సర్జికల్ స్ట్రైక్స్ వీడియోల విడుదలకు ఆర్మీ ఓకే
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో సర్జికల్ స్ట్రైక్స్‌కు సంబంధించిన వీడియో ఫుటేజిని విడుదల చేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని భారత ఆర్మీ తేల్చి చెప్పేసింది. ఇక ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోవాల్సింది ప్రధానమంత్రే. అసలు సర్జికల్ స్ట్రైక్స్ ఏవీ జరగలేదంటూ పాకిస్థాన్ మీడియా దుష్ప్రచారం చేయడం, భారతదేశంలో కూడా కొందరు నాయకులు దానికి వత్తాసు పాడటం లాంటి ఘటనల నేపథ్యంలో వీడియోలను విడుదల చేసి పక్కా సాక్ష్యాలు బయటపెట్డమే మేలని ఆర్మీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ నాయకుడు సంజయ్ నిరుపమ్ లాంటివాళ్లు సర్జికల్ స్ట్రైక్స్‌కు సంబంధించిన ఆధారాలు బయటపెట్టాలని అంటున్నారు. దీనిపై తీవ్ర రాజకీయ దుమారం సైతం రేగింది. వాస్తవానికి సైనిక రహస్యాలను బయటపెట్టడం అనేది ఇప్పటివరకు ఎప్పుడూ లేదు. త్రివిధ దళాలకు సంబంధించిన ఆపరేషన్లు ఏవైనా సరే.. వాళ్లు చేశామని చెప్పడం తప్ప.. అందుకు సంబంధించిన ఆధారాలు చూపించిన దాఖలాలు లేవు. అయినా సరే, ఇప్పుడు ఆ వీడియో బయటపెడితే ఇటు దేశంలో ప్రశ్నిస్తున్నవాళ్లతో పాటు పాకిస్థాన్ నోరు కూడా మూయించినట్లు అవుతుందని ఆర్మీవర్గాలు భావిస్తున్నాయి.
మొత్తం ఆపరేషన్ అంతటినీ మానవరహిత విమానాల సాయంతో షూట్ చేయడంతో పాటు ఆ దృశ్యాలను ప్రధానమంత్రి, మరికొందరు ఉన్నతాధికారులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా రాత్రంతా మేలుకొని మరీ చూసిన సంగతి తెలిసిందే. ఆ విషయాలను డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ లెఫ్టినెంట్ జనరల్ రణబీర్‌సింగ్ ఒక్కరే అధికారికంగా బయటకు వెల్లడించారు. అక్కడి పరిస్థితి ఇప్పటికీ ఇంకా 'లైవ్'గానే ఉందని, అయినా కొన్ని వ్యాఖ్యలు వస్తున్నాయని ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్ రాహా అన్నారు. ఇప్పుడు పరిస్థితి ఇంకా చాలా సున్నితంగా ఉందని, అందువల్ల దీనిపై ఎలాంటి విషయాలూ తాను చెప్పడం సరికాదని ఆయన తెలిపారు. 1962 నాటికి, ఇప్పటికి పరిస్థితులు చాలా మారాయని, భారత సైన్యంలోని త్రివిధ దళాలు ఎలాంటి ఎదురుదాడులైనా చేయడానికి సర్వసన్నద్ధంగా ఉన్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.