ఇరాన్‌పై నోబెల్ గ్రహీత కుటుంబం ఆరోపణ
టెహ్రాన్: నోబెల్ గ్రహీత, మానవ హక్కుల కార్య కర్త నర్గీస్ మొహమ్మదీని చంపేందుకు ఇరాన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆమె కుటుంబం ఆరోపించింది. కేన్సర్ నిర్ధారణకు అవసరమైన కీలకమైన శస్త్రచికిత్సను నిరాకరించి, నెమ్మదిగా ఆమె ప్రాణాలు పోయేందుకు కారణమవుతోందని తెలిపింది. ఆమె కుడి కాలు ఎముక గాయా న్ని వైద్యులు ఇటీవల గుర్తించారని, క్యాన్సర్ నిర్ధారణకు అవసరమైన బయాప్సీకోసం శస్త్రచికిత్సకు అవకాశం ఇవ్వకుండా ఆమె ప్రాణాలకు ముప్పు తెస్తున్నారని కుటుంబం వెల్లడించింది.
చికిత్సలో మరింత జాప్యం జరిగితే ఆమె ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని కుటుంబ సభ్యులు హెచ్చరించారు. సంవత్సరాల తరబడి జైలు జీవితం, సుదీర్ఘకాలం ఏకాంత నిర్బంధం ఆమె ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీశాయని, కేవలం ఆస్పత్రి సందర్శనలతో చేసే చిన్న చికిత్స ఆమె ఆరోగ్యాన్ని బాగు చేయలేదని వారు తెలిపారు. కాగా, ఇటీవల ఎంఆర్‌ఐలో ఆర్థరైటిస్, డిస్క్ వ్యాధి ఉన్నట్లు బయటపడిందని, 2021లో గుండెపోటుకు గురైన తర్వాత ఆమె గుండె ధమనుల్లో ఒకదానికి యాంజియోగ్రఫీ చేయాలని వైద్యులు సూచించారని ఆమె తరఫు న్యాయవాది తెలిపారు.
మరోవైపు అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ వంటి ప్రముఖులు సైతం మొహమ్మదీని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ‘నిర్బంధంలో ఉన్న మొహమ్మదీకి అవసరమైన వైద్య సంరక్షణను నిలిపివేస్తూ ఇరాన్ అధికారులు ఆమెను నెమ్మదిగా చంపుతున్నారు’అని హిల్లరీ క్లింటన్ గత శుక్రవారం తన అధికారిక సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
మొహమ్మదీ రెండు దశాబ్దాలుగా టెహ్రాన్ లోని ఎవిన్ జైలులో ఖైదీగా ఉన్నారు. ఇరాన్‌లో మానవ హక్కులకోసం, మహిళల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడుతున్న నర్గీస్ 2011లో తొలిసారి అరెస్టయ్యారు. రెండేళ్ల జైలు శిక్ష తర్వాత బెయిల్ పొందిన ఆమె.. 2015లో మళ్లీ జైలుకు వెళ్లారు. జైలులోనూ ఆమె పోరాటాన్ని ఆపలేదు. మహిళల హక్కులతో పాటు, మరణశిక్ష రద్దు, ఖైదీల హక్కుల కోసం కూడా పోరాడారు. జైలులో ఉన్నప్పటికీ మొహమ్మదీ మానవ హక్కుల కోసం అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు. ఇందుకుగాను 2023 సంవత్సరంలో మొహమ్మదీకి నోబెల్ శాంతి బహుమతి దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment