు తమ భవిష్యత్తును ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా తామే నిర్ణయించుకోవాలనీ ఆయన అన్నారు. ఏ ‘వలసవాదం’ కూడా శాశ్వతంగా ఉనికిలో ఉండదని, ఎంత కాలం పట్టినా దాని అంతానికి కూడా ఒక రోజంటూ ఉంటుందని ఆయన తన చారిత్రక అవగాహనను చాటుకున్నారు. ఈ అన్ని అంశాల్లో, కాకర్ జమ్మూ కశ్మీర్ సమస్యపై పాకిస్తాన్ ప్రామాణిక వైఖరిని మాత్రమే పేర్కొన్నారు. భారత్–చైనా ఆర్థిక, వాణిజ్య సంబంధాలపై పాక్‌కు ఎలాంటి అభ్యంతరం లేదని కాకర్ పేర్కొన్నారు. భారత్‌తో అనుసంధానతను విస్తరించడానికి లేదా వాణిజ్యం చేయడానికి పాకిస్తాన్ విముఖంగా లేదనీ, అయితే వివాదాస్పద అంశాలు ప్రతిబంధకంగా ఉన్నాయనీ ఆయన అభిప్రాయపడ్డారు. భారత్, పాకిస్తాన్ల వాణిజ్యం ‘గౌరవ ప్రదంగా’ జరగాలని, యాచించడం ఒక ఎంపిక కాదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. భారతదేశ ఆర్థిక వృద్ధిని గమనించిన కాకర్, భారత దేశం 8–10 శాతం వృద్ధి రేటును సాధించాలనుకుంటే, దానికి చౌకైన ఇంధన సరఫరా అవసరమన్నారు. మధ్య ఆసియా నుండి వచ్చే సరఫరాలను భారతదేశం విస్మరించలేదని సూచించారు. ఆ దేశాలు భారత్‌కు చమురును పాకిస్తాన్ మీదుగా రవాణా చేయవలసి ఉంటుందని ఆయన చెప్పకుండా వదిలేశారు. ఇంధన భద్రత కోసం సెంట్రల్ ఆసియన్ ఏజెన్సీ లేదా సహజ వాయువును లేదా చమురును తీసుకు వచ్చే ఇరాన్ పైప్లైన్లు భారత్ పరిశీలనలో నిజంగా లేవని పాకిస్తాన్ విశ్లేషకులు ఇప్పటికీ అర్థం చేసుకోకపోవడమే విచిత్రం. భారతదేశం అతి గర్వం అనే ‘హుబ్రిస్ వ్యాధి’తో బాధపడుతోందనీ, కానీ చరిత్ర ఎప్పుడూ వైఫల్యంతో ముగుస్తుందనీ కాకర్ ఆరోపించారు. ఇస్లామిక్ రాడికలిజంపై దృష్టి సారించిన అంతర్జాతీయ సమాజం హిందూత్వ ప్రమాదాలను ఎందుకు విస్మరించిందని కాకర్ ఆశ్చర్యపోతూ, కెనడియన్ అనుభవం చూపినట్లుగా, పశ్చిమార్ధగోళంలో ‘స్లీపర్ సెల్స్’ అని పేర్కొన్న భారతీయ డయాస్పోరాలోని ఆర్ఎస్ఎస్ మద్దతుదారులతో దానిని ముడిపెట్టారు. అయితే హిందూ మతంతో పాకిస్తాన్‌కు ఎలాంటి సమస్యా లేదని ఆయన పేర్కొన్నారు. కానీ జిన్నా, వాస్తవానికి చేసింది అదే మరి. అది విభజనపై ఆయన పట్టుబట్టడానికి దోహదపడింది. కాకర్ 1937 తదుపరి జిన్నా గురించి చదవాలి. భారతదేశంపై కాకర్ చేసిన వ్యాఖ్యలు ‘అంతిమ–ప్రత్యర్థి’ పట్ల పాకిస్తాన్‌కు ఉన్న అంతులేని శత్రుత్వాన్నీ, భారతదేశం ఎదుగుదల పట్ల దాని అసూయనూ చూపుతున్నాయి. భారత్‌తో వ్యాపారం చేయడం వల్ల పాకిస్తాన్ ప్రయోజనాలను పొందుతుందని పాక్ అధి కారిక వ్యవస్థ గ్రహించిందనీ, అయితే ‘కశ్మీర్ ఉచ్చు’ దానిని హేతు బద్ధంగా వ్యవహరించకుండా నిరోధిస్తున్నదనీ కూడా ఆ వ్యాఖ్యలు నిరూపించాయి. మూడు దశాబ్దాలు, అంతకంటే ఎక్కువ కాలం భార తదేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ప్రాయోజితం చేయడం అనేది పాకిస్తాన్లో భయంకరమైన ఆర్థిక పరిస్థితికి దారితీసింది. దీన్నుంచి బయటపడటానికి ఏకైక మార్గం ఏమిటంటే దాని ‘ప్రత్యర్థి’తో ఆర్థిక వాణిజ్య సంబంధాలను ఏర్పరచుకోవడమే! అయితే సైన్యం అలా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కాకర్ వ్యాఖ్యలు ఎటువంటి సూచనా చేయడం లేదు. ఈలోగా, గతం నుండి పక్కకు వైదొలుగుతూ, కొంతమంది పాకి స్తాన్ మాజీ క్రికెట్ దిగ్గజాలు భారత క్రికెట్ గురించి మంచిగా మాట్లాడుతున్నారని గమనించడం కొత్తగా ఉంది. ముఖ్యంగా భారత దేశంలో క్రికెట్ ఆటను పెంపొందించే విధానాన్ని వారు ప్రశంసించారు. కానీ అలాంటి మనోభావాలు భారతదేశంపై పాక్ సైన్యం ఎత్తుగడల విషయంలో ఎటువంటి తేడానూ ప్రదర్శించవు. వివేక్ కట్జూ వ్యాసకర్త విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి -
ఎవరి మాటా వినని తాలిబన్లు
అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు తిరిగి ఆక్రమించి మొన్న ఆగస్టు 15 నాటికి రెండేళ్లు పూర్తయ్యాయి. 2020లో అమెరికాతో దోహాలో చేసుకున్న ఒప్పందానికి తాలిబన్లు కట్టుబడలేదు. ఉగ్రవాదుల అడ్డాగా మార్చకపోవడం, లింగ వివక్ష అంశాలతో పాటు, అఫ్గాన్ రిపబ్లిక్‌తో అధికారం పంచుకోవడంపైనా తాలిబన్లు చర్చలు జరిపారు. ఈ క్రమంలో అక్కడ కొత్త రాజ్యాంగం పురుడు పోసుకుంటుందన్న అంచనా తీరా తారుమారైంది. పాశ్చాత్య దేశాలు తమను కూలదోయలేవని తాలిబన్లకు తెలుసు. మొక్కుబడిగా కొన్ని డిమాండ్లు చేయడం, లేదంటే ఆంక్షలు విధిస్తామని హెచ్చరిస్తే అంతే చాలన్నట్టుగా అంతర్జాతీయ సమాజం ఉంది. తాలిబన్లతో సంబంధాల విషయంలో భారత్ కూడా ఆచితూచి వ్యవహరిస్తోంది. అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు దాదాపు రెండు దశాబ్దాల తర్వాత తిరిగి ఆక్రమించి మొన్న ఆగస్టు 15 నాటికి రెండేళ్లు పూర్తయ్యాయి. అదే రోజు అప్పటి అధ్య క్షుడు అశరఫ్ గనీ దేశం వదిలి పారిపోయారు. తాలిబన్లు తమ ఆయుధ బలం మొత్తాన్ని ఉపయోగించి, అఫ్గానిస్తాన్ ఆద్యంతం అఫ్గాన్ ఎమిరేట్‌ను పునఃస్థాపించారు. అమెరికాపై ఉగ్రదాడికి ప్రతిగా ఆ దేశ మిలిటరీ దళాలు అఫ్గానిస్తాన్ మీద 2001 నవంబరులో యుద్ధం ప్రకటించడంతోనే ఈ అఫ్గాన్ ఎమిరేట్ పతనమైన సంగతి తెలిసిందే. తాలిబన్లు మళ్లీ దేశాన్ని వశం చేసుకోవడానికి ముందు, అమెరికాతో దోహాలో 2020లో చేసుకున్న ఒప్పందానికి కట్టుబడలేదు. మిలిటరీ బలగాలను వెనక్కు తీసుకున్నందుకు ప్రతిగా తాలిబన్లు అఫ్గాన్ ప్రాంతాన్ని ఉగ్రవాదులకు అడ్డాగా మార్చరాదని దోహా ఒప్పందం షరతు విధించింది. దీనితో పాటు, అఫ్గాన్ రిపబ్లిక్‌తో అధికారం పంచుకోవడంపై చర్చలు జరిపేందుకూ తాలిబన్లు అంగీకరించారు. ఈ క్రమంలో అక్కడ కొత్త రాజ్యాంగం పురుడు పోసుకుంటుందని వేసుకున్న అంచనా తారుమారైంది. తాలిబన్లు అఫ్గాన్ నేషనల్ ఆర్మీపై వేగంగా పైచేయి సాధించడంతో అధికారం పంచుకోవడం అన్న మాట పక్కకెళ్లిపోయింది. ఒకవైపు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖురాసాన్ తో తాలి బన్లు పోరాడుతూనే ఉన్నారు. మరోవైపు ఉగ్రవాద సంస్థ ఆల్– ఖైదాతో వారి అనుబంధం పెరుగుతూనే ఉంది. అల్–ఖైదా నేత అయ మాన్ అల్–జవాహిరిని 2022 జూలైలో అమెరికా ఒక డ్రోన్ దాడిలో హతం చేసినప్పుడు, ఈ సంబంధం కొనసాగుతున్నట్టు అర్థమైంది. అఫ్గానిస్తాన్‌లో అమెరికా, నాటోకు గట్టి దెబ్బ తగిలింది. తమ మిలిటరీ దళాలను వెనక్కు తీసుకునే ప్రక్రియను కూడా అవి సాఫీగా నిర్వహించలేకపోయాయి. గడచిన రెండేళ్లుగా, అమెరికా, దాని భాగ స్వాములు, అంతర్జాతీయ సమాజ సభ్యదేశాలు తాలిబన్ ప్రభుత్వం మానవ హక్కులు, మరీ ముఖ్యంగా లింగ వివక్షకు సంబంధించిన అంశాల్లో అందరినీ కలుపుకొని పోవాలని డిమాండ్ చేస్తున్నాయి. తాలిబన్ ప్రభుత్వం తాను అన్ని తెగలకు ప్రాతినిధ్యం కల్పించామని చెబుతోంది. అయితే లింగ వివక్షకు సంబంధించిన విషయాల్లో మాత్రం వాళ్లు ఇప్పటికీ షరియా చట్టాల అమలుకే మొగ్గు చూపు తున్నట్లుగా కనిపిస్తుంది. కాకపోతే 1990ల నాటి క్రూరత్వం కొంత తగ్గిందని చెప్పాలి. అంతర్జాతీయ సమాజపు డిమాండ్ల విషయంలో తాలిబన్లు వెనక్కి తగ్గలేదన్నది సుస్పష్టం. ప్రస్తుత అమీర్ (పాలకుడు) అయిన హిబతుల్లాహ్ అఖుంద్జాదా చేతుల్లో అధికారం ఉన్నంత వరకూ ఇది అసాధ్యమని కూడా చెప్పు కోవాలి. తాలిబన్లు ప్రధానంగా పష్తూన్లు. అదే సమయంలో ఇస్లామ్‌ను అనుసరిస్తారు. యాభై ఏళ్ల సంక్షోభం, యుద్ధాల ఫలితంగా అక్కడ సామాజిక మార్పులు చోటు చేసుకుని పష్తూన్ల సంప్రదాయ బలం తగ్గింది. ఈ నేపథ్యంలో తాలిబన్ అగ్రనేతకు అమిర్ అల్–ముమినీన్ హోదా కల్పించడంతో ఆయన మాట మీరడం ఎవరికైనా దుర్లభం. దేశ ఆగ్నేయ ప్రాంతంలో మంచి పట్టున్న అంతర్గత వ్యవహారాల తాత్కాలిక మంత్రి సిరాజుద్దీన్ హక్కానీ, తాలిబన్ల వ్యవస్థాపకుడైన ముల్లా ఒమర్ కుమారుడిగా అదనపు అనుకూలత ఉన్న రక్షణ శాఖ మధ్యంతర మంత్రి ముల్లా యాకూబ్ లాంటి యువ నేతలు మార్పు నకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. అయితే, లింగ అంశాల మీద ప్రపంచాన్ని ధిక్కరిస్తున్న హిబతుల్లాహ్, ఆయన వర్గమైన సంప్ర దాయ ముల్లాలకు వ్యతిరేకంగా వారు నిలబడ లేకపోతున్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధం మొద లైన తరువాత అంతర్జాతీయ సమాజం, అగ్రరాజ్యాల ధ్యాస మొత్తం అటువైపు మళ్లింది. యూరోపియన్ దేశాలపై, అమెరికా–చైనా మధ్య కొనసాగుతున్న పోటీ విషయంలోనూ యుద్ధం ప్రభావం చాలా ఎక్కువే. పైగా ఈ యుద్ధం వల్ల భూ దక్షిణార్ధ గోళంలో చేపట్టిన సంక్షేమ కార్యకలాపాలపై కూడా ప్రతికూల ప్రభావం పడింది. వీటన్నింటి కారణంగా అఫ్గానిస్తాన్ అంశం ఏడాదిన్నర కాలంగా కను మరుగైంది. అప్పుడప్పుడూ మొక్కుబడిగా కొన్ని డిమాండ్లు చేయడం, ఆంక్షలు విధిస్తామని హెచ్చరిస్తే అంతే చాలన్నట్టుగా అంతర్జాతీయ సమాజం ఉంది. ఇదిలా ఉండగానే, అఫ్గానిస్తాన్ ఆర్థిక పరిస్థితి మరీ దిగజారి, శరణార్థులు ఇతర దేశాలకు వెల్లువెత్త కుండా మానవతా సాయం కొంతవరకూ కాపాడుతోంది. అయితే విదేశాలకు వెళ్లగలిగిన స్థోమత ఉన్నవారు ఇప్పటికీ వెళుతూనే ఉండటం గమనార్హం. అఫ్గానిస్తాన్ విషయంలో జోక్యం చేసుకునేందుకు ఇప్పుడు అంత ర్జాతీయ సమాజం అనాసక్తంగా ఉంది. ఆఖరికి అక్కడినుంచి పెరిగి పోతున్న మాదకద్రవ్యాల సరఫరా విషయాన్నీ పట్టించుకోవడం లేదు. మరోవైపు, ఏ అగ్రరాజ్యమైనా అక్కడ ఏం చేయగలదు? క్షేత్రస్థాయిలో అక్కడ ఎవరూ లేరు. ఉగ్రవాదుల గుంపు కార్యకలాపాలపై టెక్నాలజీ లేదా మానవ నిఘా ద్వారా ఎంత వరకూ పరిశీలించవచ్చు? అయితే అప్పుడప్పుడూ ఇవి కూడా ప్రభావవంతంగా ఉంటాయనడానికి అల్–జవాహిరిని మట్టుబెట్టడం నిదర్శనం. పాశ్చాత్య దేశాలు తలుచుకుంటే వాయుమార్గం ద్వారా తమను ఎప్పుడైనా దెబ్బతీయగలవనీ, అయినప్పటికీ తమ ప్రభుత్వాన్ని మాత్రం అవి కూల్చలేవనీ తాలిబన్లకు తెలుసు. ఇలా జరగాలంటే దేశంలో అసంతృప్తి పెరగాలి. కానీ అలాంటి పరిస్థితి ఏదీ కనిపించడం లేదు. ప్రజాగ్రహం లేదా విదేశాల్లో స్థిరపడ్డ ప్రతిపక్ష పార్టీల చర్యలు మచ్చుకైనా లేవు. అంతేకాకుండా అమెరికా, యూరప్, రష్యా, చైనా ప్రయోజనాలేవీ దెబ్బతినకుండా తాలిబన్లు జాగ్రత్త పడుతున్నారు. అమెరికన్లు, యూరోపియన్ల విషయంలో తాలిబన్లు కొంత సానుకూలంగా వ్యవహరిస్తున్నా పాకిస్తాన్‌తో మాత్రం అంతంత మాత్రంగానే ఉంటున్నారు. తెహరీక్–ఎ–తాలిబన్ పాకిస్తాన్ (టీటీపీ), అఫ్గాన్ తాలిబన్ల సంబంధాలు మతపరమైనవి, వ్యక్తిగత మైనవి, తెగలకు కూడా సంబంధించినవి. టీటీపీ కూడా ‘అమీర్’కు విధేయులుగా ఉంటామని ఇప్పటికే ప్రకటించింది. అది ఇరు పక్షా లకూ పవిత్ర సంబంధం లాంటిది. టీటీపీ నియంత్రణలో తాలిబన్ల సహకారం ఏమాత్రం అందక పోవడంతో పాకిస్తాన్ సైన్యం, నిఘా వర్గాలు చాలా నిస్పృహలో ఉన్నాయి. ఇది కాస్తా ఘర్షణకు దారితీస్తోంది. ఇరువైపులా బాహాటంగా వ్యతిరేకత వెల్లడవుతోంది. ఆగస్టు 14వ తేదీన కాకుల్లో పాకిస్తాన్ మిలిటరీ అకాడమీ ప్రారంభోత్సవం సందర్భంగా, పాకి స్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్ మాట్లాడుతూ, ‘‘అఫ్గాన్ సోదరులను గౌరవిస్తూనే ఈ మాట. వారిని బాగా ఆదరిస్తున్న దేశం పాక్. వారు కూడా ఈ గౌరవ మన్ననలకు తగ్గట్టుగా వ్యవహరించా ల్సిన అవసరముంది. కనీసం మాకు