పాక్ సైన్యాన్ని మేం ఎదుర్కోవడానికి రెడీ!
బోనియార్ (జమ్మూకశ్మీర్): పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో పాకిస్థాన్ సైన్యం, ఉగ్రవాదులు ఎలాంటి దుశ్చర్యకు ఒడిగట్టినా.. దానిని ఎదుర్కోవడానికి తాము సర్వసన్నద్ధంగా ఉన్నామని భారత సైన్యం స్పష్టం చేసింది.
‘వాస్తవాధీన రేఖ (ఎల్‌వోసీ) మీదుగా మా సన్నద్ధత అత్యున్నత స్థాయిలో ఉంది. ఎల్‌వోసీ మీదుగా ఎలాంటి దుశ్చర్య ఎదురైనా దానిని ఎదుర్కోవడానికి సైన్యం సిద్ధంగా ఉంది. ఇది నిత్యం ఎదురయ్యేదైనా, వేరే తరహాదైనా ఎదుర్కొంటాం’ అని శ్రీనగర్‌కు చెందిన 15 కార్ప్స్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ లెప్టినెంట్ జనరల్ సతీష్ దువా మంగళవారం బోనియార్‌లో విలేకరులకు తెలిపారు.
ఎల్‌వోసీ మీదుగా భారీగా చొరబాటు ప్రయత్నాలు జరగుతున్నాయని, వాటిని చాలావరకు ఆర్మీ భగ్నం చేస్తున్నదని, ఎల్‌వోసీ మీదుగా తరచూ జరుగుతున్న ఎన్‌కౌంటర్లే ఇందుకు నిదర్శనం అని ఆయన చెప్పారు. చొరబాటు యత్నాలను భగ్నం చేస్తూ ఆర్మీ పలువురు మిలిటెంట్లను హతమార్చిందని, ఇది ఆర్మీ సన్నద్ధతను చాటుతోందని ఆయన చెప్పారు. అయితే, పీవోకేలో నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్‌పై స్పందించడానికి ఆయన నిరాకరించారు. ఈ విషయంలో సైన్యం, రాజకీయ అధినాయకత్వం చెప్పాల్సినదంతా చెప్పేసిందని, ఆ విషయంలో తనకు ఎలాంటి భిన్నమైన అభిప్రాయం లేదని తెలిపారు. కొందరు తప్పుదోవ పట్టిన యువకులే కశ్మీర్‌లోయలో జరుగుతున్న ఆందోళనల్లో పాలుపంచుకుంటున్నారని, మెజారిటీ యువత సైన్యం వైపే ఉందని ఆయన చెప్పారు.