'బుల్లెట్లు కాదు.. పుస్తకాలందించండి'
లండన్: బుల్లెట్ల సమాజం నుంచి బయటపడటం ఒక్క విద్య ద్వారానే సాధ్యం అని పాకిస్థాన్ బాలికల అక్షర సాహసి, నోబెల్ బహుమతి విజేత యూసఫ్ జాయ్ మలాలా పేర్కొంది. ప్రపంచ నేతలంతా బుల్లెట్ల నుంచి దూరంగా జరిగి పుస్తకాలనే ఎంచుకోవాలని సూచించింది. 12 ఏళ్ల బాలికలందరికీ నిర్బంధ విద్యను అందించేలా కృషిచేయాల్సిందిగా ఆమె కోరింది. టెలిగ్రాఫ్లో ప్రపంచ నేతలను ఉద్దేశిస్తూ మలాలా ఒక సంక్షిప్త సందేశాన్ని తెలియజేసింది. తానింకా టీనేజర్ అయినప్పటికీ ఒక బ్రహ్మాండమైన ఆశను కలిగి ఉన్నానని, పన్నెండేళ్ల లోపు బాలికలందరికి కచ్చితంగా ఉచిత విద్యను అందించగలమన్న నమ్మకం తనకు ఉందని ఆశాభావం వ్యక్తం చేసింది.
అయితే, అది ఎప్పుడు చేద్దామనే విషయంలో ప్రతిఒక్కరు ఒక అంతిమ ఆలోచనకు రావాల్సిన అవసరం ఉందని సూచించింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇప్పుడిప్పుడే విద్యార్థినులు బడిబాట పడుతున్నారని, సెకండరీ విద్యకు చేరేవారి సంఖ్య కూడా పెరుగుతోందని మలాలా గుర్తు చేసింది. అయితే, సెకండరీ స్థాయిలోనే విద్యను ఆపేసే బాలికలు ఉన్న దేశాలు చాలా ఉన్నాయని, ఆ దేశాలు కూడా ఈ విషయంలో ఎలాంటి ఆందోళన లేకుండా ఉన్నాయని ఇది కాస్తంత గమనించాల్సిన విషయం అని మలాలా సూచించింది.