1993 పేలుళ్లు: నిందితుడు రైల్లో భార్యతో ఎంజాయ్
ముంబై: 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీంకు సన్నిహితుడు ముస్తఫా దొస్సా రాత్రి రైల్లో భార్యతో ఎంజాయ్ చేస్తూ దొరికిపోయాడు. పేలుళ్లలో దొస్సా పాత్రపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. 2015లో మోడళ్లకు ఆడిషన్ నిర్వహిస్తూ దొస్సా పోలీసులకు దొరికిపోయాడు. ఇదిలా వుండగా పేలుళ్ల కోసం ఉపయోగించిన మందు సామగ్రిని ఎక్కడి నుంచి సేకరించారనే విషయంపై విచారించడానికి దొస్సాను పోలీసులు ముంబై నుంచి పోర్ బందర్ కు తీసుకువెళ్లాలని నిర్ణయించారు.
అందుకు రైలు మార్గాన్ని ఎంచుకున్నారు. అయితే, దొస్సా రైల్లో ప్రయాణిస్తున్న సమయంలో అతని భార్య కూడా వెంటే ఉంది. అహ్మదాబాద్ లో సౌరాష్ట్ర ఎక్స్ ప్రెస్ ఆగిన సమయంలో దొస్సా భార్య షబీనా ఖత్రీ బోగీలోపలికి ప్రవేశించింది. వీరిద్దరు కలిసివున్న ఫోటో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ సమయంలో పోలీసులు కూడా పక్కనే ఉన్నట్లు రిపోర్టులు వచ్చాయి. కాగా, గతేడాది పేలుళ్లలో మరో నిందితుడైన అబూ సలేం కూడా విచారణకు వేరే ప్రదేశానికి వెళ్లే సమయంలో భార్యతో రైల్లో కనిపించాడు.
బిజినెస్ మీటింగ్స్
పోర్ బందర్ కు వెళ్తున్న సమయంలో రైల్లో కొందరితో వ్యాపార విషయాలపై దొస్సా చర్చలు జరిపినట్లు తెలిసింది. దీంతో జైలు నుంచి తన వ్యాపారాలన్నింటిని దొస్సా చక్కబెట్టుకుంటున్న వ్యవహారం బయటపడింది.
భార్యతో
రైలు అహ్మదాబాద్ చేరుకోగానే.. దొస్సా భార్య ఖత్రీ రైల్లో భర్తను కలిసింది. ఆ తర్వాత పోలీసులు వారిద్దరిని ఒంటరిగా వదిలేసి.. తిరిగి రైలు పోర్ బందర్ చేరుకున్న తర్వాత మాత్రమే తిరిగి దొస్సా వద్దకు వెళ్లినట్లు తెలిసింది.