వ్యతిరేకంగా పనిచేసే వారికి ఆశ్రయమైనా కల్పించకుండా ఉండాల్సింది’’ అని వ్యాఖ్యానించారు. ఈ ఆరోపణలను తాలిబన్ అధికార ప్రతినిధి తిరస్కరించడం గమనార్హం. అయినా ఎట్టి పరిస్థితుల్లోనూ తాలిబన్లు టీటీపీని వదులు కోరు. అంతర్జాతీయ సంబంధాల్లో ఉదారత అనేది ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం కాదని గ్రహించిన తొలి దేశం పాకిస్తాన్ ఏమీ కాదు. తాలిబన్లతో సంబంధాల విషయంలో భారత్ కొంచెం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఏడాది కాలంగా అఫ్గానిస్తాన్‌లో మన ‘టెక్నికల్ టీమ్’ ఒకటి పనిచేస్తోంది. భారత్ నుంచి మానవతా సాయం కూడా ఈ పొరుగు దేశానికి అందుతోంది. అయితే అఫ్గాన్ల పరిస్థితిని వాస్తవిక దృక్పథంతో అర్థం చేసుకుని ఆచరణ సాధ్యమైన ఆలోచనలను అమల్లో పెట్టడం మేలు. భద్రతా ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటూనే వీసాల జారీని కొంత సులువు చేయడం అవసరం. ఈ చర్య ఇరు దేశాల మధ్య దశాబ్దాలుగా ఉన్న సంబంధాలను మరి కొంచెం దృఢతరం చేయగలదు. వివేక్ కాట్జూ వ్యాసకర్త విదేశీ వ్యవహారాల శాఖ మాజీ కార్యదర్శి (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
'పాక్ కు ధీటుగా బదులిచ్చాం'
సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్వోసీ)ని దాటి పాకిస్తాన్ ఉగ్రవాదులపై విజయవంతంగా సర్జికల్ దాడులు జరిపిన భారత్ సైన్యంపై ప్రశంసలు వెల్లువెత్తుతుండగా.. ఈ విషయంపై పాక్ మీడియా మాత్రం భిన్నంగా స్పందించింది. భారత ఆర్మీ జరిపిన దాడులలో ఇద్దరు పాకిస్తాన్ జవాన్లు మృతిచెందినట్లు ఆర్మీ మీడియా వెల్లడించింది. భారత్ తమ భూభాగంలోకి చొరబడి అకారణంగా కాల్పులకు తెగబడిందని పేర్కొంది. ఎలోవోసీని దాటి సర్జికల్ దాడులు చేసి మీడియాలో హైప్ క్రియేట్ చేశారని పాక్ ఆర్మీ పెద్దలు భారత్ పై మండిపడుతున్నారు. భారత్ మా మీద దాడి చేసినందున, అదే తీరుగా మేం కూడా సర్జికల్ అటాక్ చేస్తామని హెచ్చరించింది. పాక్ నుంచి ప్రతీకార దాడులు జరిగే అవకాశాలున్నాయని ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ ఫాలీ మేజర్ అభిప్రాయపడ్డారు. పాక్ ఉగ్రదాడులకు భారత్ తగిన రీతిలో సమాధానం చెప్పిందన్నారు. గతంలో మాదిరిగా ఉన్నట్లు కాదు.. ప్రస్తుతం భారత్ దూకుడుగా వ్యవహరిస్తుందన్న విషయం పాక్ అర్థం చేసుకుంటే మంచిదని హెచ్చరించారు. సరైన ప్రణాళితో, చాలా తెలివిగా దాడుల ప్లాన్ అమలు చేసిన అందర్నీ ఆయన అభినందించారు. ఈ ఘటన కేవలం ఆర్మీకి మాత్రమే కాదు దేశం మొత్తానికి ఎనర్జీని ఇచ్చిందని వ్యాఖ్యానించారు. ఇటీవల ఉడీలో పాక్ ఉగ్రవాదుల దాడికి ప్రతీకారంగా భారత సైన్యం తాజాగా జరిపిన దాడుల్లో 38మంది ఉగ్రవాదులు హతమైన విషయం తెలిసిందే.