సమష్టిగా పోరాడదాం: మన్మోహన్ సింగ్
దక్షిణ, తూర్పు ఆసియా దేశాలకు ప్రధాని మన్మోహన్ పిలుపు
నేప్యీదే: అంతర్జాతీయ ఉగ్రవాదం, సీమాంతర నేరాలు, మత్తు మందుల రవాణా కారణంగా తలెత్తుతున్న భద్రత సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవడానికి దక్షిణ, తూర్పు ఆసియా దేశాలు సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని మన్మోహన్ సింగ్ సోమవారమిక్కడ అన్నారు. ఆసియావ్యాప్తంగా అభివృద్ధి, సుస్థిరత, శాంతి వర్ధిల్లేలా చేయాలంటే ఉమ్మడి కృషి అవసరమన్నారు. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న ‘బిమ్స్‌టెక్’ (బహుళ రంగాల్లో సాంకేతిక, ఆర్థిక సహకారానికి బంగాళాఖాత తీర దేశాల కూటమి కృషి) దేశాల సదస్సు నిమిత్తం రెండు రోజుల పర్యటనకు మన్మోహన్ మయన్మార్ రాజధాని నేప్యీదే వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వ్యవసాయం, పర్యాటకం, వాతావరణం, ఇంధనం, పెట్టుబడి, వాణిజ్యం, ఇతర రంగాల్లో ఉప ప్రాంతీయ సహకారాన్ని, సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు.
ఢిల్లీ నుంచి బయల్దేరే ముందు ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నేర సంబంధిత అంశాల్లో పరస్పర న్యాయ సహకారం, మత్తు మందుల రవాణా, సీమాంతర నేరాలు, అంతర్జాతీయ ఉగ్రవాదాలను ఎదుర్కోవడానికి ప్రాంతీయ సహకారం అవసరమ న్నారు. యూపీఏ ప్రభుత్వ కాలపరిమితి త్వరలో ముగుస్తున్న నేపథ్యంలో ప్రధానిగా మన్మోహన్‌కు ఇదే చివరి విదేశీ పర్యటన కావచ్చు. ఈ దృష్ట్యా ఆయన శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్, థాయ్‌లాండ్, భూటాన్, నేపాల్ నాయకులతో సంబంధాలను పటిష్టం చేసుకునేందుకు ఈ పర్యటన ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బంగ్లాదేశ్, నేపాల్ దేశాల ఉగ్రవాదులు ఇక్కడ దాడులకు దిగే అవకాశముందని భావిస్తున్న నేపథ్యంలో ఈ అంశాన్ని ప్రధాని వారితో చర్చించనున్నారు.