పాక్ భూభాగంపై భారత సైన్యం దాడులు
భారతదేశంలో పదే పదే ఉగ్రదాడులకు పాల్పడుతున్న పాక్ ఉగ్రవాదులపై భారత సైన్యం దాడులు చేసింది. పాకిస్థాన్ భూభాగంలోకి మూడు కిలోమీటర్ల మేర చొరబడి.. అక్కడున్న ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్లపై 'నిర్దేశిత దాడులు' (సర్జికల్ స్ట్రైక్స్) చేసింది. పాక్ భూభాగంలోనే తాము ఈ దాడులు చేసినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్ తెలిపారు. పాక్ భూభాగంలో ఉన్న 8 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో పలువురు ఉగ్రవాదులు కూడా హతమైనట్లు సమాచారం. ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం ఉదయం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తదితరులకు దాడుల విషయం గురించి చెప్పారు.
''నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్రవాదుల లాంచ్‌పాడ్లపై భారత సైన్యం గత రాత్రి నిర్దేశిత దాడులు చేసింది. ఈ దాడిలో భారత సైన్యం వైపు నుంచి ఎలాంటి నష్టం సంభవించలేదు. మన భూభాగంలోకి చొరబడాలని కుట్ర పన్నుతున్న ఉగ్రవాదులను మట్టి కరిపించడమే ఈ దాడుల ఉద్దేశం. నేను పాకిస్థాన్ డీజీఎంఓకు ఫోన్ చేసి, మన ఆందోళన గురించి చెప్పాను, గత రాత్రి నిర్దేశిత దాడులు చేసినట్లు వివరించాను'' అని లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్ మీడియాకు తెలిపారు. ఉగ్రవాద కార్యకలాపాలకు వాళ్ల భూభాగంలో చోటు ఇవ్వొద్దని ఇన్నాళ్లుగా పదే పదే చెబుతున్నా వాళ్లు మాత్రం దాడులకు పాల్పడుతూనే ఉన్నారని ఆయన అన్నారు. పూంఛ్ లోను, ఉడీలోను ఈనెల 11, 18వ తేదీలలో జరిగిన దాడులే అందుకు నిదర్శనమని చెప్పారు.
ఇక భారత సైన్యం దాడులకు దేశంలోని అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఇది అద్భుతమైన ఆపరేషన్ అని, భారత సైన్యం బాగా స్పందించిందని రిటైర్డ్ ఎయిర్ మార్షల్ ఫాలీ హోమీ మేజర్ అన్నారు. ప్రధానమంత్రి మోదీ ఏం చెప్పారో అదే చేస్తున్నారని బీజేపీ నాయకుడు రాం మాధవ్ ట్వీట్ చేశారు. దేశంలోకి చొరబడుతున్న ఉగ్రవాదులను శిక్షించడం మొదలైందని ఆయన చెప్పారు.
మరోవైపు.. భారత సైన్యం దాడులను ఖండిస్తున్నట్లు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ చెప్పారు. శాంతి కావాలని కోరుకుంటున్న తమ విధానాన్ని తమ బలహీనతగా భావించకూడదని ఆయన అన్నారు. తమ దేశ రక్షణ, భద్రతలకు తాము సిద్ధంగా ఉన్నామని కూడా తెలిపారు.
భారత్ సైన్యం విడుదల చేసిన ప్రకటన