38మంది హతం.. ఏడుగురు బందీ!
న్యూఢిల్లీ: పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి భారత సైన్యం జరిపిన దాడుల్లో 38మంది ఉగ్రవాదులు హతమయ్యారని తెలిసింది. మరో ఏడుగురు బందీ అయినట్లు సమాచారం. అయితే, ఈ దాడిలో భారత్ సైనికుల్లో ఏ ఒక్కరూ గాయపడలేదు. భారత ఆర్మీ ప్రత్యేక దళం అర్థరాత్రి దాటిన తర్వాత 12.30గంటల ప్రాంతంలో దాడిని ప్రారంభించి 4.30గంటల ప్రాంతంలో ముగించింది. ఈ దాడి ముగిసిన వెంటనే ఆర్మీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్ పాక్ ఈ విషయం చేరవేశారు. పాక్ కూడా భారత సైన్యం తమ భూభాగంలోకి చొరబడినట్లు ఒప్పుకుంది.
ఉడీ ఉగ్రదాడిలో 18మంది వీర జవాన్లను కోల్పోయిన భారత్ తీవ్రంగా బాధపడింది. ఈ విషయంలో గట్టిగా స్పందించాలని నిర్ణయించింది. ఉడీ దాడి జరిగిన రోజే రక్షణ మంత్రి మనోహర్ పారికర్ పాక్ ఉగ్రమూకలపై సైన్యంతోనే బుద్ధి చెబుతామని అన్నారు. అదే సమయంలో ఈ దాడిని పాక్ ఖండించకపోగా భారత్ ని రెచ్చగొట్టింది. ఆ దాడి వాళ్లే చేసుకుని పాక్ పై ఆరోపణలు చేస్తున్నారని పేర్కొంది. ప్రతి దాడికి పాక్ ను నిందించడం అలవాటుగా మారిందని పేర్కొంది. ఇదే సమయంలో పాక్ ప్రధాని షరీఫ్ కూడా ఐక్యరాజ్యసమితి ప్రసంగంలో ఉగ్రవాదులను వెనుకేసుకొచ్చాడు. దీంతో రక్తం పాలు కలిసి సాగడం కుదరదని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటన చేశారు. పాక్ ఉగ్రవాద దేశం అని నేరుగా ప్రకటించారు. ప్రపంచమంతా ఆదేశాన్ని ఉగ్రవాద దేశంగా గుర్తించాలని అన్నారు.
అదే సమయంలో తాము అణుదాడులకు కూడా వెనుకాడబోమంటూ పాక్ నుంచి స్వరం వినిపించింది. ఇదే అదనుగా తీసుకున్న మోదీ తన వ్యూహానికి మరింత పదును పెట్టారు. పాక్ పై ఘాటు విమర్శలు చేయడమే కాకుండా ఉడీ ఉగ్రదాడి వెనుక పాక్ హస్తం ఉందంటూ ఆధారాలతో సహా బయటపెట్టించారు. తాను సార్క్ సమావేశం కావడం లేదని అనూహ్యంగా ప్రకటించారు. భారత్ సరసనే బంగ్లాదేశ్, అఫ్ఘనిస్తాన్, భూటాన్ కూడా నిలిచాయి.
ఇదే సమయంలో మరికొంతమంది ఉగ్రవాదులు మరోసారి దాడికోసం రానున్నారని నిఘా సమాచారం తెలియడంతో దెబ్బకు దెబ్బ కొట్టాలనే తీరుగా పక్కా వ్యూహాత్మకంగా ఎన్నడూ లేనిది తొలిసారి మూడు కిలోమీటర్ల పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి భారత్ సేన మెరుపుదాడి చేసింది. ఎవ్వరికీ సమాచారం ఇవ్వకుండా సర్జికల్ ఆపరేషన్ నిర్వహించింది. పాక్ తో పోలిస్తే ఇలా భారత్ చేయడం తొలిసారి. ఆ దేశం ఇప్పటికే పదులసార్లు భారత్ లోకి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి చొరబడింది.