పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రధాని అన్వర్ ఉల్ హఖ్ కాకర్
పాకిస్తాన్‌లో ఏ ప్రభుత్వం ఉన్నా దానిపై సైన్యం ప్రభావం తప్పకుండా ఉంటుందనేది మరోసారి నిరూపితమయ్యింది. ఆపద్ధర్మ ప్రధాన మంత్రి అన్వర్ ఉల్ హఖ్ కాకర్ అచ్చంగా ఒక ఎన్నికైన ప్రధానమంత్రిలా సైన్యానికి అనుగుణంగా వ్యవహరించడం ఇందుకు తాజా ఉదాహరణ. ఇటీవల ‘మార్గల్లా డైలాగ్’లో పాల్గొని దీర్ఘకాలిక ప్రభుత్వాధినేత లాగా ‘ముసురుకుంటున్న భద్రతా సవాళ్లు’ అనే అంశంపై ప్రసంగించారు.చైనా ఎదుగుదలను అరికట్టే విషయంలో పశ్చిమ దేశాల విధానం విఫలమైందనీ, మరోవైపు, పాకిస్తాన్ ‘అంతిమ–ప్రత్యర్థి’ భారతదేశం ఈ సంఘర్షణను ప్రోత్సహించిందనీ ఆయన ఆరోపించారు. పాకిస్తాన్‌లో ఎవరూ ఆయన మాటలను విమర్శించడం లేదు. కారణం ఆయన సైన్యం ఏం కోరుకుంటున్నదో అదే చేస్తున్నారు కనుక!
పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రధాన మంత్రి అన్వర్ ఉల్ హఖ్ కాకర్, ఆ దేశంలో ఈ తాత్కాలిక పదవిని నిర్వహిస్తున్న ఎనిమిదో నేత. తాత్కాలిక ప్రధానమంత్రులూ, వారు సారథ్యం వహించే ప్రభుత్వాల పని ఏమిటంటే... ప్రభుత్వ యంత్రాంగంతో పనిచేయిస్తూ, రాజ్యాంగబద్ధంగా నిర్దేశించిన వ్యవధిలో ఎన్నికలను నిర్వహించడంలో ఎన్నికల కమిషన్‌కు సహాయం చేయడం!
తన పూర్వ ఆపద్ధర్మ ప్రధానుల మాదిరిగా కాకుండా, దేశ పాలనా వ్యవస్థకు చేరువగా ఉన్న కాకర్, ఎన్నుకోబడిన నాయకుడిగా తనను తాను ప్రదర్శించుకుంటున్నారు. అంతర్జాతీయ సమావేశాలకు హాజరవుతున్నారు. దీర్ఘకాలిక విధాన నిర్ణయాలు తీసుకుంటున్నారు. పైగా, చారిత్రక రాజకీయ ప్రక్రియలపై తన అవగాహనను వ్యక్తపరు స్తున్నారు.
ఆ విధంగా ఆయన తన పరిమితులను దాటుతున్నారు. కానీ పాకిస్తాన్‌లో ఎవరూ దానిని ఎత్తి చూపడం లేదు. ఇందుకు కారణం ఆయన సైన్యం ఏం కోరుకుంటున్నదో అదే చేస్తున్నారు కనుక. మే 9 నాటి అవాంతరాల తర్వాత, పాకిస్తానీ రాజకీయ నాయ కులు లేదా వ్యాఖ్యాతలెవరూ, ఆగ్రహంతో ఉన్న ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ అసిమ్ మునీర్‌ను నిజంగానే అతిక్రమించడానికి సాహసించడం లేదు.
ఇస్లామాబాద్ పాలసీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐపీఆర్‌ఐ) నవంబర్ 15న నిర్వహించిన ‘మార్గల్లా డైలాగ్’లో కాకర్ ప్రసంగించారు. ఈ సంభాషణ థీమ్ ఏమిటంటే, ‘ముసురుకుంటున్న భద్రతా సవాళ్లు’. ఐపీఆర్‌ఐ అనేది పాకిస్తాన్ ప్రధాన మంత్రి కార్యాలయానికి అనుబంధంగా ఉన్న జాతీయ భద్రతా విభాగం (ఎన్‌ఎస్‌డీ)కి చెందిన మేధావుల బృందం. భారతదేశంపై ముఖ్యంగా ఐపీఆర్‌ఐ నిర్వహించిన కార్యక్రమంలో కాకర్ చేసిన వ్యాఖ్యలు, భారతదేశంపై పాకిస్తాన్ అధికార వ్యవస్థ ప్రస్తుత ఆలోచనకు ప్రతిబింబం కావు.
