సాక్షి, న్యూఢిల్లీ: ‘నా రోగి ఓ రైతు. ఆయనకు 40 ఏళ్లు. పచ్చ కామర్లతో (క్రానిక్ జాండీస్)తో బాధ పడుతున్న ఆయన ఓ రోజు చికిత్స కోసం నా వద్దకు వచ్చారు. ఆయనకు రక్త పరీక్షలు నిర్వహించగా బైల్‌రూబిన్ లెవల్స్ ఉండాల్సిన దానికన్నా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక కాలేయం ఎంజైమ్స్ ఉండాల్సిన దానికన్నా ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉన్నాయి. అన్నీ పరీక్షలు ఆయన మద్యం ఎక్కువగా సేవిస్తున్నాడనే తెలిపాయి. అయితే ఆ రోగి మాత్రం ఆ విషయాన్ని ఖండించారు. తాను జీవితం ఒక్క చుక్క కూడా మద్యం ముట్టుకోలేదని వాదించారు. ఆయన మరీ లావుగానీ, బక్కగాగానీ లేకుండా దృఢంగా ఉన్నారు.
కాలేయ వ్యాధి ఎందుకు వచ్చిందో తెలుసుకునేందుకు ఆయనపై వివిధ రకాల వైరస్‌లు, బయాటిక్ పరీక్షలు నిర్వహించాం. అన్నీ నెగటివ్ ఫలితాలు వచ్చాయి. డెంగ్యూ, టైఫాయిడ్, అరుదైన క్యాన్సర్ పరీక్షలూ నిర్వహించాం. అయినా నెగటివ్ ఫలితాలే వచ్చాయి. రోజు రోజుకు రోగికి జాండీస్ జబ్బు పెరుగుతోంది. బయాప్సీ చేయాలని నిర్ణయించాను. ఒక్క క్యాన్సర్లకే కాకుండా జబ్బుకు అసలు కారణం ఏమిటో తెలుసుకోవడానికి కూడా ఈ బయాప్సీ ఉపయోగ పడుతుంది. రోగి అంగీకారంతో బయాప్సీ పరీక్ష నిర్వహించాం. అతిగా మద్యం తాగడం వల్ల వచ్చే ‘సీవియర్ ఆల్కహాలిక్ హెపటైటీస్’ ఉందని ఆ పరీక్షలో తేలింది. దాదాపు ప్రతిరోజు అతిగా తాగేవాళ్లకే ఈ జబ్బు వస్తుంది. రోగిని పిలిచి తిట్టాను నిజం చెప్పమని. తాను నిజమే చెబుతున్నానని, అబద్ధం చెప్పడం లేదని అన్నారు. లాభం లేదనుకొని ఆయన భార్య, కూతుళ్లను పిలిపించి వారిని ప్రశ్నించాను.
రోగికి ఎప్పుడు కూడా మద్యం అలవాటు లేదని, తామంతా మూడు పూటలా కలిసే తింటామని, రాత్రిపూట కలిసే ఉంటామని వారు చెప్పారు. ఇంకా ఏమీ అలవాట్లు ఉన్నాయిని ప్రశ్నించాను. తిన్నాక రెండు పూటల తిన్నది అరిగేందుకు ఆయుర్వేదం మందు తాగుతారని ఆయన భార్య తెలిపింది. ‘దశమూలారిష్టం’ తీసుకుంటానని రోగి చెప్పారు. నాకు ఆశ్చర్యం వేసింది. అది కేరళలో ప్రతి రెండు ఇళ్లలో ఒకరి ఇంట్లో ఉంటుంది. ఎక్కువ మంది అన్నం జీర్ణం అయ్యేందుకే దాన్ని వాడుతుంటారు. దాన్ని 30 వన మూలికలతో తయారు చేస్తారు. అందులో ‘వుడ్‌ఫోర్డియా ఫ్రూటికోసా’ అని పువ్వులు కూడా కలుపుతారు. వాటిని మురగబెడితే ద్రాక్షలాగా ఆల్కహాల్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆ ఆల్కహాలే జీర్ణ వ్యవస్థకు ఎక్కువగా తోడ్పడుతుంది. కొంత మంది వైద్యులు ఆ పువ్వులు త్వరగా కుళ్లడానికి బ్రెడ్డులో వాడే బేకింగ్ పౌడర్‌ను వాడుతారు. మరికొందరు వైద్యులు నేరుగా ఆల్కహాలును కలిపి ఔషధాన్ని తయారు చేస్తున్నారు.
కేరళలో మద్యపానంపై నిషేధం ఉండడం వల్ల ‘దశమమూలారిష్టం’ను ఎక్కువగా వాడుతున్నారని తోటి వైద్యుల ద్వారా తెల్సింది. అన్నం జీర్ణం కోసం వాడే వాళ్లు దీన్ని రోజుకు నాలుగుసార్లు వాడుతుండగా, మద్యం అలవాటున్నవాళ్లు ఎక్కువగా తాగుతున్నారని తెల్సింది. నాలుగు సార్లు తీసుకునే మందులో 35 గ్రాముల ఆల్కహాలు ఉంటుంది. ఆ మందులో మొత్తం ఆల్కహాలు శాతం ఎనిమిది నుంచి పది శాతం ఉంటుంది. కాలేయ వ్యాధి రావడానికి ఆ మాత్రం ఆల్కహాలు చాలు కనుక ఈ ఔషధం కారణంగా నా రోగికి కాలేయ వ్యాధి వచ్చిందని తెల్సి ట్రీట్‌మెంట్ మొదలుపెట్టాను. నా రోగిలో ఆల్కహాలిక్స్‌లో ఉండని లివర్‌ను దెబ్బతీసే ‘నెక్రోసిస్’ కూడా ఉందని మా ల్యాబ్ అసిస్టెంట్ ద్వారా తెల్సింది.
నా రోగిని పిలిపించి ఇంకా ఏమేమి తాగుతావని అడిగాను. తన తోటలో పండించే పైనాపిల్ జ్యూస్ రోజు తాగుతానని చెప్పారు. ఆయన తినే పైనాపిల్స్‌ను తెప్పించి వాటిని ల్యాబ్‌లో పరీక్షించాం. వాటిల్లో ‘నికల్ టెట్రాకార్బనిల్’, అసెటిల్ పెంటాకార్బనిల్, కార్బామిక్ ఆసిడ్స్’ ఉన్నాయని తేలింది. ఎరువులు ఎక్కువగా వాడడంలో అవి అందులోకి వచ్చాయి. నా రోగికి ‘టాక్సిక్ హెపటైటీస్’ కూడా ఉంది కనుక, అది పైనాపిల్స్ వల్ల వచ్చిందని తేలింది. ట్రీట్‌మెంట్‌తో రోగి పూర్తిగా కోలుకున్నాడు.
(కొచ్చీలోని ఈఎంసీ హాస్పిటల్‌కు అనుబంధమైన ‘గ్యాస్ట్రో ఎంట్రాలజీ యూనిట్’లో స్పెషలిస్ట్‌గా పనిచేస్తున్న డాక్టర్ సిరియాక్ అబీ ఫిలిప్స్ ‘ది అమెరికన్ జనరల్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ’ తాజా సంచికలో రాసిన వ్యాసానికి అనువాదం)
Comments
Please login to add a commentAdd a comment