Biopsy
-
నర్గీస్‌ను చంపేందుకు కుట్ర
టెహ్రాన్: నోబెల్ గ్రహీత, మానవ హక్కుల కార్య కర్త నర్గీస్ మొహమ్మదీని చంపేందుకు ఇరాన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆమె కుటుంబం ఆరోపించింది. కేన్సర్ నిర్ధారణకు అవసరమైన కీలకమైన శస్త్రచికిత్సను నిరాకరించి, నెమ్మదిగా ఆమె ప్రాణాలు పోయేందుకు కారణమవుతోందని తెలిపింది. ఆమె కుడి కాలు ఎముక గాయా న్ని వైద్యులు ఇటీవల గుర్తించారని, క్యాన్సర్ నిర్ధారణకు అవసరమైన బయాప్సీకోసం శస్త్రచికిత్సకు అవకాశం ఇవ్వకుండా ఆమె ప్రాణాలకు ముప్పు తెస్తున్నారని కుటుంబం వెల్లడించింది. చికిత్సలో మరింత జాప్యం జరిగితే ఆమె ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని కుటుంబ సభ్యులు హెచ్చరించారు. సంవత్సరాల తరబడి జైలు జీవితం, సుదీర్ఘకాలం ఏకాంత నిర్బంధం ఆమె ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీశాయని, కేవలం ఆస్పత్రి సందర్శనలతో చేసే చిన్న చికిత్స ఆమె ఆరోగ్యాన్ని బాగు చేయలేదని వారు తెలిపారు. కాగా, ఇటీవల ఎంఆర్ఐలో ఆర్థరైటిస్, డిస్క్ వ్యాధి ఉన్నట్లు బయటపడిందని, 2021లో గుండెపోటుకు గురైన తర్వాత ఆమె గుండె ధమనుల్లో ఒకదానికి యాంజియోగ్రఫీ చేయాలని వైద్యులు సూచించారని ఆమె తరఫు న్యాయవాది తెలిపారు. మరోవైపు అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ వంటి ప్రముఖులు సైతం మొహమ్మదీని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ‘నిర్బంధంలో ఉన్న మొహమ్మదీకి అవసరమైన వైద్య సంరక్షణను నిలిపివేస్తూ ఇరాన్ అధికారులు ఆమెను నెమ్మదిగా చంపుతున్నారు’అని హిల్లరీ క్లింటన్ గత శుక్రవారం తన అధికారిక సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మొహమ్మదీ రెండు దశాబ్దాలుగా టెహ్రాన్ లోని ఎవిన్ జైలులో ఖైదీగా ఉన్నారు. ఇరాన్లో మానవ హక్కులకోసం, మహిళల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడుతున్న నర్గీస్ 2011లో తొలిసారి అరెస్టయ్యారు. రెండేళ్ల జైలు శిక్ష తర్వాత బెయిల్ పొందిన ఆమె.. 2015లో మళ్లీ జైలుకు వెళ్లారు. జైలులోనూ ఆమె పోరాటాన్ని ఆపలేదు. మహిళల హక్కులతో పాటు, మరణశిక్ష రద్దు, ఖైదీల హక్కుల కోసం కూడా పోరాడారు. జైలులో ఉన్నప్పటికీ మొహమ్మదీ మానవ హక్కుల కోసం అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు. ఇందుకుగాను 2023 సంవత్సరంలో మొహమ్మదీకి నోబెల్ శాంతి బహుమతి దక్కింది. -
చలికాలంలో ఇంటిపంటల రక్షణ ఇలా..!
శీతాకాలం చలి వాతావరణంలో ఉష్ణోగ్రత తక్కువగా, గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. రసం పీల్చే పురుగులు, వైరస్ తెగుళ్ల వ్యాప్తికి ఇది అనువైన కాలం. కుండీల్లో, పెరట్లో ఆకుకూరలు, టమాటా, చిక్కుడు, వంగ, మిరప, బీర, ఆనప తదితర పంటలు చీడపీడల బారిన పడకుండా చూసుకోవడానికి ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలి. చీడపీడలు రానీయని టీకాలన్నమాట. జనవరి ఆఖరులో చలి తగ్గేవరకు వీటిని పాటించాలి. ► జీవామృతంను 1:10 పాళ్లలో నీటిలో కలిపి ప్రతి 10–15 రోజులకోసారి క్రమం తప్పకుండా పిచికారీ చేస్తుంటే పంటలు ఆరోగ్యంగా పెరుగుతాయి. చీడపీడలను తట్టుకునే శక్తి పెరుగుతుంది. ► ఆచ్ఛాదన (మల్చింగ్): కుండీలు, మడుల్లో కూరగాయ మొక్కలు/చెట్ల చుట్టూ గడ్డీ గాదంతో ఐదారు అంగుళాల మందాన ఆచ్ఛాదనగా వేస్తే మంచిది. ► ఇంటిపంటల్లో పెద్ద పురుగులు కనిపిస్తే వాటిని చేతితో ఏరేయడం ఉత్తమం. శీతాకాలంలో పంటలనాశించే కొన్ని పురుగులు: టమాటా, వంగ, ఆకుకూరలతోపాటు మందారం, చామంతి, గులాబీ వంటి పంటలపై పిండినల్లి(మీలీ బగ్), తామర పురుగు(త్రిప్స్) తరచూ కనిపిస్తుంటాయి. వీటితోపాటు పేనుబంక, దీపపు పురుగులు, తెల్లదోమ, ఎర్రనల్లి కూడా ఆశిస్తుంటాయి. పిండినల్లి: పిండినల్లి మొక్కలను ఆశించి రసం పీల్చుతుంటుంది. అందువల్ల మొక్క పెరుగుదల నిలిచిపోతుంది. ఇది సోకినప్పుడు పళ్లు తోముకునే బ్రష్‌ను ముంచి తుడిచేస్తే పోతుంది. కలబంద రసం లేదా వేపనూనె లేదా సబ్బు నీళ్లలో బ్రష్‌ను ముంచి తుడిచేయాలి. పేనుబంక: దీన్నే మసిపేను అని కూడా అంటారు. కంటికి కనిపించనంత చిన్న పేన్లు బంకవంటి తీపి పదార్థాన్ని విసర్జిస్తుంటాయి. ఈ తీపి కోసం చీమలు చేరతాయి. మొక్కల మీద చీమలు పారాడుతూ ఉంటే పేనుబంక లేదా పిండినల్లి సోకిందన్నమాటే. పచ్చదోమ: ఆకుపచ్చగా ఉండే చిన్న దోమలు ఆకుల నుంచి రసం పీల్చుతుంటాయి. పచ్చదోమ ఆకుల చివర్ల నుంచి పని మొదలు పెడతాయి. కాబట్టి ఇది సోకిన ఆకులు కొసల నుంచి లోపలి వరకు ఎండిపోతూ ఉంటాయి. బీర, ఆనప వంటి పెద్ద ఆకులుండే పంటలను పచ్చదోమ ఎక్కువగా ఆశిస్తూ దిగుబడిని తగ్గించేస్తాయి. తామర ‡పురుగు: తామర పురుగు సోకిన మిరప ఆకులకు పైముడత వస్తుంది. మిరప కాయలు వంకర్లు తిరుగుతాయి. వాటిపై చారలు ఏర్పడతాయి. దీన్ని గజ్జి తెగులు, తామర తెగులు అని కూడా అంటారు. బూడిద తెగులు: చల్లని వాతావరణంలో శిలీంద్రం వేగంగా వ్యాపించడం వల్ల బూడది తెగులు వస్తుంది. ఇది సోకిన పంటల ఆకులపై తెల్లని పొడి కనిపిస్తుంది. మిరప, వంగ, టమాటా, ఆకుకూరలపై ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది. రసంపీల్చే పురుగులు: ముందుజాగ్రత్త పిచికారీలు రసం పీల్చే పురుగులు పంటల జోలికి రాకుండా ముందుగానే జాగ్రత్తపడడం ఉత్తమం. వేపాకు రసం లేదా వావిలి ఆకుల కషాయం లేదా వేప నూనె లేదా వేపపిండి కషాయంను (వీటిలో ఏదైనా ఒక దాన్ని గానీ లేదా ఒక దాని తర్వాత మరొక దాన్ని మార్చి మార్చి గానీ) ప్రతి 7–10 రోజులకోసారి పిచికారీ చేయాలి. వేపాకు రసం: పావు కిలో వేపాకులు రుబ్బి + 5 లీటర్ల నీటిలో కలిపి అదే రోజు పంటలపై చల్లాలి(10 కిలోల వేపాకులు రుబ్బి 100 లీటర్ల నీటిలో కలిపి ఎకరంలో పంటలకు చల్లవచ్చు). వావిలి ఆకుల కషాయం: 2 లీటర్ల నీటిలో 350 గ్రాముల వావిలి ఆకులు వేసి 2 లేదా 3 పొంగులు వచ్చే వరకు మరిగించి.. చల్లార్చిన తర్వాత ఆ కషాయంలో 10 లీటర్ల నీటిలో కలిపి పంటలపై పిచికారీ చేయాలి(5 కిలోల వావిలి ఆకుల కషాయాన్ని 100 లీటర్ల నీటిలో కలిపితే ఎకరానికి సరిపోతుంది). వేప నూనె: మార్కెట్లో దొరుకుతుంది. సీసాపై ముద్రించిన సాంద్రతకు తగిన మోతాదులో పిచికారీ చేయాలి. వేపకాయల పిండి రసం: 10 లీటర్ల నీటిలో అర కేజీ వేపకాయల పిండి(వేపగింజల పిండి 300 గ్రాములు చాలు)ని పల్చటి గుడ్డలో మూటగట్టి.. 4 గంటలు నానబెట్టాలి. ఆ తర్వాత మూటను నీటిలో నుంచి తీసి పిండాలి. ఇలా అనేకసార్లు ముంచుతూ తీస్తూ పిండాలి. అదే రోజు పిచికారీ చేయాలి లేదా రోజ్ క్యాన్ ద్వారా మొక్కలపై చల్లవచ్చు. ఈ కషాయాలు, రసాలను పిచికారీ చేసేముందు 10 లీటర్లకు 5 గ్రాముల(100 లీటర్లకు 200 గ్రాముల) సబ్బుపొడి లేదా కుంకుడు రసాన్ని కలపాలి. నూనె పూసిన ఎరలు: నూనె పూసిన ఎరలు(స్టిక్కీ ట్రాప్స్) వేలాడదీస్తే పురుగులను ఆకర్షించి నశింపజేస్తాయి. తామర పురుగులను ఆకర్షించడానికి తెలుపు, తెల్లదోమలను నీలం, పచ్చదోమలను పసుపుపచ్చ ఎరలను వాడాలి. టమాటా, వంగ, మిర్చి వంటి ప్రతి 20 కూరగాయ మొక్కలకు ఒక్కో రకం ఎరలను రెండేసి చొప్పున వేలాడదీయాలి. ఎరలను మార్కెట్లో కొనొచ్చు. లేదా ఆయా రంగుల డబ్బాలు లేదా ప్లాస్టిక్ షీట్లు ఉంటే వాటికి నూనె లేదా గ్రీజు రాసి వేలాడదీయవచ్చు. రసంపీల్చే పురుగుల తీవ్రత ఎక్కువగా ఉంటే? రసంపీల్చే పురుగులు ఇప్పటికే మొక్కలకు తీవ్రస్థాయిలో ఆశించి ఉంటే పైన పేర్కొన్న పిచికారీలు కొనసాగిస్తూనే.. తెల్లటి షేడ్‌నెట్‌ను మొక్కలపై గ్రీన్హౌస్ మాదిరిగా రక్షణగా ఏర్పాటు చేయాలి. ఇనుప తీగతో డోమ్ ఆకారం చేసి దానిపై తెల్లని షేడ్‌నెట్ చుట్టేస్తే సరి.? సేంద్రియ ఇంటిపంటల సాగుపై సికింద్రాబాద్ తార్నాక (రోడ్డు నంబర్ ఒకటి, బ్యాంక్ ఆఫ్ బరోడా దగ్గర)లోని సుస్థిర వ్యవసాయ కేంద్రం కార్యాలయంలో కనీసం 10 మంది కోరితే వారాంతంలో శిక్షణ ఇస్తున్నారు. పుస్తకాలు, విత్తనాలు, వర్మీకంపోస్టు లభిస్తాయి. వివరాలకు.. డా. గడ్డం రాజశేఖర్ – 83329 45368 ∙సిఎస్ఎ కార్యాలయంపై టెర్రస్ గార్డెన్లో డా. రాజశేఖర్ ∙ఎల్లో స్టిక్కీ ట్రాప్ -
‘దశమూలారిష్టం’తో అరిష్టం కూడా!
సాక్షి, న్యూఢిల్లీ: ‘నా రోగి ఓ రైతు. ఆయనకు 40 ఏళ్లు. పచ్చ కామర్లతో (క్రానిక్ జాండీస్)తో బాధ పడుతున్న ఆయన ఓ రోజు చికిత్స కోసం నా వద్దకు వచ్చారు. ఆయనకు రక్త పరీక్షలు నిర్వహించగా బైల్‌రూబిన్ లెవల్స్ ఉండాల్సిన దానికన్నా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక కాలేయం ఎంజైమ్స్ ఉండాల్సిన దానికన్నా ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉన్నాయి. అన్నీ పరీక్షలు ఆయన మద్యం ఎక్కువగా సేవిస్తున్నాడనే తెలిపాయి. అయితే ఆ రోగి మాత్రం ఆ విషయాన్ని ఖండించారు. తాను జీవితం ఒక్క చుక్క కూడా మద్యం ముట్టుకోలేదని వాదించారు. ఆయన మరీ లావుగానీ, బక్కగాగానీ లేకుండా దృఢంగా ఉన్నారు. కాలేయ వ్యాధి ఎందుకు వచ్చిందో తెలుసుకునేందుకు ఆయనపై వివిధ రకాల వైరస్లు, బయాటిక్ పరీక్షలు నిర్వహించాం. అన్నీ నెగటివ్ ఫలితాలు వచ్చాయి. డెంగ్యూ, టైఫాయిడ్, అరుదైన క్యాన్సర్ పరీక్షలూ నిర్వహించాం. అయినా నెగటివ్ ఫలితాలే వచ్చాయి. రోజు రోజుకు రోగికి జాండీస్ జబ్బు పెరుగుతోంది. బయాప్సీ చేయాలని నిర్ణయించాను. ఒక్క క్యాన్సర్లకే కాకుండా జబ్బుకు అసలు కారణం ఏమిటో తెలుసుకోవడానికి కూడా ఈ బయాప్సీ ఉపయోగ పడుతుంది. రోగి అంగీకారంతో బయాప్సీ పరీక్ష నిర్వహించాం. అతిగా మద్యం తాగడం వల్ల వచ్చే ‘సీవియర్ ఆల్కహాలిక్ హెపటైటీస్’ ఉందని ఆ పరీక్షలో తేలింది. దాదాపు ప్రతిరోజు అతిగా తాగేవాళ్లకే ఈ జబ్బు వస్తుంది. రోగిని పిలిచి తిట్టాను నిజం చెప్పమని. తాను నిజమే చెబుతున్నానని, అబద్ధం చెప్పడం లేదని అన్నారు. లాభం లేదనుకొని ఆయన భార్య, కూతుళ్లను పిలిపించి వారిని ప్రశ్నించాను. రోగికి ఎప్పుడు కూడా మద్యం అలవాటు లేదని, తామంతా మూడు పూటలా కలిసే తింటామని, రాత్రిపూట కలిసే ఉంటామని వారు చెప్పారు. ఇంకా ఏమీ అలవాట్లు ఉన్నాయిని ప్రశ్నించాను. తిన్నాక రెండు పూటల తిన్నది అరిగేందుకు ఆయుర్వేదం మందు తాగుతారని ఆయన భార్య తెలిపింది. ‘దశమూలారిష్టం’ తీసుకుంటానని రోగి చెప్పారు. నాకు ఆశ్చర్యం వేసింది. అది కేరళలో ప్రతి రెండు ఇళ్లలో ఒకరి ఇంట్లో ఉంటుంది. ఎక్కువ మంది అన్నం జీర్ణం అయ్యేందుకే దాన్ని వాడుతుంటారు. దాన్ని 30 వన మూలికలతో తయారు చేస్తారు. అందులో ‘వుడ్ఫోర్డియా ఫ్రూటికోసా’ అని పువ్వులు కూడా కలుపుతారు. వాటిని మురగబెడితే ద్రాక్షలాగా ఆల్కహాల్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆ ఆల్కహాలే జీర్ణ వ్యవస్థకు ఎక్కువగా తోడ్పడుతుంది. కొంత మంది వైద్యులు ఆ పువ్వులు త్వరగా కుళ్లడానికి బ్రెడ్డులో వాడే బేకింగ్ పౌడర్‌ను వాడుతారు. మరికొందరు వైద్యులు నేరుగా ఆల్కహాలును కలిపి ఔషధాన్ని తయారు చేస్తున్నారు. కేరళలో మద్యపానంపై నిషేధం ఉండడం వల్ల ‘దశమమూలారిష్టం’ను ఎక్కువగా వాడుతున్నారని తోటి వైద్యుల ద్వారా తెల్సింది. అన్నం జీర్ణం కోసం వాడే వాళ్లు దీన్ని రోజుకు నాలుగుసార్లు వాడుతుండగా, మద్యం అలవాటున్నవాళ్లు ఎక్కువగా తాగుతున్నారని తెల్సింది. నాలుగు సార్లు తీసుకునే మందులో 35 గ్రాముల ఆల్కహాలు ఉంటుంది. ఆ మందులో మొత్తం ఆల్కహాలు శాతం ఎనిమిది నుంచి పది శాతం ఉంటుంది. కాలేయ వ్యాధి రావడానికి ఆ మాత్రం ఆల్కహాలు చాలు కనుక ఈ ఔషధం కారణంగా నా రోగికి కాలేయ వ్యాధి వచ్చిందని తెల్సి ట్రీట్మెంట్ మొదలుపెట్టాను. నా రోగిలో ఆల్కహాలిక్స్‌లో ఉండని లివర్‌ను దెబ్బతీసే ‘నెక్రోసిస్’ కూడా ఉందని మా ల్యాబ్ అసిస్టెంట్ ద్వారా తెల్సింది. నా రోగిని పిలిపించి ఇంకా ఏమేమి తాగుతావని అడిగాను. తన తోటలో పండించే పైనాపిల్ జ్యూస్ రోజు తాగుతానని చెప్పారు. ఆయన తినే పైనాపిల్స్‌ను తెప్పించి వాటిని ల్యాబ్‌లో పరీక్షించాం. వాటిల్లో ‘నికల్ టెట్రాకార్బనిల్’, అసెటిల్ పెంటాకార్బనిల్, కార్బామిక్ ఆసిడ్స్’ ఉన్నాయని తేలింది. ఎరువులు ఎక్కువగా వాడడంలో అవి అందులోకి వచ్చాయి. నా రోగికి ‘టాక్సిక్ హెపటైటీస్’ కూడా ఉంది కనుక, అది పైనాపిల్స్ వల్ల వచ్చిందని తేలింది. ట్రీట్మెంట్తో రోగి పూర్తిగా కోలుకున్నాడు. (కొచ్చీలోని ఈఎంసీ హాస్పిటల్‌కు అనుబంధమైన ‘గ్యాస్ట్రో ఎంట్రాలజీ యూనిట్’లో స్పెషలిస్ట్‌గా పనిచేస్తున్న డాక్టర్ సిరియాక్ అబీ ఫిలిప్స్ ‘ది అమెరికన్ జనరల్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ’ తాజా సంచికలో రాసిన వ్యాసానికి అనువాదం) -
బ్రెస్ట్ క్యాన్సర్ ను ముందే గుర్తించవచ్చు
న్యూయార్క్: ప్రపంచంలో క్యాన్సర్ర్ తో ఏటా చనిపోతున్న స్త్రీలలో ఎక్కువ కనిపించే బ్రెస్ట్ క్యాన్సర్ ను గుర్తించే మాలిక్యులర్ మార్కర్ ను పరిశోధకులు కనుగొన్నారు. సాధారణంగా స్త్రీలలో ఉండే పునరుత్పాదక కణాలను గుర్తించడం ద్వారా క్యాన్సర్ రాకను ముందే గుర్తించే అవకాశం ఉంటుందని తెలిపారు. 302 మంది మహిళల బయాప్సీలను చేసిన పరిశోధనల ఫలితాల్లో 'కి 67' లెవల్స్ ఎక్కువగా ఉన్న మహిళలకు క్యాన్సర్ ముప్పు ఐదు రెట్లు ఎక్కువగా ఉంటుందని తేలింది. వీరిలో 63 మందికి క్యాన్సర్ వచ్చినట్లు తర్వాతి పరిశోధనలతో తెలిసింది. 'కి67' కణాలు 'కి 67' మమ్మరీ ఎపీథెలియమ్ కణాలని అంటారు. స్త్రీ జీవితంలోని వివిధ దశల్లో ఈ కణాలు భిన్న మార్పులు చెందడం వల్ల ఈ కణాల్లో కాన్సర్ కణుతులు తయారవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందని తెలిపారు. 'మీకు బ్రెస్ట్ క్యాన్సర్ లేదని మహిళలకు ఊరికే చెప్పేబదులు బయాప్సీ చేయించడం వల్ల భవిష్యత్ అవకాశాలను పూర్తిగా తెలుసుకోవచ్చు' హార్వాడ్ యూనివర్సిటీ పరిశోధకుల్లో ఒకరైన కొర్నెలియా పొల్యాక్ అన్నారు. క్యాన్సర్ చివరి స్టేజ్ లో ఉన్న మహిళలను ముందే గుర్తించడం వల్ల ప్రత్యేకమైన మార్గాలను అనుసరించి రిస్క్ ను తగ్గించవచ్చని హార్వాడ్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ రుల్లా తమిమి తెలిపారు. కి67 లెవల్స్ ను గుర్తించే క్రమంలో సాధారణంగా ఉపయోగించే పరికరాల కంటే మాలిక్యులర్ బేస్డ్ టెస్టింగ్ లో రేడియేషన్ తక్కువగా ఉంటుందని వివరించారు. బ్రెస్ట్ క్యాన్సర్ కు సంబంధించిన ఈ వివరాలను ఆన్ లైన్ జర్నల్ క్యాన్సర్ రిసెర్చ్ లో ప్రచురించారు.