అందువల్ల, భారత రాజకీయ, భద్రతా వర్గాలను పరిగణనలోకి తీసుకోవడంలో పాకిస్తాన్ తన పూర్వపు ప్రాధాన్యాన్ని ప్రస్తుతం కొద్దిగా కోల్పోయిన ప్పటికీ, కాకర్ వ్యాఖ్యలను విస్మరించలేము. ముఖ్యంగా పాకిస్తానీ దౌత్య వేత్తలు, భద్రతా విశ్లేషకులు ఇప్పుడు ఈ అభిప్రాయాలకు సంబంధించి పాశ్చాత్య దేశాలతో సహా వారి సంభాషణకర్తలను ఒత్తిడి చేయవలసి ఉంటుంది.
చైనా ఎదుగుదలను అరికట్టే విషయంలో పశ్చిమ దేశాల విధానం విఫలమైందని అంచనా వేస్తూ, చైనా–పాశ్చాత్య ఘర్షణ నుండి పాకి స్తాన్ ఇక ఎటువంటి ప్రయోజనాన్ని పొందలేదని కాకర్ నొక్కి చెప్పారు. మరోవైపు, పాకిస్తాన్ ‘అంతిమ–ప్రత్యర్థి’ భారతదేశం ఈ సంఘర్షణను ప్రోత్సహించిందని ఆయన అన్నారు. విస్తారమైన జనాభా కారణంగా చైనాను అదుపు చేయడంలో సహాయపడటానికి భారత్ తనను తాను ‘ముఖ్య పాత్రధారి’గా ప్రతిపాదించుకుంటోందని అన్నారు.
సాంకేతికత బదిలీలు, పెట్టుబడులు, ఇతర ‘ప్రయో జనాలు’ పొందేందుకు ‘భారతదేశం పశ్చిమార్ధ గోళంతో సరసా లాడుతోంది’ అని ఆయన వ్యాఖ>్యనించారు. పాశ్చాత్య దేశాలు జనాభా కారణంగా చైనాతో పోటీలో భారతదేశాన్ని ఆకర్షణీయంగా భావిస్తే, దాదాపు 1.4 బిలియన్ల జనాభా ఉన్న ఆఫ్రికా ఖండాన్ని లేదా యాభై కోట్ల మంది జనాభా ఉన్న ‘ది ఎకనామిక్ కో–ఆపరేషన్ ఆర్గనైజేషన్’ (ఈసీఓ)ను ఎందుకు పరిగణించలేదని కాకర్ ఆశ్చర్య పోయారు.
ఇక కశ్మీర్ విషయానికి వస్తే, కాకర్ 2019 ఆగస్టు నాటి రాజ్యాంగ మార్పుల విషయానికి వెళ్లలేదు. అయితే కశ్మీరీ ప్రజలకు చేసిన వాగ్దానాలను విస్మరించడంలో అంతర్జాతీయ సమాజానివి ‘ద్వంద్వ ప్రమాణాలు’ అని ఆయన ఆరోపించారు. కశ్మీర్ సమస్యకు పరి ష్కారం చూపడం భారత్ లేదా పాకిస్తాన్ పని కాదనీ, కశ్మీరీలు తమ భవిష్యత్తును ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా తామే నిర్ణయించుకోవాలనీ ఆయన అన్నారు. ఏ ‘వలసవాదం’ కూడా శాశ్వతంగా ఉనికిలో ఉండదని, ఎంత కాలం పట్టినా దాని అంతానికి కూడా ఒక రోజంటూ ఉంటుందని ఆయన తన చారిత్రక అవగాహనను చాటుకున్నారు. ఈ అన్ని అంశాల్లో, కాకర్ జమ్మూ కశ్మీర్ సమస్యపై పాకిస్తాన్ ప్రామాణిక వైఖరిని మాత్రమే పేర్కొన్నారు.
భారత్–చైనా ఆర్థిక, వాణిజ్య సంబంధాలపై పాక్‌కు ఎలాంటి అభ్యంతరం లేదని కాకర్ పేర్కొన్నారు. భారత్‌తో అనుసంధానతను విస్తరించడానికి లేదా వాణిజ్యం చేయడానికి పాకిస్తాన్ విముఖంగా లేదనీ, అయితే వివాదాస్పద అంశాలు ప్రతిబంధకంగా ఉన్నాయనీ ఆయన అభిప్రాయపడ్డారు. భారత్, పాకిస్తాన్‌ల వాణిజ్యం ‘గౌరవ ప్రదంగా’ జరగాలని, యాచించడం ఒక ఎంపిక కాదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. భారతదేశ ఆర్థిక వృద్ధిని గమనించిన కాకర్, భారత దేశం 8–10 శాతం వృద్ధి రేటును సాధించాలనుకుంటే, దానికి చౌకైన ఇంధన సరఫరా అవసరమన్నారు.
మధ్య ఆసియా నుండి వచ్చే సరఫరాలను భారతదేశం విస్మరించలేదని సూచించారు. ఆ దేశాలు భారత్‌కు చమురును పాకిస్తాన్ మీదుగా రవాణా చేయవలసి ఉంటుందని ఆయన చెప్పకుండా వదిలేశారు. ఇంధన భద్రత కోసం సెంట్రల్ ఆసియన్ ఏజెన్సీ లేదా సహజ వాయువును లేదా చమురును తీసుకు వచ్చే ఇరాన్ పైప్‌లైన్‌లు భారత్ పరిశీలనలో నిజంగా లేవని పాకిస్తాన్ విశ్లేషకులు ఇప్పటికీ అర్థం చేసుకోకపోవడమే విచిత్రం.
భారతదేశం అతి గర్వం అనే ‘హుబ్రిస్ వ్యాధి’తో బాధపడుతోందనీ, కానీ చరిత్ర ఎప్పుడూ వైఫల్యంతో ముగుస్తుందనీ కాకర్ ఆరోపించారు. ఇస్లామిక్ రాడికలిజంపై దృష్టి సారించిన అంతర్జాతీయ సమాజం హిందూత్వ ప్రమాదాలను ఎందుకు విస్మరించిందని కాకర్ ఆశ్చర్యపోతూ, కెనడియన్ అనుభవం చూపినట్లుగా, పశ్చిమార్ధగోళంలో ‘స్లీపర్ సెల్స్’ అని పేర్కొన్న భారతీయ డయాస్పోరాలోని ఆర్‌ఎస్‌ఎస్ మద్దతుదారులతో దానిని ముడిపెట్టారు. అయితే హిందూ మతంతో పాకిస్తాన్‌కు ఎలాంటి సమస్యా లేదని ఆయన పేర్కొన్నారు. కానీ జిన్నా, వాస్తవానికి చేసింది అదే మరి. అది విభజనపై ఆయన పట్టుబట్టడానికి దోహదపడింది. కాకర్ 1937 తదుపరి జిన్నా గురించి చదవాలి.
భారతదేశంపై కాకర్ చేసిన వ్యాఖ్యలు ‘అంతిమ–ప్రత్యర్థి’ పట్ల పాకిస్తాన్‌కు ఉన్న అంతులేని శత్రుత్వాన్నీ, భారతదేశం ఎదుగుదల పట్ల దాని అసూయనూ చూపుతున్నాయి. భారత్‌తో వ్యాపారం చేయడం వల్ల పాకిస్తాన్ ప్రయోజనాలను పొందుతుందని పాక్ అధి కారిక వ్యవస్థ గ్రహించిందనీ, అయితే ‘కశ్మీర్ ఉచ్చు’ దానిని హేతు బద్ధంగా వ్యవహరించకుండా నిరోధిస్తున్నదనీ కూడా ఆ వ్యాఖ్యలు నిరూపించాయి.
మూడు దశాబ్దాలు, అంతకంటే ఎక్కువ కాలం భార తదేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ప్రాయోజితం చేయడం అనేది పాకిస్తాన్‌లో భయంకరమైన ఆర్థిక పరిస్థితికి దారితీసింది. దీన్నుంచి బయటపడటానికి ఏకైక మార్గం ఏమిటంటే దాని ‘ప్రత్యర్థి’తో ఆర్థిక వాణిజ్య సంబంధాలను ఏర్పరచుకోవడమే! అయితే సైన్యం అలా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కాకర్ వ్యాఖ్యలు ఎటువంటి సూచనా చేయడం లేదు.
ఈలోగా, గతం నుండి పక్కకు వైదొలుగుతూ, కొంతమంది పాకి స్తాన్ మాజీ క్రికెట్ దిగ్గజాలు భారత క్రికెట్ గురించి మంచిగా మాట్లాడుతున్నారని గమనించడం కొత్తగా ఉంది. ముఖ్యంగా భారత దేశంలో క్రికెట్ ఆటను పెంపొందించే విధానాన్ని వారు ప్రశంసించారు. కానీ అలాంటి మనోభావాలు భారతదేశంపై పాక్ సైన్యం ఎత్తుగడల విషయంలో ఎటువంటి తేడానూ ప్రదర్శించవు.
వివేక్ కట్జూ
వ్యాసకర్త విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment