
తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దిశగా గుజరాత్
రెండో ఇన్నింగ్స్‌లో 429/7
మరో 29 పరుగులు చేస్తే ఫైనల్ బెర్త్
కేరళతో రంజీ ట్రోఫీ సెమీఫైనల్
అహ్మదాబాద్: జైమీత్ పటేల్ (161 బంతుల్లో 74 బ్యాటింగ్; 2 ఫోర్లు), సిద్ధార్థ్ దేశాయ్ (134 బంతుల్లో 24 బ్యాటింగ్; 1 ఫోర్) మొండి పట్టుదలతో ఆడటంతో... గుజరాత్ జట్టు రంజీ ట్రోఫీ ఫైనల్‌కు చేరువైంది. కేరళతో జరుగుతున్న సెమీఫైనల్లో ఓవర్‌నైట్ స్కోరు 222/1తో గురువారం నాలుగో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన గుజరాత్ జట్టు... ఆట ముగిసే సమయానికి 154 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 429 పరుగులు చేసింది.
ఫలితం తేలడం కష్టమైన ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన జట్టే ఫైనల్‌కు చేరుకోవడం ఖాయమైంది. అంతకుముందు కేరళ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 457 పరుగులు చేయగా... ప్రస్తుతం చేతిలో 3 వికెట్లు ఉన్న గుజరాత్ మరో 29 పరుగులు చేస్తే కేరళ స్కోరును దాటేస్తుంది. ప్రియాంక్ పాంచాల్ (237 బంతుల్లో 148; 18 ఫోర్లు, 1 సిక్స్) భారీ సెంచరీ ఖాతాలో వేసుకోగా... మనన్ హింగ్‌రాజియా (127 బంతుల్లో 33; 3 ఫోర్లు), ఉర్విల్ పటేల్ (43 బంతుల్లో 25; 3 ఫోర్లు), హేమంగ్ పటేల్ (41 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్) తలా కొన్ని పరుగులు చేశారు.
కెప్టెన్ చింతన్ గాజా (2), విశాల్ జైస్వాల్ (14) ఎక్కువసేపు నిలవలేకపోయారు. చివర్లో సిద్ధార్థ్ దేశాయ్‌తో కలిసి జైమీత్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఓ పక్క పరుగులు సాధిస్తూనే... ఓవర్లు కరిగించాడు. ఈ జంట అబేధ్యమైన ఎనిమిదో వికెట్‌కు 220 బంతుల్లో 72 పరుగులు జోడించింది. ఓవరాల్‌గా గురువారం 83 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 207 పరుగులు చేసింది. కేరళ బౌలర్లలో జలజ్ సక్సేనా 4 వికెట్లు పడగొట్టాడు.
స్కోరు వివరాలు
కేరళ తొలి ఇన్నింగ్స్: 457; గుజరాత్ తొలి ఇన్నింగ్స్: ప్రియాంక్ (బి) జలజ్ సక్సేనా 148; ఆర్య దేశాయ్ (బి) బాసిల్ 73; మనన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) జలజ్ సక్సేనా 33; ఉర్విల్ పటేల్ (స్టంప్డ్) అజహరుద్దీన్ (బి) జలజ్ సక్సేనా 25; హేమాంగ్ పటేల్ (సి) (సబ్) రోజర్ (బి) నిధీశ్ 27; జైమీత్ పటేల్ (బ్యాటింగ్) 74; చింతన్ గాజా (ఎల్బీడబ్ల్యూ) (బి) జలజ్ సక్సేనా 2; విశాల్ జైస్వాల్ (సి) బాసిల్ (బి) ఆదిత్య 14; సిద్ధార్థ్ దేశాయ్ (బ్యాటింగ్) 24; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (154 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి) 429. వికెట్ల పతనం: 1–131, 2–238, 3–277, 4–292, 5–320, 6–325, 7–357. బౌలింగ్: నిధీశ్ 23–4–86–1; జలజ్ సక్సేనా 61–12–137–4; బాసిల్ 22–1–59–1; ఆదిత్య సర్వతే 36–3–104–1; అక్షయ్ చంద్రన్ 11–0–31–0; ఇమ్రాన్ 1–0–3–0.
Comments
Please login to add a commentAdd a comment