సర్జికల్ స్ట్రైక్స్ అంటే ఏమిటీ?
న్యూఢిల్లీ: ఉడీ ఉగ్రదాడికి గట్టి సమాధానం ఇచ్చిన భారత ఆర్మీని చూసి నేడు దేశమంతా గర్విస్తోంది. మొట్టమొదటిసారి ఇండియన్ ఆర్మీ పాక్ గుండెలు అదిరిపడేలా గర్జించింది. వ్యూహాలను రచించడంలోనూ, అవసరం అయినప్పుడు వాటిని అమలుచేయడంలోనూ తామేం తక్కువకాదని భారత్ నిరూపించింది. పాక్ భూభాగంలో దాడిని గురించి ఆర్మీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్ వివరణ ఇస్తూ బాంబులు అనే మాటను ఉపయోగించకుండా 'సర్జికల్ స్ట్రైక్స్'(నిర్దేశిత దాడులు) ఓ పదం ఉపయోగించారు.
దీనిపై కొంతమందికి అవగాహన ఉన్నప్పటికీ ఎంతోమంది అసలు సర్జికల్ ఎటాక్స్ అంటే ఏమిటని ఆలోచనలో పడ్డారు. సర్జికల్ ఎటాక్స్ అంటే మరేమీ లేదు. ముందుగా తెలిసిన సమాచారం ప్రకారం పక్కాగా నిఘా నిర్వహించి అణువణువు జాగ్రత్తగా వ్యవహరించి నిక్కచ్చిగా ఓ లక్షిత ప్రాంతాన్ని ఎంచుకొని పక్కాగా దాడి చేయడం. ఆర్మీ ఎంతమేరకు లక్ష్యంగా ఎంచుకుంటుందో సరిగ్గా అంతే మొత్తంలో ధ్వంసం అవుతుంది. ఇది చాలా తీవ్రంగా ఉంటుంది. ఫలితం చాలా భయంకరంగా ఉంటుంది. అయితే, ఈ దాడి ప్రాంతలోని నిర్మాణాలకుగానీ, వాహనాలు, భవనాలకు, ఇతర జనావాసాలకు గానీ ఎలాంటి చిన్ననష్టం కూడా సంభవించదు.
ఇంకా చెప్పాలంటే.. ఇటీవల మయన్మార్ లో నాగా తీవ్రవాదులను భారత సేనలే ఎదుర్కొన్నాయి. 70మంది భారత ఆర్మీ కమాండోలు ఆపరేషన్ ప్రారంభించి ఈ సర్జికల్ ఆపరేషన్ ద్వారా 40నిమిషాల్లో పని పూర్తి చేశారు. ఆ సమయంలో 38మంది నాగా తీవ్రవాదులు హతమయ్యారు. ఈ దాడిలో ఉపయోగించి బాంబుల పరిమాణం చిన్నగా ఉన్నప్పటికీ లక్షిత ప్రాంతాన్ని తుత్తునియలు చేయగల సామర్ధ్యం ఉంటుంది. 2003లో ఇరాక్ యుద్ధం సమయంలో అమెరికా కూడా సర్జికల్ దాడులే చేసింది. అక్కడి ప్రభుత్వ భవనాలు, మిలటరీ క్యాంపులను ఈ దాడుల ద్వారానే ధ్వంసం చేసింది.