మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్, 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దాంతో అతన్ని రెండు రోజుల క్రితం పాకిస్తాన్‌లోని కరాచీలో హుటాహుటిన ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఒక ఫ్లోర్ మొత్తాన్నీ ఖాళీ చేయించి అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ చికిత్స అందిస్తున్నట్టు చెబుతున్నారు. ఆస్పత్రి వర్గాలు, కుటుంబీకులకు తప్ప మరెవరికీ ప్రవేశం లేకుండా పోలీసులు భారీ సంఖ్యలో పహారా కాస్తున్నారట.
విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు మీడియా సంస్థలు ఈ మేరకు వార్తా కథనాలు ప్రసారం చేశాయి. అంతేగాక 67 ఏళ్ల దావూద్‌కు విషప్రయోగం జరిగిందని, అందుకే ఉన్నపళాన ఆస్పత్రికి తరలించారని సోమవారమంతా జోరుగా పుకార్లు షికారు చేశాయి. చికిత్స పొందుతూ ఆదివారమే అతను మరణించినట్టు కూడా వార్తలొచ్చాయి! అయితే దావూద్‌పై విషప్రయోగం, అతని మృతి వార్తలు పూర్తిగా అవాస్తవమని నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రి పాలవడం మాత్రం నిజమేనని నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది. దావూద్ చాలా ఏళ్లుగా కుటుంబంతో పాటుగా పాకిస్తాన్‌లోనే నివసిస్తున్నట్టు ఇప్పటికే తేలింది. అతను కరాచీలోనే ఉంటున్నట్టు పక్కా ఆధారాలున్నాయని భారత్ వెల్లడించింది కూడా. భారత్‌తో పాటు ఐరాస భద్రతా మండలి కూడా 2003లోనే దావూద్‌ను మోస్ట్ వాంటెడ్ అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడం తెలిసిందే. అతని తలపై ఏకంగా 2.5 కోట్ల డాలర్ల రివార్డు ఉంది!
రోజంతా కలకలం
దావూద్‌పై విషప్రయోగం, మృతి వార్తలు సోమవారం ఉదయం నుంచే కలకలం రేపాయి. ఆదివారం అర్ధరాత్రి దాటాక ఓ యూట్యూబర్ వీటిని తొలుత బయట పెట్టాడు. పలు సోషల్ మీడియా వార్తలను ఉటంకిస్తూ ఈ మేరకు కథనం ప్రసారం చేసి దుమారం రేపాడు. ఆది, సోమవారాల్లో పాకిస్థాన్ అంతటా గంటల తరబడి ఇంటర్నెట్ మూగబోవడానికి, దావూద్ మృతికి లింకుందని చెప్పుకొచ్చాడు. ‘‘దేశంలో ఏదో పెద్ద ఉదంతమే జరిగింది. దాన్ని దాచేందుకే నెట్‌పై ఆంక్షలు విధించారు’’ అంటూ ప్రముఖ పాక్ జర్నలిస్టులు ఎక్స్ పోస్టుల్లో అనుమానాలు వెలిబుచ్చడంతో మరింత అలజడి రేగింది. దావూద్ విషమ పరిస్థితుల్లో కరాచీ ఆస్పత్రిలో చేరినట్టు పాక్ జర్నలిస్టు అర్జూ కాజ్మీ ఎక్స్ పోస్టులో నిర్ధారించారు.
తొలిసారేమీ కాదు...
దావూద్‌పై విషప్రయోగం జరిగిందని, అతను మరణించాడని వార్తలు రావడం ఇది తొలిసారేమీ కాదు. ఏటా కనీసం ఒకట్రెండుసార్లు ఇలాంటి వార్తలు రావడం, అవన్నీ పుకార్లేనని తేలడం పరిపాటిగా మారింది.
కరాచీలోనే దావూద్: అల్లుడు
పాక్ ఖండిస్తున్నా, దావూద్ కరాచీలో ఉండటం వాస్తవమేనని అతని అల్లుడు అలీ షా పార్కర్ గత జనవరిలో ధ్రువీకరించాడు. కరాచీలోని అబ్దుల్లా గాజీ బాబా దర్గా వెనక రహీం ఫకీ సమీపంలోని డిఫెన్స్ ఏరియాలో దుర్భేద్యమైన ఇంట్లో కొన్నేళ్లుగా దావూద్ నివాసముంటున్నట్టు తెలిపాడు. దావూద్ చెల్లెలు హసీనా పార్కర్ కొడుకైన అలీ షా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏకు ఇచి్చన స్టేట్‌మెంట్‌లో ఇంకా పలు విషయాలు వెల్లడించాడు. ‘‘దావూద్ ఓ పాక్ పఠాన్ స్త్రీని రెండో పెళ్లి చేసుకున్నాడు. దావూద్‌కు ముగ్గురు సోదరులు, నలుగురు అక్కచెల్లెళ్లు, ఒక కొడుకు, ముగ్గురు కూతుళ్లున్నారు. ఒక కూతురును పాక్ మాజీ క్రికెటర్ జావెద్ మియాందాద్ కుమారునికిచ్చి పెళ్లి చేశాడు’’ అని అలీ షా తెలిపాడు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment