మలాలాకు మరో అంతర్జాతీయ అవార్డు
ప్రపంచంలోనే అతి పిన్న వయసులో నోబెల్ శాంతిబహుమతిని గెలుచుకున్న పాకిస్థానీ బాలిక మలాలా యూసుఫ్జాయ్కి మరో అంతర్జాతీయ అవార్డు వచ్చింది. ఈసారి అమెరికా లిబర్టీ మెడల్ ఆమెను వరించింది. ఈ అవార్డు విలువ దాదాపు 61 లక్షల రూపాయలు. ఈ మొత్తాన్ని ఆమె పాకిస్థాన్లో చదువు కోసం విరాళంగా ఇచ్చింది. బాగా ధైర్యసాహసాలు చూపించిన వాళ్లకు లిబర్టీ మెడల్ ఇస్తారు.
అపార ధైర్యసాహసాలు ప్రదర్శించి, కనీసం ప్రాథమిక మానవహక్కులు కూడా లభించని ప్రాంతంలో ఉన్న ప్రజలకోసం గళమెత్తి పోరాడినందుకు ఆమెను ఈ బహుమతికి ఎంపిక చేసినట్లు అమెరికాలోని నేషనల్ కాన్స్టిట్యూషన్ సెంటర్ (ఎన్సీసీ) ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం మలాలా బ్రిటన్లో నివసిస్తోంది. 2012లో తాలిబన్లను ఎదిరించి ఆమె అంతర్జాతీయంగా ఒక్కసారిగా పేరుప్రఖ్యాతులు సంపాదించింది.