సాక్షి, అమరావతి: సుస్థిర ఆర్థిక ప్రగతి లక్ష్యాల వైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తోందని నోబెల్ బహుమతి గ్రహీత, ఎంఐటీ ప్రొఫెసర్, ప్రపంచ ప్రఖ్యాత ఆర్థికవేత్త ప్రొఫెసర్ ఎస్తర్ డుఫ్లో అభినందించారు. పేదరికాన్ని నిర్మూలించి ప్రజల జీవన స్థితిగతులను పెంపొందించడంపై రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం అమలు చేస్తున్న పథకాలు ఎంతో బాగున్నాయని ప్రశంసించారు. వివిధ అంశాలపై సీఎంజగన్ దార్శనికత, పరిజ్ఞానం, అంకితభావం తమను ఆకట్టుకున్నట్లు చెప్పారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌తో ప్రొఫెసర్ ఎస్తర్ డుఫ్లో బృందం సమావేశమై పలు అంశాలపై చర్చించింది. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, గృహ నిర్మాణం, మహిళా సాధికారిత తదితర అంశాల్లో ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక చర్యలు, అమలు చేస్తున్న కార్యక్రమాలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ వారికి వివరించారు.
గదిలో కాదు.. జనం మధ్యలో తిరిగి
సీఎం జగన్ సుదీర్ఘ పాదయాత్రతో క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకుని, వాటిని అర్థం చేసుకుని పథకాలను రూపొందించారని ఎస్తర్ డుఫ్లో పేర్కొన్నారు. ఒక గదిలో కూర్చుని సీఎం ఈ పథకాలకు రూపకల్పన చేయలేదని, అలా చేస్తే అవి కేవలం థియరిటికల్‌గా ఉంటాయని వ్యాఖ్యానించారు. సంతృప్త స్థాయిలో పథకాలను అమలు చేస్తూ అర్హులు ఎవరూ మిగిలిపోకూడదంటూ ముఖ్యమంత్రి జగన్ తీసుకుంటున్న చొరవ ఆయన గొప్ప ఆలోచనా థృక్పథాన్ని వెల్లడిస్తోందని చెప్పారు. పేదరికాన్ని నిర్మూలించాలనే ఆయన అంకితభావాన్ని వెల్లడిస్తోందన్నారు. నగదు బదిలీ పథకాల్లో భాగంగా నేరుగా మహిళల ఖాతాల్లోకి పారదర్శకంగా జమ చేయడం, గృహ నిర్మాణంలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా అన్ని రకాలుగా కుటుంబం సుస్థిరమవుతుందని తెలిపారు.
క్షేత్రస్థాయిలో పరిశీలించి సూచనలు..
సుస్థిర ఆర్థిక ప్రగతి కోసం నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల అమలు తీరు, దాని ప్రభావంపై అధ్యయనం నిర్వహించి సలహాలను కోరడం సీఎం దార్శనికతకు నిదర్శనమని తెలిపారు. పాదయాత్రలో ప్రజల కష్టాలను చూసి సీఎం జగన్ పథకాలను ప్రవేశపెట్టినందున ఏం చేయాలన్న దానిపై తాము పెద్దగా దృష్టి పెట్టాల్సిన అవసరం లేదని, క్షేత్రస్థాయిలో పరిశీలించి బలోపేతం కోసం సూచనలు చేస్తామని చెప్పారు. గత 15 ఏళ్లుగా ‘జె–పాల్’ 20 రాష్ట్రాల్లో పని చేస్తోందని, ఆంధ్రప్రదేశ్‌లో పైలట్ ప్రాజెక్టు కింద ఇప్పటికే కొన్ని అంశాల్లో పని చేస్తున్నట్లు తెలిపారు.
సీఎస్‌ను కలసిన బృందం
ముఖ్యమంత్రితో సమావేశం అనంతరం ఎస్తర్ డుఫ్లో బృందం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ, వివిధ శాఖల ఉన్నతాధికారులను కలుసుకుంది. సుస్థిర ఆర్థిక ప్రగతి లక్ష్యాలు, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎస్ వివరించారు. జె–పాల్ (ది అబ్దుల్ లతీఫ్ జమీల్ పావర్టీ యాక్షన్ ల్యాబ్)కు ఎస్తర్ డుఫ్లో డైరెక్టర్‌గా, సహ వ్యవస్థాపకురాలిగా వ్యవహరిస్తున్నారు. దక్షిణాసియాకు సంబంధించి జె–పాల్ తరఫున సైంటిఫిక్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా వ్యవహరిస్తున్నారు. సమావేశంలో ఎస్తర్ డుఫ్లోతో పాటు బృందం సభ్యులు శోభిని ముఖర్జీ, కపిల్ విశ్వనాథన్, అపర్ణ కృష్ణన్, కునాల్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
చదవండి: సంక్షేమ స్ఫూర్తి.. పంజాబ్‌లోనూ ఏపీ తరహా పథకం..
Comments
Please login to add a commentAdd a comment