మళ్లీ 'సర్జికల్' తరహా దాడులు.. పాక్ కకావికలు
భారత సైన్యం మళ్లీ పాకిస్తాన్ మీద విరుచుకుపడింది. మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ తరహా దాడులు చేసింది. ఈనెల 20, 21 తేదీలలో జరిపిన ఈ దాడుల వివరాలను సైన్యం తాజాగా ప్రకటించింది. జమ్ము కశ్మీర్ రాష్ట్రంలోని నౌషేరా ప్రాంతం సమీపంలో ఉన్న పాకిస్తాన్ శిబిరాలపై భారత భద్రతా దళాలు ముమ్మరంగా కాల్పులు జరిపాయి. ఈ దాడిలో పాకిస్తాన్‌కు చెందిన పలు సైనిక శిబిరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పాకిస్తానీ శిబిరాలను పూర్తిగా ధ్వంసం చేసింది.
ప్రస్తుతం నియంత్రణ రేఖ ప్రాంతం మొత్తం భారత సైన్యం ఆధీనంలోనే ఉందని, తమకు జమ్ము కశ్మీర్‌లో శాంతి నెలకొల్పడమే ముఖ్యమని ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది. కొండ ప్రాంతంలో ఉన్న పాకిస్తానీ బంకర్లను ధ్వంసం చేస్తున్న దృశ్యాలతో కూడిన వీడియోలను కూడా సైన్యం బయటపెట్టింది. పాకిస్తాన్ సైన్యం చొరబాట్లను ప్రోత్సహిస్తూ వాటికి అండగా ఉంటోందని ఆర్మీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ అశోక్ నరులా చెప్పారు. కొండల్లో ఉన్న మంచు కరుగుతూ భారతదేశం వైపు రావడానికి మార్గాలు తెరుచుకోవడంతో ఈ ప్రాంతంలో చొరబాట్లు పెరుగుతాయన్న ఆందోళనలు ఉన్నాయని, అందుకే భారత సైన్యం ముందుగా చర్యలు తీసుకుందని ఆయన వివరించారు.