'పాక్ కు ధీటుగా బదులిచ్చాం'
సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ)ని దాటి పాకిస్తాన్ ఉగ్రవాదులపై విజయవంతంగా సర్జికల్ దాడులు జరిపిన భారత్ సైన్యంపై ప్రశంసలు వెల్లువెత్తుతుండగా.. ఈ విషయంపై పాక్ మీడియా మాత్రం భిన్నంగా స్పందించింది. భారత ఆర్మీ జరిపిన దాడులలో ఇద్దరు పాకిస్తాన్ జవాన్లు మృతిచెందినట్లు ఆర్మీ మీడియా వెల్లడించింది. భారత్ తమ భూభాగంలోకి చొరబడి అకారణంగా కాల్పులకు తెగబడిందని పేర్కొంది. ఎలోవోసీని దాటి సర్జికల్ దాడులు చేసి మీడియాలో హైప్ క్రియేట్ చేశారని పాక్ ఆర్మీ పెద్దలు భారత్ పై మండిపడుతున్నారు. భారత్ మా మీద దాడి చేసినందున, అదే తీరుగా మేం కూడా సర్జికల్ అటాక్ చేస్తామని హెచ్చరించింది.
పాక్ నుంచి ప్రతీకార దాడులు జరిగే అవకాశాలున్నాయని ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ ఫాలీ మేజర్ అభిప్రాయపడ్డారు. పాక్ ఉగ్రదాడులకు భారత్ తగిన రీతిలో సమాధానం చెప్పిందన్నారు. గతంలో మాదిరిగా ఉన్నట్లు కాదు.. ప్రస్తుతం భారత్ దూకుడుగా వ్యవహరిస్తుందన్న విషయం పాక్ అర్థం చేసుకుంటే మంచిదని హెచ్చరించారు. సరైన ప్రణాళితో, చాలా తెలివిగా దాడుల ప్లాన్ అమలు చేసిన అందర్నీ ఆయన అభినందించారు. ఈ ఘటన కేవలం ఆర్మీకి మాత్రమే కాదు దేశం మొత్తానికి ఎనర్జీని ఇచ్చిందని వ్యాఖ్యానించారు. ఇటీవల ఉడీలో పాక్ ఉగ్రవాదుల దాడికి ప్రతీకారంగా భారత సైన్యం తాజాగా జరిపిన దాడుల్లో 38మంది ఉగ్రవాదులు హతమైన విషయం తెలిసిందే.