Malala Yousufzai
-
ఈ గాయం మానేదెన్నడు?
బాలికల విద్యపై తీవ్రవాదుల నిషేధానికి వ్యతిరేకంగా నేను మాట్లాడుతూ వచ్చినందుకే నాపై ఒక పాకిస్తానీ తాలిబన్ కాల్పులు జరిపాడు. కానీ తొమ్మిదేళ్ల తర్వాత కూడా వైద్యులు నా శరీరంపై తాలిబన్ గాయానికి మరమ్మతు చేస్తూనే ఉన్నారు. ఆగస్టు 9న తాజా సర్జరీ కోసం ఆసుపత్రికి వెళ్లినప్పుడు అఫ్గాన్‌లో తొలి ప్రధాన నగరం కుందుజ్ తాలిబన్ల వశమైందని వార్త విన్నాను. ఆసుపత్రిలో ఉంటూనే ఒక రాష్ట్రం తర్వాత మరొక రాష్ట్రం తుపాకులు ధరించిన సాయుధుల కైవసం కావడాన్ని చూస్తూ గడిపాను. తొమ్మిదేళ్ల తర్వాత, ఒక్క బుల్లెట్ గాయం నుంచి ఇంకా కోలుకుంటూనే ఉన్నాను. నాలుగు దశాబ్దాలుగా అఫ్గానిస్తాన్ ప్రజలు లక్షలాది బుల్లెట్ల బారినపడి ఉంటారు. మేము పేర్లు మర్చిపోయిన లేక మాకెన్నటికీ తెలియని, సహాయం కోసం అలమటించి విఫలమైన అలాంటి వారి గురించి తల్చుకున్నప్పుడల్లా నా హృదయం బద్దలవుతుంది. రెండు వారాల క్రితం తాలిబన్ల ఆధిపత్యంలోకి వెళ్లిన అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా సైనికబలగాలు ఉపసంహరించుకుంటున్న సమయంలో బోస్టన్లోని ఆసుపత్రిలో పడుకుని ఉన్నాను. తాలిబన్లు నా దేహానికి చేసిన గాయానికి వైద్యులు మరమ్మతు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు నాకు ఆరో శస్త్రచికిత్స జరిగింది. 2012 అక్టోబర్‌లో, పాకిస్తానీ తాలిబన్ సభ్యుడొకరు మా పాఠశాల బస్సులోకి ఎక్కి నా ఎడమ నుదుటిలోకి ఒక బుల్లెట్ దింపాడు. ఆ బుల్లెట్ నా ఎడమకన్నును, పుర్రెని, మెదడును చిన్నాభిన్నం చేసింది. నా ముఖ నరాన్ని, నా కర్ణభేరిని ఛిద్రం చేసింది. నా దవడ కీళ్లను విరగ్గొట్టింది. పాకిస్తాన్‌లోని పెషావర్‌లో నాకు అత్యవసర శస్త్రచికిత్సలు చేశారు. ఛిద్రమైన నా ఎడమ పుర్రె భాగాన్ని వైద్యులు తొలగించారు. వారి సత్వర స్పందన నా జీవితాన్ని కాపాడింది. కానీ త్వరలోనే నా అవయవాలు పనిచేయడం మానేశాయి. దాంతో పాక్ రాజధాని ఇస్లామాబాద్ నగరానికి నన్ను విమానంలో తరలించారు. ఒక వారం తర్వాత నాకు మరింత విస్తృతమైన సంరక్షణ కావాలని, మెరుగైన చికిత్స కోసం నా స్వదేశం నుంచి బయటి దేశాలకు నేను వెళ్లాల్సి ఉంటుందని వైద్యులు నిర్ణయించారు. ఆ సమయంలో నేను కోమాలో ఉన్నాను. నాపై కాల్పులు జరిగిన రోజునుంచి బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్ నగరంలోని క్వీన్ ఎలిజబెత్ ఆసుపత్రిలో నాకు మెలకువ వచ్చేంతవరకు ఏం జరిగిందో నాకు తెలీదు. నేను కళ్లు తెరిచేటప్పటికి బతికే ఉన్నానని గుర్తించాను. కానీ నేను ఎక్కడున్నానో.. నా చుట్టూ ఇంగ్లిష్ మాట్లాడుతున్న అపరి చితులు ఎందుకు గుమికూడి ఉన్నారో తెలీదు. అప్పుడు కూడా నాకు తీవ్రమైన తలనొప్పి ఉండింది. నా చూపు మందగించిపోయింది. నా మెడలోని ట్యూబ్ వల్ల మాట్లాడటం కూడా కష్టమైపోయింది. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత కూడా నేను మాట్లాడలేకపోయాను. కానీ ఒక నోట్ పుస్తకంలో జరిగినదంతా రాయడం ప్రారంభించి నా గదిలోకి వచ్చిన ప్రతి ఒక్కరికీ దాన్ని చూపించసాగాను. నాకు ఏం జరిగింది, మా నాన్న ఎక్కడున్నారు, ఈ చికిత్సకు అయ్యే ఖర్చు ఎవరు చెల్లిస్తారు. మావద్ద డబ్బు లేదు ఇలా ప్రశ్నల వర్షం నన్ను ముంచెత్తింది. నా దేహంలో చాలా భాగాన్ని నేను కదిలించలేనని త్వరలోనే గుర్తించాను. ఇది తాత్కాలికమేనని వైద్యులు నమ్మకంగా చెప్పారు. నా పొత్తికడుపును స్పర్శించాను. చాలా గట్టిగా తగిలింది. నా పుర్రె ఎముకను పాకిస్తానీ వైద్యులు తొలగించినప్పుడు దాన్ని నా పొట్టలో ఉంచి కుట్టేశారని ఆసుపత్రి వైద్యులు చెప్పారు. దాన్ని నా తలభాగంలో తిరిగి అతికించడానికి నాకు మరొక శస్త్రచికిత్స చేయాల్సి ఉందట. అయితే నా పుర్రె బోను ఉన్న చోట ఒక టైటానియం ప్లేట్‌ని అమర్చాలని బ్రిటన్ వైద్యులు ఆ తర్వాత నిర్ణయించారు. వారు నా పొట్టనుంచి నా పుర్రె ఎముకను తీసివేశారు. ఈరోజు అది నా పుస్తకాల షెల్ఫ్‌లో కూర్చుని ఉంది. నా కుటుంబం నన్ను చూడటానికి బ్రిటన్ వచ్చినప్పుడు, నేను వ్యాయామ చికిత్స, పునరావాస చికిత్స మొదలుపెట్టాను. మెల్లగా నడవడం, బుల్లి బుల్లి అడుగులేయడం ప్రారంభించాను. అలాగే పసిపిల్లలాగే మాట్లాడసాగాను. నాకు ఇది పునర్జన్మ అనిపించింది. నన్ను బ్రిటన్ తీసుకొచ్చిన ఆరువారాల తర్వాత నా ముఖ పక్షవాతాన్ని నయం చేయాలని వైద్యులు నిర్ణయించారు. ముఖ నరానికి సర్జరీ జరిగి, క్రమం తప్పకుండా ముఖానికి మసాజ్ చేయించుకున్న కొన్ని నెలల అనంతరం, నా ముఖ సౌష్టవం, దాని కదలికలు కాస్త మెరుగుపడ్డాయి. తర్వాత్తర్వాత అద్దంలో నా ముఖం చూసుకోవడం, వీడియోలో నన్ను నేను పరిశీలించుకోవడం మానేశాను. వాస్తవాన్ని అంగీకరించి, సంతోషంగా గడపసాగాను. మరోవైపున నా తల్లిదండ్రులు తన కుమార్తె కోల్పోయిన ప్రతిదాన్ని నయం చేయించాలని అనుకున్నారు. దాంతో బోస్టన్లోని మాస్ ఐ అండ్ ఇయర్ ఆసుపత్రి సర్జన్లను మేము కలుసుకున్నాము. తర్వాత నాకు రెండు సంక్లిష్ట సర్జరీలు అవసరమయ్యాయి. 2018లో వైద్యులు మొదటగా నా కాలిపిక్కలోంచి ఒక నరం తీసి దాన్ని నా ముఖంలో కుడినుంచి ఎడమవైపునకు చొప్పించారు. 2019లో వారు నా తొడ భాగం నుంచి కణజాలాన్ని తీసుకుని నా ముఖం ఎడమభాగాన దాన్ని అమర్చారు. నరం ఈ కణజాలానికి అతుక్కుంటుందని వారు భావించారు. ఎట్టకేలకు నా ముఖంలో మరింత కదలిక వచ్చింది. అయితే ఈ రెండో ప్రక్రియ నా బుగ్గలు, దవడ చుట్టూ అదనపు కొవ్వును, శోషరసాన్ని చేర్చింది. దీంతో నాకు మరో సర్జరీ చేయాల్సి ఉందని వైద్యులు చెప్పారు. బోస్టన్‌లో 2021 ఆగస్టు 9న ఉదయం 5 గంటలకే నిద్రలేచి తాజా సర్జరీ కోసం ఆసుపత్రికి వెళ్లాను. అప్పుడే తాలిబన్లు కుందుజ్‌ని పట్టుకున్నారనే వార్త చూశాను. అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల వశమైన తొలి ప్రధాన నగరం కుందుజ్. ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే నా తలచుట్టూ ఐస్ ప్యాక్‌లు, బ్యాండేజీ కట్టి ఉండగా, ఒక రాష్ట్రం తర్వాత మరొక రాష్ట్రం బుల్లెట్లు నింపిన తుపాకులు ధరించిన సాయుధుల కైవశం కావడాన్ని చూస్తూ గడిపాను. నేను ఆసుపత్రి బెడ్ మీద లేచి కూర్చోగలిగిన వెంటనే ప్రపంచ దేశాధినేతలకు ఫోన్ కాల్స్ చేస్తూ, వారికి ఉత్తరాలు రాస్తూ, అఫ్గానిస్తాన్‌లోని మహిళా హక్కుల కార్యకర్తలతో మాట్లాడుతూ గడిపాను. గత రెండు వారాల్లో, చాలామంది మహిళా హక్కుల కార్యకర్తలకు సహాయం చేసి, వారి కుటుంబాలు సురక్షిత స్థలానికి చేరుకోగలిగేలా చేయగలిగాము. కానీ వారిలో ప్రతి ఒక్కరినీ మేము కాపాడలేమని నాకు తెలుసు. తాలిబన్లు నాపై కాల్పులు జరిపినప్పుడు, పాకిస్తాన్ లోని జర్నలిస్టులకు, కొద్దిమంది అంతర్జాతీయ మీడియా సంస్థలకు చెందిన పాత్రికేయులకు నా పేరు తెలుసు. వారు నాపై దాడి గురించి వార్తలు రాశారు. ‘నేను మలాలా’ అనే సైన్ బోర్డులను ప్రపంచమంతటా ప్రజలు గుంపులుగుంపులుగా పట్టుకుని ఉండకపోతే, వేలాది మంది నాకు మద్దతుగా ఉత్తరాలు పంపి మద్దతు ఇవ్వకపోయి ఉంటే, నాకోసం ప్రార్థనలు చేసి, కథనాలు రాయకపోయి ఉంటే, నాకు వైద్య చికిత్స కూడా అంది ఉండేది కాదు. అంతకుమించి నేను జీవించి ఉండేదాన్ని కాను. తొమ్మిదేళ్ల తర్వాత, నేను ఒక్క బుల్లెట్ గాయం నుంచి ఇప్పటికీ కోలుకుంటూనే ఉన్నాను. నాలుగు దశాబ్దాలుగా అఫ్గానిస్తాన్ ప్రజలు లక్షలాది బుల్లెట్ల బారిన పడి ఉంటారు. మేము పేర్లు మర్చిపోయిన లేక మాకెన్నటికీ తెలియని, సహాయం కోసం అలమటించి విఫలమైన అలాంటి వారి గురించి తల్చుకున్నప్పుడల్లా నా హృదయం బద్దలవుతుంది. నా తాజా శస్త్రచికిత్స వల్ల అయిన గాయాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. నా దేహం నుంచి బుల్లెట్ తొలగించడానికి డాక్టర్లు నా వీపుభాగంలో చేసిన గాయం మచ్చ అలాగే ఉంది. కొద్ది రోజుల క్రితం నా మంచి స్నేహితురాలికి కాల్ చేశాను. ఆరోజు నాపై దాడి జరిగినప్పుడు బస్సులో నా పక్కనే కూర్చున్న అమ్మాయి తను. ఆరోజు ఏం జరిగిందని ఆమెను తిరిగి అడిగాను. ‘నేను గట్టిగా కేకలు పెట్టానా.. నేను పారిపోవడానికి ప్రయత్నిం చానా?’ అని ఆమెను అడిగాను. ‘లేదు’ అని చెప్పిందామె. ‘నువ్వు అప్పటికీ మౌనంగానే ఉన్నావు. నీ పేరును పిలిచిన ఆ తాలిబన్ ముఖం కేసి చూడసాగావు. నా చేతిని గట్టిగా పట్టుకున్నావు. ఆ నొప్పి రోజుల తరబడి నన్ను వేధించింది. అతడు నిన్ను గుర్తుపట్టి వెంటనే కాల్పులు మొదలెట్టాడు. నీ చేతులతో నీ ముఖం కప్పుకున్నావు. కిందికి వంగడానికి ప్రయత్నించావు. ఒక క్షణకాలంలోనే నా ఒడిలో కుప్పగూలిపోయావు’ అని గుర్తు చేసిందామె. నా ఇద్దరు క్లాస్మేట్స్ షాజియా, కైనత్‌లకు కూడా చేతులపై, భుజాలపై బుల్లెట్లు దిగాయి. తెల్లగా ఉన్న స్కూల్ బస్సు రక్తంతో ఎర్రబడింది. ఒక బుల్లెట్ గాయం నుంచి, అనేక శస్త్రచికిత్సల నుంచి నా దేహానికి మచ్చలు పడ్డాయి. కానీ ఆరోజు ఏం జరిగిందీ నాకు తెలీదు. తొమ్మిదేళ్ల తర్వాత కూడా నా మంచి స్నేహితురాలు ఆ సంఘటనపై దుస్వప్నాలు కంటూనే ఉంది. మలాలా, బాలికా హక్కుల కార్యకర్త, నోబెల్ బహుమతి గ్రహీత -
అఫ్గన్‌లో మహిళల రక్షణపై మలాలా ఆందోళన
లండన్: అఫ్గనిస్తాన్‌లో తాలిబన్లు అధికారం చేజి క్కించు కోవడంపై పాకి స్తానీ హక్కుల కార్యకర్త, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్(24) ఆందోళన వ్యక్తం చేశారు. ఆ దేశంలోని మహిళలు, మైనారిటీలు హక్కుల కార్యకర్తల రక్షణపై తీవ్ర ఆందోళన చెందుతు న్నట్లు ఆమె తెలిపారు. ఆదివారం ట్విట్టర్లో ఆమె..‘అఫ్గనిస్తాన్‌ను తాలిబన్లు సంపూర్ణంగా స్వాధీనం చేసుకోవడం చూసి షాక్‌కు గురయ్యాను. ఈ పరిస్థితుల్లో అక్కడి మహిళలు, మైనారిటీలు, హక్కుల కార్యకర్తల రక్షణపై తీవ్ర ఆందోళన చెందుతున్నాను’ అన్నారు. ‘ప్రపంచదేశాలు జోక్యం చేసుకుని అక్కడ తక్షణమే కాల్పుల విరమణ అమలయ్యేలా చూడాలి. శరణార్ధులు, పౌరులకు భద్రత కల్పించి, మానవతాసాయం అందజేయాలి’ అని ఆమె కోరారు. బాలికలు చదువుకోవాలంటూ పాక్‌లోని స్వాత్ ప్రాంతం లో ఉద్యమం చేపట్టిన మలాలాపై 2012లో తాలి బన్లు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆమె పాకిస్తాన్లో, అనంతరం యూకేలో చికిత్స పొందారు. ప్రస్తుతం యూకేలోనే ఉంటున్నారు. ఆమె పాకిస్తాన్ వస్తే చంపేస్తామంటూ తాలిబన్లు హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. అఫ్గాన్‌లో స్థిరత్వం ఏర్పడాలి: రైజీ కాబూల్: తాలిబన్ వశమైన అఫ్గనిస్తాన్‌లో స్థిరమైన పాలన ఏర్పడాలంటూ ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీమ్ రైజీ ఆకాంక్షించారు. అఫ్గన్‌లో స్థిరత్వం ఏర్పడేందుకు ఇరాన్ సహకరిస్తుందని, అదే తమ ప్రధమ ప్రాధాన్యమని పేర్కొన్నారు. అఫ్గన్ తమకు సోదరుడి వంటిదన్నారు. అమెరికన్ ఆర్మీ వైఫల్యం కావడంతోనే అఫ్గాన్‌ను విడిచి వెళ్లిందని వ్యాఖ్యానించారు. అమెరికా బలగాల నిష్క్రమణ వల్ల అఫ్గన్‌కు తిరిగి జీవం పోసేందుకు, స్థిరమైన శాంతిని నెలకొల్పేందుకు అవకాశం దక్కిందన్నారు. అధికారికంగా 8 లక్షల మంది, అనధికారికంగా 20 లక్షల మంది అఫ్గన్లు ఇరాన్లో శరణార్థులుగా ఉన్నారు. రక్షణ బాధ్యత అఫ్గన్లదే అమెరికా భద్రతా సలహాదారు సలివన్ వాషింగ్టన్/కాబూల్: అఫ్గనిస్తాన్‌ను తాలిబన్లు స్వల్ప వ్యవధిలోనే చేజిక్కించుకోవడానికి ఆ దేశ సైనిక బలగాల వైఫల్యమే కారణమని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివన్ నిందించారు. అఫ్గన్‌లో మూడో దశాబ్ది సంఘర్షణలోకి అమెరికా అడుగు పెట్టాలని అధ్యక్షుడు జో బైడెన్ కోరుకోవడం లేదని తెలిపారు. రెండు దశాబ్దాల పాటు అఫ్గన్ రక్షణ కోసం అమెరికా వందల కోట్ల డాలర్లు వెచ్చించిందని, అక్కడి సైనికులకు శిక్షణ ఇచ్చిందని గుర్తుచేశారు. ఇకపై స్వదేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అఫ్గన్ సైన్యానిది, అక్కడి ప్రజలదేనని తేల్చిచెప్పారు. రాజధాని కాబూల్ విషయంలో తాలిబన్లతో పోరాటం వద్దని అఫ్గన్ సైనికులే నిర్ణయించుకున్నారని, అందులో తమ ప్రమేయం లేదని స్పష్టం చేశారు. తాలిబన్లపై సొంతంగా పోరాటం సాగించడానికి అఫ్గన్ సైన్యం సిద్ధంగా లేదన్నారు. కాబూల్‌లో పరిణామాలు కలచి వేస్తున్నప్పటికీ బైడెన్ నిర్ణయంలో మార్పు ఉండబోదని వివరించారు. -
వివాహం అవసరమా.. మలాలాపై విమర్శలు
లండన్: తమ ఆంక్షలు లెక్కచేయకుండా చదువుకుంటుందని.. 13 ఏళ్ల వయసులో తాలిబన్ల తూటాలకు బలయ్యింది. అయినా బెదరకుండా ఆడపిల్లల చదువు కోసం కృషి చేస్తూ.. నోబెల్ బహుమతి అందుకుంది పాకిస్తాన్‌కు చెందిన మలాలా యూసఫ్ జాయ్. తాజాగా మరోసారి అరుదైన గౌరవం అందుకుంది. ప్రముఖ బ్రిటీష్ మ్యాగ్జైన్ వోగ్ తన జూలై ఎడిషన్ కవర్ మీద మలాలా ఫోటో ప్రచురించింది. ఈ సందర్భంగా మలాలా రాజకీయాలు, సంస్కృతితో పాటు ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు అంశాలను పంచుకుంది. ఈ క్రమంలో వివాహం గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట్లో పెద్ద చర్చకు దారి తీశాయి. వివాహం గురించి మలాలా చేసిన వ్యాఖ్యలపై నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మలాలా మాట్లాడుతూ.. ‘‘నా తల్లిదండ్రులు నన్ను పెళ్లికుమార్తెగా చూడాలని ఆశపడుతున్నారు. అలానే చాలా మంది తమ సంబంధాల కథనాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. వీటన్నింటిని చూస్తే నాకు చాలా ఆందోళన కలుగుతుంది. అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలో నాకు అర్థం కావడం లేదు. మన జీవితంలో ఒక భాగస్వామి, తోడు కావాలంటే.. పెళ్లి పత్రాలపై ఎందుకు సంతకాలు చేయాలి.. కేవలం భాగస్వాములుగా ఎందుకు ఉండలేరు’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. Sad to know about Malala;s thoughts.😢#MalalaOnMarriage pic.twitter.com/vLUujigsW5 — S A M R E E N 🍁 (@SamreeenSohail) June 3, 2021 మలాలా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘‘నువ్వు విదేశీ వ్యక్తివి అయ్యావ్.. అందుకే ఇలా మాట్లాడుతున్నావ్’’.. ‘‘నువ్వు ఇలాంటి బాధ్యతారహిత్యమైన వ్యాఖ్యలతో యువతను పెడదోవ పట్టిస్తున్నావ్.. ఇస్లాం సంస్కృతిని భ్రష్టుపట్టిస్తున్నావ్’’.. ‘‘నీ వ్యాఖ్యాలు విచారకరం.. ఈ విషయంలో నీకు మద్దతు తెలపడం లేదు’’ అంటూ విమర్శిస్తున్నారు నెటిజనులు. చదవండి: ‘మలాల.. ఈ సారి తప్పించుకోలేవ్’ -
ఆర్టికల్ 370 రద్దు: స్పందించిన మలాలా
కశ్మీర్: జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడంపై నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్ జాయ్ స్పందించారు. కశ్మీర్‌లోని మహిళలు, చిన్నారుల రక్షణకు దక్షిణాసియా ప్రజలు, నాయకులు కట్టుబడి ఉండాలని ఈ సందర్భంగా మలాలా పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ లేఖను ట్వీట్ చేశారు. ‘నా చిన్నతనం నుంచి ఇంకా చెప్పాలంటే.. నా తల్లిదండ్రులు.. వారి తల్లిదండ్రులు చిన్నగా ఉన్నప్పటి నుంచి కశ్మీర్లో సంక్షోభం నెలకొంది. గడిచిన ఏడు దశాబ్దాలుగా కశ్మీర్లో పిల్లలు హింస మధ్యే పెరుగుతున్నారు. నరకం చూస్తున్నారు. దక్షిణాసియా నాకు సొంతిల్లుతో సమానం. కాబట్టి కశ్మీర్ అంశంలో నా బాధ్యతను మర్చిపోలేను. దక్షిణాసియాలో కశ్మీర్‌తో సహా 1.8బిలియన్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. మనం భిన్న సంస్కృతులు, ఆచారాలు, ఆహారపు అలవాట్లు, భాషలు, సంప్రదాయాలు పాటిస్తున్నాం. అయినంత మాత్రాన నిరంతరం గొడవపడుతూ.. ఒకరినొకరం హింసించుకుంటూ బతకాల్సిన అవసరం లేదు. శాంతిని అలవర్చుకుంటూ కూడా మనం నివసించవచ్చు’ అని పేర్కొన్నారు. ‘ఆర్టికల్ 370 రద్దు తర్వాత నేను కశ్మీర్‌లోని మహిళలు, చిన్నారుల భద్రత గురించి ఆలోచిస్తున్నాను. అక్కడ ఉన్న సంక్షోభం కారణంగా ఎందరో ఇబ్బందులకు గురవుతున్నారు. దక్షిణాసియా ప్రజలు, అంతర్జాతీయ సమాజం, సంబంధిత అధికారులు దీనిపై స్పందిస్తారని అనుకుంటున్నాను. ప్రజల మధ్య ఎన్ని విభేదాలున్నా మానవ హక్కుల పరిరక్షణ కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలి. మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి’ అని మలాలా లేఖలో పేర్కొన్నారు. The people of Kashmir have lived in conflict since I was a child, since my mother and father were children, since my grandparents were young. pic.twitter.com/Qdq0j2hyN9 — Malala (@Malala) August 8, 2019 -
'ఆ అమ్మాయి వస్తే.. స్వాగతం పలుకుతాం'
ముంబై: పాకిస్థాన్‌తో క్రికెట్ సిరీస్‌ను తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు ఆ దేశ కళాకారులను, సినీ నటులను మహారాష్ట్ర గడ్డపై అడుగుపెట్టనీయబోమంటూ హెచ్చిరించిన శివసేన.. పాక్ ధీర బాలిక, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ విషయంలో భిన్నంగా స్పందించింది. మలాలా భారత్‌కు ఎప్పుడు వచ్చినా స్వాగతం పలుకుతామని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ చెప్పారు. 'భారత్‌లోని శాంతిదూతలకు ఓ మాట చెబుతున్నా. పాకిస్థాన్‌లో ఉగ్రవాదంపై మలాలా పోరాటాన్ని శివసేన, సామ్నా అభినందిస్తోంది. మలాలా భారత్‌కు వస్తే శివసేన స్వాగతం పలుకుతుంది' అని సంజయ్ రౌత్ అన్నారు. కసూరి, హఫీజ్ సయీద్ వంటి వారు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ భారత్‌లో హింసకు ప్రేరిపిస్తున్నారని, చిన్నమ్మాయి అయిన మలాలా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతూ నోబెల్ బహుమతిని గెల్చుకుందని చెప్పారు. మలాలాకు స్వాగతం పలికడం వల్ల.. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించరాదని భారత్‌లోని పాకిస్థాన్ ప్రేమికులకు సందేశాన్ని పంపినట్టు అవుతుందని అన్నారు. భారత్‌ను సందర్శించాలని ఉందని, బాలికల్లో స్ఫూర్తి నింపేందుకు ఢిల్లీ, ముంబై నగరాల్లో పర్యటించాలని ఉందని మలాలా ఇటీవల చెప్పారు. -
'బుల్లెట్లు కాదు.. పుస్తకాలందించండి'
లండన్: బుల్లెట్ల సమాజం నుంచి బయటపడటం ఒక్క విద్య ద్వారానే సాధ్యం అని పాకిస్థాన్ బాలికల అక్షర సాహసి, నోబెల్ బహుమతి విజేత యూసఫ్ జాయ్ మలాలా పేర్కొంది. ప్రపంచ నేతలంతా బుల్లెట్ల నుంచి దూరంగా జరిగి పుస్తకాలనే ఎంచుకోవాలని సూచించింది. 12 ఏళ్ల బాలికలందరికీ నిర్బంధ విద్యను అందించేలా కృషిచేయాల్సిందిగా ఆమె కోరింది. టెలిగ్రాఫ్‌లో ప్రపంచ నేతలను ఉద్దేశిస్తూ మలాలా ఒక సంక్షిప్త సందేశాన్ని తెలియజేసింది. తానింకా టీనేజర్ అయినప్పటికీ ఒక బ్రహ్మాండమైన ఆశను కలిగి ఉన్నానని, పన్నెండేళ్ల లోపు బాలికలందరికి కచ్చితంగా ఉచిత విద్యను అందించగలమన్న నమ్మకం తనకు ఉందని ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే, అది ఎప్పుడు చేద్దామనే విషయంలో ప్రతిఒక్కరు ఒక అంతిమ ఆలోచనకు రావాల్సిన అవసరం ఉందని సూచించింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇప్పుడిప్పుడే విద్యార్థినులు బడిబాట పడుతున్నారని, సెకండరీ విద్యకు చేరేవారి సంఖ్య కూడా పెరుగుతోందని మలాలా గుర్తు చేసింది. అయితే, సెకండరీ స్థాయిలోనే విద్యను ఆపేసే బాలికలు ఉన్న దేశాలు చాలా ఉన్నాయని, ఆ దేశాలు కూడా ఈ విషయంలో ఎలాంటి ఆందోళన లేకుండా ఉన్నాయని ఇది కాస్తంత గమనించాల్సిన విషయం అని మలాలా సూచించింది. -
మలాలాకు మరో అంతర్జాతీయ అవార్డు
ప్రపంచంలోనే అతి పిన్న వయసులో నోబెల్ శాంతిబహుమతిని గెలుచుకున్న పాకిస్థానీ బాలిక మలాలా యూసుఫ్జాయ్కి మరో అంతర్జాతీయ అవార్డు వచ్చింది. ఈసారి అమెరికా లిబర్టీ మెడల్ ఆమెను వరించింది. ఈ అవార్డు విలువ దాదాపు 61 లక్షల రూపాయలు. ఈ మొత్తాన్ని ఆమె పాకిస్థాన్‌లో చదువు కోసం విరాళంగా ఇచ్చింది. బాగా ధైర్యసాహసాలు చూపించిన వాళ్లకు లిబర్టీ మెడల్ ఇస్తారు. అపార ధైర్యసాహసాలు ప్రదర్శించి, కనీసం ప్రాథమిక మానవహక్కులు కూడా లభించని ప్రాంతంలో ఉన్న ప్రజలకోసం గళమెత్తి పోరాడినందుకు ఆమెను ఈ బహుమతికి ఎంపిక చేసినట్లు అమెరికాలోని నేషనల్ కాన్స్టిట్యూషన్ సెంటర్ (ఎన్సీసీ) ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం మలాలా బ్రిటన్‌లో నివసిస్తోంది. 2012లో తాలిబన్లను ఎదిరించి ఆమె అంతర్జాతీయంగా ఒక్కసారిగా పేరుప్రఖ్యాతులు సంపాదించింది. -
మలాలాకు నోబెల్‌పై తాలిబ న్ల ధ్వజం
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో బాలికల విద్యా హక్కుల కోసం ఉద్యమిస్తున్న బాలిక మలాలా యూసఫ్‌జాయ్ మతంపై నమ్మకంలేని వాళ్ల ఏజెంటు అని గతంలో ఆమెపై తుపాకీ కాల్పులతో దాడికి పాల్పడిన తాలిబన్లు విమర్శించారు. ఆమెకు నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించటాన్ని పాక్ తాలిబన్ వేర్పాటు వర్గం జమాత్ ఉల్ అహ్రార్ తప్పుపట్టింది. ‘తుపాకులు, సాయుధ సంఘర్షణలకు వ్యతిరేకంగా మలాలా చాలా మాట్లాడుతోంది. పేలుడు పదార్థాలను కనుగొన్నది.. ఆమెకు ప్రకటించిన నోబెల్ బహుమతి వ్యవస్థాపకుడేనన్న విషయం ఆమెకు తెలియదా?’ అని జమాత్ ఉల్ అహ్రార్ ప్రతినిధి ఎహ్సానుల్లా ఎహ్సాన్ అన్నాడు. ‘గౌరవం కోసం కృషి చేసే వారి విజయం’ వాషింగ్టన్: భారత సామాజిక కార్యకర్త కైలాశ్ సత్యార్థి, మలాలాకు సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించటం.. ప్రతి ఒక్క మానవుని గౌరవాన్ని నిలబెట్టేందుకు కృషిచేస్తున్న వారందరి విజయమని అమెరికా అధ్యక్షుడుఒబామా అభివర్ణించారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయిన ఆయన.. ఈ ఏడాది ఆ అవార్డు విజేతలకు ఓ సందేశంలో అభినందించారు. బాల కార్మికతను నిర్మూలించేందుకు, ప్రపంచం నుంచి బానిసత్వమనే కళంకాన్ని తుడిచివేసేందుకు కైలాశ్ సత్యార్థి తన జీవితాన్ని అంకితం చేశారు’ అని కొనియాడారు. -
చరిత్ర సృష్టించిన మలాలా
లండన్: అత్యంత పిన్న వయసులో నోబెల్ బహుమతి గెలుచుకున్న వ్యక్తిగా పాకిస్థాన్ సాహస బాలిక మలాలా యూసఫ్‌జాయ్ చరిత్ర సృష్టించారు. భారతీయుడు కైలాశ్ సత్యార్థితో పాటు 17 ఏళ్ల మలాలాకు సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతి ప్రకటించారు. గతంలో విలియమ్ లారెన్స్ అనే భౌతిక శాస్త్రవేత్త 25 ఏళ్ల వయసులో నోబెల్ బహుమతి అందుకుని, అత్యంత చిన్న వయసులో ఈ ఘనత సాధించిన వ్యక్తిగా పేరుగాంచారు. తాజాగా మలాలా ఈ రికార్డను బద్దలు కొట్టారు. కైలాశ్ సత్యార్థి, మలాలా బాలలు, యువత హక్కుల కోసం పోరాడినందుకు వీరికి నోబెల్ పురస్కార కమిటీ ఈ అవార్డు ప్రకటించింది. చిన్నారుల చదువు కోసం వీరు రాజీలేని పోరాటం చేశారని కమిటీ ప్రశసించింది. పాకిస్థాన్ బాలికల విద్యాహక్కు కోసం మలాలా తీవ్రవాదులకు తూటాలకు ఎదురునిలిచింది. -
భారతీయుడికి నోబెల్ శాంతి బహుమతి
-
భారతీయుడికి నోబెల్ శాంతి బహుమతి
స్టాక్‌హోం: ఈ సంవత్సరం నోబెల్ శాంతి పురస్కారం భారత్, పాకిస్థాన్ లకు సంయుక్తంగా దక్కింది. భారతీయుడు కైలాశ్ సత్యార్థి, పాకిస్థాన్ హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్ లను సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతి వరించింది. వీరిద్దరూ బాలల హక్కుల కార్యకర్తలు కావడం విశేషం. బాలలు, యువత హక్కుల కోసం పోరాడినందుకు వీరికి నోబెల్ పురస్కార కమిటీ ఈ అవార్డు ప్రకటించింది. చిన్నారుల చదువు కోసం వీరు రాజీలేని పోరాటం చేశారని కమిటీ ప్రశసించింది. పాకిస్థాన్ బాలికల విద్యాహక్కు కోసం మలాలా తీవ్రవాదులకు తూటాలకు ఎదురునిలిచింది. -
పాక్ లో మలాలా పుస్తకం నిషేధం
ఇస్లామాబాద్ : తాలిబాన్ ఉగ్రవాదుల తూటాలకు ఎదురొడ్డిన సాహస బాలిక మలాలా యూసఫ్ జాయ్ రాసిన 'ఐ యామ్ మలాలా' పుస్తకాన్ని పాకిస్తాన్ లో నిషేధించారు. ఈ పుస్తకం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిని పెంచినా పాక్ లో మాత్రం నిషేధం ఎదుర్కొంటుంది. దీనికి సంబంధించి పాకిస్తాన్ ప్రైవేటు స్కూల్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు మిర్జా కసిఫ్ బ్రిటీష్ డైలీకి ఇచ్చిన ఓ నివేదికలో పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రచురణలో ఉన్న పుస్తకం పాకిస్తాన్ బాలలను భయందోళనలకు గురి చేసేలా ఉందని ఆయన తెలిపారు. దేశ వ్యాప్తంగా ఉన్న 1,52,000 పాఠశాలల్లో ఈ పుస్తకం ప్రవేశ పెట్టాలంటే సమీక్ష తప్పకుండా జరపాలన్నారు. ఈ క్రమంలోనే ఆ పుస్తకాన్ని తాత్కాలికంగా నిలిపివేసామన్నారు. కాగా, ప్రభుత్వ పాఠశాలలో ఇప్పటి వరకూ నిషేదం విధించలేదని, ఈ అంశంపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. తాలిబన్ల దాడి తనపై చేసిన దాడిని పుస్తక రూపంలోకి తీసుకువచ్చి బాలల్లో ఆత్మస్థైర్యాన్ని నింపాలని మలాలా చేసిన ప్రయత్నం ఆచరణలోకి వచ్చేటట్లు కనబడుట లేదు. -
మలాల, రాయ్‌లకు 'క్లింటన్' పురస్కారాలు
భారతీయ పర్యావరణవేత్త బంకర్ రాయ్, పాకిస్థాన్‌లో బాలికల విద్యపై తాలిబన్లను సైతం ఎదిరించిన మలాల యూసఫ్ జాయ్లు ఈ ఏడాది ప్రతిష్టాత్మక క్లింటన్ గ్లోబల్ సిటిజన్స్ అవార్డ్సుకు ఎంపికయ్యారు. న్యూయార్క్‌లో రేపు జరగనున్న క్లింటన్ గ్లోబల్ ఇన్షియేటివ్ వార్షిక సమావేశంలో బంకర్ రాయ్, మలాలలు ఆ అవార్డ్సు స్వీకరించనున్నారు. దాదాపు 40 ఏళ్ల క్రితం భారతీయుడు రాయ్ బేర్పూట్ కాలేజీని స్థాపించారు. ఆ సంస్థ ప్రపంచవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన కార్యక్రమాలను ఈ సందర్భంగా గ్లోబల్ సిటిజన్స్ అవార్డ్సు కమిటీ కొనియాడింది. ప్రపంచంలో పేదరిక నిర్మూలనలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని మారుమూల పల్లె ప్రాంతాల్లోని ప్రజలకు మౌలిక సదుపాల రూపకల్పనలో ఆ సంస్ధ పాటుపడుతున్న తీరు నభూతోనభవిష్యత్తు అంటూ కిర్తీంచింది. వర్షం నీటిని నిల్వ చేసి మంచినీటి మార్చి ప్రపంచవ్యాప్తంగా రెండున్నర లక్షల మంది పాఠశాల విద్యార్థులకు అందజేసిన తీరు ఆ సంస్థ సమాజసేవకు పాటుపడుతున్న తీరుకు ఓ నిదర్శనమని పేర్కొంది. ప్లానెట్ను రక్షించే 50 మంది ప్రపంచ పర్యావరణవేత్తల జాబితాలో గార్డియన్ పత్రిక రూపొందించిన జాబితాలో రాయ్ స్థానం సంపాదించిన సంగతి తెలిసిందే. అలాగే ప్రపంచంలోని ప్రజలను అత్యంత ప్రభావితం చేసే 100 మంది వ్యక్తుల్లో రాయ్ కూడా ఉన్నట్లు టైమ్స్ మ్యాగజైన్ వెల్లడించింది. రేపు జరగనున్న ఆ సమావేశానికి ప్రపంచ నలుమూలల నుంచి వ్యాపారవేత్తలు, ప్రభుత్వ అధికారులుల, పౌర సమాజ ప్రతినిధిలు, హాజరుకానున్నారు. 2007లో స్థాపించిన క్లింటన్ గ్లోబల్ సిటిజన్ అవార్డ్‌ను స్థాపించారు. ప్రపంచంలోని వివిధ సమస్యలను దర్శనికతతో పరిష్కరించడమే కాకుండా అరుదైన ప్రతిభ పాటవాల ద్వారా నాయకత్వ లక్షణాలు కలిగిన వారి కోసం ఈ అవార్డును ఏర్పాటు చేశారు.