ఈ గాయం మానేదెన్నడు? | Malala Article On Taliban Take Over Afghanistan And Her Wound | Sakshi
Sakshi News home page

ఈ గాయం మానేదెన్నడు?

Published Fri, Aug 27 2021 12:49 AM | Last Updated on Fri, Aug 27 2021 12:50 AM

Malala Article On Taliban Take Over Afghanistan And Her Wound - Sakshi

బాలికల విద్యపై తీవ్రవాదుల నిషేధానికి వ్యతిరేకంగా నేను మాట్లాడుతూ వచ్చినందుకే నాపై ఒక పాకిస్తానీ తాలిబన్‌ కాల్పులు జరిపాడు. కానీ తొమ్మిదేళ్ల తర్వాత కూడా వైద్యులు నా శరీరంపై తాలిబన్‌ గాయానికి మరమ్మతు చేస్తూనే ఉన్నారు. ఆగస్టు 9న తాజా సర్జరీ కోసం ఆసుపత్రికి వెళ్లినప్పుడు అఫ్గాన్‌లో తొలి ప్రధాన నగరం కుందుజ్‌ తాలిబన్ల వశమైందని వార్త విన్నాను. ఆసుపత్రిలో ఉంటూనే ఒక రాష్ట్రం తర్వాత మరొక రాష్ట్రం తుపాకులు ధరించిన సాయుధుల కైవసం కావడాన్ని చూస్తూ గడిపాను. తొమ్మిదేళ్ల తర్వాత, ఒక్క బుల్లెట్‌ గాయం నుంచి ఇంకా కోలుకుంటూనే ఉన్నాను. నాలుగు దశాబ్దాలుగా అఫ్గానిస్తాన్‌ ప్రజలు లక్షలాది బుల్లెట్ల బారినపడి ఉంటారు. మేము పేర్లు మర్చిపోయిన లేక మాకెన్నటికీ తెలియని, సహాయం కోసం అలమటించి విఫలమైన అలాంటి వారి గురించి తల్చుకున్నప్పుడల్లా నా హృదయం బద్దలవుతుంది.

రెండు వారాల క్రితం తాలిబన్ల ఆధిపత్యంలోకి వెళ్లిన అఫ్గానిస్తాన్‌ నుంచి అమెరికా సైనికబలగాలు ఉపసంహరించుకుంటున్న సమయంలో బోస్టన్‌లోని ఆసుపత్రిలో పడుకుని ఉన్నాను. తాలిబన్లు నా దేహానికి చేసిన గాయానికి వైద్యులు మరమ్మతు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు నాకు ఆరో శస్త్రచికిత్స జరిగింది.  

2012 అక్టోబర్‌లో, పాకిస్తానీ తాలిబన్‌ సభ్యుడొకరు మా పాఠశాల బస్సులోకి ఎక్కి నా ఎడమ నుదుటిలోకి ఒక బుల్లెట్‌ దింపాడు. ఆ బుల్లెట్‌ నా ఎడమకన్నును, పుర్రెని, మెదడును చిన్నాభిన్నం చేసింది. నా ముఖ నరాన్ని, నా కర్ణభేరిని ఛిద్రం చేసింది. నా దవడ కీళ్లను విరగ్గొట్టింది. పాకిస్తాన్‌లోని పెషావర్‌లో నాకు అత్యవసర శస్త్రచికిత్సలు చేశారు. ఛిద్రమైన నా ఎడమ పుర్రె భాగాన్ని వైద్యులు తొలగించారు. వారి సత్వర స్పందన నా జీవితాన్ని కాపాడింది. కానీ త్వరలోనే నా అవయవాలు పనిచేయడం మానేశాయి. దాంతో పాక్‌ రాజధాని ఇస్లామాబాద్‌ నగరానికి నన్ను విమానంలో తరలించారు. ఒక వారం తర్వాత నాకు మరింత విస్తృతమైన సంరక్షణ కావాలని, మెరుగైన చికిత్స కోసం నా స్వదేశం నుంచి బయటి దేశాలకు నేను వెళ్లాల్సి ఉంటుందని వైద్యులు నిర్ణయించారు. 

ఆ సమయంలో నేను కోమాలో ఉన్నాను. నాపై కాల్పులు జరిగిన రోజునుంచి బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్‌ నగరంలోని క్వీన్‌ ఎలిజబెత్‌ ఆసుపత్రిలో నాకు మెలకువ వచ్చేంతవరకు ఏం జరిగిందో నాకు తెలీదు. నేను కళ్లు తెరిచేటప్పటికి బతికే ఉన్నానని గుర్తించాను. కానీ నేను ఎక్కడున్నానో.. నా చుట్టూ ఇంగ్లిష్‌ మాట్లాడుతున్న అపరి చితులు ఎందుకు గుమికూడి ఉన్నారో తెలీదు. అప్పుడు కూడా నాకు తీవ్రమైన తలనొప్పి ఉండింది. నా చూపు మందగించిపోయింది. నా మెడలోని ట్యూబ్‌ వల్ల మాట్లాడటం కూడా కష్టమైపోయింది. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత కూడా నేను మాట్లాడలేకపోయాను. కానీ ఒక నోట్‌ పుస్తకంలో జరిగినదంతా రాయడం ప్రారంభించి నా గదిలోకి వచ్చిన ప్రతి ఒక్కరికీ దాన్ని చూపించసాగాను. నాకు ఏం జరిగింది, మా నాన్న ఎక్కడున్నారు, ఈ చికిత్సకు అయ్యే ఖర్చు ఎవరు చెల్లిస్తారు. మావద్ద డబ్బు లేదు ఇలా ప్రశ్నల వర్షం నన్ను ముంచెత్తింది. 

నా దేహంలో చాలా భాగాన్ని నేను కదిలించలేనని త్వరలోనే గుర్తించాను. ఇది తాత్కాలికమేనని వైద్యులు నమ్మకంగా చెప్పారు. నా పొత్తికడుపును స్పర్శించాను. చాలా గట్టిగా తగిలింది. నా పుర్రె ఎముకను పాకిస్తానీ వైద్యులు తొలగించినప్పుడు దాన్ని నా పొట్టలో ఉంచి కుట్టేశారని ఆసుపత్రి వైద్యులు చెప్పారు. దాన్ని నా తలభాగంలో తిరిగి అతికించడానికి నాకు మరొక శస్త్రచికిత్స చేయాల్సి ఉందట. అయితే నా పుర్రె బోను ఉన్న చోట ఒక టైటానియం ప్లేట్‌ని అమర్చాలని బ్రిటన్‌ వైద్యులు ఆ తర్వాత నిర్ణయించారు. వారు నా పొట్టనుంచి నా పుర్రె ఎముకను తీసివేశారు. ఈరోజు అది నా పుస్తకాల షెల్ఫ్‌లో కూర్చుని ఉంది.

నా కుటుంబం నన్ను చూడటానికి బ్రిటన్‌ వచ్చినప్పుడు, నేను వ్యాయామ చికిత్స, పునరావాస చికిత్స మొదలుపెట్టాను. మెల్లగా నడవడం, బుల్లి బుల్లి అడుగులేయడం ప్రారంభించాను. అలాగే పసిపిల్లలాగే మాట్లాడసాగాను. నాకు ఇది పునర్జన్మ అనిపించింది. నన్ను బ్రిటన్‌ తీసుకొచ్చిన ఆరువారాల తర్వాత నా ముఖ పక్షవాతాన్ని నయం చేయాలని వైద్యులు నిర్ణయించారు. ముఖ నరానికి సర్జరీ జరిగి, క్రమం తప్పకుండా ముఖానికి మసాజ్‌ చేయించుకున్న కొన్ని నెలల అనంతరం, నా ముఖ సౌష్టవం, దాని కదలికలు కాస్త మెరుగుపడ్డాయి. 

తర్వాత్తర్వాత అద్దంలో నా ముఖం చూసుకోవడం, వీడియోలో నన్ను నేను పరిశీలించుకోవడం మానేశాను. వాస్తవాన్ని అంగీకరించి, సంతోషంగా గడపసాగాను. మరోవైపున నా తల్లిదండ్రులు తన కుమార్తె కోల్పోయిన ప్రతిదాన్ని నయం చేయించాలని అనుకున్నారు. దాంతో బోస్టన్‌లోని మాస్‌ ఐ అండ్‌ ఇయర్‌ ఆసుపత్రి సర్జన్లను మేము కలుసుకున్నాము. తర్వాత నాకు రెండు సంక్లిష్ట సర్జరీలు అవసరమయ్యాయి. 2018లో వైద్యులు మొదటగా నా కాలిపిక్కలోంచి ఒక నరం తీసి దాన్ని నా ముఖంలో కుడినుంచి ఎడమవైపునకు చొప్పించారు. 2019లో వారు నా తొడ భాగం నుంచి కణజాలాన్ని తీసుకుని నా ముఖం ఎడమభాగాన దాన్ని అమర్చారు. నరం ఈ కణజాలానికి అతుక్కుంటుందని వారు భావించారు. ఎట్టకేలకు నా ముఖంలో మరింత కదలిక వచ్చింది. అయితే ఈ రెండో ప్రక్రియ నా బుగ్గలు, దవడ చుట్టూ అదనపు కొవ్వును, శోషరసాన్ని చేర్చింది. దీంతో నాకు మరో సర్జరీ చేయాల్సి ఉందని వైద్యులు చెప్పారు.

బోస్టన్‌లో 2021 ఆగస్టు 9న ఉదయం 5 గంటలకే నిద్రలేచి తాజా సర్జరీ కోసం ఆసుపత్రికి వెళ్లాను. అప్పుడే తాలిబన్లు కుందుజ్‌ని పట్టుకున్నారనే వార్త చూశాను. అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల వశమైన తొలి ప్రధాన నగరం కుందుజ్‌. ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే నా తలచుట్టూ ఐస్‌ ప్యాక్‌లు, బ్యాండేజీ కట్టి ఉండగా, ఒక రాష్ట్రం తర్వాత మరొక రాష్ట్రం బుల్లెట్లు నింపిన తుపాకులు ధరించిన సాయుధుల కైవశం కావడాన్ని చూస్తూ గడిపాను.

నేను ఆసుపత్రి బెడ్‌ మీద లేచి కూర్చోగలిగిన వెంటనే ప్రపంచ దేశాధినేతలకు ఫోన్‌ కాల్స్‌ చేస్తూ, వారికి ఉత్తరాలు రాస్తూ, అఫ్గానిస్తాన్‌లోని మహిళా హక్కుల కార్యకర్తలతో మాట్లాడుతూ గడిపాను. గత రెండు వారాల్లో, చాలామంది మహిళా హక్కుల కార్యకర్తలకు సహాయం చేసి, వారి కుటుంబాలు సురక్షిత స్థలానికి చేరుకోగలిగేలా చేయగలిగాము. కానీ వారిలో ప్రతి ఒక్కరినీ మేము కాపాడలేమని నాకు తెలుసు. తాలిబన్లు నాపై కాల్పులు జరిపినప్పుడు, పాకిస్తాన్‌ లోని జర్నలిస్టులకు, కొద్దిమంది అంతర్జాతీయ మీడియా సంస్థలకు చెందిన పాత్రికేయులకు నా పేరు తెలుసు. వారు నాపై దాడి గురించి వార్తలు రాశారు. ‘నేను మలాలా’ అనే సైన్‌ బోర్డులను ప్రపంచమంతటా ప్రజలు గుంపులుగుంపులుగా పట్టుకుని ఉండకపోతే, వేలాది మంది నాకు మద్దతుగా ఉత్తరాలు పంపి మద్దతు ఇవ్వకపోయి ఉంటే, నాకోసం ప్రార్థనలు చేసి, కథనాలు రాయకపోయి ఉంటే, నాకు వైద్య చికిత్స కూడా అంది ఉండేది కాదు. అంతకుమించి నేను జీవించి ఉండేదాన్ని కాను. 

తొమ్మిదేళ్ల తర్వాత, నేను ఒక్క బుల్లెట్‌ గాయం నుంచి ఇప్పటికీ కోలుకుంటూనే ఉన్నాను. నాలుగు దశాబ్దాలుగా అఫ్గానిస్తాన్‌ ప్రజలు లక్షలాది బుల్లెట్ల బారిన పడి ఉంటారు. మేము పేర్లు మర్చిపోయిన లేక మాకెన్నటికీ తెలియని, సహాయం కోసం అలమటించి విఫలమైన అలాంటి వారి గురించి తల్చుకున్నప్పుడల్లా నా హృదయం బద్దలవుతుంది. నా తాజా శస్త్రచికిత్స వల్ల అయిన గాయాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. నా దేహం నుంచి బుల్లెట్‌ తొలగించడానికి డాక్టర్లు నా వీపుభాగంలో చేసిన గాయం మచ్చ అలాగే ఉంది. 

కొద్ది రోజుల క్రితం నా మంచి స్నేహితురాలికి కాల్‌ చేశాను. ఆరోజు నాపై దాడి జరిగినప్పుడు బస్సులో నా పక్కనే కూర్చున్న అమ్మాయి తను. ఆరోజు ఏం జరిగిందని ఆమెను తిరిగి అడిగాను. ‘నేను గట్టిగా కేకలు పెట్టానా.. నేను పారిపోవడానికి ప్రయత్నిం చానా?’ అని ఆమెను అడిగాను. ‘లేదు’ అని చెప్పిందామె. ‘నువ్వు అప్పటికీ మౌనంగానే ఉన్నావు. నీ పేరును పిలిచిన ఆ తాలిబన్‌ ముఖం కేసి చూడసాగావు. నా చేతిని గట్టిగా పట్టుకున్నావు. ఆ నొప్పి రోజుల తరబడి నన్ను వేధించింది. అతడు నిన్ను గుర్తుపట్టి వెంటనే కాల్పులు మొదలెట్టాడు. నీ చేతులతో నీ ముఖం కప్పుకున్నావు. కిందికి వంగడానికి ప్రయత్నించావు. ఒక క్షణకాలంలోనే నా ఒడిలో కుప్పగూలిపోయావు’ అని గుర్తు చేసిందామె. నా ఇద్దరు క్లాస్‌మేట్స్‌ షాజియా, కైనత్‌లకు కూడా చేతులపై, భుజాలపై బుల్లెట్లు దిగాయి. తెల్లగా ఉన్న స్కూల్‌ బస్సు రక్తంతో ఎర్రబడింది. ఒక బుల్లెట్‌ గాయం నుంచి, అనేక శస్త్రచికిత్సల నుంచి నా దేహానికి మచ్చలు పడ్డాయి. కానీ ఆరోజు ఏం జరిగిందీ నాకు తెలీదు. తొమ్మిదేళ్ల తర్వాత కూడా నా మంచి స్నేహితురాలు ఆ సంఘటనపై దుస్వప్నాలు కంటూనే ఉంది.
మలాలా, బాలికా హక్కుల కార్యకర్త,
నోబెల్‌ బహుమతి గ్రహీత 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement